Menu

మద్రాస్- గోడ కథ

అలెగ్జాండర్ మొదలు కొని అడాల్ఫ్ హిట్లర్ వరకు ప్రపంచ చరిత్రలో జరిగిన యుద్దలు అన్నిటికి కారణం ఒకటి ఆధిపత్యం కోసం అయితే మరొకటి అధికారం కోసం. ఈ యుద్ధాలు మూలంగా అభ్యున్నతి కంటే ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగిన దాఖాలాలే ఎక్కువ.ఈ యుద్ధాలకు మూలం ఆధిపత్యం , అధికార వాంచ అయినప్పటికి వాటికి ఆజ్యం పోసింది మాత్రం కుట్రలు,కుతంత్రలు,రాజకీయ లబ్ది,ద్రోహాలు, వెన్నుపోట్లే.ఇవి ఒక దేశ అభ్యున్నతికి నిత్యం అడ్డుగోడలుగానే నిలుస్తాయి.

సరే ఇక మన కథకి వస్తే ‘మద్రాస్’, ఇది తమిళుల రాజధాని అయినటువంటి ఒకప్పటి చెన్నై పేరు.మద్రాస్ ఒక గోడకు చెందిన కథ. ఒక హౌసింగ్ బోర్డు గోడను అనుకొని వున్న ఒక నగరం(వ్యాసర్‌పాడి దాని పేరు),దానిలో రెండు వర్గాలుగా విడిపోయిన జనం. అక్కడి మనుష్యుల మధ్య నెలకొన్న ప్రేమలు,స్నేహాలు,తగాదాలు,ఆవేశం,బాధ, విశ్వాసనీయత, వైరం,వర్గపోరు,ఆధిపత్యం,అధికార వాంఛ,ద్రోహం,వెన్నుపోటు,కుళ్ళు రాజకీయాలు,అభ్యున్నతి.వాటన్నిటికి ప్రతీకగా నిలిచిన అక్కడి గోడ ,వారి జీవన విధానం  దాని చుట్టూ పెనవేసుకున్న కథ. తనలో ఇన్ని భావోద్వేగాలను ఇముడ్చుకున్న నగరం కథ ఈ ‘మద్రాస్’. బావోద్వేగంతో కూడిన ఒక పొలిటికల్ డ్రామా.

చాలా మందికి మింగుడు పడని విషయం రజనీకాంత్ వంటి ఒక కమర్షియల్ నటుడు, తన ‘కబాలి’ చిత్రానికి ఒక నూతన దర్శకుడ్ని ఎంపిక చేసినందుకు కు గల కారణానికి గల సమాధానం ఈ ‘మద్రాస్’. దర్శకుడిగా రంజిత్ కి ఇది రెండవ చిత్రమే.

 

కథ విషయానికి వస్తే

1990 తమిళనాట మద్రాస్ లోని వ్యాసర్‌పాడి అనే ప్రాంతానికి చెందిన కృష్ణప్పన్,కరుణాకరన్ అనే ఇద్దరు  పెద్ద మనుష్యులు తమ అభిమాన నాయకుల మధ్య పార్టీల విభజన కారణంగా వారూ విడిపోతారు.దానితో అప్పటి వరకు ఒకటిగా వున్న ఆ ప్రాంతం, అక్కడి ప్రజలు రెండు వర్గాలుగా విడిపోతారు.అలా అన్నిటిని సమానంగా పంచుకున్నప్పటికి ఈ రెండు వర్గాల వారికి చెందిన ఒక పెద్ద గోడ, దానిపై తమ తమ పార్టీల ప్రకటన నినాదమే రావాలనే విషయం వివాదానికి తెరలేపుతుంది.దానిపై చిత్రీకరించేందుకు రెండు వర్గాల మధ్య పోరు.అది కేవలం గోడ కాదు తమ ప్రతిష్ఠ, పలుకుబడికి గుర్తు అని భావించే కృష్ణప్పన్ వర్గం,అందులో మాకు భాగం వుంది అని కరుణాకరన్ వర్గాల మధ్య తగాదా, దానితో కృష్ణప్పన్  కు ఎదురు తిరిగిన ఒక సామాన్యుని హత్య,దానికి బదులుగా కృష్ణప్పన్ హత్య,తన తండ్రి చంపిన వారిపై కన్నన్ పగ సాధింపు,అటుపై కన్నన్  చంపేందుకు ప్రయత్నం, అతడు తనని చంపేందుకు ప్రయత్నించిన వారిని చంపడం అంటూ చివారఖరికి కన్నన్ తన పలుకుబడితో అక్కడ గోడపై తన తండ్రి  చిత్రాన్ని చిత్రించడం జరుగుతుంది. దీనితో దానిని సాధించలేక ఓడిపోయాం అనే దిగులుతో కరుణాకరన్ మరణం దానితో అతడి కొడుకు ‘మారి’  ఆ వర్గానికి నాయకుడవుతాడు. ఆ గోడ వద్ద నెలకొన్న కొన్ని మరణాల కారణంతో దానిని  బలి తీసుకొనే గోడగా  చూసి భయపడడం ఆరంభిస్తారు. దానితో  అక్కడ ఒక గుడి వెలుస్తుంది. దీనిని తనకు అనుకూలంగా మార్చుకొని గోడపై తన తండ్రి చిత్రం చెరగ కుండా చూసుకుంటాడు కన్నన్.గోడను ఎలాగన్నా దక్కించుకోవాలన్న తీవ్ర కసితో ఉంటాడు మారి. ఆఖరికి ఈ తరంలో కూడాను ఇలాగే సాగుతుంది ఈ గోడ సమస్య.ఇంత వరకు చెప్పిన ఈ కథ దర్శకుడి మాటల్లోనే. నా కల్పితం ఏమి లేదు.

ఈ చిత్ర కథానాయకుడు కాళి (కార్తీ) ‘జీవితం చాల చిన్నది, ఈ రోజు ఈ క్షణం ఉన్నంతలో అనుభవించాలి’ అన్నది అతని వైఖరి. అతని స్నేహితుడు అన్బు(కలై అరసన్)’ రాజకీయ అధికారాన్ని దక్కించుకోవడం తోనే  ప్రజలకు స్వేచ్చ, దానిని పొందే తీరాలి’ అన్నది ఇతని వైఖరి . వీళ్ళ వర్గాన్ని నడిపేవాడు మారి (చార్లెస్ వినోద్ ), అక్కడి వారికి అన్ని తనే. అతనికి అన్నింటా తోడుగా వుంటాడు అన్బు.

ఇక రెండవ వర్గానికి  పెద్ద కన్నన్ (నంద కుమార్),అతడి కుమారుడు పెరుమాళ్( మైమ్ గోపి).అక్కడ విషయాలన్నీ వీరి కనుసన్నలోనే జరుగుతాయి.వీరి అనుచరుడు విజి (పవేల్).

కాళి(కార్తీ) తను వున్న ఏరియాలోనే బాగా చదువు కున్నవాడు,IT ఉద్యోగం తన తల్లిదండ్రులు,  ఓ ముదుసలి భామ ఇదే అతని కుటుంబం.మంచివాడు, స్నేహానికి విలువ నిచ్చే వ్యక్తి, ఒకింత ఆవేశపరుడు.తను ఎంతగానో అభిమానించే స్నేహితుడు అన్బు. తన తల్లి నిత్యం  పెళ్లి సంబంధాలు చూసి  తాను అంగీకరించినా సరే తన తల్లే ఎదో ఒక కారణం చెప్పి వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టడంతో ఇక జీవితంలో పెళ్ళే కాదేమో తనకి అని విసిగి పోతాడు. తన గోడును తన స్నేహితులతో చెప్పుకొని రోదిస్తుంటే , అక్కడ ఉన్న అతని స్నేహితుల పరివారం అటువైపు వస్తున్న కలై సెల్వి  ను  ( కేథరిన్ తెస్రా )  చూపి మా వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు పెళ్లి చేసుకుంటావా అని ఆట పట్టిస్తారు.అయితే ఎవరో ఏమిటో తెలియని ఆ అమ్మాయి పరోక్షంగా తన స్నేహితుల మాటల వలన ఇబ్బంది పడిందేమోనని  ఎవరు లేని సమయంలో ఆమెను కలిసి ఇందులో తన ప్రమేయం ఏమి లేదు, తన స్నేహితులే ఆట పట్టించారు అని చెప్పడంతో అయితే అది నిజం కాదా అని  అడగడంతో ఆమె చెప్పిన దానిలో అర్ధం ఏమిటో తెలియక సందిగ్ధంలో పడతాడు.అతడి స్నేహితుడు అన్బు భార్య అమ్మాయిలు ప్రేమను ఇలాగే వ్యక్తపరుస్తారు అని చెప్పడంతో అప్పటి నుండి తను కలై సెల్వి  ( కేథరిన్ తెస్రా ) వెంబడిస్తాడు దానితో ఇరువురి మధ్య తగాదా అటుపై కొన్ని సంఘటనల మూలంగా ఇరువురి మధ్య ప్రేమ చిగురిస్తుంది . ఈ ప్రేమ  ఎంత బాగుంది కదా, ఇది తెలియకుండానే జీవితంలో చాలా రోజులు గడిచిపోయాయి అని తనలో తనే మైమరిచి పోతుంటాడు. జీవితం ఇప్పుడు మరింత కొత్తగా ఉన్నట్లు ఉంది అని మురిసిపోతుంటాడు తన స్నేహితుడు అన్బుతో చెప్పుకొని.

అన్బు(కలై అరసన్)  తను ఉంటున్న ఆ ఏరియా లోని స్థానిక ప్రజలకు ఏ సమస్య వచ్చినా  అన్నింటిని తనే ముందు ఉండి చూసుకుంటాడు.తన కుటుంబం కంటే కూడా తన చుట్టూ వున్న వ్యక్తులకై  చలిస్తాడు.మారి తర్వాత ఆ ఏరియాలో అంతటి ప్రభావం చూపే వ్యక్తి తనే.రాజకీయాలకు సంబంధించిన విషయాలలో చాలా చురుకుగా వ్యవహరిస్తాడు. దానితో ఆ వర్గంలో మారి కంటే తనే వైరి వర్గానికి కొరకరాని కొయ్యగా కనిపిస్తాడు. ఆలోచన పరుడు, కుటుంబానికి,స్నేహానికి విలువ నిస్తాడు.నిత్యం  తన స్నేహితుడు కాళి కి అన్ని విషయాలలోనూ చేదోడు వాదోడు గా ఉంటాడు.

ఒక రోజు తన ఏరియాలో రాబోతున్న స్థానిక ఎన్నికలకు చెందిన మహానాడు సందర్భంగా  వారి నాయకుడు మారి ప్రచారం బాధ్యతలు అన్బు కు అప్ప జెప్పుతాడు.ఏరియా అంతటా తమ ప్రచార నినాదాలతో  నిండినా  చివరాఖరిగా మిగిలింది ఆ గోడ. ఆ గోడకు సంబంధించిన చర్చ మొదలవగా మెల్ల మెల్లగా అక్కడి వారంతా ఒక్కొక్కరిగా జారుకుంటారు తమకు ఎందుకు అనవసర విషయంలో జోక్యం అని.అయితే అక్కడ  గోడ బలి తీసుకుంటుంది అనే దుస్ప్రచారం, ఆ గోడ కోసం రక్తం చిందించిన వారి కోసం ఏమవుతుందో చూద్దాం అని తన పార్టీ వర్గం యొక్క నినాదం చిత్రీకరిస్తాడు. దానితో కన్నన్ వర్గానికి చెందిన అతని కుమారుడు పెరుమాళ్  సంప్రతింపులకు వెళ్తే అక్కడ అన్బు వర్గం ఆ గోడపై చిత్రంచిన దానిని చేరిపెందుకు నిరాకరించడంతో   రెండు వర్గాల నడుమ గొడవ దానితో కాళి, పెరుమాళ్ వర్గానికి చెందిన వ్యక్తి పై చెయ్యి చేసుకోవడంతో గొడవ తీవ్ర స్థాయికి చేరుతుంది.దానితో ఆగ్రహించిన పెరుమాళ్ అన్బు  ను జైల్లో పెట్టించి కొడతారు. జైలు నించి విడుదలైన తర్వాత కూడా ఆ గోడ మాది దానిని విడిచే ప్రసక్తే లేదని పెరుమాళ్ కి వార్నింగ్ ఇస్తాడు.  దేనికి భయపడని అన్బు ను చంపితే గాని అతని వర్గంలోని వారికి భయం రాదు, అతడిని అలా వదిలేస్తే ఎక్కడ నాయకుడిగా ఎదిగిపోతాడో నన్న భయంతో అతడిని చంపేందుకు ప్రణాళిక వేస్తారు. కాళి ప్రేమ వ్యవహారం , అన్బు రాజకీయ ప్రచారం అంటూ సాగిపోతూ వుండగా ఒకరోజు రాత్రి జరిగిన కొన్ని సంఘటనలు వారి జీవితాన్నే మార్చేస్తాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా పెరుమాళ్ వర్గం మనుష్యులు అన్బు , కాళి ఇరువురిని చుట్టు ముట్టడంతో, తీవ్ర పోరాటం తర్వాత తప్పించుకొనే ప్రయత్నంలో, రాత్రిలోపు అన్బు ను హతమార్చకుంటే మీరు నా చేతిలో చస్తారని పెరుమాళ్ అనడంతో ప్రక్కనే ఉన్న కాళి  పట్టరాని ఆవేశంతో  పెరుమాళ్ ని కొట్టి పారిపోతాడు.ఇక్కడ ఇంటర్వెల్, ఇంటర్వెల్ లో ఆరుతూ, వెలుగుతున్న విద్యుత్  దీపాల నడుమ టాప్ ఆంగిల్ లో నిర్మానుష్యమైన  నగరం దానిని ఆనుకోనివున్న  గోడపై  భయానకంగా క్రిష్ణప్పన్ చిత్రం. ఒక క్షణం పాటు నిజంగా ఇది బలి తీసుకునే గోడేనేమో అని చూసినవారికి అనిపించక తప్పదు.

ఏదో పెద్ద ఘోరం జరిగిపోయింది అనుకుంటుండగానే పెరుమాళ్ చనిపోయాడు అన్న వార్త అన్బును,కాళిని మరింత కలవర పెడుతుంది.జీవితంలో అన్ని సవ్యంగా జరుగుతున్నాయి అనుకున్న తరుణంలో ఎటూ కోలుకోలేని దెబ్బ జైలు జీవితమే కదా మనకిక అని వాపోతాడు కాళి. కొడుకును కోల్పోయిన బాధలో కన్నన్ ,ఎక్కడ కనబడ్డా అన్బు ,కాళిని చంపేందుకు సిద్ధంగా ఉన్న కన్నన్ అనుచర వర్గం, ఆ ప్రదేశం నుండి తప్పించుకొనే వీలు లేకుండా పోలిస్ బందోబస్తి . పోలిసుల చేత చిక్కితే మరణమే, కోర్టుకు అప్పజెప్పమని ‘మారి’ లాయర్ సలహా. ఎటు తప్పించుకునేందుకు వీలు లేని తరుణంలో అన్బు వర్గ నాయకుడు ‘మారి’ సహాయంతో అక్కడి నుండి తప్పించుకుంటారు మిత్రులు ఇరువురు. కోర్టుకు చేరేలోపే చంపెయ్యమని పోలీసుల సలహా.తీరా కోర్టులో హాజరు చేసే ముందు లిస్టులో  అన్బు పేరు మాత్రమే ఉండడంతో, అందుకు కాళి తను చేసిన  తప్పుకు తన స్నేహితుడు బలవడాన్ని నిరాకరిస్తాడు. ఒక్కసారి జైలుకు వెళ్లివస్తే నీ మీద ముద్ర పడి పోతుంది వద్దు, నీ స్థానం లో నేనున్నా అదే చేస్తాను అయినా చదువు కున్నవాడివి అనవసర విషయాలు నీ కెందుకు అని వారించి కాళి కి బదులు తను శిక్షను అనుభవించేందుకు సిద్దపడతాడు.పిచ్చ పాటి  మాటల్లో ఒక్కసారిగా కొంతమంది దుండగులు అన్బును చుట్టుముట్టి కోర్టు ఆవరణలోనే పెట్టి అతి క్రూరంగా చంపుతారు.

ప్రాణపదంగా భావించే స్నేహితుని మరణంతో కాళి ఎంతో  బాధకు లోనవుతాడు. తన కళ్ళెదుటే జరిగిన ఆ సంఘటనను తలచుకొని మరింత క్రుంగిపోతాడు. దానికి కారణమైన వారిపై పగ సాధించాలనుకుంటాడు. అ క్రమంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోక తప్పదు తను.అంతటి బాధలో అతనికున్న కొద్దిపాటి సాంత్వన తన ప్రేమ ఒక్కటే.మెల్లమెల్లగా తన ప్రేయసి సహచర్యంతో  అన్నిటిని మరిచేందుకు ప్రయత్నిస్తాడు. ప్రేమ కాస్తా పెళ్ళితో ముడిపడుతుంది.

ఒక్కసారిగా  ఎన్నో ఏళ్ల క్రితం విడివడిన పార్టీల మధ్య ఐక్యత నెలకొంటుంది. కేవలం ఆ రెండు పార్టీల మూలంగానే విడివడిన ఆ రెండు వర్గాలలోని నాయకులలో కన్నన్  సంధికి దిగడంతో రెండు వర్గాలు ఒకటయ్యేందుకు మార్గం సుగమం అవుతుంది. అంతా సవ్యంగా సాగిపోతున్న కాళి జీవితంలో ఒక నిజం  ప్రజలను  చైతన్యం దిశగా నడిపేందుకు, వారిలో కనువిప్పు కలిగించేందుకు  దోహదపరస్తుంది. ఆ నిజం ఏమిటి, ప్రజలలో కలిగిన మార్పేమిటి ,అక్కడి అన్ని సంఘటనలకు ప్రతీకగా నిలిచిన ఆ  గోడ ఏమైంది అన్నదే మిగతా కథ.

మనిషిని మనిషి గౌరవించేందుకు ,సామాజిక సమస్యలను ఎదుర్కోవడానికి కేవలం  చదువు  మాత్రం సరిపోదు, చదువుతో కూడిన సామాజిక రాజకీయాలు ,సామాజిక స్పృహ తప్పక   వుండాలన్నదే  ‘మద్రాస్.’

తీస్తే గీస్తే దీనిని రీమేక్ గా తియ్యాలి తప్ప , డబ్బింగ్ చేసేందుకు వీలుపడదు.ఎందుకంటే ఇది పూర్తిగా తమిళుల నేపధ్యంతో ముడిపడ్డ చిత్రం గనుక.

ఇందులో నన్ను అమితంగా ఆకట్టుక్కున్న విషయాలు:

  • ఎంచుకున్న కథా నేపధ్యం ( స్థానిక రాజకీయాలు , అక్కడి ప్రజల జీవనశైలి )
  • నటీనటుల ఎన్నిక. ముఖ్యంగా కాళి పాత్రలో కార్తీ బాగా ఆకట్టుకుంటాడు, నిజం చెప్పాలంటే కార్తీది కథను నడిపించే ఒక పాత్ర మాత్రమే తప్ప ..ఎక్కడా  కథానాయకుడు అంటూ ప్రత్యేకించి చూపడం జరుగదు. కార్తీ కంటే కూడా అతని స్నేహితుడిగా వచ్చే అన్బు పాత్రదారి కలై అరసన్  సినిమా ముగిసిన తర్వాత కూడా ఒక చెరగని ముద్ర వేస్తాడు.
  • సహజత్వంతో కూడిన పాత్రలు
  • దర్శకుడి రంజిత్ మేకింగ్ ,కథ,కథా విస్తరణ
  • సంతోష్ నారాయణ్ సంగీతం, నేపధ్య సంగీతం  (ఇన్ ది మూడ్ ఫర్ లవ్ background Music inspiration), అన్ని పాటలు బాగున్నప్పటికీ మద్రాస్ నగరం యొక్క ఔచిత్యాన్ని, సాధక  భాధకాలను తెలిపే మొదటి పాట బాగా ఇష్టం.
  • పెరుమాళ్ వర్గం కాళి(కార్తీ), అన్బు లను (కలై అరసన్ ) చంపేందుకు చేసే పోరాట సన్నివేశాలు  చాలా యదార్ధంగాను ఆకట్టుకునే విధంగాను ఉంటాయి. అదే విధంగా కోర్టు ఆవరణలో అన్బును క్రూరంగా చంపే సన్నివేశాలు చిత్రీకరణ చాలా బాగుంటుంది
6 Comments
  1. బి. పవన్ కుమార్ December 18, 2016 /
  2. శ్రీనివాస్ December 18, 2016 /
  3. బి. పవన్ కుమార్ December 19, 2016 /
  4. శ్రీధర్ December 21, 2016 /