Menu

2016 లో చూడదగ్గ తెలుగు చిత్రాలు

నేను శైలజ :   రామ్ వరుస పరాజయాల తర్వాత తన ఖాతాలో ఓ మోస్తరుగా హిట్  దక్కించుకున్న  చిత్రం. దేవి శ్రీ ప్రసాద్  పాటలు అలరిస్తాయి. విఫల ప్రేమికుడిగా రామ్ ఆకట్టు కుంటాడు, ప్రదీప్ రావంత్ పాత్ర కొంచెం వెరైటీ గా ఉంటుంది. కామెడీ ,ప్రేమ, కుటుంబ విలువలు నేపధ్యంగా సాగే ఈ చిత్రం ఫామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

కిల్లింగ్ వీరప్పన్ : ఐస్ క్రీం, 365  వంటి చిత్రాల పరాజయం తర్వాత రామ్ గోపాల్ వర్మ మళ్ళీ  తన మేకింగ్ తో అందరిని ఆకట్టుకున్నాడు . మాతృక కన్నడం అయినప్పటికి తెలుగు, తమిళం లోను విడుదల చెయ్యబడి ఆకట్టుకుంది. విమర్శకుల ప్రసంసలు అందుకుంది. వీరప్పన్ గా సందీప్ భరద్వాజ్, పోలిస్ గా శివరాజ్ కుమార్ ఆకట్టుకున్నారు. కెమెరా పనితనం బాగుంటుంది.

నాన్నకు ప్రేమతో  : సుకుమార్ గత చిత్రాలతో పోల్చుకుంటే గొప్ప చిత్రం ఏమి కాదు గాని, కేవలం జూనియర్  NTR ను స్టైలిష్ గా  చూడాలనుకుంటే మాత్రమే  ఓ లుక్కు వెయ్యొచ్చు. సుకుమార్ లాజిక్ లు మిస్ చేసి, ఇంటెలిజెన్స్ గా ఏదో చెయ్యాలని కొంత అసహనానికి గురి చేసినా, తన స్టైలిష్ మేకింగ్ కోసం ఓ సారి చూడొచ్చు.

సోగ్గాడే చిన్ని నాయన : పల్లెటూరి నేపధ్యంలో సాగే ఈ చిత్రంలో నాగార్జున రెండు పాత్రల్లో  ఆకట్టుకుంటాడు.  బంగారు రాజు  పాత్రలో నాగార్జున తన యాసతో ఆకట్టుకుంటాడు. పెద్ద పెద్ద  లాజిక్ లు, మాజిక్ ల గోల ప్రక్కన పెట్టి  కుటుంబ సమేతంగా ఓ సారి ఆహ్లాదంగా చూడదగ్గ చిత్రం.

కృష్ణగాడి వీర ప్రేమ గాథ : భలే భలే మగడివోయి తర్వాత నాని ఖాతాలో మరో హిట్.  అందాల రాక్షసి దర్శకుడు  హను రాఘవపూడి దర్సకత్వంలో వచ్చిన ఈ ప్రేమ కథ ఓ సారి చోడోచ్చు నాని కోసం.

క్షణం  : తెలుగులో మిస్టరీ , థ్రిల్లర్ ఫిలిమ్స్ చాలా మట్టుకు కొరవడిన తరుణంలో ఒక నిఖార్సయిన మిస్టరీ థ్రిల్లర్  చిత్రం. అడివిశేష్ కేవలం నటనతోనే కాక కథకుడిగాను ఆకట్టుకున్న చిత్రం. కేవలం  కోటి రూపాయల లోపు బడ్జెట్ తో సినిమా తీసి, సినిమాకు ఎన్ని హంగులు అద్దిన అంతిమంగా కావలసింది కథే అని నిరూపించిన చిత్రం. దర్శకుడు రవికాంత్ కు మొదటి చిత్రమే అయినా చాలా నీటుగా వుంటుంది అతని మేకింగ్. తప్పక చూడవలసిన చిత్రం.

గుంటూరు టాకీస్: ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన  బ్లాక్ కామెడీ చిత్రం. డబల్ మినింగ్ డైలాగ్స్, సీన్స్ తగ్గించి  ఇంకొంచెం బాగా తీసి ఉంటే బాగానే వుండి వుండేది ఈ చిత్రం. గై రిచీ లాగా  కామెడి తో కూడిన సీరియస్ విషయం కథా వస్తువు అయినప్పటికి పేలవమైన విలన్ తో కొంచెం తేలిపోయింది. ప్రవీణ్ సత్తారు అటెంప్ట్ కోసమూ , నరేష్ , సిద్దుల నవ్వుల కోసం, రష్మి కోసం ఓ సారి చూడొచ్చు.

కళ్యాణ వైబోగమే : కథ  సాధారణమే అయినప్పటికి నాగశౌర్య , మాళవిక నాయర్ ల నడుమ సాగే కొన్ని మంచి సన్నివేశాలు,కామెడీ కోసం ఓ సారి చూడొచ్చు.

ఊపిరి :  ఊపిరి సలపని మూస ఫార్ములా  చిత్రాల నడుమ కాసింత సాంత్వన ఈ ‘ఊపిరి.’ ఇది ప్రెంచి చిత్రం ‘ఇన్ టచబుల్స్’ కు అనుసరణ. చాల బాగం ఆకట్టుకున్నప్పటికి, వంశీ జోడించిన సెంటిమెంట్ లు, ప్రేమలు కొంచెం మూస పంథాలోనే సాగుతాయి ఇందులోను. కార్తీ కామెడీ ,నాగార్జున హుందాతనం ఆకట్టుకుంటాయి. పాటలు అంతంత మాత్రమే. కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది.

అ..ఆ : నితిన్ ఖాతాలో మరో విజయం ,ఆకట్టుకున్న రావు రమేష్ పాత్ర. మెప్పించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు. అయితే మూలకథ ఎందుకో కొంచెం అత్తారింటికి దారిని తలపిస్తుంది. మిక్కి J మేయార్ సంగీతంలో పాటలు వినేందుకు చాలా ఇంపుగా వున్నాయి.

జెంటిల్ మెన్ : మోహన్ కృష్ణ ఇంద్రగంటి సేఫ్ గేమ్. డీసెంట్ గా సాగే నాని నటన.. ఆడియో లాంచ్ లోను, ట్రైలర్ లో చెప్పినంతగా కథలో భారీ ట్విస్ట్ లు అంటూ ఏమి లేవు. నీట్ గా సాగే మోహన్ కృష్ణ ఇంద్రగంటి మేకింగ్, నాని,నివేదా  థామస్ ల నటన కోసం  ఓ  సారి చూడొచ్చు.

పెళ్లి చూపులు : గొప్ప చిత్రం కాదు గాని, నిస్సందేహంగా చెప్పొచ్చు ఓ మంచి చిత్రం అని. ప్రస్తుతం ఉన్న యువతరం ,వారి ఆలోచనా శైలికి చాలా దగ్గరగా ఉండే చిత్రం.చాలా యదార్ధంగా సాగే సన్నివేశాలు ఇంటర్వెల్ వరకు బాగున్నా , ఆపై కొంచెం ఉహాజనితంగానే సాగుతుంది.అయితే ఆసాంతం ఆకట్టుకుంటుంది, తప్పక చూడాల్సిన సినిమా.బడ్జెట్ తక్కువే అయినా కంటెంట్, కామెడీ అదిరిపోతుంది.

మనమంతా : ఎప్పుడూ వైవిధ్యమైన చిత్రాలు తీసే చంద్రశేఖర్ ఏలేటి ఈ చిత్రమూ బాగానే తీసినప్పటికీ, విమర్శకుల  ప్రశంసలు అందుకున్నప్పటికి  సరైన ప్రచారం లేక సినిమా పరాజయం పొందింది. ఒక మంచి అనుభవం కోసం, వైవిధ్యం కోసం తప్పక చూడొచ్చు.

జనతా గారేజ్ : కథ మూలం రామ్ గోపాల్ వర్మ సర్కార్ ను తలపించినా కొరటాల శివ తనదైన శైలితో ఆకట్టు కుంటాడు.  జూనియర్ NTR, మోహన్ లాల్ నటన చాలా నీట్ గా ఉంటుంది. అయితే ఎప్పటిలాగానే విలన్ లు బలహీనంగానే ఉంటారు. NTR ప్రేమలో క్లారిటీ ఉండదు. కొరటాల శివ మాత్రం ఉబుసుపోని కామెడి జోలికి వెళ్లకుండా తను చెప్పదలచుకున్న విషయం సూటిగా చెబుతాడు.  NTR ఖాతాలో అత్యధిక వసూళ్ళ చిత్రం ఇదే . గొప్ప చిత్రం కాదు గాని , మంచి చిత్రం.

జో  అచ్చ్యుతానంద : ఇద్దరు అన్నాతమ్ముళ్లు ఒక అమ్మాయి ప్రేమ కోసం పడే హయిరాన లాగా మొదలయి , అటుపై ఇద్దరు అన్నదమ్ముల మధ్య అడ్డుగోడలుగా నిలిచిన అహాన్ని గురించి చూపించిన సినిమా. ఈ చిత్రంతో అవసరాల శ్రీనివాస్ పై  మరింత గౌరవం పెరిగింది. అయితే ఇంకొంచెం క్లారిటీ గా చూపించి వుంటే అదిరిపోయి ఉండేది. నారా రోహిత్, నాగశౌర్య,రెజినా ఆకట్టుకున్నారు.

మజ్ను : నాని కథలో మరో సూపర్ హిట్. కథలో పెద్ద కొత్తదనం ఏమిలేదు కాని. నాని  భగ్న ప్రేమికుడిగా ఆకట్టుకున్నాడు. వైజాగ్ ప్రేమ కథ, అందులోని హీరోయిన్ ,  వెన్నెల కిశోర్ కామెడీ,పాటలు  ఆకట్టుకున్నాయి.

హైపర్ : మరి అంత గుడ్డు కాదు ,మరి అంత చెత్తా కాదు. ఒక ఆవరేజ్ బొమ్మే. రావు రమేష్ , రామ్ ల మధ్య సాగే  సన్నివేశాలు మాత్రం కొన్ని తప్పక  ఆకట్టు కుంటాయి. మిగతాది అంతా మన తెలుగు సినిమా పంథాలోనే సాగిపోద్ది. రామ్ ఇలాంటి హైపర్ సినిమాలు సాలనే చేసాడు.

మన ఊరి రామాయణం : మలయాళం లోని షట్టర్ సినిమా కు రీమేక్ . ప్రకాష్ రాజ్ గురించి కొత్తగా చెప్పేందుకు ఏమిలేదు. ఆయన నటన గురించి అందరికి తెలిసిందే, ప్రియమణి వేశ్య పాత్ర , సత్యదేవ్ కి, పృథ్వి కి మంచి పాత్ర. ఎందుకో మనోళ్ళకి ఈ రామాయణం పెద్దగా రుచించలేదు గాని, నిజంగా చూడదగ్గ చిత్రం.

ప్రేమం  : ఎటూ రీమేక్ అన్నది అందరికి తెలిసిందే. శృతి హాసన్ ని తప్పించి మిగతా అందరి కోసం ఓ సారి లుక్కేయోచ్చు.

సాహసం శ్వాసగా సాగిపో : రెండు జానర్ ల సినిమా. మొదటి బాగం అంతా ప్రేమ , రెండో భాగం అంతా థ్రిల్లర్ . ప్రేమ బాగుంది కాని త్రిల్లరే కాస్త వికటించింది. అందునా క్లైమాక్స్ మరి పేలవంగా ముగిసింది. ఎండ్ సస్పెన్సే కొంప ముంచింది. వెళ్లిపోమాకే  పాట ఎదను హత్తుకుంది.

ఎక్కడికి పోతావు చిన్నవాడా : నిఖిల్ ఖాతాలో నిఖార్సయిన హిట్.

ధ్రువ : తమిళ చిత్రం తని ఒరువన్ కు రీమేక్ , తెలుగులోనూ ఆకట్టుకుంది. సురేందర్ రెడ్డి తెలుగులో ఏమైనా తేడా చేస్తాడా అనుకున్నా, అలా జరగలేదు. తమిళ్ లో హిప్ హాప్ తమిళా పాటలే ప్రత్యేక ఆకర్షణ. కాని తెలుగులోనే పాటలు వికటించాయి. తెలుగులో తప్పక చూడవలసిన ఓ ఆక్షన్ ,థ్రిల్లర్ చిత్రం .

వంగవీటి:  ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువు అయినటువంటి చిత్రం. అయితే రామ్ గోపాల్ వర్మ చెప్పినంత ఏమి లేదు సినిమాలో. ఇది  కేవలం విజయవాడలో రౌడీయిజం  ఆరంభాన్ని , అంతాన్ని చర్చించిన చిత్రం మాత్రమే.  రామ్ గోపాల్ వర్మ వాయిస్ ఓవర్ , చలసాని వెంకట రత్నాన్ని , వంగవీటి రాధని , దేవినేని మురళిని మట్టు పెట్టే సన్నివేశాలు, మూడు పాటలు బాగున్నాయి. కెమెరానే  సీరియల్ కెమెరా కంటే మరి అద్వానంగా వుంది. ఓసారి  చూడొచ్చు.

అప్పట్లో ఒకడుండేవాడు: ఈ సంవత్సరాంతంలో ఓ మంచి చిత్రం. అటు కమర్షియల్ గాను , ఇటు విమర్శకుల ప్రశంసలను పొందిన చిత్రం.

One Response
  1. jai February 24, 2017 /