Menu

కిరుమి – సమస్యకు పరిష్కారం

ప్రతి సమస్యకు ఎదురు వెళ్ళే పరిష్కరించాలనే ఆవశ్యకత ఏమి లేదు. కొన్ని సార్లు తప్పుకోవడానికి పేరే గెలవడం అంటే.మన ఉనికిని మనం కాపాడుకోవడానికి కొన్ని సందర్భాలలో మనల్ని మనం  తగ్గించుకోవడం  తప్పేమీ కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే ఈ కథలోని అంతరార్ధం. దీన్ని ఆధారం చేసుకొనే  ఈ కథ మొత్తం నడుస్తుంది. తమిళంలో కిరుమి అంటే  తెలుగులో సూక్ష్మజీవి అని అర్ధం.

                              ఈ కథలోని కథానాయకుడు పేరు కధీర్ (అసలు పేరు అదే అనుకోండి. ) మొదటి సన్నివేశంలోనే స్నేహితులతో బాతాకాని మాట్లడుతున్నప్పుడే  వాళ్ళు కధీర్‌ని ఆట పట్టిస్తారు. ఆ ఒక్క సన్నివేశంలోనే  కధీర్ అనాకారి, ఏ పనిపాటా లేనివాడు, ఏ పని లేకున్నా ఉచిత సలహాలు ఇచ్చేవాడని ప్రస్పుటంగా తెలుస్తుంది. సినిమా కథ క్రమాన్ని వివరిస్తూ ఓ పాట,అందులోనే టైటిల్ కార్డు పడుతుంది. దారిలో ప్రభాకర్ (చార్లీ) కధీర్ కంట పడతాడు. అతడు ఒక police informer. కధీర్ కు బాగా పరిచయస్తుడు. సోదరుడు వంటి వాడు , కదీర్ ఎక్కువ చొరవగా వ్యవహరించేది ఇతడి వద్దే. ఈ పరిచయంలోనే ప్రభాకర్ (చార్లీ) ఒక వ్యక్తిని వెంబడిస్తూ తన వాహనాన్ని కధీర్ కు అప్ప జెప్పితే అక్కడ కదీర్ ఒక పరిచయస్తురాలైన అమ్మాయితో మాట్లాడుతూ రొమాన్స్ కు సిద్ధపడి, ఆమె తల్లిదండ్రులు రావడంతో పరుగులంకించుకొని ప్రభాకర్ తో పయనమవుతాడు. ఇద్దరు మందు కొట్టి ప్రభాకర్ ఇంటికి చేరుకుంటారు. అక్కడ ప్రభాకర్ భార్య మాటల్లో అతడు  ఏ చీకుచింతా లేకుండా స్నేహితులతోనే గడుపుతూ ఇంటి ముఖం మరిచి తిరిగే బలాదూరు అని తెలుస్తుంది. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే అతడికి పెళ్ళయింది. అయినా సరే కధీర్ మరొక అమ్మాయితో రొమాన్స్  చేసేందుకు ఏమాత్రం సిగ్గుపడడు. అటుపై అక్కడి నుండి బారుకు చేరుకొన్న కధీర్‌ను పేకాటలో ఆటపట్టించడంతో పట్టలేని ఉక్రోసంతో ఆట నెగ్గి  బదులుకు వారిని ఆట పట్టించి, నోరుజారి బారు ఓనర్ చేతిలో చెంపదెబ్బ తిని  బయటకొచ్చి ఏడుస్తూ  వాడేమైన పెద్ద తోపా అంటూ గోడకు బాధ చెప్పుకొని ,అటుపై అక్కడ బయట పోలీసులతో తలతిక్కగా మాట్లాడి అక్కడ పోలీసులతో దెబ్బలు తిని అరెస్టు అవుతాడు. అటుపై అటు వైపు వచ్చిన  ప్రభాకర్ యధేచ్చగా అక్కడ ఉన్న కదీర్ ను  చూసి  తన పలుకుబడితో మంచిగా  అక్కడ నుండి  బయటకు తీసుకు వస్తే పోలీసులు తను పేకాటలో గెలిచిన డబ్బులు తిరిగి ఇప్పించామంటాడు. పై మూడు సన్నివేశాల ద్వారా అతడు  కొంచెం తెలివైనవాడే అయినా అనవసరమైన మాట దురుసుతనం,అసూయ, తలబిరుసు ,కొంచెం అతి తెలివి తనం,వెటకారం, చేతకాని తనం వంటివి  అతని ప్రవర్తనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ఇంటికి చేరగానే బార్యతో రొమాన్స్, అటుపై ప్రభాకర్ను వెంటబెట్టుకొని వాళ్ల దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఆసుపత్రిలో చెకప్ కి పంపి అక్కడ భార్యను కైపుగా చూస్తుండడంతో ఆమె ఇక ఇది తప్ప వేరే ధ్యాసే లేదా నీకు అంటే ఈ వయస్సులో ఇది తప్ప వేరే ఏమిటే ధ్యాస ఉంటుంది అనడంతో అతడి తీరు ఏమిటో మనకి అప్పటికే అర్దమయి పోతుంది. ప్రభాకర్ తనకు తెలిసిన inspector వద్ద మాట్లాడి అతడికి  అందులోనే inspector కు సహాయకారిగా ఉండేలా పని ఏర్పాటు చేస్తాడు. దీంతో మొదటి ముప్పై నిముషాలకి కావలసిన setup (పాత్రలు, వాటి ఉద్దేశ్యం, కథాగమనం ) చాలా నీట్ గా రూపొందించబడి ఉంటుంది.
              అటుపై కధీర్ తన తెలివి,అతి చొరవతో మెల్లమెల్లగా ఆ పనిలో అందరికి చేరువై, అలాగే inspector సౌందర పాండియన్ వద్ద నమ్మకస్తుడిగాను మన్నలను పొందుతాడు. సరిగ్గా కథ 40 నిమిషంలో తనను బార్ లో కొట్టిన బార్ ఓనర్ తమ్ముడు శంకర్ పిలుపుతో వెళ్లగా అక్కడ అతడు కధీర్ కు  గత పరాభవం గుర్తు చేసి ఆట పట్టించడంతో అతనిపై కోపం.ఇదే కథలో మొదటి ప్లాట్ పాయింట్.  అలాగే అటువైపు వచ్చిన వేరొక పరిధి  inspector మది అరసన్ తో వాగ్వాదం జరుగగా తను department మనిషినే అని చెప్పినా వినకుండా అతడిని జీపు ఎక్కించి స్టేషన్ కు తీసుకెళతాడు. దీనికి కారణం అంతక మునుపే ఇద్దరి inspector లకు మధ్య పచ్చ గడ్డివేస్తే భగ్గుమనేలా వైరం. అదే కదీర్ పై చూపిన కోపానికి గల  కారణం. తనకు జరిగిన ఈ రెండు పరభావాలకు ప్రతీకారంగా తన inspector వద్ద అక్కడ బార్ లో జరిగే gambling గురించిన సమాచారాన్ని చెవిలో వేస్తాడు కధీర్. అదంతా విన్న ప్రభాకర్ ఇద్దరికీ ముందే వున్న వైరం, ఆ ఏరియా inspector మది అరసన్ కు, బార్ ఓనర్ కి మధ్య వున్నా సంబంధం గురించి విడమరిచి చెప్పి పెద్దల విషయాలలో జోక్యం కల్పించు కోవద్దని కధీర్ ను హెచ్చరిస్తాడు. అటుపై inspector సౌందర పాండియన్ తన పరిధి కాదని తెలిసి కుడా బార్ పై రైడ్ చేసి అక్కడ బార్ ఓనర్ తమ్ముడు శంకర్ పై చెయ్యి చేసుకొని ,అక్కడ పెద్ద మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకుంటాడు. బార్ ఓనర్ తొత్తు అయిన మరో inspector మది అరసన్ ఇందులో కలగ జేసుకుంటాడు. ప్రభాకర్ కధీర్ కు పోన్ చేసి జరిగిన రైడ్ గురించి,తనకు అవసరం లేని విషయాల్లో కలిగించుకోవద్దు అని వారిస్తాడు. అటుపైన ప్రభాకర్ కధీర్ ను కలిసి ఇకపై ఇలా చెయ్యొద్దు, నువ్వు ఆకతాయితనంగా ఇద్దరి inspector  ల మధ్య గొడవ రేపావు.దీనితో రేపు internal inquiry వరకు వెళ్ళే అవకాశం వుంది. ఈ పోలీసు ఈ క్రిమినల్సు అంతా పెద్ద వ్యవస్థ ,దాని ముందు మనమంతా సాదారణ దుమ్ము లాంటి వాళ్లం అని వారిస్తాడు. ఆపైన ఇద్దరు తమ బండిలో ప్రయాణ మావుతుండగా  కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరిని తరుముతుండగా ప్రభాకర్ కధీర్ ను తప్పించి తన ప్రాణాలు కోల్పోతాడు, ఇక్కడే ఇంటర్వెల్.
                    కధీర్ తను వెంట వుండి కూడా చేతకాని వాడిలా వ్యవహరించానా అనే పశ్చాతాపంతో కుమిలి తనకు గుర్తున్న నిందితుల వివరాలు చెబుతాడు. కోర్టులో విచారణ , అక్కడ ఆ నిందితుల స్థానంలో వేరే ఐదుగురు వుండడం , అసలు నిందితులు కోర్టు ఆవరణలో ఉండడం చూసి స్తంభించి పోతాడు. మరో ప్రక్క ఇద్దరు inspector  లకు మధ్య  internal inquiry, inspector మది అరసన్ ను సస్పెండ్ చేస్తారు. ఇద్ద్దరు వ్యక్తులు టీ కొట్టు వద్ద మాట్లాడిన మాటలు కధీర్ మనసులో మరింత కలవరం రేపుతాయి. తన వెనుక  ఏదో కుట్ర జరుగుతుంది అని మాత్రం తెలుస్తుంది.ఇక్కడే రెండో ప్లాట్ పాయింట్ వస్తుంది. అటుపై అతని అంతరాత్మ అతడిని మరింత కలవర పెడుతుంది. ప్రభాకర్ కు జరిగినట్టు గానే తనకు ఏదో పెద్ద ఆపద పొంచి వుందని కధీర్ గ్రహిస్తాడు.తానిచ్చిన సమాచారాల మూలంగానే ప్రభాకర్ ను చంపారని , నన్ను అలాగే చంపుతారు అని అనుకుంటాడు. ఎవరో తనని నీడలా వెంటాడుతున్నారని  గ్రహిస్తాడు. తనకు అవసరం లేని విషయాలలో కలిగించుకున్నామేమో నని అనుకుంటాడు. ఇందులో కధీర్ వెంట పొంచి వున్నా ప్రమాదమేమిటి ,దాని వెనుక ఎవరెవరి హస్తం వుంది. కధీర్ దానిని గుర్తించాడా , దానికి ఎలా వ్యవహరించాడు అన్నదే మిగాతా కథ.
             చిత్రంలో నటీనటులందరూ బాగా నటించారు. ముఖ్యంగా కథానాయకుడు కధీర్ . నటుడిగా అతడికిది రెండో చిత్రమే అయినా అతని హావభావాలు ఆకట్టుకుంటాయి. అటుపై  ప్రభాకర్ పాత్రదారి చార్లీ , కధీర్ మిత్రులుగా నటించినవారు ఆకట్టుకున్నారు.
      సాంకేతిక విషయాల జోలికి వస్తే ఇందులో ముందుగా చెప్పుకోవలసింది దర్శకుడు అను చరణ్ గురించి. ఎందుకంటే ఈ కథ,కథనం, దర్శకత్వం తో పాటు కూర్పు కూడా ఆయనే, చాలా ఖచ్చితంగా ఉంటుంది అతని ఎడిటింగ్.ఈ చిత్రంలో కాక్కముట్టై దర్శకుడు మణికండన్ బాగస్వామ్యం కూడా వుంది.అతడికి కూడా కథ,కథనం,సంభాషణలలో భాగం వుంది. ఇక ఈ చిత్రానికి మరో రెండు ప్రక్క బలాలు నేపధ్య సంగీతం , చాయాగ్రహణం . సంగీత దర్శకుడు  కే నిజంగా సన్నివేశాలకు   నేపధ్య సంగీతంతో ప్రాణం పోసాడు.
                  ఈ సినిమా గురించి ఇంత ఇదిగా చెప్పేందుకు కారణం ఒక కథలో కథనం ఎలో ఉండాలో అన్నదానికి ఇది ఒక చక్కని మాదిరి అని చెప్పొచ్చు. కథానాయకుడు అతని పాత్ర, ఇతర పాత్రల తీరుతెన్నులు. ఒక కథనం structure ఎలా ఉండాలి వంటి విషయాలు, ముఖ్యంగా కథానాయకుని వ్యహార శైలి, పాయింట్ ఆఫ్ వ్యూ వంటి విషయాలు చాలా నీట్ గా రూపొందించబడి ఉంటాయి. తక్కువ వ్యయంలో ఓ చిత్రం తియ్యడం ఎలాగో ఇది చూస్తే అవగతమవుతుంది.ఇందులో క్లైమాక్స్ బలహీనమని కొంత మంది వాదించవచ్చు. కాని నిజానికి అదే సరి. ఎందుకంటే అదే యదార్ధం గనుక. ఇంకొకటి  అదేమీ తెలుగు సినిమా కాదు, హీరో ఫైటింగ్స్ చేసి నెగ్గుక్కు రావడానికి. అసలు కథనం యొక్క structure ఎలా వుంటుందో తెలుసుకొనేందుకు ఈ చిత్రం దోహద పడుతుంది.
              అయితే ఒకసారి నాకు ఒక దర్శకునికి మధ్య జరిగిన సంభాషణలో ఒక సినిమాను కేవలం కథ,కథనాలను మాత్రమే ప్రమాణంగా తీసుకొని విమర్శించకూడదు.ఒక్కోసారి ఆ కథకు ఆధారమైన పాయింట్‌ను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అలా చెప్పదలచుకున్న పాయింటే తప్పుగా ఉంటే అది ఎంత గొప్ప కథనమయినా సరే బోల్తా కొడుతుంది అని. నేని సమీక్ష ఆరంభంలో చెప్పిన మొదటి వాక్యాలే నాకు మళ్లీ చెప్పారు.
              ‘ప్రతి సమస్యకు ఎదురు వెళ్ళే పరిష్కరించాలనే ఆవశ్యకత ఏమి లేదు. కొన్ని సార్లు తప్పుకోవడానికి పేరే గెలవడం అంటే.మన ఉనికిని మనం కాపాడుకోవడానికి కొన్ని సందర్భాలలో మనల్ని మనం  తగ్గించుకోవడం  తప్పేమీ కాదు.’
           మన దైనందిన జీవితంలో మన చుట్టూ వుండే మనుష్యులు నిత్యం చేసేదే అది(సమస్యలకు తలవంచి పోవడం). దానిని మళ్లీ ప్రత్యేకించి సినిమాగా తీసి చెప్పాలా. సినిమా అనేది కేవలం మనం ఏం చెప్పదలచుకున్నాం అనేది మాత్రమే కాదు. కొన్నిసార్లు మన భావాలను సమాజంపై వ్యక్తపరచడం కూడా. కథగా మనం దేన్నయినా చెప్పొచ్చు, అయితే దాని ప్రభావం ఆరోగ్యవంతంగా ఉండలే తప్ప, నీరు కార్చేదిగా ఉండకూడదు. ఇందులో దర్శకుడు చేసింది అదే, ఏమి చేతగాని వారిలా సమస్యలకు తలొగ్గితేనే మనుగడ సాగించగలం అనేది, చవటల్లాగా ఉండాలనేది పరోక్షంగా అతడు సమాజానికి ఇచ్చే తప్పుడు సంకేతం, అందువలనే సినిమా అంతా బాగున్నప్పటికి ఆఖరిలో చెప్పిన ముగింపే సినిమా కొంప ముంచింది, ఫలితం తల్లక్రిందులైంది అని చెప్పారు.(దాని అర్ధం భారీ ఫైట్లు చేసి ప్రత్యర్దులతో తలపడడం అని కాదు.)
          ఆయన చెప్పిన విషయం అవగతం అయినప్పటికి అది ఎంతవరకు సమంజసం అనేదే తెలియ లేదు. అలాగని ఆయన చెప్పిన విషయంలో కొంత నిజం కూడా లేకపోలేదు.అలాగే విమర్శకుల ప్రశంసలు అందుకున్న మాట నిజమే మరి. ముగింపు విషయం ప్రక్కన పెడదాం, ఏదయితేనేం ఓ మంచి చిత్రం చూసాం అనే అనుభూతి కావాలనుకుంటే ఓ సారి ప్రయత్నించండి.
6 Comments
  1. venkat Balusupati May 3, 2017 /
  2. siva May 18, 2017 /
  3. srinivas May 24, 2017 /
  4. బి. పవన్ కుమార్ May 30, 2017 /
  5. l.hanimireddy July 15, 2017 /