ఈ సినిమా మన తెలుగు కథ ఆధారంగా తీయబడింది. ఆ కథే మన శ్రీ రమణ గారి “మిథునం”
కథ వెనుక కథ:
మిథునం కథ మొదటి సారిగా నవంబరు 1997 లో ఆంధ్రభూమి వారపత్రిక లో ప్రచురించబడింది. అది చదివి బాపు గారు ఆనందంతో “చదివినదానికంటే రాస్తే బాగా అర్థం అవుతుంది.” అని ఆ కథని తన దస్తూరితో వ్రాసి శ్రీ రమణ కు పంపారు. తర్వాత రచన సంపాదకులు శ్రీ శాయి గారు ఈ కథను బాపు దస్తూరితో, బొమ్మలతో రచనలో ప్రచురించారు. ఆ సంచికకు బాపు గారి బొమ్మను ముఖచిత్రంగా వేస్తూ “దస్తూరి తిలకం-బాపు” అని ప్రచురించారు. దానికి పాఠకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఎంతటి ఆదరణ పొందిందంటే, రచన పత్రికలో తిరిగి అనుబధంగా ప్రచురించాల్సివచ్చింది. ఎందరో రచయతల, ప్రముఖుల మన్ననలను పొందింది. కథ, కొత్త ఢిల్లి వారు ప్రతి సంవత్సరం ఎంపిక చేసే అత్యుత్తమ భారతీయ కథల్లో ’మిథునం’ను కూడా చేర్చుకున్నారు. వారి ఆ సంవత్సర (1998) “కథ” సంచికలొ మిథునం ఆంగ్ల అనువాదం (వట్లూరి శ్యామల (కల్లూరి శ్యామల అని ఒక website లో వుంది) అనువదించారు) ప్రచురింపబడింది. అలా ఆ అనువాదాన్ని చదివిన M.T. వాసుదేవన్ నాయర్ చలన చిత్రంగా తీయాలని నిశ్చయించారు. ఈ కథ అనేక భారతీయ భాషల్లోకి, నాలుగు విదేశి భాషల్లోకి అనువదింపబడింది. ఈ కథను విమర్శించినవాళ్ళు కూడా లేకపోలేదు. “ఏముంది కథలో, బ్రాహ్మణ వంటకం మీద రాయబడింది” అన్నారు. దానికి శ్రీ రమణ గారి స్పందన: “నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే నేను బ్రాహ్మణుణ్ణి మరియు భోజన ప్రియుణ్ణి”.
సినీ నటులు సుత్తివేలు దీనిని రేడియో కోసం నాటకంగా రూపోందించారు. మన తెలుగు నిర్మాత స్రవంతి కిషోర్ దీన్ని టీ.వి. సీరియలుగా తీద్దామనుకున్నారు. దీంట్లో వాణిజ్య విలువలు లేవు అని శ్రీ రమణ వారించారంట.