ఈ నెల సినిమా-2008
డిశెంబరు నెల సినిమా :ఓయ్ లక్కీ లక్కీ ఒయ్
తన మొదటి సినిమా Khosla Ka Ghosla తో అందరి మన్ననలూ అందుకున్న దిబాకర్ బెనర్జీ దర్శకత్వంలో వచ్చిన రెండో చిత్రం Oye Lucky Lucky Oye.
ఈ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులతో పాటు విమర్శకుల మన్ననలు కూడా అందుకున్నారు దిబాకర్. అభయ్ డియోల్ నటన తో పాటు, మిగిలిన పాత్ర ధారుల నటన, వైవిధ్యమైన స్క్రీన్ ప్లే, మంచి నేపథ్య సంగీతం ఈ సినిమాకి ఈ సినిమాకి అదనపు ఆకర్షణలు.
నవతరంగంలో ఈ నెల సినిమా ఒయ్ లక్కీ లక్కీ ఒయ్.
ఈ చిత్ర సమీక్ష ఇక్కడ చదవొచ్చు.
నవంబరు నెల సినిమా: Waltz with Bashir
1982 లో లెబనాన్ లో జరిగిన యుద్ధం ఈ సినిమాకి నేపథ్యం. దర్శకుడు Ari Folman ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తాడు. ఒక రోజు ఒక స్నేహితుడు తన వద్దకొచ్చి ప్రతి రాత్రి 26 కుక్కలు తనను వెంటాడుతున్నట్టు కల వస్తుందనీ, ఆ కలకీ తాము 1982 లో పాల్గొన్న లెబనాన్ యద్ధానికి దగ్గరి సంబంధం ఉండొచ్చని అంటాడు. Ari Folman కూడా ఆ యుద్ధంలో పాల్గొన్నప్పటికీ పాతికేళ్ళ తర్వాత ఆ జ్ఞాపకాలేవి తనకి లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక విధంగా మనస్తాపానికీ గురిచేస్తుంది. అసలా యుద్ధంలో తన పాత్ర ఏంటి అని తెలుసుకోడానికి Ari Folman ఆ రోజుల్లో తన యూనిట్లో ఉండి యుద్ధంలో పాల్గొన్న మిగిలిన మాజీసైనికులను కలుసుకుని వారి జ్ఞాపకాల ద్వారా తన గతాన్ని reconstruct చేసుకోడానికి చేసే ప్రయత్నమే ఈ సినిమా.
ఈ సినిమా సమీక్ష ఇక్కడ చదవండి.
ఈ సినిమాకి సంబంధించిన వీడియోలు ఇక్కడ చూడండి.
అక్టోబరు నెల సినిమా: కాలిఫోర్నియా డ్రీమింగ్
ఈ సినిమా దర్శకుడు Cristian Demescu. ఈ సినిమా ఎడిటింగ్ పూర్తికాకూండానే ఒక ఏక్సిడెంట్ లో మరణించాడు. ఆయనకు నివాళులర్పిస్తూ పూర్తిగా ఎడిటింగ్ జరగకుండానే Cristian Demescu వుండగా ఎలా వుందో అలాగే ఈ సినిమాని విడుదల చేయడం జరిగింది. అందుకే ఈ సినిమాకు క్యాప్షన్ endless అని వుంటుంది.
కానీ చాలా మంది రోమానియన్లు చెప్తున్నట్టుగా ఆ క్యాప్షన్ తప్పుదోవ పట్టించేదిగా వుందని నా అభిప్రాయం కూడా. Endless కి బదులుగా With out an end అని పెట్టడం సబబేమో!
రొమానియా లో 1990 లలో జరిగిన ఒక సంఘటన ఆధరాంగా ఈ సినిమా కథ రూపొందించబడింది.అమెరికా నడిపే యుధ్ధ రాజకీయాలను ఎత్తిపొడిచిన ఈ సినిమా నిజంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. వీలయితే తప్పక చూడండి. సినిమా అక్కడక్కడా కొంచెం పొడిగించినట్టు అనిపించినా అది ఈ సినిమా పూర్తి స్థాయిలో ఎడిటింగ్ కానందువలన అని అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యన రొమానియా సినిమాలకు పెరుగుతున్న ఆదరణకు ఇలాంటి సినిమాలే కారణం.
ఈ సినిమా సమీక్ష ఇక్కడ చదండి.
సెప్టెంబరు నెల సినిమా: ముంబాయ్ మేరీ జాన్
ముంబైలో 2006లో జరిగిన 7/11 బాంబ్ బ్లాస్ట్ ల తర్వాత సామాన్య ప్రజానికం అనుభవించిన మానసిక సంఘర్షణను ఆవిష్కరించడమే ఈ చిత్ర కధ. భిన్న సామాజిక పరిస్ధితుల నుండి ఐదు పాత్రలు ఎంచుకొని వాళ్ళ లైఫ్‍స్టైల్లో ఈ ఉదంతం వల్ల వచ్చిన మార్పుల్ని వాటిని ఎదుర్కొన్న వైనాన్ని చాలా గ్రిప్పింగ్‍గా అందించాడు దర్శకుడు.
ఇది ఖచ్చితంగా దర్శకుని సినిమానే.
నవతరంగంలో ఈ నెల సినిమా: ముంబై మేరీ జాన్
ఈ సినిమా సమీక్ష ఇక్కడ చదవండి.
ఈ సినిమా దర్శకుడు నిశికాంత్ కామత్ తో ఇంటర్వ్యూ ఇక్కడ చదవండి.
ఆగష్టు నెల సినిమా :El baño del Papa
ముప్పై లక్షల జనాభా కలిగిన ఉరుగ్వే దేశంలో సంవత్సరానికి పది కంటే తక్కువ సినిమాలు నిర్మాణమవుతున్నా గత కొద్ది సంవత్సరాలలో ఎన్నో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఉరుగ్వే సినిమాలు ప్రదర్శింపబడి అవార్డులు కూడా గెలుచుకున్నాయి.
ఉరుగ్వే నుంచి వచ్చిన అన్ని సినిమాలు చూడదగ్గవి కాకపోయినా Whisky మరియు 25 Watts సినిమాలు మాత్రం ఇటీవలి కాలంలో ఈ దేశం నుంచి వచ్చిన మంచి సినిమాలుగా పేర్కొనవచ్చు. వీటితో పాటు El baño del Papa 2007 లో వచ్చిన కొన్ని మంచి సినిమాల్లో ఒకటి.
ఈ సినిమా కూడా లండన్, టోరంటో చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడడమే కాకుండా చాలా చిత్రోత్సవాల్లో అవార్డులు కూడా గెలుచుకుంది.
నవతరంగంలో ఈ నెల సినిమా El baño del Papa
ఈ సినిమా సమీక్ష ఇక్కడ చదవండి.
జులై నెల సినిమా:ఆమిర్
‘ది హ్యాపెనింగ్’, ‘దశావతారం’ వంటి భారీ చిత్రాల నడుమ పోయిన వారం సైలెంట్ గా రిలీజైన హిందీ సినిమా ‘అమీర్’. ఒక కొత్త దర్శకుడు, అసలు పేరుకూడా సరిగ్గా తెలియని ఒక కొత్త హీరోలతో UTV వారి ‘స్పాట్ బాయ్ మోషన్ పిక్చర్’ బ్యానర్ నిర్మించిన సినిమా ఇది.
గతంలో అనురాగ్ కశ్యప్ వద్ద అసిస్టెంట్ గా పని చేసిన రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇతర భాషా సినిమాల నుంచి ప్రేరణ చెంది రూపొందించినది అయినప్పటికీ సినిమాలోని అన్ని విషయాల్లోనూ ఎంతో శ్రద్ధ తీసుకుని చాలా sophisticated గా వుండడం అభినందనీయం.
రొటీన్ సాంగ్-డ్యాన్స్ సినిమాలు కాకుండా వెరైటీ కోరుకునే వాళ్ళు తప్పక చూడాల్సిన సినిమా ఇది.
నవతరంగం లో ఈ నెల సినిమా ఆమిర్
ఈ సినిమా సమీక్ష: ఆమిర్ – తప్పకుండా చూడవలసిన చిత్రం
జూన్ నెల సినిమా:ఖుదా కేలియే
దేశ విదేశాల్లో నిర్మితమవుతున్న సినిమాల ద్వారా వినోదం పొందడం సహజమే కానీ ఆయా దేశాల సినిమాల ద్వారా అక్కడి సామాజిక పరిస్థితులను, స్థితిగతులను, ప్రజల ఆలోచనాశైలిని తెలుసుకునే అవకాశం కూడా కలుగుతుంది.
మన సినిమాల్ళో చూపించినట్టుగా మన పొరుగున ఉన్న పాకిస్తాన్ లో అంతా తీవ్రవాదులూ, ఉగ్రవాదం కాదని ఆ దేశం గురించి మరింతగా తెలుసుకుని అక్కడి వాళ్ళు మనలానే మామూలు మనుషులే అని గ్రహించి తద్వారా ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందించడంలో సినిమా చేయగలిగింది ఎంతో వుందనిపిస్తుంది.
కాకపోతే గత 40 ఏళ్ళగా పాకిస్తాన్ నుంచి సినిమాలు ఇటు రావడం ఆగిపోయాయి. మన సినిమాలు పైరసీ పుణ్యామాఆక్కడి వారిని బాగానే వినోదపరుస్తున్నట్టున్నాయి. 43 ఏళ్ళ తర్వాత ఖుధా కేలియే అనే ఒక పాకిస్తాన్ సినిమా సరిహద్దులు దాటి ఇటు రావడమూ, ఆ సినిమాని మన దేశ ప్రజానీకం చూసి ఆదరించడం జరగడం ఎంతో ఆనందించదగిన విషయం.
జూన్ నెల కు నవతరంగం ’ఈ నెల సినిమా’ ఖుదా కేలియే.
ఈ సినిమా సమీక్ష:ఖుదా కే లియే -In the name of God (ఒక పాకిస్తానీ చిత్ర సమీక్ష)
మే నెల సినిమా:మహెక్
గత సంవత్సరం వివిధ సినిమా ఉత్సవాలలో Frozen సినిమాతో భారతీయ సినిమాని అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించి మెప్పుపొందిన శివాజీ తోపాటు మరో నవ యువ దర్శకుడు Kranti kanade తన సినిమా Mahek ద్వారా ఫర్వాలేదనిపించాడు. పూనే లోని Film and Telivision Institute of India లో Film making లో పట్టా పొంది తన తొలి లఘు చిత్రం ఛైత్ర తో జాతీయ స్థాయిలో ఉత్తమ లఘు చిత్రం అవార్డు సాధించిన పిమ్మట తన మొదటి పూర్తి స్థాయి చలనచిత్రంగా Mahek సినిమాను రూపొందించిన క్రాంతి కనాడే మొదటి సినిమాతోనే మంచి దర్శకుడిగా పేరు సాధించాడు.
చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటి ఆఫ్ ఇండియా వారిచే నిర్మింపబడిన ఈ సినిమా నవతరంగంలో ’ఈ నెల సినిమా’.
ఈ సందర్భంగా త్వరలో ఈ సినిమా సమీక్ష, దర్శకునితో ఇంటర్వ్యూ, అలాగే ఈ సినిమా యొక్క స్క్రీన్ ప్లే కూడా అందరికీ అందించే ప్రయత్నం చేస్తాం.
ఈ సినిమా సమీక్ష: మహెక్-ఒక సమీక్ష
ఏప్రిల్ నెల సినిమా: ఫ్రోజెన్
2007 లో వచ్చిన ఉత్తమ భారతీయ సినిమాల్లో ‘Frozen’ ఒకటి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. లండన్ , టొరాంటో చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడడమే కాకుండా మొన్నీ మధనే ముగుసిన ముంబాయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలోనూ, గతంలో Osian’s-Cinefan Film Festival లో జ్యూరీ అవార్డు కూడా గెలుచుకుంది.
వృత్తిరీత్యా స్టిల్ ఫోటోగ్రాఫర్ అయిన శివాజీ చంద్రభూషణ్ గతంలో కొన్ని చలనచిత్రాలు నిర్మీంచినప్పటికీ ‘Frozen’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు.
వైవిధ్యమైన కథనం, అధ్బుతమైన సినిమాటోగ్రఫీ, ఉత్తమ సాంకేతిక విలువలు ఈ సినిమాకి ప్రాణం. ఈ రోజుల్లో పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ లో సినిమా నిర్మీంచే ధైర్యం చేసి నలుపు తెలుపుల్లో ఎన్ని వర్ణాలో అనిపించేలా లడఖ్ ప్రాంతంలోని అందాలను అత్యంత సుందరంగా తెరకెక్కించి భారతీయ సినిమాకి అంతర్జాతీయ ఖ్యాతి కలిగించారు.
ఈ సినిమా సమీక్ష: Frozen-సమీక్ష
ఈ సినిమా దర్శకునితో ముఖాముఖి: Dr Desi లో ఇంటర్వ్యూ
మార్చి నెల సినిమా: కమ్లి
నిర్మాణం: అపూర్వ చిత్ర
గతంలో తిలాదానం చిత్రం ద్వారా ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయమైన KNT శాస్త్రి గారి దర్శకత్వంలో వచ్చిన ’కమ్లి’ సినిమా హైదరాబాదు చుట్టుపక్కల నివసించే లంబాడీల తండాల్లో ప్రజల జీవితాన్ని ప్రతిబింబిస్తూ, అక్కడి ప్రజలను వారి ఆచారాలనూ నేపథ్యంగా తీసుకుని, ఆ తండాలో నివసించే కమ్లి అనే యువతి కథను ఎంతో సహజంగా దృశ్యీకరించారు దర్శకుడు.
గతంలో ఎన్నో చలన చిత్రీత్సవాల్లో ప్రదర్శింపబడడమే కాకుండా ఈ మధ్యనే ప్రకటించిన నంది అవార్డుల్లో ఉత్తమ నటి అవార్డుకు గాను, ఈ సినిమాలో కమ్లి పాత్ర పోషించిన నందితా దాస్ గెలుచుకుంది.
అర్థవంతమైన తెలుగు సినిమాలు కరువవుతున్న ఈ రోజుల్లో శిశువిక్రయం, ఆసుపత్రులనుంచి శిశు అపహరణ లాంటి ఎన్నో ప్రస్తుత అంశాలను ప్రస్తావిస్తూ రూపొందించిన ఈ సినిమా మంచి సినిమా కోరుకునే వారందరూ చూడదగ్గ సినిమా.
ఈ సినిమా సమీక్ష: కమ్లి-బంజారా బతుకు చిత్రం
ఈ సినిమా వెబ్‍సైట్:http://www.apoorvachitra.com
ఫిబ్రవరి నెల సినిమా: Travelers and Magicians
దర్శకత్వం:Khyentse Rinpoche
“మానవుని దు:ఖానికి కారణం ఉంది. కోరిక వలన దు:ఖం పుడుతోంది. దు:ఖం పోవాలంటే కోరిక నశించాలి” అని చెప్పిన బుద్ధుని బోధనలు విశ్వసిస్తున్న దేశాలలో భూటాన్ ఒకటి.
దర్శకుడు Khyentse Rinpoche ఒక పేరుపొందిన బౌద్ధ లామా. తన భూటాన్ ప్రజల జీవితాన్ని, సంస్కృతిని ప్రపంచానికి తెలియచేయాలనుకున్నాడు.మోహంలో మునిగిన ఒక కుర్రవాడి కధను(జపనీస్ కధ),ప్రాచుర్యంలో ఉన్న ఓ బౌద్ధ నీతికధను కలిపి, చక్కని సినిమా తీసాడు.
అందరూ తప్పక చూడవలసిన సినిమా ఇది.
ఈ సినిమా సమీక్ష:Travellers and Magicians – భూటాన్
ఈ సినిమా వెబ్‍సైట్: http://www.travellersandmagicians.com/
జనవరి నెల సినిమా:I For India
దర్శకత్వం:సంధ్య సూరి
ఈ సినిమా గురించి మీరు ఇంతకముందు వినివుండకపోవచ్చు. ఇలా అందరికీ తెలియని మంచి సినిమాల గురించి మరింతమందికి తెలియచేయడమే ఈ శీర్షిక లక్ష్యం.
దేశం వదిలి దూర దేశాలు తరలి వెళ్ళిన భారతీయుల జీవితాన్ని వాస్తవంగా చూపెట్టడానికి చేసిన ఒక వైవిధ్యమైన ప్రయత్నం ఈ సినిమా. డాక్యుమెంటరీ చిత్రమైనా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకోగలదు. ప్రవాస భారతీయులు ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా.
ఈ సినిమా సమీక్ష: I for India – సినిమా పరిచయం
ఈ సినిమా వెబ్‍సైట్: http://www.iforindiathemovie.com/