అమెరికన్ బ్యూటీలో అందమెంత ?
ఏఁడు – ౧౯౯౯
దేశం – అమెరికా సంయుక్త రాష్ట్రాలు
భాష – ఆంగ్లం
అమెరికన్ బ్యూటి సినిమా గుఱించి అందరూ వినేవుంటారు. చాలా మంచి సినిమా అని నేనంటే అందరూ ఒప్పుకోకపోవచ్చు. ఆస్కారు వచ్చేంత ఆస్కారం వుందా అనిపించే ఈ సినిమాకు మాత్రం ఏకంగా ఐదు వచ్చాయి ౨౦౦౦లోఁ. ఉత్తమనటుడు, ఉత్తమదర్శకుడు, ఉత్తమ చిత్రీకరణ, ఉత్తమ సంభాషణలతో సహా ఉత్తమ చిత్రంగా ఎన్నుకోబడింది !!
సినిమా పేరువచ్చేసి అమెరికా అందం. అంటే ఈ సినిమాలో అమెరికా స్వప్నాన్ని ఎంతో అందంగా చూపిస్తారా? కానీ, అమెరికాలో వున్న మీ చుట్టాలెవరితోనైనా ఈ సినిమా ప్రస్తావించండి. ఈఈఈవ్.. అని వికారం వస్తున్నట్టు ముఖం పెడతారు. అమెరికా అందాన్ని నమ్మిన ప్రవాసులకు అదీ అమెరికా స్వప్నంలో ప్రగాఢవిశ్వాసం వున్నవారు అయిన వారికి ఈ సినిమా నచ్చుదు. ఐతే ఈ సినిమా చేదు నిజాన్ని తెరకెక్కిస్తుందా? దీనికి ఐదు ఆస్కార్లు వచ్చాయి. దాని అర్థం ఏంటి? సినిమా అంత బాగుంటుందా? “మీ జీవితాలు నిస్సారం” అని చెబితే దాన్ని జీర్ణించుకొని, “అవును లెస్స పలికితిరి” అని ఒప్పుకొని విశాల దృక్పదంతో అకాదమీ వారు అన్ని బహుమతులు అంటగట్టారా? మొత్తానికి ఈ సినిమా చెప్పదలచుకుంది ఏంటి, అన్న చిక్కు ప్రశ్నకు నా విశ్లేషణాత్మక తటస్థ దృక్కోణం నుండి మీకో చూపే ఈ వ్యాసం.
అప్పుడెప్పుడో కల్లికోటలోఁ
నేనూ దీన్ని ౨౦౦౦లో చూసాను థియేటర్లో మఱీను. అప్పుడు నా వయస్సు పదిహేడో, పద్దెనిమిదో. నేనూ ఇద్దరు మిత్రులూ కలసి వెళ్ళాం. అమెరికా అందాలు అంటున్నాడు, పోష్టరులోనేమో తెల్లని నడుము పై బొడ్డు ప్రక్కన ఎఱ్ఱ గులాబీ. ఇంకేంటి మస్తీ అనుకుని వెళ్లాం. మమ్మల్ని నిరాశపఱచకుండా సినిమాలో సృంగారం లేకపోలేదు. కానీ ఈ సినిమాలో నిండివున్న విషం మాత్రం ఎంత కామంతోఁ కళ్ళు మూసుకుపోయిన వాడికైనా కొట్టొచ్చేడట్టు కనిపిస్తుంది. ఛీ ఇలాంటి సినిమాకి అమెరికా అందం అని పేరు ఎందుకు పెట్టాడు. దానికి అన్ని ఆస్కార్లు రావడం ఏంటి అనుకున్నా.
కానీ నిన్న రాత్రి ఈ సినిమాని మరల చూసాను. ఈ సారి వయస్సు నాది ఇఱవై ఒకటి కన్నా కాస్త ఎక్కువ, అమెరికాలో బ్రతికి వారి జీవితాలని నిశితంగా పరిశీలించి వీలైనంత అవగాహన చేసుకొని వచ్చాను. ఇక ఈమధ్య జనాలు సినిమాలు ఎందుకు చూస్తారు ఏమి ఆశిస్తారు అన్నది కూడా బాగా అవగాహన అయ్యింది. కాబట్టి అప్పటికన్నా ఇప్పుడు ఈ సినిమా మీద నాకు చాలా మంచి అభిప్రాయం ఏర్పడింది.
కథ
నలభై రెండేళ్ళ లెస్టర్ సగటు మధ్యతరగతి అమెరికను. భార్యా, కూతురుతో నివాసం. చాలా వఱకూ అమెరికా కుటుంబాల వలె వీరికి కూడా తమ జీవితంలో ఏదో లోపిస్తుందని ఎక్కడో తెలుసుకాని ఒప్పుకొని మార్చుకోవడానికి తగిన ధైర్యం లేదు. అలా అతి నిస్సారమైనదైనా నిస్సహజమైనది మాత్రం కాని అమెరికా జీవితం గడుపుతూంటాడు. ఇతని ఉద్యోగం చెత్త, కానీ ఇంటిపై ఋణం తీర్చాలి కాబట్టి వదలడానికి లేదు, అలానే భార్య కారోలిన్ సేల్లు ఉద్యోగం, అందులో ఆమెకు విజయం లేదు. (ఒక వేళ విజయం ఉన్నా సేల్సు వారి జీవితం చాలా నిరర్థకంగానే వుంటుంది. దానికి ఋజువు కారోలిన్ అక్రమ ప్రియుని జీవితం). కూతురు జేనీ పదో-పదకొండో తరగతి పిల్ల. భారతంలోఁ హైస్కూలు అంటే ఆప్తమిత్రులతో కాలం గడపడం, కానీ అమెరికాలో కౌమార విధ్యార్థుల అవస్థలు అన్నీ ఇన్నీ కాదు. అబధ్రత (insecurity) మఱియూ వ్యక్తిత్వ సంక్షోభం (identity crisis) చాలా ఎక్కువ. పైపెచ్చు జేనీ గురించి అమ్మానాన్నలు పట్టించుకుని ఏండ్లయ్యింది.
ఇక ప్రక్కింటిలోఁ, రిటైర్డు జనరల్ గారు, చండశాసనుడు, ఏ స్థాయిలోనంటే, భార్యకు మతి భ్రమిస్తుంది, కొడుకు రిక్కీకి రహస్యంగా మత్తుపదార్థాల వ్యాపారం ఉంటుంది. జనరల్ శ్వేతాధిపత్వవాది! స్వలింగ సంపర్క తీవ్ర వ్యతిరేకి!
మొత్తానికి ఒకరిని మించిన కుటుంబం ఇంకొకటి. జీవితంలో ఏ ఆశాలేని లెస్టర్ ఉనికిని కుదిపేస్తుంది కూతురు జేనీ స్నేహితురాలు ఆంజలా. ఆంజలా అందగత్తె, మాడల్ అవ్వాలని కలలు. లెస్టర్ కు ఆమెను చూడగానే వ్యామోహం కలుగుతుంది. దానికి తోడు ఆంజలా జేనీతో “మీ నాన్నే కొద్దిగా కండలు పెంచితే I would totally fuck him” అనడం లెస్టర్ కు వినిపిస్తుంది. మీలో సాంప్రదాయబద్దమైన వారికి ఈ పాటికే వికారం కలిగివుండాలి. పదిహేడేళ్ళ పిల్ల నలభై రెండేళ్లతను పైగా స్నేహితురాలి తండ్రిఁ గుఱించి ఇలా మాట్లాడుతుందని. దానికి నా సమాధానం “ఇంకా వుంది” ! దానితో స్ఫూర్తి పొందిన లెస్టరు ఉద్యోగం వదిలేసి, కండలు పెంచడం మీద పూర్తి ధ్యాస పెడతాడు. ఆంజలానే తన సర్వస్వం అనుకుంటూ. ఈ విషయం గ్రహించిన జేనీ పక్కింటి డ్రగ్ డీలర్ మఱియూ చిత్రవిచిత్రంగా ప్రవర్తించే రిక్కీ దగ్గర ఊరట పొందుతుంది. కండలు పెంచడం ఉపకరించడానికి లెస్టర్ రిక్కీ దగ్గర మందు పదార్థాలు కొనడం మొదలు పెడతాడు. రిక్కీ తండ్రి రిక్కీకి లెస్టర్ కీ వున్న సంబంధం వ్యభిచారాత్మకమైనదని (ఇద్దరు పురుషుల మధ్య) అనుమానించి, లెస్టర్ ని చంపేటంతగా ద్వేషించడం మొదలు పెడతాడు. రిక్కీని ఇంటినుండి వెళ్లిపొమ్మంటాడు. ఈలోగా లెస్టర్ భార్య కారోలిను కూడా చేతగానివాడైన భర్తను వదిలేసి ఇళ్ళ అమ్మకం రంగంలో విజయాన్ని వరించిన బడ్డీని కామించడం మొదలుపెడుతుంది. చివరకు ఆంజెలా లెస్టర్ కు దొరకుతుంది. కానీ ఆమె కన్య అని తెలుసుకున్న క్షణం ఆమె మీద వ్యామోహం పోతుంది. ఆపై ఆమెతోఁ మాటల్లో తన ప్రస్తుతం జీవితం (సినిమా మొదటితోఁ పోల్చుకుంటే) ఎంత అందంగా వుందో అని గ్రహిస్తాడు. కానీ ఆ క్షణానే పక్కింటి మేజర్ అతనిని చంపేస్తాడు!
కథాంశం
ఈ పాటికే మీకు అర్థమయ్యుండాలి. సినిమాలో అమెరికా లేదా పాశ్చాత్య జీవితంలో వుండే అన్ని రకాల వైకృతాలూ మనకు కనిపిస్తూవుంటాయి. నాకు ౨౦౦౦లో సినిమా చూసినప్పుడు అన్ని పాత్రల మీదా విపరీతమైన చిఱాకు వేసింది. ప్రత్యేకించి లెస్టర్ గా చేసిన కెవిన్ స్పేసీ మీద. నటన అంత అద్భుతమని కూడా దాని అర్థం.
అందం
రిక్కీ అందమైన వస్తువులను కెమరాలో చిత్రీకరించే అలవాటు వున్నవాడు. అతను తన జీవితం ఎంత చెండాలంగా వున్నా, దానిని ద్వేషించడు. తండ్రి తనను హింసించినా, పిచ్చాసుపత్రిలో బంధించినా, మాదక ద్రవ్యాల వ్యాపారం వున్నా, అతను మాత్రం ఒక ఎగిరే ప్లాస్టిక్కు కవరు చూసి దాని కదలికలలోని అందం వర్ణనాతీతం అని గ్రహించిన ‘జ్ఞాని’, అదే విషయాన్ని జేనీకి చెబుతూవుంటాడు. అలానే అతను జీవితంలో అన్ని భయాలనూ అధిగమించినవాడౌతాడు. ఈ సినిమాలోని మఱపురాని సంభాషణ
It was one of those days when it’s a minute away from snowing and there’s this electricity in the air, you can almost hear it. And this bag was, like, dancing with me. Like a little kid begging me to play with it. For fifteen minutes. And that’s the day I knew there was this entire life behind things, and… this incredibly benevolent force, that wanted me to know there was no reason to be afraid, ever. Video’s a poor excuse, I know. But it helps me remember… and I need to remember… Sometimes there’s so much beauty in the world I feel like I can’t take it, like my heart’s going to cave in.
లెస్టర్ కూడా చనిపోయాక (ఆ ఆఖరి క్షణంలో తన జీవితం తన ముందు చివరిసారి కదలాడేటప్పుడు) దీన్నే గ్రహిస్తాడు.
I guess I could be pretty pissed off about what happened to me… but it’s hard to stay mad, when there’s so much beauty in the world. Sometimes I feel like I’m seeing it all at once, and it’s too much, my heart fills up like a balloon that’s about to burst… And then I remember to relax, and stop trying to hold on to it, and then it flows through me like rain and I can’t feel anything but gratitude for every single moment of my stupid little life… You have no idea what I’m talking about, I’m sure. But don’t worry… you will someday.
జీవితం ఎంత ఛండాలంగా వున్నా ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు వున్నంత కాలం, బ్రతుకు జీవించదగ్గది అన్నది సినిమా సారం.
సాంకేతిక అంశాలు
సినిమా చాలా చాలా బాగుంటుంది. స్క్రిప్టుగానీ, స్కిరీను ప్లే గానీ మాః గొప్పగా వుంటాయి. ఇక నటన కూడా అత్యద్భుతం. కెవిన్ స్పేసీ ఏ సినిమాలోనైనా చీల్చిచెండాడతాడు నటన. కారోలిన గా ఆనెట్ బెనింగ్ కూడా చాలా బాగానటించింది. అన్ని పాత్రలూ చాలా అద్భుతంగా చిత్రీకరించబడ్డవి.
నిజానిజాలు
నిజంగా చాలా అమెరికా జీవితాలు ఇంతా చెండాలంగానూ వుంటాయి. కానీ దూరపు కొండల నునుపుల్నే జీవితానికి మూలస్కంధాలుగా మార్చుకున్నవారికి ఇలాంటివి ఎక్కవు. కాబట్టి సంస్కారవంతులైన ప్రవాసులుకు ఈ చలనచిత్రం నచ్చకపోవడం సర్వ సహజం. అది మన మొదటి ప్రశ్నకు సమాధానం. ఇంక రెండోది అన్ని ఆస్కార్లు ఎందుకు వచ్చాయన్నది. మనుషులకు మనుషులను కొలవడానికి కొలబద్దలు కావాలి. ఒకిరకొకరు లేబుళ్లు అతికించుకోవాలి. తరతరాలుగా చెఱగని బిరుదులు, బహుమతులు, సన్మానాలు మొదలైనవాటి యునికే దీనికి నిలువెత్తు ఋజువు. కాబట్టి సినిమాల్ని కొలవడానికి కూడా కొలబద్దలు కావాలి. అలాంటి కొలబద్దే ఈ ఆస్కార్లు. ఈ కొలబద్ద వంకరది, ఇది కొలిచేది కూడా చాలా నిమిత్తమైన ఆంగ్ల సినిమాలను మాత్రమే. కానీ అమ్ముకోలుకు అమ్ముడుపోయిన ప్రపంచంలో, అందరికంటా మాః బాగా మార్కెటింగు చేసుకున్న ఆస్కార్లే భగవద్వాక్కు. వాటికి వోట్లు వేసేది అమెరికన్లు మఱియూ ఇతర పాశ్చాత్యులు మాత్రమే. అందరి వోటర్లలానే వారికి కూడా కాకరకాయి కూరలో బెల్లంలాగా, సక్కర పూసిన సత్యమే కావాలి. ఇక్కడ సత్యం పాశ్చాత్య జీవితాల వైకృతాలు. చ౨క్కెర ఎంత ఛండాలమైన జీవితం అయినా దానిలో అందం వుంటుందన్నిది. అంటే ఈ సినిమా యొక్క సందేశం ఏంటంటే అమెరికా జనాలకి, మన జీవితాలు అతి ఛండాలం, కానీ ఏం పర్వాలేదు, జీవితంలో చాలా చాల అందం వుంది. ఎంత అందం వుందంటే తట్టుకోలేనంత అందంవుంది అని. అంతులేని ఆశకల్పిస్తుంది ఈ సినిమా.
I can’t feel anything but gratitude for every single moment of my stupid little life… You have no idea what I’m talking about, I’m sure. But don’t worry… you will someday.
అంటే ఒక రకంగా మీ జీవితాలు చాలా ఛండలంగా వున్నవి అన్నదానిని మీరు ధైర్యంగా ఎదుర్కుని మార్చుకోవలసిన అవసరం లేదని చెబుతున్నట్టు. ఇక్కడ కూడా మీలో కొందరికి మనోలంజనం అనే పదం గుర్తుకురావచ్చు. అలా చెప్పడం తప్పనట్లేదు. సినిమా అంటేనే నీరసపు జనాలకు కలలను అమ్ముకోవడం. ముఠా మేస్త్రిలో అమ్మిన కలకూ హ్యపీడేస్ లో అమ్మిన కలకూ శంకరాభరణంలో అమ్మిన కలకూ వ్యత్యాసాలు వుంటాయంతే! నిజాన్ని నిర్మొహమాటంగా చెబితే సినిమాలు హిట్లవ్వవు. ౧౫ ప్రయుతాలతో తీసిన సినిమా దానికి ఇఱవై నాలుగు రెట్లు సంపాదించేలదు.
చివరి మాట
ఈ సినిమా చాలా చాలా మంచి సినిమా అని ఇప్పటికే రెండు సార్లు అన్నాను. నేను పై ఆఖరి గద్యంలోనే దీన్ని కొంత తక్కువచేసి మాట్లాడినట్లు మీకు అనిపించవచ్చు. కానీ అది ఐదు ఆస్కార్లు రావడానికి వెనుక కారణం సినిమాలోని నాణ్యతే గాదు, ప్రేక్షకుల మనోభావాల నిత్రాణ కూడా కొంత కారణం అని చెప్పడానికే. ఈ సినిమా గుఱించి ఇంకా ఎంతో వ్రాయవచ్చు. ఎన్నో వేఱే దృక్కోణాలలోఁ. అలా ఎవరైనా వ్రాసి నవతరంగంలో వేస్తే చాలా బాగుంటుంది. అలానే మీరు నవతరంగం సభ్యులు కానప్పటికీ, మంచి ఆలోచనలను మంచి తెలుగులో వ్యాయగలిగిన వారైతే తప్పకుండా వ్రాసి నవతరఙ్‌గమ్@జీమేల్.కామ్ కి పంపగలరు.
కొసమెఱుపులు
ఈ సినిమా దర్శకుడు సామ్ మెండెస్‌కి ఇది మొదటి చిత్రం. అతని భార్య నటి కేట్ విన్స్‌లెట్. ఇతను అసలు బ్రిటీషరు, బ్రిటిష్ ఆర్మీలో కూడా పనిచేసాడు! మెండెస్ అనేది అసలు పోర్తుగీసు పేరఁట! సినిమా రచయిత అలెన్ బాల్‌కు కూడా ఇది తొలి చిత్రం. దర్శకునిలా ఇతను కూడా ఎక్కవ రంగస్థలం మీద పనిచేసేవాడట. అమెరికాలోని వోల్డ్ ట్రేడ్ సెంటర్ బయట అతనికి ఎగురుతూ కనిపించిన ప్లాస్టిక్ సంచి ఈ సినిమా స్క్రిప్టుకు దారి తీసింది ! (ఈ సినిమా తీసిన ఏఁడాదికే ట్రేడ్ సెంటర్ దుర్ఘటన జరిగింది). అలా మంచు కుఱిసేముందు గాలిలో అల్లాడుతున్న సంచి చూసి ఇంత గొప్ప సినిమా వ్రాసాడన్న విషయం చాలా మందికి అబ్బురం గొల్పినా, మీరు కూడా కళాకారుడైతే మీకు అది సర్వసహజం అనిపిస్తుంది (ఎన్నిసార్లు మీరు కిటికీలోంచి దేన్నో చూసిన్నప్పుడో లేదా నడిచి వెళ్తూ ఒక్కసారి ఆగి దేన్నో చూసో ఆహాఆ అనుకోలేదు ?)
లంకెలు
Filed Under: ప్రపంచ సినిమా • విశ్లేషణ
ఈ సినిమా గురించి మీ విశ్లేషణ చాలా బాగుంది.
అయినా సరే ఈ సినిమా నాకు నచ్చిందని చెబితే నన్ను నేను మోసం చేసుకున్నట్టే
మీకు లాగే మళ్ళీ చూస్తే నచ్చుతుందేమో ?
ఇంతకు ముందో సారి నా బ్లాగులోనేననుకుంట మీరు ఈ సినిమాని గురించి వ్యాఖ్య చేసారు.
* నేను అమెరికా ఫానునీ కాదు, ఎనారైని అంతకన్నా కాదు.
అసలీ సినిమా నచ్చని వాళ్ళు వుంటారా అనే భ్రమ లో నేను చాలా రోజులు ఉన్నప్పటికీ కొన్నాళ్ళకు ఈ సినిమాని బండబూతులు తిట్టిన వారిని కలిసాక ఈ ప్రపంచంలో అందరికీ నచ్చేదంటూ ఏదీ ఉండదని ఖచ్చితంగా తెలుసుకున్నాను.నా జీవితంలో అతి ఎక్కువ సార్లు చూసిన సినిమా ఇదేననుకుంటా….
నాకంతగా ఎందుకు నచ్చిందో అంతగా విశ్లేషించుకోలేదు కానీ ఈ మధ్యనే నాకు కొ.కు ఇష్టమా శ్రీపాద ఇష్టమా అని నన్ను నేను ప్రశ్నించుకుంటే కొ.కు కొ.కు అని మనసు గట్టిగా కేకలేయడానికి, అమెరికన్ బ్యూటీ విపరీతంగా నచ్చడానికి ఏదైనా లింకుడొచ్చని అనిపించింది.
రాకేశ్ మీ విశ్లేషణ చాలా బాగుంది.ఈ సినిమా నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు అపర్ణా సేన్ సినిమా అయినా యుగాంత్, మరో హాలివుడ్ సినిమా రిక్వియమ్ ఫర్ అ డ్రీమ్ సినిమాలు చూడండి.నా దృష్టిలో ఈ మూడూ సినిమాలన్నీ నచ్చాలి లేదా అన్నీ నచ్చకూడదని నా అంచనా…
ఎవరైనా అన్నీ చూస్తే తెలపండి
Thank you very much for your wonderfull artical,and it was my one of my fav film.
I like this film because this film “true”, i mean honest portrai of human nature.
visit my short film here
http://www.jonathanswork.com/filmmaking.html
ఈ సినిమా లో చివరి క్షణం లో అతని మది లో మెదిలె , youర్ entire life flashes before the second before you die…… అనే మాటలు నాకు చాలా ఇష్టం.
I love this line from the film
…. “Today is the first day of the rest of your life”
@ ప్రవీణ్,
నేను అమెరికా వెళ్లివచ్చాను కాబట్టి, ఆ సినిమాలోని వికారం కళ్ళారా చూసా కాబట్టి , దాన్ని దిగమ్రింగి సినిమాని నిష్పాక్షికంగా చూడగలిగాను.
మీరూ ఆ స్థాయికి చేరుకుంటే మీకు నచ్చవచ్చు కానీ.. ఆ స్థాయి చేరుకోదగ్గ స్థాయి కాదు
@ వేంకట్,
మీకు ఈ సినిమా ఇంత ఇష్టం అని నాకు తెలియదు.
అన్నట్టు “Today is the first day of the rest of your life” అన్నది క్లిషే అందరూ వాడేదే, కానీ వాడు “thats not true if you are going to die today” అనడం గమ్మత్తు
@ కిరణ్,
“your entire life flashes before the second before you die” ఈ విషయం చావు దగ్గరకు వెళ్లి వచ్చిన వారందరూ అనేదే, కానీ వాడు “First of all, that one second isn’t a second at all, it stretches on forever, like an ocean of time…” అనడం గమ్మత్తు
కచ్చితంగా చాలా గూఢమైన సినిమా, సందేహం లేదు. అఫ్కోర్సు, అమెరికన్ కలని మెక్డానల్డ్స్ హేంబర్గరంత నమ్మేసే వాళ్ళకి ఈ సినిమా నచ్చక పోవడంలో వింత యేమీ లేదు. ఒకలాగా చూస్తే లెస్టర్ పాత్రకి జెనరల్ గారి పాత్రా, జెనరల్ గారి కొడుకు పాత్రా కాంట్రాస్టులు. ఇన్ని పాత్రల్నీ సజీవంగా దిద్ది జెనర్ల్ పాత్రని చెక్కపడిగా వొదిలేశారని నా మొదటి అభియోగం. ఏంజెలా కన్య అని తెలుసుకుని, ఇన్నాళ్ళూ ఆమెని తల్చుకుని లొట్తలేసుకూంటూ ఉన్న లెస్టర్ అకస్మాత్తుగా ఆమె మీద కోరికని కోల్పోవడం కూడా పాత్రోచితంగా లేదన్నది నా రెండో అభియోగం. ఇహ, చివరి సీనులో జెనరల్ గారి గుండు దెబ్బకి ప్రాణం పోయిన లెస్టర్ ఆత్మ అదలా జరుగుతుందీ అనే సర్వాంతర్యామి స్పృహతో కథ చెప్పడం సినిమాకి దోహదం చేసిందా, దిగదీసిందా అని నేనింకా తర్కించుకుంటూనే ఉన్నా. ఏదేమైనా .. మాట్లాడ్డానికి చాలా కష్టమైన సినిమా పేరెత్తి దాన్ని గురించి నాళుగు ముక్కలు రాసినందుకు అభినందనలు. రిక్కీగా వేసిన వెస్ బెంట్లీ మంచి నటుడౌతాడని అనిపించింది. కానీ ఏంటో తరవాత అతను నటించిన సినిమాలేవీ చూడ్డం పడలేదు.
మనలో మాట, ఆత్రం ఎంత ఎక్కువైనా అచ్చు తప్పుల్ని కాస్త కంట్రోల్లో పెడితే బావుంటుంది.
@కొత్త పాళీ,
జనరల్ పాత్రకు కూడా స్వలింగసంపర్క చరిత్ర వుందంట, అసలు స్కిరిప్టులో. అది మనం ఎలాగూ ఊహించుకోవచ్చు, గరాజ్ లో లెస్టర్ తో సీను చూశాక.
ఈ విషయం కొంత ఆ పాత్రను క్లిష్టం చేసేస్తుంది కానీ, లేకుంటే, ఆయని పాత్ర చాలా నిధానమైనది, చాలా తేలికగా ఊహించుకోదగ్గది.
ఇక లెస్టర్ నేను చనిపోబోతున్నాను అని రెండు సార్లు గుర్తుచేస్తాడు సినిమా మధ్యలో. దానికి అర్థం సినిమా దాని గుఱించి కాదు అని ప్రేక్షకులకు ముందే చెప్పడం అని నాకు అనిపించింది.
లెస్టర్ మంచివాడు అని నాకు సినిమా అంతటా అనిపించింది. కాబట్టి నాకు వ్యామోహం తొలగిపోవడం సహజంగానే అనిపించింది.
సినిమాని ఇంకొద్దిగా డీటెయిల్డుగా తీయవచ్చు, కానీ పొడుగు పెంచడం ఇష్టంలేక చేయలేదేమో..
మనలో మన మాట, ఇప్పటికే టపా వేయడానికి నాలుగేసి గంటలు పడుతుంది. అయినా నాకేంటో అచ్చుతప్పులు కనిపించట్లేదు. ఇప్పుడు మీరు చెప్పాక ఒక ఆఱో ఎన్నో తటస్తించాయి, అంత కన్నా ఎక్కువ కనిపించట్లేదు నాకు. ఏదోటి చేయాలి దీనిగుఱించి.
@ రాకేశ్
.
నాకు ఆ ముక్క ఒక్కటే నచ్చింది అనటం లేదు. ఆ డైలాగ్ నుంచి, మన వాడి ప్రాణం పోయే వరకు ఉన్న డైలాగ్ ఇష్టం అని అంటున్నా. అందుకే కదా అక్కడ చుక్కలు పెట్టాను
నమ్మగలరా, ఈ సినిమా పై సమీక్ష అని చూడగానే ఎవరు రాసి ఉంటారో ఊహించాను.
నేనీ సినిమా చూడ లేదు కాని, అది దేని గురించో కాస్త తెలుసు.
మీ విశ్లేషణ చాలా బాగుంది.
ఈ మధ్య బ్లాగరులలో ముగ్గురి ఆలోచనలను గమనించడం నాకు ఆసక్తికరంగా ఉంటోంది:
రాకేశ్వర రావు, నవీన్, ఫణి (కలం కలలు).
I see almost extreme idealism along with almost the same extreme awareness of reality in all these guys. That’s the feeling I am getting and it’s not a judgement of any sorts.
I felt like expressing that.
Best wishes to you all.
@ లలిత గారు
నా (మా) జబ్బు మీరు బాగా పసిగట్టినట్టున్నారు. దానికి మీ దగ్గర విఱుగుడు కూడా ఉంటే దయచేసి చెప్పగలరు
రాకేశ్వర రావు,
మీది జబ్బు అని నేననలేదు. అది జబ్బు కాదు.
రెండు విపరీతాలనూ తాక గల మీరు మీదైన సమతూకాన్ని కనుక్కుని మీ లోకాన్ని మలచుకోవాలని ఆశీస్సులు.
సరేనా?
రాకేశ్వర రావు గారి ఉవాచ:
“నేనూ దీన్ని ౨౦౦౦లో చూసాను థియేటర్లో మఱీను. అప్పుడు నా వయస్సు పదిహేడో, పద్దెనిమిదో.”
“కానీ నిన్న రాత్రి ఈ సినిమాని మరల చూసాను. ఈ సారి వయస్సు నాది ఇఱవై ఒకటి కన్నా కాస్త ఎక్కువ”
రాకేశ్వర రావు గారూ, ఇలా అడుగుతున్నందుకు క్షమించండి. మీరు, గణితం రాని/వయసు తెలియని ఒక తెలుగు సినిమా హీరోయినా?
@ కాంతు గారు,
ఇఱవై ఒకటి కన్నా కాస్త ఎక్కువ అనగా,
ఇఱవై ఒకటి కన్నా ఒక యాభై నెలలకన్నా ‘ఇంకాస్త’ ఎక్కువ అని.
(Friends లో ఒక జోకు వుంటుంది అందులో మానికాని ఎవరో వయస్సు అడిగితే, ఎన్నో ఏళ్ళ పదమూడు నెలలు అని చెబుతుంది. ఇది కూడా అలాంటిదే.)