Menu

దంగల్ – ఒక తండ్రి కన్న కల

సృష్టిలో ప్రతి జీవికి జననం, జీవనం, మరణం ఇత్యాది మామూలే. అయితే మనిషికి మాత్రమే ఉన్న ప్రత్యేక లక్షణాలు   విచక్షణా జ్ఞానం ,నిర్దిష్ట లక్ష్యాలు, సంకల్పాలు,భావోద్వేగాలు. అనునిత్యం తన ఉనికిని నిరూపించుకొనేందుకు చేసే  పోరాటం ,ఒడిదుడుకులు, వైఫల్యాలు,  అంతిమంగా విజయ శిఖరాలను అధిరోహించడం. కలలు అందరూ కంటారు ,అయితే వాటిని సఫలీకృతం చేసుకునే దిశగా తీవ్రమైన సంకల్పంతోను, కృషితోను కొంతమంది మాత్రమే ముందుకు సాగిపోతారు. దాని మూలంగా ఓ వ్యక్తి కొన్ని సార్లు  సంఘంలోని వ్యక్తుల నుండి, ఆఖరికి తన స్వంత కుటుంబం నుండి కూడా  అవరోధాలు, అవహేళన , విమర్శలను ఎదుర్కోక తప్పదు.  లక్ష్యం ఎంత ఉన్నతమైతే అవరోధాలు కూడా అంత బలీయంగా ఉంటాయి మరి. అటువంటి అవరోధాలను , అవహేళనలను లెక్క చెయ్యక కేవలం భారత దేశానికి ఒక స్వర్ణ పతకాన్ని అందించాలనే స్వప్నం  దిశగాను , ఆడవాళ్ళు మగవాళ్ల కంటే ఎందులో తక్కువ  అని మగ వాళ్లకి దీటుగా తన కూతుళ్ళను పెంచిన ఓ తండ్రి కథే ఈ ‘దంగల్.

కథ విషయానికి వస్తే 

మహావీర్ సింగ్ ఫోగాట్( ఆమీర్ ఖాన్) హర్యానాలోని భివాని అనే ప్రాంతానికి చెందిన ఒక కుస్తీ వీరుడు, జాతీయ స్థాయి ఆటగాడు, అంతర్జాతీయ స్థాయిలో ఆడి భారత దేశానికి బంగారు పతకం గెలవాలనే కాంక్ష కలవాడు అయితే , కొన్ని అనివార్య కారణాల అతడి ఆటను విడిచి పెట్టి వేరే గత్యంతరం లేక ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడి పోతాడు. అయితే  భారత దేశానికి కుస్తీ పోటీలలో బంగారు పతకాన్ని అందివ్వాలనే తన కలను తనకు పుట్టిన వారితోనైనా  సాకారం చేసుకోవాలని ఉవిళ్లూరుతాడు. అయితే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్న రీతిన  తన భార్య శోభా కౌర్ (సాక్షి తన్వార్)కు ఒకరి తర్వాత ఒకరిగా నలుగురు ఆడ సంతానమే పుట్టడంతో తన కలను సాకారం చేసేందుకు ఒక్క మగ శిశువైనా పుట్టడా అని ఎదురు చూసిన అతనికి నిరాశే మిగులుతుంది. కేవలం మగ పిల్లాడు మాత్రమే తన కలను నిజం చెయ్యగలడు అని నమ్మిన తను ఇక తన ఆశను పూర్తిగా చంపుకుంటాడు. అయితే ఒక రోజు చుట్టు ప్రక్కల ఇద్దరు ఆకతాయిలు గీతా,బాబితా లను  ఏడిపించారనే నెపంతో చెయ్యి చేసుకున్నందుకు గాను తన కుమార్తెలపై పిర్యాదు రావడంతో దాని వెనకున్న కారణం,వారిపై ఎలా చెయ్యి చేసుకున్నారు అనే విషయాలను తెలుసుకొనే ప్రయత్నంలో  వారిలో అంతర్లీనంగా ఉన్న కుస్తీ ఆట మూలాలను  గుర్తిస్తాడు మహావీర్ సింగ్ ఫోగాట్( ఆమీర్ ఖాన్).

తన ఇద్దరు కుమార్తెలను కుస్తీ పోటీలకు అనువుగా సిద్ధం చెయ్యాలనుకుంటాడు. కావలసింది బంగారు పతకం కాని దానిని  సాధించేందుకు ఆడ అయితే ఏమిటి, మగవాడు అయితే ఏమిటి అన్న భావం అతడిలో కలుగుతుంది. అందుకు మగ వాళ్లకు దీటుగా వాళ్లను తీర్చిదిద్దాలనుకుంటాడు, తత్పలితంగా తన చుట్టు ప్రక్కల వారి నుండి కొన్ని విమర్శలను ఎదుర్కోక తప్పదు. దానితో తనే రంగంలోకి దిగి వారికి తగిన తర్ఫీదు ఇవ్వడం ప్రారంభిస్తాడు. తండ్రి కఠోర శిక్షణ తన ఇద్దరి కుమార్తెలకు మొదట్లో రుచించదు. అయితే ఓ సందర్భంలో వాళ్లు తమ తండ్రి మిగతా స్త్రీల కంటే తమను ఎంత భిన్నంగా పెంచుతున్నాడు అన్న నిజం తెలిసాక, తమ తండ్రి ఆశయం దిశగా ముందుకు సాగుతారు. ఆ ప్రయత్నంలో మగవారితో సమానంగా తలపడి,వారిని సైతం మట్టి కరిపించి , తమ తండ్రి ఆలోచన తప్పు కాదు (స్త్రీలు క్రీడలలో ఉండడం ) అని ఊరి జనం విస్మయం చెందేలా  చేస్తారు.

కేవలం తన ఇద్దరు కుమార్తెలకు శిక్షణ నిచ్చే నెపంతో మహావీర్ సింగ్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. సర్కార్ నుండి ఎటువంటి సహకారం లభించనప్పటికీ దిగులు చెందక వారికి అన్ని తనే సమకూరుస్తాడు. మెల్ల మెల్లగా గీత స్థానిక కుస్తీ పోటిల నుండి రాష్ట్ర స్థాయి పోటీలలోను గెలుపొందుతుంది. అటుపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడేందుకు సన్నద్దమవుతుంది. అయితే ఎటువంటి వారికైన సరే జీవితంలో తప్పటడుగు వెయ్యడం సహజం. తన ఆటపై కాకుండా గీతకు ఇతరులలానే బయట విషయాలపై  మనసు చలిస్తుంది.దానితో ఆటపై ఏకాగ్రత కోల్పోతుంది. దాని మూలంగా తన ఆటలో పేలవమైన ప్రదర్శన కనబరుస్తుంది. దానితో తన ఆటను మెరుగుపరచుకొనేందుకు  ఆమెకు మళ్లీ తన  తండ్రి సహాయం అవసరమవుతుంది. నిస్పృహలో కూరుకుపోయిన ఆమెను తన తండ్రి ,తన  అనుభవంతో ఎలా ముందుకు నడిపాడు, తన ఆటలోని లోపాలను ఎలా చక్కదిద్దాడు, చివరాకిరికి తన స్వప్నం  ఎలా నెరవేరింది అన్నది మిగతా కథ.

విశ్లేషణ విషయానికి వస్తే

క్రీడాకారుల జీవితానికి సంబందించిన కథలంటే ఒడిదుడుకులు,వైఫల్యాలు,విజయాలు అన్న పాయింట్ మామూలే అయినప్పటికీ, వారు ఎదుర్కున్న పరిస్థితులు , రూపొందించిన కథనం అన్నది ఇక్కడ కీలకం. ఆ విధంగా ‘దంగల్’ మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.  స్త్రీలను బయట చదువులకు పంపెందుకే ఆలోచించే ఆ రోజుల్లో, ఓ తండ్రి తన కూతుళ్ళను మగవారికి ఈ మాత్రం తీసిపోకుండా ఎలా పెంచాడు అన్న విషయం అందరిని ఆకట్టుకుంది. దేశం గర్వించదగిన అతి కొద్దిమంది నటులలో ఆమీర్ ఖాన్ ఒకరు. నిజంగా ఈ పాత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేసారనే చెప్పొచ్చు. కేవలం చిత్రంలో ఏడు నిముషాలు ,అందున ఆమీర్ ఖాన్ బాడి బిల్డింగ్ చేసి కనబడే దృశ్యాలు  ౩ నిముషాలు మాత్రమే, ఈ ఒక్క విషయం చాలు పాత్రను గురించిన  అతడి అంకిత భావం గురించి చెప్పేందుకు.నిజానికి కమల్ హసన్ , ప్రకాష్ రాజ్ వంటి నటులే కొన్ని చోట్ల ఎంత కాదనుకున్నా ఓవరాక్షన్  చేసినట్లు ఉంటుంది,  అయితే ఆమీర్ ఖాన్ విషయంలో మాత్రం అలా ఎపుడు అనిపించలేదు నాకు. ఈ మధ్య బాలీవుడ్ లో బయోపిక్  ల పరంపర ,అందులోనూ ముఖ్యంగా క్రీడాకారుల బయోపిక్ పరంపర ఎక్కువగా కొనసాగుతుంది, ఇది నిజంగా హర్షించ దగ్గ విషయం. ఎప్పుడూ పరభాష  చిత్రాల  కాపీ పేస్ట్ ల గోలే కాకుండా, ఇటువంటి చిత్రాలను కూడా రూపొందించడం మూలంగా మన మూలల్లోనే  నిఖార్సయిన కథలను గుర్తించడం, వాస్తవికతల చిత్రణ జరుగుతుంది, వీటన్నిటి కంటే ముఖ్యంగా మరుగున పడిన అనేకమంది  జీవితాలను సామాన్యుల ముందుకు  చేర్చడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో వచ్చిన ‘సాల ఖడూస్’ లో ఆటకు సంబంధించిన డీటైలింగ్  ఏది లేకుండా కేవలం పైపై మెరుగులతోటే కమర్షియల్ గా  తియ్యడం జరిగింది. అయితే ‘దంగల్’ లో  గొప్పతనం ఏమిటంటే కథతో పాటు ఆ ఆటకు సంబంధించిన విషయాలపై అవగాహన కలిగించి  ప్రేక్షకులకు ఎక్కడ బోర్ అనిపించకుండా, వారిని కూడా  ఆ ఆటతో పాటు మమేకం చెయ్య గలగడం. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు,ఆలోచింపజేసేది, జీవితానుభవాన్ని పంచేది, స్ఫూర్తిని నింపేది,సామాజిక భాధ్యతలను ఎత్తి చూపేది అన్న విషయం మరిచిపోకుడదు. సందర్భోచితంగానే సాగిన 3 పాటలు, అక్కడక్కడ సంధించిన  వ్యంగ్యాస్త్రాలు , ఆలోచింపజేసే సంభాషణలు వెరసి ‘దంగల్’ ఈ సంవత్సరాంతంలో ఓ గొప్ప చిత్రం.

 

నాకు నచ్చిన అంశాలు:

  1. కథనం ,మాటలు, దర్శకత్వం
  2. ఆమీర్ ఖాన్ నటన
  3. పాత్రలకు ఎంచుకున్న నటీనటులు, వారి నటన.
  4. ఆటకు సంబంధించిన విషయాలపై ఇచ్చిన డీటైలింగ్
2 Comments
  1. jai December 29, 2016 /