ఫోకస్-2008
జనవరి-కెంజి మిజొగుచి-జపాన్
నవతరంగం ద్వారా తెలుగు వారికి ప్రపంచ సినిమా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి నెలా ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకులను, వారి సినిమాలను పరిచయం చేయడమే ఈ ఫోకస్ శీర్షిక ముఖ్య ఉద్దేశం.
జనవరి నెలకు గానూ ఈ శీర్షికలో జపాను కు చెందిన ప్రఖ్యాత దర్శకుడు కెంజి మిజోగుచి గురించి పరిచయం చేసుకుందాం.
ప్రపంచంలోని పది మంచి సినిమాలు ఏవి అని ఎవర్నడిగినా అందులో కనీసం ఒక్క సినిమా అయినా మిజోగుచి సినిమా ఉంటుందంటే ఆశ్చర్యం లేదు. ఈయన దర్శకత్వంలో రూపొందిన Ugetsu, Life of Oharu, Sansho-the Bailiff సినిమాలు వచ్చి ఇప్పటికి దశాబ్దాలు గడిచిపోయినప్పటికీ,నేటికీ ఈ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈయన గురించి ఈయన సినిమాలు, దర్శకత్వ శైలి గురించి వీలైనంత సమాచారం అందించేందుకు నవతరంగం ద్వారా ప్రయత్నం చేస్తాం. పాఠకులు కూడా తాము చూసిన మిజోగుచి సినిమాల గురించి తమ అభిప్రాయాలు తెలియచేయాలనుకుంటే ఈ క్రింది అడ్రస్ కు మెయిల్ చేయగలరు.
మీ వ్యాసాలు, సమీక్షలు, అభిప్రాయాలు, సలహాలు పంపించవలసిన e-చిరునామా:navatarangam [at] gmail [.] com
ఫోకస్ శీర్షికలో మిజోగుచి గురించిన వ్యాసాలు:
—————————————————-
ఫిబ్రవరి-బి.యన్.రెడ్డి-ఇండియా
తెలుగు సినిమా బాల్య దశలోఉన్న తొలి రోజుల్లోతన దిశానిర్దేశంతో ఒక ప్రాంతీయ భాషా చిత్రం అంతర్జాతీయస్థాయి ఎలా అందుకోగలదో చూపిన మార్గదర్శి బి.యన్.రెడ్డి.
నవంబర్ 16, 1908న కడప జిల్లా పులివెందుల తాలూకా కొత్తపల్లి గ్రామంలోని ఒక రైతు కుటుంబంలో జన్మించిన బి.యన్.సంస్కరణాభిలాషతో చలనచిత్ర నిర్మాణ,దర్శకత్వం చేపట్టారు.ప్రతి సినిమాతోఅక్షరాస్యత అతి తక్కువ ఉన్న మన సమాజాన్ని పట్టి పీడుస్తున్న అసంఖ్యాక సమస్యలకు కొంతమేరకు పరిష్కారం చూపేందుకు యత్నించిన సహృదయుడు బి.యన్.
ఎన్నోఅద్భుతమైన కళాఖండాల తో తెలుగుసినిమాకు అంతర్జాతీయ ఖ్యాతిని సముపార్జించి పెట్టిన బి.యన్.రెడ్డి శతజయంతి సంవత్శరం లో ఆ మహామనిషికి ఆయన చేతిలో రూపుదిద్దుకున్న మహత్తర చిత్రరాజాలకు నివాళి అర్పించే సదుద్దేశ్యంతో నవతరంగం.కామ్ ఫిబ్రవరి నెలలో బి.యన్. ప్రత్యేక కధనాలు, వ్యాసాలు,సమీక్షలు,విశ్లేషణలు,పాఠకులకు ఆయనతో,ఆయన సినిమాలతో ఉన్న అనుబంధాన్నిఅందరితో పంచుకునే అవకాశం కల్పిస్తుంది. మంచి సినిమాను అభిమానించే పాఠకమహాశయులందరూ తమతమ అనుభూతులను పంపవలసింది గా మనవి చేస్తున్నాం.
నవతరంగంలో బి.యన్. గురించిన వ్యాసాలు:
___________________________________
మార్చి-అకిరా కురొసావా-జపాన్
ప్రపంచంలో కెల్లా అత్యుత్తమ సినీదర్శకుడు ఎవరు అంటే టక్కున సమాధానం చెప్పడం కష్టమేమోగానీ, ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రాచుర్యం కలిగిన సినిమా దర్శకుడు ఎవరంటే అకిరా కురసావా అని ఖచ్చితంగా చెప్పొచ్చు. తన సినిమాలతో ప్రపంచ సినీప్రేమికులంరినీ మంత్ర ముగ్ధులను చేయడమే కాకుండా అంతవరకూ ఐరోపా, అమెరికా ఖండాలకే పరిమితమనుకున్న సినిమా కళను, మరో కొత్త కోణంలో ఆవిష్కరించారు.
జపనీస్ సినిమారంగానికి త్రిమూర్తులుగా భావించబడే వారిలో కురసోవా ఒకరు. ఈ సంవత్సరం జనవరి నెలలో ’ఫోకస్’ శీర్షికన జపనీస్ త్రిమూర్తుల్లో ఒకరైన కెంజి మిజోగుచి గురించి నవతరంగంలో తెలుసుకున్నాం. ఈ నెలలో అకిరా కురసావా పై ఫోకస్ శీర్షికలో ఆయన దర్శకత్వం వహంచిన సినిమాల గురించి సమీక్షలు, విశ్లేషణాత్మక వ్యాసాలు, ఆయన గురించిన సినిమాలపై వ్యాఖ్యానం,పుస్తక పరిచయం లాంటి అంశాలను పొందుపరచాలన్నది మా ప్రయత్నం.
ఈ సందర్భంగా నవతరంగం సభ్యులు మాత్రమే కాకుండా పాఠకులూ తమ వ్యాసాలను navatarangam[at]gmail[dot]com కు పంపించవలసిందిగా మనవి.
నవతరంగంలో అకిరా కురొసావా వ్యాసాలు:
సినిమాలపై మోజుతో జేబులో వంద రూపాయలతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బొంబాయి పారిపోయి, అక్కడ నానా కష్టాలకోర్చి సినీ పరిశ్రమలో ఒక్కో మెట్టు ఎక్కుతూ, సినిమాను ఒక కళగా గౌరవిస్తూనే తన సినిమాలను వినోదాత్మకంగా రూపొందించి ప్రేక్షకాధరాభిమానాలతో కమర్శియల్ గానూ సఫలం కాగలిగి, ఏ రంగం ద్వారా అయితే తను లాభపడ్డారో అదే సినిమా రంగం కోసం స్టూడియోలు, ల్యాబ్ లు నిర్మించి చలనచిత్ర రంగానికై అంతులేని కృషి చేసి ఎందరికో మార్గదర్శకంగా నిలబడ్డ ఒక వ్యక్తి కథ వినడానికి సినిమా కథలా వున్నా ఇది నూటికి నూరుపాళ్ళు నిజం.
ఆయ్న కథ మన తెలుగు సినిమా కథ. సినిమా కోసమే పుట్టారా అనిపించే ఈయన పేరు అక్కినేని లక్ష్మివరప్రసాద రావు. అలా చెప్తే అందరూ గుర్తుపట్టకపోవచ్చేమోగానీ LVప్రసాద్ అంటే గుర్తుపట్టని తెలుగు వాళ్ళు ఎవరూ వుండరేమో!
ఈ సంవత్సరం ఆయన శతజయంతి సంధర్భంగా ఆయన సినిమాలను మరో సారి మననం చేసుకోవడం ద్వారా ఆయన్ని గుర్తుచేసుకుందాం.
LV ప్రసాద్ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమాల గురించి, లేదా ఆయన నిర్మాణంలో వచ్చిన సినిమాల గురించి మీ విశ్లేషణా వ్యాసాంగం ఈ నెలాఖరులోగా navatarangam at gmail dot com కు పంపగలరు.
నవతరంగంలో ఎల్వీ ప్రసాద్ గురించి వ్యాసాలు:
________________________________________
ఆధునిక మానవుడి మేధో మథనం నుంచి వెల్లివిరిసిన సమిష్టి కళారూపం సినిమా! వందేళ్ళ చరిత్రను సంతరించుకున్న సినిమా సర్వకళా సమ్మిశ్రితమై విరాజిల్లుతోంది. సినీ ప్రపంచానికి భారతదేశం అందించిన ఆణిముత్యం సత్యజిత్ రే. అనేక కళల్ని ఆపోసనపెట్టి అత్యద్భుత చిత్రాల్ని అందించిన రే భారతీయ నవ్య సినిమాకి నిలువెత్తు ప్రతిరూపం. వ్యాపారమే లక్ష్యంగా డబ్బే ఊపిరి, ప్రాణాలుగా చేసుకుని ఊహా విహారాల్లో ఆకాశయానం చేస్తున్న భారతీయ సినిమాను నేలపైకి దించి సామాన్య ప్రజ వైపు ప్రజల జీవన విధానాల వైపు వాస్తవ పరిస్థితులవైపు అత్యంత కళాత్మకంగా మరల్చి భారతీయ సినిమాకే నవ్యత్వాన్ని అందించిన వాడు సత్యజిత్ రే.
సత్యజిత్ రే కృషి సినిమాకు మానవతీయతను నేర్పి నవ్య వాస్తవికతను సంతరింపజేసి నూతన పథాన్ని నిర్దేశించింది. భారతీయ చలనచిత్ర రంగంలో నవ్య సినిమా, సమాంతర సినిమా, ఆర్ట్ సినిమా తదితర పేర్లతో పిలువబడుతున్న సరికొత్త సినిమాకు ఊపిరి పోసింది.
భారత దేశ సినిమాకు కొత్త ఊపిరి పోసి అంతర్జాతీయ స్థాయికి చేర్చి ఎందరికో మార్గ దర్శకుడైన సత్యజిత్ రే పై ఈ నెల నవతరంగం లో ఫోకస్ శీర్షికలో వీలైనంత విశ్లేషణా వ్యాసంగం, సమాచారం పొందుపరిచే ప్రయతం చేస్తున్నాం.
సత్యజిత్ రే గురించి, ఆయన సినిమాల గురించి మీరూ రాయదలుచుకుంటే మీ వ్యాసాలు navatarangam [at] gmail [dot] com కు పంపగలరు.
నవతరంగంలో సత్యజిత్ రే గురించి వ్యాసాలు:
- సత్యజిత్ రే – ఒక పరిచయం
- మేకింగ్ మూవీస్-సత్యజిత్ రే వ్యాసాలు
- నా జీవితం లో ’రే’ సినిమా
- ఒంటరి గృహిణి – “చారులత”, సత్యజిత్ రాయ్ సినిమా
- వ్యాసం-1:అపూ తో రెండున్నరేళ్ళు – మొదటి భాగం
- వ్యాసం-1:అపూ తో రెండున్నరేళ్ళు – రెండో భాగం
- మేకింగ్ మూవీస్ – వ్యాసం రెండు: ప్రాజెక్ట్ టైగర్ (మొదటి భాగం)
- Making Movies – వ్యాసం రెండు: ప్రాజెక్ట్ టైగర్ (రెండో భాగం)
- మహానగర్
- Making Movies-3:హుండి-ఝుండి-షుండి (Part-1)
- Making Movies-3:హుండి-ఝుండి-షుండి (Part-2)
- Making Movies:వ్యాసం 4 – ఒంటెలు-ట్రెయిన్
________________________________
జూన్-జాన్ అబ్రహం-ఇండియా
సినిమా ఆయనకు పరిశ్రమా కాదు, వ్యాపారమూ కాదు. సినిమా ఆయనకు ఒక కళ….’ప్రజా కళ’. ఆ కళ కేవలం అధ్యయనం చేయడానికో, ఆనందించడానికో కాదు, ఆ కళ కేవలం అశేష ప్రజానీకం కోసం అట్టడుగున పడివున్న ప్రజల క్షేమం కోసం నిర్దేశించబడిందన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. ఆయన ఎక్కడి నుంచో ఆకాశం నుండి ఊడిపడ్డవాడు కాదు. ఆయన జనం నుంచి జనం కోసం వచ్చినవాడు. ఆయన జాన్ అబ్రహం.
ఆయన విశ్వాసంలో కెమెరా అబద్ధం చెప్పదు.కెమెరా తన కళ్ళెదుట వున్న విషయాన్ని మాత్రమే చూపుతుంది.అందుకే ఆ విశ్వాసంతోనే తన కెమెరాను మన సామాజిక నగ్న సత్యాల్ని ఎత్తి చూపడానికి ఉపయోగించాలనే ధ్యేయంతో చివరంటా పోరాటం చేసినవాడు జాన్ అబ్రహం.
నవతరంగంలో జాన్ అబ్రహం గురించి వ్యాసాలు:
హాలీవుడ్ గుర్తిస్తేనో, మీరామ్యాక్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తేనో కానీ మంచి సినిమా అంటే ఎంటో మనకి తెలియదు. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఎంతో మంది దర్శకులు మంచి సినిమాలు తీస్తూనే ఉన్నారు. కానీ వాటిని గుర్తించడంలోనే ఎక్కడో పొరపాటు జరుగుతోంది. అందుకు నిదర్శనం Bela Tarr సినిమాలే!గత 20 ఏళ్ళగా సినిమా పరిశ్రమలో ఉన్నప్పటికీ గతసంవత్సరం Cannes లో తన సినిమా Man from London ప్రదర్శనతో ప్రపంచం కళ్ళల్లో పడ్డాడు.
1955లో హంగరీ దేశంలో జన్మించిన Bela Tarr 22 ఏళ్ళ వయసులోనే తన తొలి సినిమా , Family Nest ద్వారా 1977లో సినీ జగత్తులో మొదటి అడుగు వేశారు. ఆ తర్వాత 1981లో The Outsider మరియు 1982లో The Prefab people సినిమాల ద్వార తన సినీ పయనంలో మొదటి మజిలీ పూర్తి చేశారు. అటు పిమ్మట 1988లో Damnation, 1994లో Satantango, 2000లో Werckmeister Harmonies సినిమాల ద్వారా తన రెండో మజిలీని పూర్తిచేసి 2007లో The Man from London అన్న సినిమా ద్వారా Cannes ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ సినిమా విభాగంలో ప్రపంచం లోని అత్యుత్తమ దర్శకులతో పోటీపడిన ఈయన సినిమాలు, దర్శకత్వ శైలిని విశ్లేషించడమే ఈ నెల ఫోకస్ విభాగం యొక్క లక్ష్యం.
మీరు గతంలో బెలా టర్ సినిమా లు చూసి వున్నా, లేదా ఇప్పుడు చూడాలని ఆసక్తి వున్నా ఆ సినిమాలు చూసి మీ అభిప్రాయాలు, విశ్లేషణలు navatarangam at gmail dot com కి పంపగలరు.
బెల టర్ గురించి నవతరంగంలో వచ్చిన వ్యాసాలు:
ఆగష్టు-రిత్విక్ ఘటక్-ఇండియా
భారతీయ సినిమా రంగంలో రిత్విక్ ఘటక్ ఓ హై ఓల్టేజీ టాలెంట్. ఆయన నిర్మించిన చిత్రాల్లో ఎంచుకున్న సబ్జెక్టు కానీ, నిర్మాణ రంగంలో ఆయన చిత్రీకరణ పధ్ధతి , సంగీతాన్ని దృశ్యాల్ని లయీకరించిన విధానమూ ఆయన స్థాయిని చెబుతాయి.భారతదేశ విభజన పట్ల ఆయన దు:ఖపడడమూ, కళాత్మకంగా స్పందించిన తీరూ ఆయనలోని సున్నితత్వాన్ని, నిజాయితీని స్పష్టపరుస్తాయి.నవ్య వాస్తవిక వాదిగా ఆయన చిత్రాల్లో అత్యంత వేదనా భరితమయిన బతుకుల్ని వెళ్ళదీస్తున్న వారే ప్రధాన పాత్రలుగా నిలుస్తారు.భారతీయ నవ్య సినిమా రంగంలో గ్రేట్ మాస్టర్స్ గా చెప్పుకునే ముగ్గురిలో (సత్యజిత్ రే, మృణాల్ సేన్) రిత్విక్ ఘటక్ ఒకరు.
ఆయన నిర్మించిన చిత్రాల్లో ఒక్కొక్కటి ఒక దృశ్య కావ్యం.కాని ’మేఘేధాక తార’ ను ఆయన చిత్రాల్లో కెల్లా గొప్ప చిత్రమని ఆయనే పేర్కొన్నారు.ఇందులో స్వార్థాన్ని త్యజించి, తన కుటుంబంలోని వారి అవసరాలు నెరవేర్చడం కోసం కొవ్వొత్తిలా కరిగిపోయిన నీత ముఖ్యాభినేత్రి.ఈ చిత్రంలో స్త్రీత్వాన్ని, త్యాగాన్ని ప్రధానాంశాలుగా చేసుకొని మధ్య తరగతి జీవుల మనస్తత్వాల్ని స్వార్థాల్ని విశ్లేషిస్తాడు రిత్విక్ ఘటక్.ఈయన సినిమాలు, దర్శకత్వ శైలిని విశ్లేషించడమే ఈ నెల ఫోకస్ విభాగం యొక్క లక్ష్యం.
మీరు గతంలో రిత్విక్ ఘటక్ సినిమా లు చూసి వున్నా, లేదా ఇప్పుడు చూడాలని ఆసక్తి వున్నా ఆ సినిమాలు చూసి మీ అభిప్రాయాలు, విశ్లేషణలు navatarangam at gmail dot com కి పంపగలరు.
రిత్విక్ ఘటక్ గురించి నవతరంగంలో వచ్చిన వ్యాసాలు:
————————————————–
సెప్టెంబరు-బాపు మరియు తపన్ సిన్హా-ఇండియా
బాపు:ఈ నెల నవతరంగంలో బాపు గారి మీద ఫోకస్. నిజానికి ఆయన సినిమాలు, దర్శకత్వ శైలి గురించి మన తెలుగు వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదనే అనుకుంటాను. కానీ మొన్నీ మధ్య ఇక్కడ (యు.కె) లో మన తెలుగు అసోసియేషన్ వారి సావనీర్ చూస్తుంటే అందులో బాపు గారే సొంతంగా తమ సినిమాల గురించి చెప్పిన ఒక పొడుగాటి వ్యాసం కనిపించింది. ఇది ఎలా ఐనా నవతరంగంలో ప్రచురించాలనే ఉద్దేశంతో ఆ సావనీర్ సంపాదకులు శ్రీ బోయెల్ల రామానాయుడు గారిని సంప్రదించాను.అడగ్గానే ఆయన నవతరంగంలో ప్రచురించవచ్చన్నారు.అది జరిగి నాలుగు నెలలయింది. అయినా నాకెందుకో అనుమానం. అందుకే కళాధర్ బాపు గారికి ఫోన్ చేసి అడిగాను. ఆయన కూడా అలాగే అన్నారు.ఈ మధ్యనే రామానాయుడు గారిని మరోసారి కలిసినప్పుడు మరొక్కసారి చెప్పి ఆయన అవునన్నాక ఆ వ్యాసాన్ని నవతరంగంలో ప్రచురించే ఏర్పాట్లు మొదలుపెట్టాను.
సంతకం అక్కర్లేని చిత్రకారుడు, టైటిల్ కార్డ్ అక్కర్లేని చలనచిత్ర దర్శకుడు, శ్రీ బాపు తన కదలని, కదిలే బొమ్మలతో ఎనలేని భావాలను అలవోకగా ప్రకటించినా, తన సినిమాల గురించి అరుదుగా మాట్లాడే ’మితభాషి.’ మొదటిసారిగా తన చిత్రాల సిత్రాలను పాఠకుల ముందు పరుస్తున్నారు. ఆస్వాదించండి…..
బాపు-రమణ ల సినిమాల గురించి బాపు గారు స్వయంగా చెప్పిన కబుర్లే కాకుండా పాఠకులు కూడా వారి సినిమాల గురించి వ్యాసాలు రాసి పంపిస్తే ప్రచురిస్తామని మనవి చేసుకుంటున్నాం. బాపు రమణ ల గురించి, వారి సినిమాలు, రచనలు, కార్టూన్ల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే బాపు బొమ్మ దర్శించండి.
నవతరంగంలో బాపు గురించి వ్యాసాలు:
- బాపు-ఒక పరిచయం(లాంటిది)
- అందాల రాముడు సినిమా-ఒక అనుభవం-1
- సత్యజిత్ రాయ్ గురించి బాపు
- మా సినిమాలు:బాపు-మొదటి భాగం
- మా సినిమాలు:బాపు-రెండవ భాగం
- మా సినిమాలు:బాపు-మూడవ భాగం
తపన్ సిన్హా:ఈ నెల నవతరంగంలో ఫోకస్ శీర్శిక లో మరో ప్రముఖ భారతీయ దర్శకుణ్ణీ పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా వుంది. భారత ప్రభుత్వం సినీ కళాకారులకు అందచేసే అత్యుత్తమ పురస్కారం ’దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు’ 2006 సంవత్సరానికి గాను ప్రముఖ బెంగాలీ/హిందీ చిత్ర తపన్ సిన్హా కు ఇస్తునట్టుగా ప్రకటించిన సందర్భంగా ఆయన గురించే కాకుండా ఆయన సినిమాలతో కూడిన వ్యాసాలను కూడా ప్రచురించబోతున్నాము.
భారతీయ నవ్య సినిమా దర్శకుల్లో మొదటి తరానికి చెందినవాడు తపన్ సిన్హా.ఇప్పటికి దాదాపు నలభై చిత్రాలు తీసి అనేక అవార్డులు అందుకున్న తపన్ సిన్హా బెంగాలీవాడు. తపన్ దా గా అందరి అభిమానాన్ని చూరగొన్న తపన్ సిన్హా అన్ని చిత్రాల్లోనూ మానవీయ విలువలు ప్రతిభావంతంగా ఆవిష్కృతమవుతాయి.
తపన్ సిన్హా గురించి నవతరంగం వ్యాసాలు:
____________________________________
అక్టోబరు-డేవిడ్ లీన్-ఇంగ్లండ్
నవతరంగం ద్వారా తెలుగు వారికి ప్రపంచ సినిమా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి నెలా ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకులను, వారి సినిమాలను పరిచయం చేయడమే ఈ ఫోకస్ శీర్షిక ముఖ్య ఉద్దేశం.
ఫ్రెంచ్ దర్శకుడు jean Renoir సినిమా దర్శకుల గురించి చెప్తూ, “ఒక గొప్ప దర్శకుడు తన జీవితకాలంలో నిర్మించిన అన్ని మంచి సినిమాలు ఒక దాని తర్వాత ఒకటి పేరిస్తే వచ్చేది వివిధ రకాల సినిమాల సముదాయం కాకపోగా అవన్నీ ఒకే సినిమాలోని వివిధ అధ్యాయాలుగా అనిపిస్తాయి” అంటారు. అంటే ఒక దర్శకుడు తన జీవితకాలంలో రూపొందించే గొప్ప సినిమాలన్నింటిలో చెరిపివేయలేని ఒక మార్కు వదిలిపెడ్తాడని ఆయన ఉద్దేశం. ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకులు తమ జీవితకాలంలో రూపొందించిన సినిమాల్లో ఈ గుణాన్ని తప్పక గమనించవచ్చు. అలాంటి గొప్పవాళ్ళ లిస్టులో చేర్చదగిన వారిలో ఒక దర్శకుడు మాత్రం తప్పక ఉంటాడు. అతనే డేవిడ్ లీన్.
ఈ సంవత్సరం డేవిడ్ లీన్ శత జయంతి సంవత్సరం కాబట్టి ఆయన సినిమాల సమీక్షలు/విశ్లేషణలు ఈ నెల నవతరంగంలో పొందుపరచదలుచుకున్నాం. డేవిడ్ లీన్ సినిమాలకి సంబంధించిన వ్యాసాలూ navatarangam at gmail dot com కి పంపగలరని మనవి.
నవతరంగంలో డెవిడ్ లీన్ కి సంబంధించిన వ్యాసాలు:
____________________________________
నవంబరు-ఆండ్రే వైదా-పోలండ్
అయనకి సినిమా ఒక ఆయుధం. ఆయనకి సినిమా ఒక ఉద్యమం. ఆయన సినిమాలు చరిత్రకు సాక్ష్యాలు. ఆయన సినిమాలు సమకాలీన సమాజపు భావజాలానికి ప్రతిబింబాలు. యాభై ఏళ్ళకి పైగా సినిమాలు తీస్తూ తన దేశపరిస్థుతులు ప్రపంచానికి తెలియచేస్తూ సినిమానే జీవితం చేసుకున్న ఆయన పేరు ఆండ్రే వైదా (Andrzej Wazda). గత యాభై ఏళ్ళుగా చలనచిత్ర నిర్మాణంతో పాటు నాటకాలకు సినిమాలకూ దర్శకత్వం వహిస్తూ, “Manggha” అనే సంస్థ ద్వారా పోలండ్ లో జపనీయుల కళలూ మరియు సాంకేతికతకలను పరిరక్షిస్తూ, తను స్థాపించిన ఫిల్మ్ స్కూలు ద్వారా నవ యువ దర్శకులను తీర్చిదిద్దుతూ కూడా ఎనభై ఏళ్ళ వయసులో కూడా ఇంకా చిత్ర నిర్మాణం కొనసాగిస్తూ తన జీవితాన్నే సినిమాకీ, ముఖ్యంగా కళకీ, అంకితం చేసిన మహానుభావుడు వైదా. ఆయనకి నవతరంగం తరుపున శతకోటి వందనాలు.
పోలండ్ దేశంలోనే కాకుండా ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకుల్లో ఒకరిగా చేర్చదగ్గ ఆండ్రే వైదా పై ఆయన సినిమాలపై ఈ నెల నవతరంగం లో ఫోకస్ శీర్షికలో దృష్టి సారిస్తున్న సందర్భంగా ఆయన సినిమాల జీవిత విశేషాలతో కూడుకున్న వ్యాసాలు navatarangam at gmail dot com కి పంపగలరని మనవి.
నవతరంగంలో ఆండ్రే వైదా కి సంబంధించిన వ్యాసాలు:
____________________________________
డిశెంబరు-అబ్బాస్ కియరోస్తమి-ఇరాన్
నవతరంగం ద్వారా తెలుగు వారికి ప్రపంచ సినిమా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి నెలా ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకులను, వారి సినిమాలను పరిచయం చేయడమే ఈ ఫోకస్ శీర్షిక ముఖ్య ఉద్దేశం.
డిశెంబరు నెలకు గానూ ఈ శీర్షికలో ఇరాన్ కు చెందిన ప్రఖ్యాత దర్శకుడు అబ్బాస్ కియరోస్తమి గురించి పరిచయం చేసుకుందాం.
ప్రపంచంలోని వివిధ చలనచిత్రోత్సవాల్లోనే కాకుండా వివిధ సంస్థల ద్వారా కియరోస్తమీ దాదాపు రెండు వందలకి పైగానే అవార్డులు అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంతటి ప్రఖ్యాతి గాంచినా ఆయన ఏనాడు తన దేశం వదిలి సినిమాలు తీయలేదు. అవకాశం ఉండి కూడా ఇతర దేశాల్లో ఎందుకు సినిమాలు తీయలేదన్న ప్రశ్నకు ఈ విధంగా సమాధానం చెప్పారు ఆయన-”బాగా ఏపుగా ఎదిగిన ఒక చెట్టును వేర్లతో పెకలించి మరో చోటుకు తరలించి నాటితే ఆ చెట్టు తిరిగి పూలు పూయకపోవచ్చు. ఒక వేళ పూసినా ఆ పూలు అంతకు ముందంత సువాసనలు కలిగి ఉండకపోవచ్చు. అది సహజం. అలాగే నేను కుడా నా దేశం వదిలి ఇతర దేశాల్లో సినిమాలు తీసుంటే నేను ఆ చెట్టులా అయ్యుండే వాడిని”
ఈ నెల ఫోకస్ శీర్షికలో అబ్బాస్ కియరోస్తమి సినిమాల సమీక్షలు, విశ్లేషణలు ప్రచురించాలనుకుంటున్నాము. నవతరంగం సభ్యులు, పాఠకులు తాము చూసిన కియరొస్తామీ సినిమాల సంబంధించిన వ్యాసాలు నేరుగా నవతరంగంలో ప్రచురించవచ్చు లేదా మీ వ్యాసాలు navatarangam at gmail dot com కి పంపించవచ్చు.