Menu

అప్పట్లో ఒకడుండేవాడు (2016)

కొన్ని సినిమాల మీద రివ్యూలు వ్రాస్తే బాగోదు. కొన్ని సినిమాల మీద రివ్యూలు వ్రాయకపోతే బాగోదు. ఈ రెండో కోవకు చెందే సినిమా “అప్పట్లో ఒకడుండేవాడు“. “అయ్యారే” సినిమాతో పరిచయమైన “సాగర్ చంద్ర” దర్శకత్వం వహించిన ఈ సినిమాలో “శ్రీవిష్ణు“, “నారా రోహిత్” ప్రధాన పాత్రలు పోషించారు. “ప్రశాంతి”, “కృష్ణ విజయ్”లతో పాటు “రోహిత్” కూడా ఒక నిర్మాత ఈ సినిమాకి.

కథ :

1990లలో హైదరాబాద్ క్రైమ్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన రైల్వే రాజు (శ్రీవిష్ణు) ఇప్పుడు ఏమయ్యాడు? అతడి కథేంటి? రాజుకి, ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ (నారా రోహిత్)కి ఏంటి సంబంధం? అన్న అంశాలపై సాగే కథ ఇది.

కథనం, దర్శకత్వం – విశ్లేషణ :

పైన వ్రాసినట్టుగా ఒక పిట్టకథలా దీని గురించి చెబితే ఇది అతి సాధారణమైన చిన్న సినిమా అవుతుంది. కానీ కథనంలోకి వెళ్తే కానీ తెలియదు, ఆ పిట్టకథలో ఎంత పెద్ద సముద్రం ఉందోనని. మూలకథ చిన్నదే అయినప్పుడు కథనంతో సినిమా నడుస్తుందని చెప్పడానికి ఈ సినిమా మరో ఉదాహరణ. ఇక విశ్లేషణలోకి వెళితే…

ఒక పీరియడ్ డ్రామాగా ఓ కల్పిత కథను చెప్పాలి అనుకున్నప్పుడు దర్శకుడికి చాలా “స్వేచ్చ” దొరుకుతుంది. ఆలోచన స్థాయిని పెంచుకొని, సృజనాత్మకతకు పదును పెట్టొచ్చు. కానీ అలాంటి కథలకు అప్పటి సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవడం కూడా ఎంతో అవసరం. ఈ రెండింటిలో దర్శకుడు సాగర్ చాలా జాగ్రత్త వహించాడు.

కథ జరిగే కాలంనాటి వాతావరణాన్ని తన సినిమాలో పూర్తిగా తీసుకొనివచ్చే ప్రయత్నం చేశాడు. 1990ల్లోని సామాజిక పరిణామాలను కూడా తన కథతో బాగా అనుసంధానం చేశాడు. ఉదాహరణకు, అప్పటి ప్రధాని “పీ.వీ.నరసింహారావు” భారతదేశంలో విదేశీ పెట్టుబడులకు అనుమతులు ఇవ్వడం, భారతీయులకు విదేశాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పించడం లాంటి అంశాలు తన కథలో సరిగ్గా వాడుకున్నాడు. అప్పటి హిట్టు సినిమాలైన “శివ“, “జగదేకవీరుడు అతిలోక సుందరి“, “బొబ్బిలిరాజా” పోస్టర్లు వాడాడు. దీనిలో ఏముంది అని అనుకుంటారేమో. ఇలాంటి చిన్న విషయాలు తెలియకుండా ప్రేక్షకుడి దృష్టిని తప్పకుండా ఆకర్షిస్తాయి. ఏదైనా సన్నివేశంలో నటుడి వెనుక ఇలాంటి పోస్టరు కనిపిస్తే ప్రేక్షకుడు నటుడిని కాకుండా ఆ పోస్టరు వంక చూస్తాడు. తన తోటి ప్రేక్షకుడికీ చూపిస్తాడు.

“స్వేచ్చ” విషయానికి వస్తే, ఎంత పెద్ద కమర్షియల్ సినిమాలో అయినా, దర్శకుడికి తను వ్యక్తిగతంగా నమ్మే సిద్ధాంతాలను, తనలోని వేదాంతాన్ని, తన జీవిత అనుభవాలను, తన ఊహలను ఒక సన్నివేశంలోనో, లేకపోతే ఒక షాట్ లోనో చెప్పే అవకాశం దొరుకుతుంది. దర్శకుడికి అలాంటి అవకాశాలు బోలెడు దొరికాయి ఈ సినిమాలో. ఉదాహరణకు, అలసిపోయిన రాజు పరిస్థితులకు ఎదురుతిరిగి భగవాన్ దాసు (జీవీ)పై తిరగబడే సన్నివేశంలో అక్కడి గ్రామఫోను రికార్డు దెబ్బతింటుంది. భగవాన్ పై క్లోజ్ షాట్, “పుట్టింది పెరిగింది ఎందుకో” అనే ఒక పాటలోని లైన్ పదే పదే వినిబడుతుంది. దర్శకుడు తనలోని భావాలను చెప్పిన సందర్భం ఇది. వీటినే “డైరెక్టర్స్ మూమెంట్స్” అంటారు. ఇలాంటివి మరెన్నో ఉన్నాయి ఈ సినిమాలో. ఇంతేకాదు, కథనంలో చూపించిన ప్రతి సన్నివేశానికి కథతో సంబంధం ఉంది. ఈమధ్య కాలంలో సినిమాల్లో అరుదుగా జరిగే విషయం ఇది.

పులి మీద స్వారీ, క్రైమ్ ప్రపంచంలో ప్రయాణం మొదలుపెట్టాక ఆపడం ఉండదనే విషయం ఈ సినిమాలో చాలా బాగా చూపించాడు దర్శకుడు. ముఖ్యంగా రాజు తన ప్రత్యర్థులతో సంధి కుదుర్చుకోవడానికి వెళ్ళే సన్నివేశం రెండో సగానికి ఉత్తమ సన్నివేశంగా చెప్పొచ్చు. ఇక్కడ “శ్రీవిష్ణు” నటన ఒక అద్భుతం. అలాగే, చివర్లో విట్టల్ (బ్రహ్మాజీ), రాజుకి మధ్యనున్న సన్నివేశం గుండెను తాకింది.

ఈ సినిమా నిడివి 124 నిమిషాలు. నిజానికి ఇందులో పాటలు అవసరంలేదు. ఒక్క పాట కూడా రిజిస్టర్ అవ్వలేదు. కానీ నేపథ్య సంగీతం మాత్రం సినిమాకు విపరీతంగా సాయపడింది. క్లైమాక్స్ సన్నివేశంలో వచ్చే ఒక సన్నాయి నేపథ్య సంగీతాన్ని గుండె తడిసేలా ఇచ్చాడు నేపథ్య సంగీతం అందించిన  “సురేష్ బొబ్బిలి“.

అలా, “అప్పట్లో ఒకడుండేవాడు” అనే ఈ సినిమా 2016 సంవత్సరానికి మంచి ముగింపునిచ్చిన సినిమా. దర్శకుడు సాగర్ తన ఏ ఒక్క ప్రేక్షకుడు తెర నుండి కన్ను తిప్పుకోలేనంత పకడ్బందీగా కథనాన్ని సమకూర్చిన సినిమా. స్టార్ నటులు లేనందున ఇది అందరికీ వెంటనే చేరువ కాకపోవచ్చు కానీ ఇందులోని పెద్ద స్టార్ “కథనం“. ప్రేక్షకుడు పెట్టుబడిగా పెట్టిన టికెట్ డబ్బులకు నూరుశాతం లాభం చూపించే సినిమా.

నటనలు :

రైల్వే రాజుగా శ్రీవిష్ణు నటన అద్భుతం. ముఖ్యంగా, పైన పేర్కొన్న “సంధి” సన్నివేశంలో అతడి హావభావాలు అద్భుతం. కానీ అతడి గొంతు పౌరుషం కన్నా ప్రేమనే బాగా పలికించగలదు. ఇలాంటి ఇంటెన్సివ్ రోల్స్ మున్ముందు లభిస్తే మంచి నటుడిగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రధాన పాత్రను కాకుండా వేరే పాత్రను ఎంచుకున్నందుకు గల ధైర్యానికి నారా రోహిత్ ని ముందుగా అభినందించాలి. అతడి నటన ఎప్పటిలాగే ఉన్నప్పటికీ, అంత బరువున్న అతడి మీద క్లోజ్ షాట్స్ కాస్త ఇబ్బందిపెడతాయి. బ్రహ్మాజీకి చాలా రోజుల తరువాత ఒక మంచి ఇంటెన్స్ రోల్ దొరికింది. క్లైమాక్స్ లో అతడి నటన హత్తుకుంది. ఇక, ఉన్నది ఒక్క సన్నివేశమే అయినా, తన ముద్రను వేశాడు సత్యదేవ్. ఇతడికున్న గొప్ప వరం అతడి గొంతుక. “పది రూపాయల పెప్సీ కొంటే పది లక్షలు ఎలా వచ్చాయి?” అనే డైలాగు చెప్పిన విధానం చాలు అతడి పటిమను తెలపడానికి. తాన్య హోప్ పలికిన మాటల్లో చాలాచోట్ల లిప్ సింక్ లేదు. సాషా సింగ్, ప్రభాస్ శ్రీను, రాజీవ్ కనకాల, రాజ్ మదిరాజు, జీవీ నాయుడు, జీవా, సమీర్, రవివర్మ, పద్మజ, నరసింహరావు ఇలా అందరికీ మంచి పాత్రలు దక్కాయి. శ్రీనివాసరెడ్డి ఉన్న ఒక సన్నివేశం కామెడీగా అనిపించినా దాని వల్ల కథనం మారే పరిస్థితి. ఇక, నా అభిమాన జర్నలిస్ట్ తుమ్మల నరసింహారెడ్డి అలియాస్ TNR తళుక్కున మెరిశారు.

బలాలు :

 1. సాగర్ కథనం, దర్శకత్వం. ఒక మామూలు మూలకథకు ఒక మంచి కథనం తోడైతే ఎంత బాగుంటుందో చూపించాడు సాగర్.
 2. నవీన్ యాదవ్ ఛాయాగ్రహణం. కథ జరిగే సమయానికి ప్రేక్షకుడిని సులువుగా తీసుకొనివెళ్ళింది.
 3. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం. ఇలాంటి భావోద్వేగపు కథనానికి నేపథ్య సంగీతం ఎంత మేలు చేస్తుందో చూపించాడు సురేష్ బొబ్బిలి.
 4. నిర్మాణ విలువలు. నిర్మాతలు రోహిత్, కృష్ణ విజయ్, ప్రశాంతి దర్శకుడిని నమ్మి 1990ల్లోకి ప్రేక్షకుడిని ప్రవేశింపజేశారు.

బలహీనత(లు) :

 1. పాటలు. ఇలాంటి సినిమాలు పాటలు లేకుండా కూడా బాగుంటాయి. ఒకవేళ ఉన్నా కూడా ఒక్క పాట కూడా గుర్తుండదు ప్రేక్షకుడికి.

– యశ్వంత్ ఆలూరు

14 Comments
 1. Venu udugula January 1, 2017 / Reply
   • చందు తులసి January 2, 2017 /
 2. Jayashree Naidu January 1, 2017 / Reply
 3. jai January 5, 2017 / Reply
 4. hari venkat January 22, 2017 / Reply
 5. mauricemoghadamopl February 8, 2017 / Reply
 6. Uday June 26, 2017 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *