Menu

తెలుగు ఆడబడుచు మనసులో మాట – కలికి చిలకల కొలికి పాట

Kaliki chilakala kolikiపల్లవి:
కలికి చిలకల కొలికి మాకు మేనత్త; కలవారి కోడలు కనకమాలక్ష్మి
అత్తమామల కొలుచు అందల అతివ; పుట్టిల్లు ఎరుగని పసిపంకజాక్షి
అనుపల్లవి:
మేనాలు తేలేని మేనకోడలిని, అడగవచ్చా నిన్ను ఆడ కూతురిని
వాల్మీకినే పోలు వరుస తాతయ్య, మా ఇంటికంపించవయ్య మావయ్యా ||కలికి చిలకల||
చరణం:
ఆ చెయ్యి ఈ చెయ్యి అద్దగోడలికి, ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి
నేటి అత్తమ్మా నాటి కోడలివి, తెచ్చుకోమాయమ్మ నీదు ఆ తెలివి
తలలోని నాలుకై తల్లిగా చూసి, పూలల్లొ దారమై పూజలే చేసి
నీ కంటిపాపలో కాపురం చేసే మా చంటిపాపనూ మన్నించి పంపూ    ||కలికి చిలకల||
చరణం:
మసకపడితే నీకు మల్లెపూదండ; తెలవారితే నీకు తేనెనీరెండ
ఏడు మల్లెలు తూగు నీకు ఇల్లాలు, ఏడు జన్మల పంట మా అత్త చాలు
ఫుట్టగానే పువ్వు పరిమళిస్తుంది; పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది
తెలుసుకో తెలుసుకో
తెలుసుకో తెలుసుకో తెలివైన మామా సయోధ్య నేలేటి సాకేతరామా  ||కలికి చిలకల||
ఎందరు బిడ్డల్ని కన్న తల్లయినా అమ్మ ఒడిలో పసిపాపే. ఎన్ని వ్యవహారాలు దిద్దుకునే ఇల్లాలైనా నాన్నకు గారాలపట్టే. అలాంటి ఆప్యాయతలకూ, అనురాగాలకూ ప్రతిరూపం పుట్టిల్లు. పుట్టింటికి వెళ్తున్నాననే ఆలోచన రాగానే నలభయ్యేళ్ల ఇల్లాలైనా పదిహేడేళ్ల పడుచైపోతుంది. రెక్కలు కట్టుకుని  ఆ లోగిలిలో వాలడానికి మనసుకి క్షణంలో వందో వంతు సమయం పట్టదు. అందుకే పుట్టింటి ప్రయాణం చుట్టూ స్త్రీలు పాటలు అల్లుకుని తరతరాలుగా పాడుకుంటున్నారు.”మా అన్నలొచ్చారు మమ్మంపుతారా” అంటూ ఇంటికోడలు అడుగుతుండగా “నేనెరుగ నేనెరుగ మీ అత్తనడుగు” అని మామగారు, ఆమెనడిగితే “నేనెరుగ నేనెరుగ మీ బావనడుగు” అని అత్తగారు, అతన్నడిగితే “నేనెరుగ నేనెరుగ మీ అక్కనడుగు” అనీ, చివరికామె “నీ భర్తనడుగు” అంటుంది. “రచ్చలో కూచున్న రాజేంద్రభోగీ! మా అన్నలొచ్చారు మమ్మంపుతారా?” అని అడిగితే ఆయన “కట్టుకో చీరలు పెట్టుకో నగలు, పోయిరా పుట్టింటికి సుఖముగాను” అని సుఖాంతం చేస్తాడు. బయటకు సరదాగా సాగుతూ విషాదాన్ని దాచుకున్న ఇటువంటి స్త్రీలపాటల్లో వినిపించే నాటి సాంఘిక జీవితం ఈ చలన చిత్ర గీతంలో ధ్వనిస్తుంది.
పెళ్ళై ఏడాదితిరిగేలోగానే ఊరిసొమ్ము విషయంలో నిక్కచ్చిగా ఉండే తండ్రికీ, అల్లుడికి ఊరివాళ్ల భూమి మీ పలుకుబడితో ఇప్పించమన్న మావగారికీ మాటపట్టింపు వస్తే, “ఎక్కడివాళ్లు అక్కడ ఉంటే మంచిది” అని తండ్రి అన్న మాటను పట్టుకుని తనను పుట్టింటీకి పంపనని అత్తారు భీష్మించుకు కూచుంటే పుష్కరాలపాటు అమ్మానాన్నల మొహమూ, పుట్టిపెరిగిన ఊరూ చూడనైనా చూడని ఆ ఆడబడుచు వేదన ఊహింపతరంకాదు. అలాంటి స్థితిలో ఆషాఢమేఘంలా అమెరికా నుంచి వచ్చిన మేనకోడలు ఇంటిల్లిపాదినీ ఒప్పించి మేనత్తని పుట్టింటికి తీసుకువెళ్లాలని నడుంకట్టుకుని వచ్చిన సందర్భంలో పాట ఇది. రాతిగుండెల అత్తారిని కరిగించేలా ఆ అచ్చతెలుగు సీత పాడిన కమ్మని పాట ఇది. అడుగడుగునా తెలుగు అనుబంధాలతో అల్లుకున్న “సీతారామయ్యగారి మనవరాలు” చిత్రంలోనివీ నేపథ్యమూ పాటాను.
ముళ్లలోపడ్డ బట్టను చిరిగిపోకుండా తీసుకోవాల్సినంత కష్టతరమైన స్థితి ఈ పాటలో సీత పాత్రది. ఆ స్థితిని ఔచిత్యం చెడకుండా తెలుగువారు మరువలేని అందమైన పాటగా రాశారు వేటూరి సుందరరామమూర్తి. అన్నేళ్లు కాపురం చేసినా అత్తచాటు కోడలిగా, బాధ్యతలు తప్ప అధికారం చేతికి రాని నిస్సహాయ స్థితి సీత మేనత్తది. తండ్రిమాట జవదాటని, నోట్లో నాలుకలేనట్టుండేవాడు మేనత్త మొగుడు. ఇంటి తాళాలగుత్తినీ, ఇంట్లో నిర్ణయాధికారం బొడ్డున దోపుకున్న మేనత్త అత్తగారు అంత పనికి సానుకూలం కల్పించే మనిషీ కాదు. ఇక వరుసకు తాత అయ్యే, మేనత్త మామగారి సంగతి సరేసరి. వియ్యంకుడితో తగవుపెట్టుకుని, మాటపట్టింపుతో రెండిళ్లనడుమా రాకపోకలు లేకుండా చెయ్యడానికి మూలపురుషుడాయె. ఇలాంటి స్థితిగతులమధ్య పాటందుకున్న సీత పాత్ర ఎదుటిమనిషి నొచ్చుకోకుండా మంచి చెడులు సూచిస్తూ, అవసరానికి పొగడ్తలను నమ్ముకుని ఆ మనసుల్ని గెలుచుకోవాలి.
తన మేనత్త సుగుణాలు వర్ణిస్తూ శ్రీకారం చుట్టినా మేనత్తను “కలవారి కోడల”ని అనడంలోనే అత్తావారిల్లు కలిగిన ఇల్లనే ప్రశంశ చేసింది. వెంటనే “కనకమాలక్ష్మి” అనే పదం వేసి ఈ ఐశ్వర్యం మా అత్త సాక్షాత్తు లక్ష్మి కావడం వల్లనే వచ్చిందనే సూచనా, అలాంటి లక్ష్మి కన్నీళ్లు శోభనివ్వవనే అంతరార్థమూ తీసుకొచ్చింది. అంతటి లక్ష్మి పుట్టిల్లు ఎరుగని పసిపంకజాక్షైందంటూనే ఆడకూతుర్ని అడుగుతున్నాను వాల్మీకి అంతటి వరస తాతయ్యా మా ఇంటికంపించవయ్యా అని ముక్తాయించింది.
వెంటనే ఇంటి పెత్తనాన్ని కలిగున్న అత్తగారి పక్కచేరి మెత్తగానైనా నేరుగానే “నేటి అత్తమ్మా-నాటి కోడలివి” అని గుర్తు తెచ్చి ఆనాటి తెలివి తెచ్చుకొమ్మంటుంది. తలలో నాలుకలా, పూలలో దారంలా నీ కంటిపాపలో కాపురంచేసే పసిపాప మా అత్త, ఆమె పుట్టింటికి పంపమని కోరిక ముందుపెట్టింది.
మరోవంక మేనత్త భర్తతో ఏడుజన్మల పంటలాంటి ఏడుమల్లెలు తూగు సుకుమారి నీ భార్యని చెప్పి, పుట్టగానే పువ్వు పరిమళించినంత సహజం, పుట్టింటికి మనసు పరుగు తీయడమని తెలుసుకోమంటుంది. సీతాదేవిలాంటి తన మేనత్తకు భర్త కావడం చేతనో, తండ్రిమాట జవదాటని లక్షణం ఉన్నందువల్లనో  “సయోధ్యనేలేటి సాకేతరాముడం”టుంది అతన్ని. అత్తమామల సాంసారిక బంధాన్ని గురించి మేనకోడలు చెప్పాల్సిన సందర్భంలో “మసకబడితే నీకు మల్లెపూదండ” అంటూ మేనమామకి సున్నితంగా సూచించడం చాలా పదును తెలిసిన ప్రయోగం. ఓకసారి మునగచెట్టెక్కించి, మరోమారు తప్పు తెలియజెప్పి, ఇంకోసారి మన్నించమని బతిమాలి చివరకు పాట పూర్తయ్యేసరికి మేనత్తని పుట్టింటికి తీసుకెళ్లేలా అందర్నీ ఒప్పిస్తుంది. పదును తప్పకుండా, ఔచిత్యమెరిగి మాట్లడితే ఎంతటి అసాధ్యమైనా సుసాధ్యమవుతుందని తెలియజేసే ఈ పాట ఓ వ్యక్తిత్వ వికాస పాఠ్యాంశమే.
స్త్రీలపాటల్లోనూ, దేశీ ద్విపదకవితల్లోనూ వాడేలాంటి లయను, తూగునీ ఉపయోగించి జానపదుల గీతాల్లోని అందం ఈ పాటకి సంతరించిపెట్టారు వేటూరి. సామాన్యంగా చలనచిత్ర గీతాల్లో ఉపయోగించే అంత్యనుప్రాస చరణాల్లో వాడినా, పల్లవికి మాత్రం సామెతలు, ద్విపద కవితలు, జానపద గీతాల్లో వినవచ్చే మొదటి అక్షరానికీ పాదం మధ్యలో పదం మొదటి అక్షరానికీ ఉండె ప్రాస వేయడంతో వింత సొబగు వచ్చింది. చలన చిత్రం కోసం రాయబడ్డ గీతమని తెలియనివారు ఈ పాట వింటే తరం నుంచి తరానికి స్త్రీలలో వస్తున్న జానపద పాటేమోనని భ్రమపడేలా జానపదాన్ని అందిపుచ్చుకున్నారాయన. పాటలో ప్రతి పాదంలోనూ పలుకుబళ్లు, సామెతలు, అచ్చతెలుగు నుడికారపు మాటలూ, ఆడవారి నోళ్లలో నలిగిన పోలికలూ పాయసంలో జీడిపలుకుల్లా తగులుతాయి. “అడగవచ్చా నిన్ను ఆడకూతురిని” అంటూ ఇరకాటంలో పెట్టినా, “వాల్మీకినే బోలు వరుస తాతయ్యా” అని మునగచెట్టెక్కించినా అచ్చ తెలుగు ఆడబడుచుల ముచ్చట్లలోని నుడి సొగసే కనిపిస్తుంది. “తలలో నాలుక”, “ఏడుమల్లెలు తూగ”డం లాంటి జాతీయాలు, “పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది” వంటి సామెతలు ఈ పాటకి ఏడువారాల నగల్లా అమర్చారు. “కలికి చిలకల కొలికి”, “తేనె నీరెండ”, “సయోధ్యనేలేటి సాకేత రామా” లాంటి పదచిత్రాలు, చమత్కారాల సొగసు గురించి ఎంత తలచుకున్నా విసుగురాదు.
రసాత్మకమైన ఒక వాక్యం కూడా కావ్యమే అన్న లాక్షణికులని అనుసరించి ఈ పాటలో ఏ పాదనికి ఆ పాదాం రసరమ్యమైన కావ్యమే అవుతుంది. తెలుగు ఆడబడుచుల మనసులో మాటగా, ఒకనాటి ఉమ్మడి కుటుంబాల జీవన చిత్రంగా, తెలుగు పదబంధాల్లో సొగసుకు నిలువుటద్దంలా ఈ పాట తెలుగునోళ్లలో నువ్వుగింజలా నానుతూనే ఉంటుంది.
(కలికి చిలకల కొలికి శీర్షికన తెలుగు వెలుగు పత్రిక 2014 జనవరి సంచికలో ఈ వ్యాసం ప్రచురితమైంది, కొన్ని మార్పుచేర్పులు చేసిన వీడియో రూపం ఈ కింద చూడొచ్చు)