కధను గాలికి వదిలేసిన తెలుగు సినిమా

భారతీయ చలనచిత్రాల్లో కళాఖండాలు అన్నవి ఒక వంద లెక్కేస్తే ఆయన దర్శకత్వం వహించినవో ఆయిదు ఉంటాయి.తెలుగులో వచ్చిన అత్యుత్తమ చిత్ర్రాలో ఒక పాతిక జాబితా రాస్తే ఆ మహనీయుడి చిత్రాలు అన్నీ ఉంటాయి.నా తదనంతరం ఇక ఇలాంటి సినిమలు రావూ అని నిశ్చయంగా తెలిసినట్లే తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల అన్నట్లు నిక్కమైన నీలాలే మనకిచ్చి మహానుభావుల్లో కలిసిపోయాడు.

తెలుగు సినిమాకో దిశానిర్దేశం చేసి, మంచి సినిమా అంటే తను తీసిన సినిమాల ద్వారా నిర్వచించి,గొప్ప చలన చిత్రాలకో గ్రామరూ, కళాఖండాలకో గ్లామరూ తయారు చేసి చూపాడు.సాహిత్యం లో తప్ప క్లాసిక్స్ అనేవి తెలుగుసినిమాల్లో రావూ అనే వాదాన్ని తుత్తునియలు చేశాడు. ఆయనే మల్లీశ్వరి, బంగారు పాప, పూజాఫలం, రాజమకుటం, వంటి అద్బుత చిత్రాలను మనకు అందించి తెలుగు సినిమా బావుటాను విశ్వవిఖ్యాతం చేసిన బి.యన్.రెడ్డి.

భారీ కాన్వాసు తీసుకుని అంత కన్నాపెద్ద తారాగణం వాటి మోజు లో పడి కధాకధనాలకు న్యాయం చేయలేకపోయిన ఆనాటి దర్శకులముందు బి.యన్. హిమాలయ శిఖర సమానుడు.పోయిన శతాబ్దపు మూడు,నాలుగు,అయిదు దశాబ్దాలలోకూడా హంగూ,ఆర్భాటాల మీద తప్ప కధలొ దమ్ము లేకుండా వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి అనేది నమ్మశక్యం కాని నిజం.కాలక్రమంలో స్వర్ణయుగం అంతరించి ఆనాటి బంగారు కాంతులు పలచబడుతూ వస్తున్న వస్తున్న కాలంలో బి.యన్.ఒక సందర్భంలో తన మనోభావాలను పంచుకున్నారు.

“ఒకనాడు సినిమా తీస్తే ఆ సినిమాలో కధాంశం ఏమిటి?ఆదర్శం ఏమిటి?ఆశయం ఏమిటి?అదిచ్చే సందేశం ఏమిటి?అని కూలంకషంగా చర్చించేవాళ్ళం,ఆ విషయాలు తేలాక కధ రాసుకునేవాళ్ళం,పాత్రలను మలచుకునేవాళ్ళం.పాత్రలను బట్టి నటులను ఎన్నుకునేవాళ్ళం.ఆనాడు పాత్రల స్వభావానికి నటులు ఒదిగి ఉండేవాళ్ళు.భాషను కూడా పాత్రల స్వభావాన్ని బట్టే ఎంపిక చేసేవాళ్ళం ..మనకు అనేక ప్రాంతాలు,ఒకదానికొకటి అందికాపొందికా లేని మాండలిక ప్రత్యేకతలూ ఉన్నాయి.అందువల్ల మేము సినిమాలు తీసిన తొలినాళ్ళలో ఏ ప్రాంతపు భాష సార్వజనీనంగా ఉంటుదన్న విషయం గూడా తర్జనభర్జనలు జరిపి,ఉన్నవ లక్స్మీనారాయణ గారు “మాలపల్లి”లో వాడిన భాష ఆంధ్రదేశానికంతటికీ సరిపోతుందని భావించాం.

చిత్రంలో యధార్ధ జీవితాన్ని చిత్రించేటప్పుడు ఒక్క వాతావరణం మాత్రం చూపితే సరిపోదు.భాషలో,పాత్రల స్వభావంలో,వారి నటనారీతిలో అన్నిటా వాస్తవిక అనుభూతి కల్పించగలగాలి.దానికి దర్శకునికీ,రచయితకూ తెలుగు దేశ సాంఘిక జీవన సరళిపై మంచి పట్టు ఉండాలి.ఉదాహరణకు నేను తీసిన ’వందేమాతరం’చిత్రంలో రైతు కుటుంబాలను చిత్రీకరించాల్సివచ్చినప్పుడు నాకు తెలిసిన నా ప్రాంతపు (రాయలసీమ)రైతు కుటుంబాలను చిత్రించాను. నేను పుట్టిపెరిగిన వాతావరణాన్ని ముమ్మూర్తులా చలన చిత్రంలో ప్రతిబింబించాను.చలనచిత్రం సహజత్వానికి దగ్గరగా ఉండాలంటే ఏపాత్రలను,ఏప్రాంతాలను దృష్టిలో పెట్టుకున్నామో ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలు,కట్టుబాట్లు,ఆయా వ్యక్తుల రాగదేషాలూ అన్నింటిలో దర్శకునికీ,కళాదర్శకునికీ పరిచయం ఉండటం అవసరం.ఆనాడు వీటిని తెలుసుకుని,కధాకధనం చెడకుండా చిత్రాలను నిర్మించాలనే జిజ్ఞాస ఉండేది .అందుకే ఒక చిత్రం నిర్మించాక మరో చిత్రం నిర్మించాలంటే ,ఇందులో ఏమి చెప్పాలనేది మాకు పెద్ద సమస్యగా ఉండేది. ” థీం ” కోసం చాలా కాలం ఆలోచించవలసి వచ్చేది.

నేడు అదంతా ‘ మనవాళ్ళకు ‘ అపహాస్యంగా కనిపిస్తుంది.సినిమాకు కధేమిటి? హీరో కాల్షీట్లు ఇస్తే సరి- అన్నంత దూరం పయ నించింది మన చిత్ర పరిశ్రమ. చిత్రాన్ని వ్యాపార దృష్టితో తీసేటప్పుడు కధ, ఆదర్శాలు అనవసరం. కావలసిందల్లా ప్రజలను కవ్వించటం, గ్లామర్, పెద్దతారల పాపులారిటీ, పర్సనాలిటీ, అభిమానులు, అభిమాన సంఘాలు–వీళ్ళందరికీ సరిపడే పాళ్ళలో మసాలా వేసి వండడం -ఇలా ఏది చేస్తే అది ఘనకార్యం, ఏది తీస్తే అది అధ్భుతకళాఖండం!

చలనచిత్ర పరిశ్రమ నేడు ఫక్తు టోకు వ్యాపారం. ఎన్ని వారాలు నడిస్తే అంత కళాఖండం, చిత్రంలో ఏదీ లేకున్నా అలా రాయించుకుంటాం. ఈ వ్యాపార చిత్రాలకే ప్రభుత్వం ” ఆవార్డు” లు ఇస్తూ ఉంది. రాజు మెచ్చింది రంభగా కేమౌతుంది?

అవాస్తవికత వాస్తవికతగా రాజ్యమేలుతున్న తెలుగు చిత్ర పరిశ్రమ,కొత్తగా కొన్ని పెద్దపెద్ద నినాదాలను వల్లిస్తూఉంది.ఇందులో హీరో ధనిక వర్గం నశించాలి అని నినాదం ఇస్తూ ఉంటాడు.ఆ హీరో నాలుగు వేళ్ళకూ ఉంగరాలు మెరిసి పోతుంటాయి.’అయ్యా హీరో గారూ మీరు వేస్తున్నది కార్మికుడి వేషం,ఒక పూట తింటే మరో పూట పస్తుండే వేషం,చేతులకు ఉంగరాలు ఉండగూడదని ఎవరైనా హీరో గారికి చెప్పే దమ్ములున్నాయా?హీరో,సాదాసీదాగా పాత్రకు అనుగుణ్యంగా కనిపిస్తే హీరో ఇమేజ్ దెబ్బ తింటుంది.అందుకే మన చలన చిత్రాలు సామ్యవాదాన్ని టోకున కొని చిల్లరగా అమ్మాలని ప్రయత్నిస్తున్నాయి.

నేడు మనచిత్ర పరిశ్రమ ఒక విష వలయం లో కొట్టుమిట్టాడుతుంది.భారీ తారాగణం,పంపిణీ వ్యవస్థా,థియేటర్ యజమానుల కభంధ హస్తాల్లో పడి నలిగిపోతూ ఉంది.దీనిని ఛేదించటమెలా?పంపిణీదార్లకు వ్యాపారరీత్యా హిట్ అయ్యే కధ కావాలి,ఫలానా తార కాని,తారడు కానీ కావాలి.ఆ ఫలానా తారడికి,తారకూ కధ తన చుట్టూ గిరి గీసుకుని మరీ తిరగాలి,ఇక థియేటర్ల యజమానులకు ఈ స్టార్ సిష్టం తో పాటు రంగుల హంగులూ కావాలి.ఈ ముగ్గురినీ సంతృప్తి పరచవలసి వచ్చేసరికి తెలుగు సినిమా పంచ కూళ్ళ కషాయం లా తయారౌతోంది.రచయితలు కూడా ఈ సినిమాలను చూసి చెడుతున్నారు. నాలుగు సినిమాలు చూసి ఒక నవలను వండే పరిస్తితికి నవలా రచయితలూ,పది సినిమాలలోని సన్నివేశాలను ఏరి ఒక సినిమా రాసే సినీ రచయితలూ తయారయ్యారు.ఇక ఈ పరిశ్రమ బాగుపడేదెట్లా?తెలుగు సినిమా బాగుపడాలంటే — పంపిణీ వ్యవస్థ జాతీయం కావాలి–థియేటర్ యజమానుల కంట్రోలు పోవాలి–స్టార్ సిస్టం రద్దు కావాలి.దర్శకునికి జాతి జీవితం గురించి తెలియాలి.రచయితలు సినిమాలు కాపీ కొట్టి రచనలు సాగించే పద్దతి అంతం కావాలి.ప్రేక్షకుడు కధకు ప్రాముఖ్యమిచ్చే స్థాయికి ఎదగాలి.ఇన్ని బాధలు తెలుగు సినిమా పడలేదు.అందుకే గ్లామర్ ని సర్వరోగనివారిణిగా ఎంచుకుంది!

–అభ్యుదయ మాసపత్రిక అక్టోబరు 1976 సంచిక లోని వ్యాసం ఆధారంగా

20 Comments

20 Comments

 1. venkat

  January 20, 2008 at 7:47 pm

  రాజేంద్ర గారూ,
  మరో మంచి వ్యాసం అందిమ్చినందుకు నెనర్లు.
  B N Reddy శతజయంతి సంవత్సంలో ఆయన్ను గుర్తుచేసుకోవడం మనందరి కర్తవ్యం.
  త్వరలో మరింత మంది మరిన్ని వ్యాసాలతో ఆయన్ని గుర్తు చేసుకుంటారని ఆశిస్తున్నాను
  వెంకట్

 2. sathish

  January 21, 2008 at 12:10 pm

  తెలుగు సినిమాల్ని విమర్శించడం అంత తేలికైన పని మరొకటి లేదు అనడానికి ఈ వ్యాసం ఓ మచ్చు తునక. .

 3. రాజేంద్ర కుమార్ దేవరపల్లి

  January 21, 2008 at 1:29 pm

  అయ్యా సతీష్ గారు,ఆ విమర్శించింది బి.యన్.రెడ్డి అనే మహోన్నత దర్శకుడు,నిర్మాత,తెలుగు సినిమా ఏదేశపు ఉత్తమ సినిమాకూ తీసిపోదని తన చిత్రాల ద్వారా నిరూపించిన స్రష్ట.తమ లాంటి మేధావులు ఇంకోసారి ఆయన తీసిన సినిమాల గురించి చదివి,వీలుంటే చూసి,పనిలో పనిగా ఇప్పుడొస్తున్న చలన చిత్రాలనూ మీ ఇష్టం అయ్యింది ఒక్కటి చూసి ప్రశ్నిస్తే నేను మీకు బదులిచ్చేం దుకు సిద్దం.

 4. రాకేశ్వర రావు

  January 21, 2008 at 2:42 pm

  సతీశ్ గారు,
  “తెలుగు సినిమాల్ని విమర్శించడం అంత తేలికైన పని మరొకటి లేదు”
  అవును లెస్స పలికితిరి. దానికి కారణం కూడా మీకు తెలిసేవుంటుంది.
  “౯౯% పరమ చెత్తగా వుంటాయి కాబట్టి”

 5. వెంకట్

  January 21, 2008 at 3:01 pm

  సతీష్ గారి అభిప్రాయం ఏంటసలు?
  నా కర్థం కాలేదు.
  ఆయన వ్యాసాన్ని పొగిడారా? లేక తెలుగు సినిమాని తిట్టారా?

 6. sathish

  January 21, 2008 at 3:57 pm

  దేవరపల్లి గారూ
  ఈ వ్యాసం మొత్తం ఆయన రాసినదేనా

 7. రాజేంద్ర కుమార్ దేవరపల్లి

  January 21, 2008 at 4:51 pm

  మీరు అసలు చదవలేదని నా మట్టిబుర్రకు అర్ధమవుతుంది
  “ఒకనాడు సినిమా తీస్తే …. నుంచి ఆయన స్వంత మాటలు

 8. ప్రసాద్ సామంతపూడి

  January 22, 2008 at 2:37 am

  రాజేంద్ర గారు మంచి వ్యాసాన్ని అందించినందుకు కృతజ్ఞతలు.

  వ్యాసం చివర్లో తెలుగు సినిమా బాగుపడటానికి కొన్ని సూచనలు ఉన్నాయి. వీటి గురించి మరింత వివరింగా రాస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.

  పీత కష్టాలు పీతవి. సినిమారంగంలో ప్రతిభావంతులు చాలామంది ఉన్నారు. కాని కొన్ని కుటుంబాలు పరిశ్రమని శాసిస్తున్నాయి. వీరికితోడు అభిరుచి లేని నిర్మాతలు. వీరి కభంధ హస్తాల్లో నుండి బయటపడి మంచి సినిమా రావాలంటే చాలా కష్టం.

  దీనికీ ప్రత్యామ్నాయం ఉండాలి.

  ఒకప్పుడు సాహిత్యం ప్రభువులకు,జమీందార్లకు ఊడిగం చేసేది. తన భాధ్యత గ్రహించి తిరుగుబాటు చేసి, సామన్య ప్రజల పక్షం నిలిచింది.

  తెలుగు సినిమా కూడా తిరుగుబాటు చేసి,సగటు మనిషి పక్షం వహిస్తుందా?

  అందరూ భాధ్యతతో ఆలోచించాలి.

 9. మంజుల

  January 22, 2008 at 3:11 am

  నంది బహుమతులు కూడా చెత్త సినిమాలకి ఇవ్వడం విచారకరం. మంచి సినిమా ని ప్రేక్షకులే పోషించాలి.

 10. sathish

  January 22, 2008 at 6:55 am

  దేవరపల్లి గారూ
  నాది మట్టి బుర్ర అని సూటిగానే అనొచ్చుగా.

  ఇప్పుడొస్తున్న చెత్త సినిమాలతో పోలిస్తే గానీ ఆయన సినిమాల గొప్పతనం కనపడదా? (దాదాపు అన్ని సినీ విమర్శల్లో ‘పోల్చడం’ ఎక్కువగా చేస్తున్నారు. అది సరికాదని నా అభిప్రాయం. సమస్యకు గల కారణాల గురించి లోతుగా ఆలోచిస్తే వాస్తవం కనపడుతుంది). ఆయన సినిమాలు తీసినప్పుడు ఉన్న పరిస్థితులు వేరు (సమాజ పరంగా, పరిశ్రమ పరంగా).

  బీఎన్ రెడ్డి లాగా కొద్దిమంది ఆదర్శం కోసమే సినిమాలు తీసి ఉండవచ్చు. కానీ సినిమాలు ఆదర్శం కోసమే తీయాలనుకోవడం సరికాదని నా అభిప్రాయం.

  ఆయన వ్యాసం చివర్లో ఆశించిన మార్పులు వాస్తవానికి దూరంగా ఉన్నాయి.

  @ నేను చేసిన మొదటి కామెంట్ ఎందుకంటే, నా చిన్నప్పట్నించీ ఇదే విషయం చదువుతూ, వింటూ వస్తున్నా. తెలుగు సినిమా పరిస్థితి పై వాస్తవ ద్రుష్టితో వ్యాసాలు రాయాలి. చెత్తను తిట్టుకోవడం మాని, నాణ్యమైన సినిమాలు రావాలంటే ఏమి చెయ్యాలో కొత్త ఆలోచనలు పుట్టుకు రావాలి.
  @ ఆదర్శం కోసం తీసినా, వాస్తవానికి దగ్గరగా తీసినా కనీసం కోటి రూపాయలు ఖర్చవుతాయి(టెక్నికల్ వాల్యూతో ).
  ఆ డబ్బులు వెనక్కి వచ్చే మార్గం ఉందా?

 11. రాజేంద్ర కుమార్ దేవరపల్లి

  January 22, 2008 at 1:26 pm

  బి,యన్ రెడ్డి ఫక్తు కాపిటలిస్ట్,ఆయన చాలా వ్యాపారాలు చాలా కాలం చేశారు.ఆయన సిన్మాలు ఏవీ ఆర్ధిక నష్టాలు తేలేదు,అలాగే,రే,తదితరుల సినిమాలు కూడా,ఆయన సినిమాలు తీసిన కాలం కన్నా ఈరోజే ఇంకా మంచిసినిమాలు రావాల్సిన అవసరం ఉంది.మీరు గమనించండి ఆరోజుల్లో చాలా చెత్త వచ్చిందని రాసాను నేను.పోల్చడం అనివార్యం కావటం వల్లేతప్ప దాని మీద ప్రత్యేకమైన మోజేమీ లేదు,ముఖ్యంగా నాకు.వ్యాసాల వల్ల సినిమాల స్తితిగతులు మారుతాయనే ఊహలు ఊహలుగానే మిగులుతాయి సతీష్ గారు.చిన్నప్పట్నుంచి సినిమాల గురించి చదువుతున్న మీరు నవతరంగం కోసం మీ అంచనాలలో మంచిసినిమా ఎలా వుండాలో ఒక వ్యాసం రాయండి.కేవలం అవార్డుల కోసం తీసిన సినిమాలు కూడా ఆర్ధికం గా నష్టపోవటం దాదాపుగా ఉండదు,దాని ఖర్చులు వస్తూనే ఉంటాయి.

 12. రాజేంద్ర కుమార్ దేవరపల్లి

  January 22, 2008 at 1:30 pm

  ఇంకో విషయం సతీష్ గారు ఇక్కడ కామెంట్లను విషయప్రాధాన్యతా ప్రకారం తప్ప వ్యక్తిగతం గా తీసుకోకండి.

 13. sathish

  January 22, 2008 at 2:21 pm

  1950ల్లోనే కొడవటిగంటి తను రాసిన సినీ వ్యాసాల్లో హాలీవుడ్ భ్రష్టు పట్టిపోయింది అన్నారు. తెలుగు సినిమాల సంగతి చెప్పక్కర్లేదు.

  ఏ విమర్శ అయినా లోతుగా ఆలోచించి చెయ్యాలి అనేది నా ఉద్దేశం. -కారులో షికారు- పాట మీద బుచ్చిబాబు రాసిన వ్యాసం అందుకు ఉదాహరణ.

  ప్రముఖ దర్శకుడి కుమారుడు కొత్త తరం సినిమాలు తీయాలని ఒక్ ఔత్సాహిక దర్శకుని స్క్రిప్ట్ విన్నాడంట. వేరేవాళ్లకు చెబితే అది ఒక ఆంగ్ల చిత్రం అని చెప్పారంట.

  ప్రస్తుతం టాలెంట్ని ప్రోత్సాహించడం లేదనే వాళ్లు ఎక్కువగా ఉన్నారు మన రాష్ట్రంలో. అందులో ఎంతమందికి నిజంగా టాలెంట్ ఉందటారు. ఒక కొత్త దర్శకుడికి విషయం ఉందని తెలుసుకోవడం ఎలా?

 14. వెంకట్

  January 22, 2008 at 4:00 pm

  సతీష్ గారూ,
  ఒక కొత్త దర్శకుడిలో విషయం వుందా లేదా అనేది తెలుసుకోవడం కష్టమే! కానీ అలా అని టాలెంటు లేని పాత వాళ్ళనే ప్రోత్సాహిస్తూ కూర్చోలేము కదా!
  కొత్త పాత సంగతి పక్కనెపెడీతే స్టార్ సిస్టమ్తో సంబంధం లేకుండా, మంచి కథ , కథనాలు, క్యారెక్టరున్న క్యారెక్టర్లు, కలిగివున్న స్క్రిప్టు ఉన్న దర్శకులను ప్రోత్సాహించవచ్చు.
  కొత్త వాళ్ళు స్క్రిప్టు పట్టుకొని వస్తే ఇందులో హీరో ఇంట్రడక్షన్ ఎక్కడ ఎలా వుంటుంది, ఇంటెర్వెల్ బ్యాంగ్ ఏంటి? లాంటి విషయాలు కాకుండా స్క్రీన్ప్లే సరిగ్గా వుందా, ఎక్కడైనా లోఫోల్స్ వున్నాయా లాంటి విషయాలతో పాటు, అతనికి సినిమా అనే భాషకు వున్న గ్రామర్ పై ఏమాత్రం పరిజ్నానం వుమ్దో అడిగి తెలుసుకోవచ్చు.
  మంచి సినిమా తియ్యలనే వుండాలి గానీ టాలెంటుకి కొదవలేదు.

 15. రాజేంద్ర కుమార్ దేవరపల్లి

  January 22, 2008 at 4:52 pm

  కొత్త నిర్మాత సూట్ కేసుడబ్బుతో రాగలడు,కానీ దర్శకుడు కాగితాలు,గతంలో తన క్రెడెన్షియల్స్ తో అనుభవం తో తీయాల్సిందే.ఆదుర్తి మొదటి సినిమా ఫ్లాప్ అలాగే చివరిది కూడా.మధ్యలో అపజయమే లేదు.

 16. sathish

  January 24, 2008 at 10:29 am

  దేవరపల్లి గారు

  సీరియస్ సినిమాకు డబ్బులు వచ్చే మార్గం చెప్పండి. పెట్టుబడి వెనక్కి రాదనే కదా అందరూ వాటివైపు చూడనిది. ఆర్ధిక సమస్య లేనప్పుడు నాణ్యమైన సినిమా తీయడం పెద్ద విషయం కాదు.

  వెంకట్

  ఔత్సాహిక నటులు ఎలా, ఎక్కడ దొరుకుతారో చెప్పండి.
  ముఖ్యంగా ప్రయోగాత్మక సినిమాల్లో నటించడానికి ఆసక్తి ఉన్నవాళ్లు ఎంతమంది ఉన్నారు? (విషయం ఉన్నవాళ్లు, సహకరించేవాళ్లు).

 17. రాజేంద్ర కుమార్ దేవరపల్లి

  January 24, 2008 at 11:07 am

  ॒ సతీష్ గారు,

  సీరియస్ సినిమాలకు నాఉదాహరణలు-మాయాబజార్,షోలేకాబట్టే ఇంతకాలం నిలిచి ఉన్నాయి.వాణిజ్యపరంగా వందలాది థియేటర్లలో విడుదలయ్యి కోట్లు తీసుకురావు మీరు అనేవి, సినిమాలను సక్రమంగా మార్కెటింగ్ చేసుకోగలిగితే పెట్టుబడితో పాటు కొంచెం లాభాలు తెచ్చే అవకాశాలే ఎక్కువ.ఫిల్మ్ ఫెస్టివల్స్, వెబ్ మీడియా….,ఈరోజు ఉన్నన్ని అవకాశాలు సుడిగుండాలు,మరోప్రపంచం తీసిన రోజుల్లో లేవు.మీదే ఆలస్యం కానివ్వండీ.

 18. sathish

  January 25, 2008 at 4:07 pm

  కానీ నా లెక్క ప్రకారం మాయా బజార్, షోలే పక్కా వినోదాత్మక, వాణిజ్య చిత్రాలు. సుడిగుండాలు పూర్తి సీరియస్ చిత్రం. గ్రహణం డిజిటల్ కేమెరా వాడి 3 లక్షలతో తీశారంట. పేరు బాగానే వచ్చింది. ఆ నిర్మాతల్ని అడిగితే కానీ తెలియదు, డబ్బులు వెనక్కి వస్తయ రాదా అన్నది.

 19. వెంకట్

  January 25, 2008 at 5:18 pm

  గ్రహణం కి వాళ్ళు పెట్టిన డబ్బులు వెనక్కి రావడమే కాదు లాభాలూ వచ్చాయి. నేషనల్ అవార్డు వచ్చిన సినిమాలను దూరదర్శన్ తప్పక కొనాలనే నియమేదో వుందనుకుంటా. అలాగే DVD సేల్స్ కూడా ఫర్వాలేదు. ఆ విధంగా డబ్బులు వెనక్కి వచ్చినట్టే. అన్నట్టు గ్రహణం బడ్జెట్ 5 లకషలు.
  అలా అని అన్ని సినిమాలూ అవర్డులు సాధించి మాతర్మే డబ్బులు వెనక్కుతెచ్చుకోవాలంటే కషటమే కనుక alternate way వెతుక్కోవాలి, లేదా క్రియేట్ చేసుకోవాలి. మనకు కుప్పలు తెప్లుగా TV చానెళ్ళు వస్తున్నాయి. వీళ్ళందరికీ కంటెంట్ provide చేయడం ఒక మార్గం. కాకపోతే మన వాళ్ళకి TV అంటే ఒక చులకన భావం. మొన్నా మధ్యన ఒక చిత్రోత్సవంలో అవార్డు గెలుచుకున్న ఒకతనితో మాట్లాడుతుంటే “ఇది అవార్డు కోసం తీసా గానీ, arricamతో ఆడుకున్న నాకు డిజిటల్ తో పనేంటి అనడమే ఇందుకు సాక్ష్యం

 20. Chetana

  February 12, 2008 at 2:32 pm

  సీరియస్ సినిమా అంటే నా ఉద్దేశ్యంలో మంచి సినిమా. కళ్ళు చిట్లించి చూసే సినిమా సీరియస్ సినిమా, నవ్వుతూ చూసేది సీరియస్ సినిమా కాదు, వాణిజ్య సినిమా అని కాదు. మంచి సినిమాలు అంటే ఆర్టు సినిమాలు, ఫెస్టివల్స్కి మాత్రమే పంపే సినిమాలే తీయక్కర్లేదు, కథ స్క్రీన్‌ప్లే సరిగ్గా రాసుకుని రమ్మనండి చాలు. వినోదాత్మకం అయితెనేమి, వాణిజ్యం అయితేనేమి. మనవాళ్ళు ముందు ఒక సినిమా అందరికీ కేటర్ చేయవసరంలేదు అని కూడ గ్రహించాలి.. అలాగే వాళ్ళంటున్న “మాస్” జనాలకోసం తీసినంత మాత్రాన కథాస్క్రీన్‌ప్లే అవసరం లేదు అనుకొవక్కర్లేదు. అలా అనుకుని ఆ సినిమాలని, ఆ సినిమా చూసే మనల్ని కూడా కించపరుస్తున్నారు.

Leave a Reply

To Top