Menu

అర్జున్‌రెడ్డి నాకెందుకు నచ్చిందంటే..! – 1 (తనను తాను ధ్వసం చేసుకున్న వీరుడు)

నేనెప్పుడూ మందు ముట్టుకున్నది లేదు, లిటరల్‌గా చేత్తో కూడా ముట్టుకోలేదు. పదుల మంది తాగుతున్న చోట కావచ్చు, స్నేహితులు బలవంతపెట్టిన సమయాల్లో కావచ్చు, నేనెప్పుడూ నేనుగానే ఉన్నాను. పాసివ్ స్మోకింగ్ చేయడం కూడా నాకు నచ్చదు. మా అమ్మ అమ్మాయిలతో ఎలా నడుచుకోవాలో నేర్పింది, నేర్పుతూనేవుంటుంది, స్నేహితులే కావచ్చు, పరిచయం లేనివారే కావచ్చు, నేనెప్పుడూ అమ్మాయిల్ని ఇబ్బందిపెట్టేలా ప్రవర్తించలేదు. నాకన్నా వయసు, అధికారం, హోదా ఉన్నవారితో గొడవపడింది, గొంతు పెంచి మాట్లాడింది ఉంటే ఉండొచ్చు కానీ, నాకన్నా ఆర్థికంగానో, స్థితిగతుల పరంగానో, వయసులోనో చిన్నవారితో మాత్రం వారెంత ఎలా ప్రవర్తించినా వీలైనంతవరకూ అరవకూడదని మా ప్రోగ్రాం మేనేజర్, మిత్రుడూ నేర్పిన సూత్రం పాటిస్తూన్నాను, చాలావరకూ. నా నిర్ణయాలు నేను తీసుకునే స్వాతంత్రం, దాన్ని నిలబెట్టుకునే సమర్థత నేను సంపాయించుకున్నాను. కానీ మా అమ్మానాన్నలకు ఏదైనా తెలియకుండా చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర ఆ గౌరవం సంపాయించుకోగలిగాను. మిగిలిన విషయాల్లో లోటుపాట్లు ఉన్నా, చేసిన పొరపాటు ఒప్పుకునేందుకు వెరవను, సరిదిద్దుకునేందుకు ఒప్పుకోవడం మొదటి మెట్టు అని నా నమ్మకం. ఇదంతా స్వోత్కర్షకు చెప్పట్లేదు..
నా గురించి వ్యక్తిగతంగా తెలిసినవారూ, నేను గౌరవించేవారు అయిన మిత్రులు కొందరు అడిగారు “మీకు అర్జున్ రెడ్డి ఎలా నచ్చింది? మీలాంటివాళ్ళు కూడా అర్జున్‌రెడ్డి నచ్చింది అని బహిరంగంగా రాస్తే ఎలాగ?” అని.
********

తనను తాను ధ్వంసం చేసుకున్న వీరుడు

1976 అక్టోబరు నెల. ఆకాశంలో మబ్బు నల్లగా పట్టింది, ఇహనో ఇప్పుడో వెర్రిగా వాన కురుస్తుందనిపిస్తూ ఉంది, రోడ్డు మీద ఓ అంబాసిడర్ కారు పోతోంది. విజయవాడ నుంచి గుంటూరు వైపుగా ప్రయాణం చేస్తున్న ఆ కారులో ఉన్నది ఆధునిక కాలాన మహాకావ్యాలు, కావ్యాలంతటి నవలల రచనలో అనితరసాధ్యుడైన కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. అనారోగ్యంతో బాధపడుతున్న పెద్దాయన్ని, ఇంట్లోవాళ్ళూ, శిష్యులూ తీసుకువెళ్తున్నారు. వచ్చే ప్రాణం పోయే ప్రాణంగా ఉన్న పెద్దాయన స్మృతిలోకి వచ్చాడు
“ఎక్కడికీ?”
“గుంటూరు”
కారు అద్దంలోంచి ఆకాశాన్ని చూస్తూ..
“…ఆవిడా గుంటూరులోనే వెళ్ళిపోయింది. నేనూ అక్కడే వెళ్ళిపోతున్నాను” అన్నాడు.
అప్పటికి ఆవిడ – వరలక్ష్మి గారు – చనిపోయి నలభై నాలుగేళ్ళు.
అంతకు ఐదేళ్ళ ముందు జ్ఞానపీఠ్‌ పురస్కారం వచ్చినప్పుడు, రేడియో స్టేషన్‌ వారు పంపిన కారులో వెళ్తూ అన్నమాటలు “బ్రతికి వున్నాను కనుక యివన్నీ అనుభవిస్తున్నాను. ఆ భార్యలేదు. ఆమెకీ అనుభవంలేదు. ఇప్పుడింత మహాకవిని, అప్పుడూ మహాకవినే, నన్ను మహాకవిని చేసినది ఆమె” ఈ మాటలాయన కళ్ళల్లో చెమ్మతో అన్న మాటలు.
వియోగ బాధ భరించలేక ప్రపంచాన్ని నాశనం చేయబోయిన రామయ్య తండ్రి, ఆ దుఃఖాన్ని అనుభవించి రామాయణ కల్పవృక్షం రాసుకున్న విశ్వనాథుడు, అదే దుఃఖతీవ్రతతో నైతికంగా, శారీరికంగా, మానసికంగా ఇటుక ఇటుకగా పగలగొట్టి నేను అన్న నిర్మాణాన్ని నాశనం చేసుకోబోయిన అర్జున్‌ రెడ్డి – తీవ్రత అన్న దగ్గర – ఆ స్థాయిలో నాకు పోలిక దొరికిందంటే – వేర్వేరు స్థాయిల్లో ఈ సినిమాను చూసినవారంతా సహిస్తారని ఆశిస్తున్నాను.
*******
అన్ని కళాకృతులు అందరి కోసం కావు – కొందరి నేపథ్యం కొన్నిటిని చూసి అర్థం చేసుకోనివ్వదు. గొంతు దిగకుండా గుచ్చుకుంటుంది.
విశ్వనాథ తన భార్య చనిపోయినప్పుడు ఆ పన్నెండు రోజుల్లోనూ, ఆపైన వసివాడని స్మృతుల్లోనూ రాసుకున్న వరలక్ష్మీ త్రిశతి – మూడు శతకాల కావ్యం. మొదటిది తనలో మేలుసగం మరణించినప్పుడు ఆ పన్నెండురోజుల్లో ఆయన పడిన చిత్రవధకు పద్యరూపం – కర్మశతకం.
దాని ముందొక హెచ్చరిక ఉంటుంది –

 

ఓ సఖా! ప్రియభార్యావియోగ మెఱుగ
నట్టి యోపూర్వసత్కృతీ! యకట! నీవు
కర్మశతకంబు చదువకు! మర్మఘాతి
నీ వెఱుగలేవు దానిలోనిదగు

అంటూ పాఠక మిత్రులను హెచ్చరించారు. ఈ సినిమా అలానే అందరికీ కాదు. ఈ విషయాన్ని ఏదోక విధంగా దర్శకుడు ముందే స్పష్టం చేసివుండాల్సింది. (ఎ సర్టిఫికెట్ గురించి మాట్లాడట్లేదు)

*******
వాడొక ఫ్యూడల్. (నేనేం తిట్టట్లేదు, విషయంగా చెప్తున్నాను. అలా అర్థం చేసుకోండి) కులం పేరుతో సహా సినిమా పేరును పెట్టడంలో అది ఉంది. “ఒకవేళ ఇది 2017 కాదనుకుందాం, రాజుల కాలం అనుకుందాం. నిన్ను ఇయ్యనందుకు మీనాన్న మీద వార్ వేజ్ చేస్తూండె, వాణ్ణి గొలుసులతో కట్టి సీజ్ చేస్తూండె” అన్న మాటలో ఇది స్పష్టం. ఫుట్‌బాల్‌ ఆటలోని యుద్ధ లక్షణాలను సూటిగా అర్థం చేసుకున్న తీరులోనూ ఇది స్పష్టం. అమ్మాయి నచ్చితే నేరుగా ముద్దుపెట్టుకున్న పద్ధతిలోనూ ఇది ఉంది. వాడో ముక్కోపి. ఆవేశం ఆలోచనను నాశనం చేస్తూంది. అన్నివేళలా వెనుక ఉండే స్నేహితుడు ఉన్నాడు, ఏదైనా ఎదురొస్తే కుటుంబ గౌరవం కోసమో మరిదేని కోసమో కమ్ముకురావడానికి అన్న ఉన్నాడు. డబ్బుంది.
వాడొక నిజాయితీ పరుడు. చేసిన తప్పుని చాలా సన్నిహితుల ముందు, ఏ నష్టమూ లేకున్నా, ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోని జనాల మధ్య వాడొక వింత జీవి. తనకు ఎంతో ఇష్టమైన, తను గర్వించే కెరీర్‌ని (సినిమాలో అడుగడుగునా ఇది కనిపిస్తూంటుంది, ప్రీతీ వాళ్ళ నాన్న మేనేజ్‌మెంట్ కోటానా అన్నప్పటి నుంచీ మొదలుకొని ఈ డిప్రషన్‌ లేకుంటే న్యూరో క్రాక్ చేస్తూండే అన్నదాక) వదులుకోవాల్సిన పరిస్థితిలో తనను తాను చాచికొట్టుకున్నట్టు నిజం చెప్పేసే పిచ్చోడు. అక్కడ వాళ్ళ నాన్న మొహంలో ఓ రిలీఫ్‌ కనిపించిందని చెప్తున్నారు మన శ్రీరామ్ కణ్ణన్ గారు. అలాంటి సందర్భంలో పుత్రోత్సాహం పొందగలిగిన తండ్రికే ఇలాంటి కొడుకు ఉంటాడు.
గాఢమైన తీవ్రమైన ప్రేమికుడు. “తనలో సగం ఇక లేదూ అని” తనను తాను కృశింపజేసుకున్నవాడు. వీడికి నాన్న ఎవరంటే ఎవరిని చూపించాలని అన్నమాటకు ఠపీమని “నన్ను చూపించు” అనగలిగినవాడు. “అది నా పిల్లరా” అంటూ గుండె గొంతులో పలికించేవాడు. వెర్రిగా రోడ్డు మీద పరుగులు పెట్టినోడు. పిచ్చోడు.
ఇదంతా ముడిపడింది ఒక్క దెబ్బలో – చాచికొట్టి “ఆరుగంటలు” అని వేలితో కూడా చూపించి చెప్పినమాట గుండె ముక్కలు చేసింది. ఆ ఆరు గంటల కాలాన్ని వ్యవధిగా పెట్టిన పాపానికి – 9 నెలల పాటు తనను తాను సర్వనాశనం చేసుకోబోయాడు (9 నెలల వెనుక సంకేతాత్మకత మీకు అర్థం అయివుంటే, శిల్పం మీకు తట్టివుంటే సుకవి సందీప్ రెడ్డి ధన్యుడు). పనిగట్టుకుని తనకున్న ప్రతీదాన్నీ నాశనం చేసుకున్నాడు. ప్ర..తీ..దా..న్నీ..
వేదన, దుఃఖం -మనిషిని అగ్గిలో వేసి పుటం పెడుతుంది. ఎలాంటి మనుషులైనా ఏవోక సమస్యలు ఉన్నవాళ్ళే. ఎవరం కూడా అతీతులం కాదు, ఎవరం కూడా. లోపాలు, దోషాల ఫలితంగా వచ్చే ఉలిదెబ్బలు మనిషిని మలుస్తాయి. “Fat chick” అంటూ నోరుపారేసుకున్నవాడు అమ్మాయిలను ఆబ్జెక్టిఫై చేయకూడదని మాట్లాడడానికి మధ్య ఐదేళ్ళ వ్యవధి ఉంది. ఐదు నెలల వేదన ఉంది. గడ్డం గీసుకుందామని చూడగానే మందు బాటిల్ కనిపించి అరుకాషుడి నోట్లోపడి వైకుంఠపాళి మొదటి గడికి వెళ్ళిపోయిన మనిషి, వ్యసనాలు మానేయడానికి మధ్య నెల వ్యవధి ఉంది. ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ” అరే ఆ పరిస్థితిలో అమ్మాయిని థైస్, థైస్ అంటే తొడలు గావు, ఒడి. లాప్స్ మీద పడుకోబెట్టుకుని కంఫర్ట్ ఇవ్వాలిరా” అన్నదాక మనిషి ఊరికే రాడు. ప్రేమించడం అంటే ఏమిటో, పోగొట్టుకోవడం ఎలా ఉంటుందో తెలుసుకున్న తర్వాతి మెత్తదనం అది. అంతకుముందు దీనికి బీజాలు ఉన్నాయి. కానీ దుఃఖాశృవులతో, తెగిన హృదయంలోంచి కారిన రక్తంతో ఆ బీజం మొక్కగా ఎదిగింది.
దుఃఖ పడువారు ధన్యులు.

గమనిక: ఈ వ్యాస పరంపర గతంలో రచయిత తన ఫేస్‌బుక్‌లో పోస్టుగా ప్రకటించుకున్నారు.

(రెండవ భాగం – మరో శాకుంతలం)

One Response
  1. jai November 2, 2017 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *