Menu

సినిమానందం – joy of cinema

 

సినిమా అనేది కథ మీద ఆధారపడి ఉంటుంది తప్ప……ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల మీద, మనుషుల ప్రవర్తన మీదా  కాదు. అలాగే మనకున్న తెలివితేటలూ, మనం ఆ పరిస్తితుల్లో ఉండి ఊహించుకోటం కాక అయా కారక్టర్ల పరిథి, స్థితుగతులూ, తెలివితేటలూ..బిహేవియరల్ ఆట్టిట్యూడూ ఇవి ఆలోచించాల్సిఉంటుంది. ఇవన్నీ సినిమాలో ఎస్టాబ్లిష్ చేయటం అనేది సినిమా తీసేవాళ్ల బాధ్యత. అవన్నీ సరిగ్గా ఉన్నాయా  లేదా అన్నది ముఖ్యం.

సినిమాకి స్పేస్ ..టైం .. సిట్యువేషన్ అనేవి అప్లై అవుతుంటాయి. దానికి తోడు కొన్ని క్లాజెస్ అప్లై అవుతుంటాయ్. సినిమా చూస్తున్నంత సేపు.. ఇఫ్ / if అనే క్లాజు వాడుకుని చూడాలి.  ఇఫ్ / ఇది ఇలా ఉంటే / ఇది ఇలా జరిగితే .. తరవాత ఏం జరుగుతుందీ..ఎలా ఉండొచ్చు అనేదానికి నాలుగు విధాలైన ఆన్సర్లు ఉండొచ్చు. అందులో ఒక ఆన్సర్ బాగా సరిపోతూ…మరో ప్రశ్న లేవనెత్తుతూ మరొ నాటకీయమైన్ సన్నివేశాన్ని తెరలేపుతూ దర్శకుడూ అనుకున్న ఎండ్ పాయింట్ కి తీసుకుని రాబడుతుంది. ఎక్కడి కక్కడ ఎండ్ చేస్తే సినిమాయే ఉండదు. లేదా దర్శకుడు అనుకున్న ముగింపు ఉండదు.

అలాకాక మనం ఉన్న ప్రస్తుత పరిస్థితులు.. మనం అనుకుంటున్న లాజిక్కులూ..మనం ఊహించుకున్న సిట్యువేషన్లూ..మనం అనుకునే ముగింపులూ సినిమాల్లో ఉండవు. అలా ఉండాలంటే మనం సినిమా తీసుకోవాలి. 🙂

అందుకే సినిమా ఒక ఆర్ట్ . ఆర్ట్ అంటే కల్పితం. కల్పితం ఎప్పుడూ నిజం కాదు. కానీ నిజంలాగా కల్పితం అవ్వచ్చు. అ కల్పితం కొద్దో గొప్పో బావుందా లేదా అన్నది ముఖ్యం.
దానికంటే ముందు సినిమా చూడటం ఒక ఆర్ట్ !! కథ, కథనం, పాత్రలు, ప్రదేశం, పరిస్థితులు  వీటి కోణంలోచూడటం నేర్చుకోవాలి తప్ప,  మన ప్రస్తుత దృక్పథంలో చూడకూడదు. అందుకే సినిమా లాజిక్ వేరు..నిత్య జీవిత లాజిక్ వేరు.

 

సినిమా దాకా ఎందుకూ మన రోజువారీ జీవితం మన చేతుల్లోనే ఉన్నా..మనం అనుకున్నట్టు రోజు గడవక.. మనం తీసుకున్న నిర్ణయాలు సరైన ఫలితాన్నివ్వక, అనుకున్నవి జరగక మనకి చిరాకు, కోపం  వస్తోంటే, …ఎవరో తీసిన సినిమా మనం అనుకున్నట్టే ఉండాలంటే ఎలా ఉంటుందీ !! అందుకే సినిమాలో ఏస్తటిక్స్ డిస్కస్ చేయవచ్చు..సినిమాటిక్ లాజిక్ డిస్కస్ చేయొచ్చు కానీ…… ప్రస్తుత రోజువారీ  పరిస్థితులూ, మనుషుల ఐడియల్ ప్రవర్తనా,  మన పైత్యపు లాజిక్ అప్లై చేయకూడదు.

ఏదేని కథకి ఒక మెదలు, ఒక మధ్య, ఒక తుదీ ఉంటుంది. కథ మొదలు పెట్టేటప్పుడే చివర ఏం జరగాలీ అనేది ముందే అనుకొని  మధ్యలో ఎలాంటి మలుపులు ఉండాలో, ఎలా ఉంటే నాటకీయత పండి రసానందం కలుగుతుందో అని ఆలోచించి రాస్తారు. దానికంటే ముందు ఇతివృత్తం/ కాన్సెప్టు ఏమిటీ అని నిర్ణయించుకుంటారు.

ఉదాహరణకి స్వాతిముత్యం లో……ఇతివృత్తాన్ని అనుకుంటే..

అందరిలా ఎదగని అమాయకుడు,  (ఇక్కడ ఇతడు మతి స్థిమితం లేనివాడు కాదు.. లేక పూర్తిగా మానసిక వైకల్యం కలవాడూ కాదు)  ఏ తోడు లేక ఒంటరిగ ఎలా బతుకుతాడో అనుకునే ఈ అమాయకుడు…  ఓ స్త్రీ సహాయంతో అందరిలాగే ..పిల్లలు, మనవలు, మనవరాండ్రతో జీవితాన్ని గెలవటం అనేది ఇవివృత్తం. కల్మషంలేని మనసుతో, లోకమంటే తెలియని వాడుకనకనే అతడు స్వాతిముత్యం.
రెండవకోణంలో…. భర్త పోయి, ఓ ఐదారేళ్ల కొడుకు ఉండి, దిక్కుముక్కులేని ఒక మధ్యతరగతి ఇల్లాలు బ్రతుకుని ఎలా వెళ్లదీయాలా అని అనుకుంటున్న తరుణంలో …..అనుకోని సంఘటనతో దొరికిన ఆసరాని పట్టుకొని…జీవితాన్ని గెలవటం.

ఇక్కడ భర్తపోగానే  పుటుక్కున చస్తే అయిపోయే అంటే కథ ఏముండదు,   లేదా భర్తపోతే   ఏముందీ ఒంటరిగా బతికీడిచేయొచ్చు అనో  మనం చేప్పేయొచ్చు. కానీ  ఒంటరితనం అనేది నిజంగా ఒంటరి అయినవాళ్లకీ, ఏ ఆసరా లేదు అనుకునే వాళ్ళకే తెలుస్తుంది ఆ ఒంటరితనం బాధ. హాయిగా పార్టర్  తో కాపురం చేస్తున్నవాళ్లకి తెలియదు. ఆకలి అంటే ఏమిటీ అనేది నాలుగు పూటలు పస్తులుంటె తెలుస్తుంది తప్ప … కమ్మగా వేళకి భోజనం చేసేవాళ్లకి తెలియదు. ఇక్కడ  కేవలం శారీరక ప్రోద్బలం గురించి చెప్పట్లేదు. మానసిక ఆసరా.. ఆ ఆసరా ఏమిటి ఎందుకూ దాని ఇంపార్టెన్స్ ఏంటీ అనేది నేను చెప్పవలసిన అవసరం లేదు. పెళ్ళైన ప్రతివాళ్లకీ తెలుసు. ఇద్దరికీ కుదరక పెళ్ళి చెడినవాళ్ళు ఒంటరిగా బ్రతకట్లేదా అనొచ్చు. ఉంటారు ..కానీ వాళ్ళకి ఒక సరిజోడు దొరికితే బావుండూ అని అనుకోని, దానికోసం  ప్రయత్నించని వాళ్ళుండరు. కంపాటబుల్ పార్ట్నర్ దొరికితే ఆ ప్రయాణమే వేరు.

సో… ఈ అమాయకుడు… ఆవిడ కనపడగానే  మెడలో అమాంతంగా తాళేమీ కట్టడు.
ఇద్దరు ఒకరికొకరు పరిచయం అవుతారు.  కొని సందర్బాల్లో కలుసూ  కొద్దో గొప్పో ఇద్దరూ ఒకర్నొకరు తెలుసుకుంటారు, అర్థం చేసుకుంటారు, పాటలు పాడుకుంటారు. అతడు ఆమెకి పిల్లాడు. అమె అతనికి అశోకవనంలోని అపర సీతమ్మ లా అనిపిస్తారు. అమె మొహంలో సంతోషంలేక అలా ఎందుకుందీ అంటే…తోడూ నీడా లేని ఒంటరి స్త్రీ  ఇంకెలా ఉంటుందీ, మెళ్ళో తాళి కట్టి తోడూనీడాగా ఉండాలి ఎవరైనా  అని నానమ్మ చెపితే తెలుసుకొని……ఆ తోడూ నీడా తనవుదామని  తాళి కట్టేస్తాడు. ముందునించీ ఇతరులకి తాను సాయంగా ఉండటం అతని లక్షణం. ఇక్కాడా అమెకి సాయం చేసేద్దామని అమాయకంగా తాళి కట్టేస్తాడు, అడిగితే నానమ్మ చెప్పిందీ అంటాడు.  ఆమె తాళి తెంచవతల పారేసి ఎవడ్రానీవు అనొచ్చు. కానీ అమెకి అతడి మీద మనం అనుకునే అభిప్రాయం లేదు. ఎందుకంటే అతడేంటీ అనేది ఆమెకి తెలుసు. అతడు అమాయకుడే అయినా  ఆసరా ఉండగలడు.  సో….అప్పటికే భర్త లేక నిస్సయంగానూ, బేలగానూ ఉన్న ఆమే మనలాగా  అంత కాన్పిడెంట్ గా ఇది అక్కరలేదు అనే స్థితిలో లేదు. దైవ సమక్షంలో  అలా తన మెళ్ళో కట్టిన తాళిని అమాంతంగా తెంచి పారేయలా వద్దా.. ఈ హటాత్ సంఘటన ఎందుకు జరిగిందో ఏమిటో అనే
సంధిగ్ధంలో ఉంది. ఒక్క సారి ఆలోచిస్తే…….లోకంలో సగానికి పైగా పెళ్లిళ్ళు ” సంధిగ్ధం” లోనే జరిగాయి, జరుగుతాయి అని మనకి తెలుసొస్తుంది. ఎంత ప్రేమించిపెళ్ళి చేసుకున్నా.. ఒక్కసారి….ఏమో పెళ్ళి ద్వారా మంచే అవుతుందో చెడే అవుతుందో అన్న భయం కలక్కపోదు.  ఒక  చిన్న హెసిటేషన్…గగుర్పాటు.. భయం కలగని వాళ్లు తక్కువ. ఆ సంధిగ్దావస్థలో ఉన్న ఆమెకి,  అతడి నాయనమ్మ,  అమాయకుడు ఎలా బతుకుతాడొ అనుకొన్నా…నిన్ను చూపించాడా దేవుడు, ఇహ నేను హాయిగా సెలవుతీసుకోవచ్చు అని సెలవుతీసుకుంటుంది. ఇదే నాటకీయత..తరచి చూస్తే మన నిత్యజీవితంలో అను నిత్యం జరిగేది ఇదే, పెద్ద సంఘటనలకి మాత్రమే మనం ఆలోచిస్తాం తప్ప, రోజువారీ నాటకీయత అందరిజీవితాల్లోనూ ఉంటుంది. ఇపుడు అతడు కూడ ఒంటరి అయ్యాడు.. బాధ్యత తీసుకోమని చెప్పి చనిపోయింది పెద్దావిడ.

 

‘మనం జీవితంలో ప్రతిక్షణం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తు ఎవడికీ తెలియదు. ఫలితం బావుంటే మన నిర్ణయ శక్తి బావుంది అనుకుంటాం. ఫలితం వికటిస్తే  విచారిస్తాం.  ప్రతిసారీ  మనం తీసుకునే నిర్ణయాలు మనకి పూర్తిగా నచ్చితీసుకోము, మన వెనక పరిస్థితులు పెట్టే బలవంతం మీద తీసుకుంటాం. రైట్ ఆర్ రాంగ్ , గుడ్ ఆర్ బాడ్ ప్రతి క్షణం ఏదోటి నిర్ణయం తీసుకొని తీరాలి ఎవ్వరైనా.’  కనన  ఆమె ఏదోటి  నిర్ణయం తీసుకోవాలి. వదిన సతాయింపు, పిల్లాడి చదువు, నిస్సహాయతా, ఒంటరిగా బతకనివ్వని లోకం ఇవ్వన్నింటి మూలంగా  చిన్న ఆసరా దొరికితే ఆ పరిస్థితుల్లోంచి బయట పడాలనే చూస్తోందామె. అతడికి తనంటే ఇష్టమని తనకి ఇదివరకే ఉన్న పిల్లాడితో కూడా అతనికి స్నేహం అని అమెకి తెలుసు.  ఇవన్నీ మొదటి నించీ చూపిస్తూ వస్తాడు దర్శకుడు. అలా ఆమెకి  ఒక ఇన్నర్ కాల్ అందింది.  ఏదైతే అది అయింది అని ఆ పెళ్ళిని అంగీకరించింది.   తన పిల్లాడిలాగే ఇతడూ అనుకుంది. అలా ఆ పెళ్ళిని అంగీకరించి కాపురం పెట్టటం..అతడికి జీవిత పోరాటం నేర్పించటం..అటు మీద సంసారం సాగి..పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి.. చదువులు ఉద్యోగాలు.., తాను ముత్తైదువ గా చనిపోవటం వరకూ ఆమెకథ.

మళ్ళీ చెపుతున్నా ముత్తైదువ చావు అని ఎగతాళిగా అనిపించవచ్చు. ముత్తైదువ అన్న పేరు పాతచింతకాయ పచ్చడి అయితే అయిందిగానీ, అది వదిలేస్తే ఇద్దరు ప్రేమికులు…లేదా ఇద్దరు అన్యోన్య భార్యాభర్తల్లో… చావు విషయం వచ్చేసరికి…అవతలి వ్యక్తి చనిపోతే తమ జీవితాన్ని ఊహించుకోలేరు. ఆ బాధ కంటె తానే ముందు పోవాలీ అని అనుకుంటారు, చెప్పుకుంటారు. ప్రేమించిన వ్యక్తి చస్తే భరించటం కష్టం. భర్త, పిల్లల్ని ప్రేమించే ఏ స్త్రీ కూడా ……తానే ముందు పోవాలీ అనుకుంటుంది తప్ప తన కుటుంబంలో ఎవరు చనిపోయినా తాను భరించలేనూ అని భావిస్తుంది. అంతటి బాధలేకుండా ముందే పోవటం నిజంగా అదృష్టమే. అదే ఆమెని వరించింది. ఒట్టి అమాయకుడైతే ఏమి తనని ప్రేమించే మనిషీ.. ప్రేమించే పిల్లలూ ..మనవలూ మనవరాండ్రూ, హాయిగా చావు. ఇది సహజమైన జీవిత గెలుపు..నిండైన ఆనందం. ఇది కాక ఇంకేముంటుంది సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ ??
ఇదే స్వాతిముత్యం కథ.

ఈ కథని మనం ఫెమినిస్టు కోణంలో…ఆలోచించి ఆ మెంటల్లీ హాండీ కాపుడ్ తాళి కడితే..కట్టించుకోవటమేంటీ ..కాపురం చేయటమేంటీ అని ప్రశ్నిస్తే హాస్యాస్పదమే అవుతుంది. అక్కడ పాత్రలో మనం లేము. మరో పాత్ర…అదిఆలోచించే పద్దతి, దాని అవసరం,  అసహాయతా ఉన్నాయి. అక్కడ మనం ఉంటే ఖచ్చితంగా తెంచి అవతల పారేసి తన్ని తగలేస్తాం. కానీ ఆ పాత్రకి ఆ అమాయకుడి మీద స్నేహం ఉంది.. జాలి ఉంది.. కరుణ ఉంది.. కంపాషన్ ఉంది..అండ్ ఓ బాధ్యత చిగురించింది. అందుకే ఆ పాత్ర మనం అనుకున్నట్టు బిహేవ్ చేయదు., తను అనుకున్నట్టు ప్రవర్తిస్తుంది.

మనం అనాలోచితంగా అలా కాదు ఇలా ఉండాలీ అంటూ చెప్పేయగలం.   మనం అనుకున్నట్టు పాత్రలు బిహేవ్ చేయలేకపోవచ్చు. కానీ పాత్రోచితంగానే అవి నడచుకున్నాయా లేదా అనేది చూడాలి. కథ మనం అనుకున్నట్టు ముగింపు కాకపోవచ్చు కానీ దర్శకుడు అనుకున్నట్టు కథ ముగిసింది.

కథకుండవలసిన లక్షణాలు అన్నీ చక్కగా కుదిరాయి. ఇతివృత్తం కథలో తృప్తి పరచబడింది. పాత్ర లక్షణాల కనుగుణంగా  ఎలా ఎస్టాబ్లిష్ చేసారో అలాగే ప్రవర్తించాయి తప్ప నేల విడిచి సాము చేయలేదు. అనుకున్న ముగింపు వైపు కథ…కావలసిన సమయంలో..కావలసిన భావోద్వేగాలని తట్టి లేపుతూ సాగింది. పాటలు సందర్బోచితంగా.. సంగీతం హృద్యంగా సాగాయి.
సినిమాకుండవలసిన అన్ని లక్షణాలు సరిగ్గా ఉన్నాయి. సినిమా ఇవ్వవలసిన రసానందం ఇచ్చి చూసిన ప్రేక్షకుడు కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునే విధంగా ఉంది.  మరి సెన్సిబుల్ సినిమా అంటే  ఇంతకన్నా ఏముంటుందీ !

 ఇదిగాక సినిమానందం మరింకేమిటీ !!
One Response
  1. Ravi July 14, 2017 /