Menu

అరువి – ఉప్పొంగే జలపాతం

ఈ మధ్య కాలంలో తమిళనాట అధికంగా మాట్లాడబడిన సినిమా ఇదే. కొన్ని సినిమాలను ఆస్వాధించగలం కాని దాని భావాన్ని విరివిగా మాటల్లో చెప్పలేం. కాని అది దాని ముగింపులో మనపై బలమైన ముద్రను వేస్తుంది. మన మనస్సు పొరల్లో చెరగక నిలిచిపోతుంది. అటువంటి కోవకు చెందినదే ఈ చిత్రం.

మనలో చాలా మంది తప్పులు చేసేందుకు చాలా కారణాలు ఉన్నప్పటికీ, అందులో  అయినవాళ్లే మనల్ని అపార్ధం చేసుకోవడం, దాని మూలంగా నిరాదరణకు గురి కావడం అనేది ఓ ప్రధాన కారణం. ఓ మనిషి ఓ కుటుంబం నుండో, వ్యవస్థ నుండో నిరాదరణకు గురి కావడం కంటే ఘోరమైన విషయం మరొకటి లేదు. చాలా మట్టుకు ఇక్కడ తప్పులు ఎవరు కావాలని చెయ్యరు.ఓ వ్యక్తి నిరాదరణకు గురైనపుడు వారికి మంచేదో, చెడేదో విచక్షణతో చెప్పేవారు కరువైనప్పుడే మరిన్ని తప్పులు చేసే అవకాశం ఉంది. ఆ సమయంలో నిరాదరణకు గురై, వారు అనుభవించే మానసిక సంక్షోభం వర్ణనాతీతం. అటువంటి సంక్షోభంలో ఉన్నవారిని మాటల గారడీతో మోసం చెయ్యడం మరింత తేలిక. అలాంటిది ఓ స్త్రీ నిరాదరణకు గురైతే సమాజం ఆమెను మరింత హేయంగా చూస్తుంది. ఓ స్త్రీ ఆమె ప్రమేయం లేకుండా జరిగిన ఓ తప్పిదం మూలంగా తన కుటుంబ నిరాదరణకు గురై, మరోప్రక్క వ్యవస్థచే బాధించబడుతుంది. అయితే ఆమె ఎదుర్కొన్న పరిస్థితులకు తలవంచక ముందుకు సాగుతూ వ్యవస్థలోని లోటుపాట్లను ప్రశ్నిస్తుంది. ఇది కుటుంబంచే, వ్యవస్థచే బాధించబడ్డ అరువి అనే స్త్రీ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలు, వాటి మూలంగా ఆమె ఎదుర్కొన్న పరిస్థితులకు చెందిన కథ.

 

ఈ కథ ఆరంభమే ఓ కేసు దర్యాఫ్తుతో మొదలవుతుంది. అందులో నిందితురాలుగా చెప్పబడే వ్యక్తే ఈ చిత్ర కథనాయకి . కేసు దర్యాప్తులో భాగంగా ఆమె తండ్రి, ఆమె స్నేహితురాళ్ల వాంగ్మూలం ఆధారంగా ఆమెను గురించిన గతం వెలికి తీయబడుతుంది. ఎంతో ఆహ్లాదకరమైన పల్లె వాతావరణంలో పెరిగిన అరువి నగర జీవితానికి మొదట్లో ఇమడలేక పోతుంది. మెల్లమెల్లగా నగర జీవితానికి అలవాటుపడి, ప్రస్తుతం యువత చేసే అన్ని కార్యకలపాలలో తాను భాగమవుతుంది. ఓ రోజు క్లాసు మధ్యలో వాంతులతో ఇంటి ముఖం పడితే ఆమె కుటుంబం అంతా ఆమెను ఏవగింపుతో చూస్తుంది. నేను ఏ తప్పు చెయ్యలేదు నాన్న అని ఆమె ఎంత మొత్తుకున్నా వినక ఆఖరికి ఇంటి నుండి వెలివేయబడి నిరాదరణకు గురవుతుంది. తన స్నేహితురాలి ఇంటిలో తలదాచుకుంటుంది. అటుపై మరో చోట మకాం మారుస్తుంది. అక్కడ ఓ హిజ్రా స్నేహితురాలవుతుంది. ‘చెప్పేదంతా సత్యం’ అనేటటువంటి ఓ tv రియాలిటీ షో లో వ్యవస్థలోని కొందరి వ్యక్తుల మూలంగా తాను దగా పడ్డ విషయం చెప్పుకొస్తుంది. ఆ షో ముగింపులో అక్కడ ఓ ఉద్రిక్తతమైన వాతావరణం నెలకొంటుంది. ఆ పరిస్థితి అనేక పరిణామాలకు దారి తీసి ఆమెపై తీవ్రవాది అనే ముద్రపడుతుంది. అక్కడ ఆ tv రియాలిటీ షో లో తలెత్తిన సమస్యలేమిటి, ఆమెపై తీవ్రవాది అనే ముద్ర పడేందుకు గల కారణాలు ఏంటి, తన కుటుంబం నుండి వెలివేయబడినందుకు గల కారణాలేమిటి. అసలు తనకు జరిగిన అన్యాయం ఏమిటి, వాటికి ఆమె ఎంచుకున్న పరిష్కార మార్గం ఏమిటి అన్నదే మిగిలిన కథ.

సినిమా లో అన్నిటికంటే ప్రధానమైనది కథ, దర్శకత్వం వీటన్నిటితో పాటు ఈ చిత్ర కథనాయకి గా నటించిన అదితి బాలన్ యొక్క నటన, సినిమాటోగ్రఫీ. నటిగా ఆమెకు మొదటి సినిమా, చాలా బరువైన పాత్ర.కథనం కూడా ఆసక్తికరంగానే సాగుతోంది అయితే కొంచెం కొంచెం కథలో టోన్ మారుతూ వస్తుంది. దాంతో ఆ కథ ఎవరితోనయినా ఎక్కడ నుండి చెప్పాలో ఎలా చెప్పాలోనన్న సందిగ్దత నెలకొంటుంది. అరువి అనే స్త్రీ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు వాటి పరిణామాలు అని చెప్పొచ్చు ఓ స్త్రీ కుటుంబ నిరాదరణకు గురైతే ఆమె పడే మానసిక క్షోభ గాను చెప్పొచ్చు.ఇది ఓ విషాదంతకర కథే అయినప్పటికీ ఆ పాత్ర ఎక్కడా ఊసురోమని ఉండక చాలా శక్తివంతమైన పాత్రగాను, తనకు జరిగిన అన్యాయాన్ని నిలదిసే విధంగానూ, వ్యంగ్యంగాను ఉంటుంది ఆ పాత్ర.. సినిమాలో చాలా భాగం టీవీ రియాలిటీ షో తోనే ముడిపడి ఉంది. రచ్చబండ, బ్రతుకు జట్కా బండి వంటి షో ల వెనుక నడిచే అసలు కథను దర్శకుడు కళ్లకు కట్టినట్లు చెప్పాడు. అరువి స్కూల్ లో ఓ అమ్మాయి napkin అడిగినప్పుడు చెప్పే డైలాగ్ కావచ్చు, తన రూమ్ మేట్ అండర్ వేర్ గురించి చెప్పే డైలాగ్స్ కావచ్చు, రోడ్డు పై ఓ అందమైన అబ్బాయి వెళ్ళినపుడు సైట్ కొడుతూ వాళ్లతో పెళ్లికి ముందే సంబంధం పెట్టుకుంటే కడుపులో బేబీ ఫార్మ్ అవుతుందేమో అనే డైలాగ్ కావచ్చు, సూర్య ఫోటో స్కూల్ బ్యాగ్ లో పెట్టుకుని ఆమె మురిసిపోవడం, ఆమెకు లవ్ ప్రపోజ్ చేస్తే ఆమె రియాక్షన్, తను ఇంకొకరికి లవ్ ప్రపోజ్ చేసి నిరాకరిస్తే అందుకు ఆమె రియాక్షన్ వంటి వాటన్నిటిలోను స్త్రీల మనోభావాలు, వాళ్ల ఆంతరంగిక సంభాషణలు ఎలా ఉంటాయి అని దర్శకుడు తెరపై చెప్పే ప్రయత్నం చేసాడు.ఇది ఓ మల్టి లేయర్డ్ ఫిల్మ్ గనుక అందులో అనేక భావాలు చోటుచేసుకున్నాయి అని చెప్పొచ్చు. మాటలు అర్ధవంతంగాను ,శక్తివంతగానూ ఉన్నాయి. అరువి తన చిన్నప్పటి గతం చెప్పే సన్నివేశాలు కవితాత్మకం. అంతవరకు యదార్ధంగా సాగే కథ, ఎందుకో నాకు క్లైమాక్స్ కొచ్చే సరికి సినిమాటిక్ గా చెప్పే ప్రయత్నం చేసారనిపించింది. మొత్తంగా అయితే మిమ్మల్ని అన్ని విధాలా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు ఎన్నో ప్రపంచ స్థాయి అవార్డులు దక్కాయి. దర్శకుడు,కథనాయకి తొలి ప్రయత్నంలోనే అందరి దృష్టిని ఆకర్షించారు. సినిమాను చూసి వచ్చిన చాలాసేపటి వరకు ఆ పాత్ర,అది పడే బాధ, దాని సంఘర్షణ మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ సంవత్సరం తమిళంలో అటు కమర్షియల్ గాను,ఇటు విమర్శకుల ప్రశంసలను అందుకున్న రెండో మహిళ చిత్రం ఇది. మొదటిది నయనతార నటించిన అరం.

 

2 Comments
  1. jai December 22, 2017 /
  2. బి.పవన్ కుమార్ December 29, 2017 /