Menu

‘కోర్ట్’ సినిమా- కొన్ని ఖాళీలు!

కోర్ట్ – మరాఠీ సినిమా గతంలో చూసిన వెంటనే నాకు వెంటనే ఇలా అనిపించింది:

Form కి, Technique కి సంబంధించి కళాఖండం అనడానికి ఏమాత్రం సందేహపడనక్కర్లేని ఈ సినిమాని చూస్తున్నంత సేపూ మనసులో మెదిలింది- డా. రామ్ మనోహర్ లోహియా! భారతీయ న్యాయ వ్యవస్థలో అంతర్నిహితంగా నిలిచి కరుడుగట్టిపోయిన వర్ణవ్యవస్థ పట్ల లోహియా ఏవగింపు, ఆ వ్యవస్థలోని Status-quo ని సదా రక్షించే న్యాయమూర్తుల మీద ఆయన ఛీత్కారం ‘కోర్ట్’ సినిమాలో subtle గానే కావొచ్చు- అడుగడుగునా కన్పిస్తాయి.

Preamble అనే పదానికి చట్ట, న్యాయశాస్త్ర పరిభాషలో ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. జడ్జి కుర్చీలో ఉన్న వ్యక్తి మెదడులో హఠవాదం వంటి ఒక preamble తిష్టవేసి కూర్చుంటుంది: నిచ్చెనమెట్ల వ్యవస్థలో అట్టడుగున ఉన్న కడజాతి వారు కచ్చితంగా నేరస్థులే; burden of proof ని భుజాన మోయవల్సిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ – దాన్ని ముద్దాయిల మీదకి నెట్టేయడాన్ని కూడా అడ్డుకోనివ్వని preamble.

అటువంటి నేపథ్యంలో నారాయణ కాంబ్లే పదే పదే అరెస్టు కావల్సిందే…

ఎక్కే మెట్లూ… దిగే మెట్లుగా కోర్టుల చుట్టూ తిరగవల్సిందే!

** ** **

సుమారు ఏడాది తర్వాత ఇప్పుడు:

(ఆ సినిమాకి సంబంధించిన నా immediate impressionsలో కొంత impulsive తొందరపాటు తోచింది తర్వాత. సినిమా చూసి బయిటకు వచ్చిన వెంటనే అదృశ్యమైన పొగలా ఆవరించి ఉండే అభిప్రాయాలు, కొంచెం కాలం గడిచేటప్పటికి చెదిరి, తేటబడే అవకాశం ఉందేమో. కొన్ని పునశ్చరణల వల్ల, అభిప్రాయాన్ని మళ్లీ తరచి చూడటం వల్ల కాబోలు ‘కోర్ట్’ సినిమాకి సంబంధించి, అంతకు ముందు తోచని అనుమానాలు కొన్ని ఖాళీలు ఏర్పడ్డాయి లోపల. ఆ సినిమా చూసిన వారినే ఇక్కడ ఉద్దేశిస్తున్నాను కాబట్టి, ‘కోర్ట్’ కథాంశాన్ని సంక్షిప్తంగా కూడా ప్రస్తావించబోవడం లేదిక్కడ)
అద్దంలో ప్రతిబింబించే కుడిఎడమల తేడాలు కూడా లేనంత నిబద్ధంగా వాస్తవికతను ప్రేక్షకుల ముందు కొన్ని దృశ్యాలుగా ఆవిష్కరించే ప్రయత్నం చేసినట్టుగా దర్శక- రచయిత Chaitanya Tamhane ప్రశంసలు పొందాడు. మనకు కథ చెప్పే ముందే దాన్ని దర్శకుడు చూసి, విశ్లేషించుకొని, తన అవగాహనకు సరిపోయిన కళ్లద్దాలు మనకి తొడిగి చూపించడం ఒక పద్ధతి. అలా కాకుండా, జరుగుతున్న కథని మనతో పాటే దర్శకుడు కూడా చూస్తున్న భావన కలిగించడం మరో టెక్నిక్కు. ‘కోర్ట్’ సినిమాకు ఈ పద్ధతినే దర్శకుడు ఎంచుకున్నాడని అన్నారు సినీవిమర్శకులు. మహా అయితే, ప్రేక్షకులు కొన్నింటిని overlook చేయకుండా వాటి మీద టార్చిలైటు వేస్తే వేసుండొచ్చని సర్దిచెప్పారు. చాలా నిర్మమత్వంతో, బహు తాటస్థ్యంతో సన్నివేశాల్ని పేర్చుకుంటూపోతూనే, అవ్యవస్థ మీద తన నిరసన, అధోజనుల అవస్థ పట్ల ఆవేదన, ప్రగతిశీల శక్తులతో తన సంఘీభావం వెలిబుచ్చగలిగాడని మెచ్చుకున్నారు. ఆ subtlety యే కళాకారుడిగా తన విజయమన్నారు.

సినిమా చూసిన వెంటనే నాక్కూడా నిజమేననిపించింది; తర్వాత ‘నిజమేనా?’ అనిపించింది. ఈ రెండు స్థితుల మధ్య నా ఆలోచనలు ఎక్కువగా, అందులోని పాత్రలకు, వాటి ఔచిత్యాలకూ సంబంధించినవే.

ఇందులో పాత్రలు:
ప్రజా గాయక-కవి నారాయణ్ కాంబ్లే, ఆయన తరఫు డిఫెన్సు లాయర్ వినయ్ వోరా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నూతన్, న్యాయమూర్తి సదావర్తె, సఫాయీ కార్మికుడు వాసుదేవ్ పవార్, అతని భార్య షర్మిలా పవార్. నా మౌలిక సందేహం ఏమిటంటే- ఇందులో ‘రసాసృఙ్‌మాంసమేదోఽస్థిమజ్జాశుక్రా’దులతో కదిలే పాత్రలేవి? వ్యవస్థలకి, భావజాలాలకీ ప్రతినిధుల్లాంటి పాత్రలేవి?

ఈ సినిమాకు నిర్మాత (Vivek Gomber) కూడా అయినందువల్ల, ఆయన పోషించిన వినయ్ వోరా పాత్ర:
ఇతని తండ్రి ముంబైలో ఉంటున్న గుజరాతీ ఎగువ మధ్యతరగతి ప్రజలకు ప్రతినిధి. Typical గుజరాతీ అలవాట్లూ… ఆలోచనలూనూ; గుజరాతీయులకే పరిమితమైన అపార్టుమెంటులో ఉంటాడు, వచ్చిన అతిథుల ethnic identity కచ్చితంగా కనుక్కుంటాడు. కానీ, వినయ్ వోరా అటువంటి పోతపోసిన భావాల ప్రతిమ కాడు- మనిషి! అభ్యుదయ భావాలున్నవాడు, మానవహక్కుల కార్యకర్త, marginalised దళితుల, మైనారిటీల తరఫున పోరాడతాడు; తన క్లయింట్ బెయిల్ కోసం లక్ష రూపాయలు పూచికత్తు కట్టడానికి కూడా వెనకాడని వాడు; మురికి వెలివాడలకు కూడా ఎంతమాత్రం సంకోచం లేకుండా వెళ్తాడు, పాకీ మనుషులతో కూడా empathetic గా ఉంటాడు, అదే సమయంలో ఆచారాల్లో హేతుత్వాన్ని ప్రశ్నించే ఆధునికుడు కూడా. ఎంత సాంఘికుడో… అంత ఏకాంతుడు. బార్లు, స్నేహితురాళ్లు, ఫేషియల్స్ అన్నీ ఉన్న కులీనుడు. అథోజగత్తుతో మమేకమౌతాడే గానీ, స్థానికమైన మరాఠీ భాష రాదు. మనిషి కనుకనే అతనిలో కొన్ని వైరుధ్యాలూ, మరి కొన్ని పరిమితులూనూ.

ప్రజా గాయక-కవి నారాయణ్ కాంబ్లే-
ఈ పాత్రకూడా ఒక ప్రత్యామ్నాయ ప్రగతిశీల భావజాలానికి ప్రతినిధి, ఒక వైతాళిక స్వరం. చిన్నపిల్లలకి ట్యూషన్లు చెప్పుకోవడం, నానా అగచాట్లు పడి పుస్తకాలు అచ్చు వేయించడం, సిటీబస్సుల్లో తిరిగి వాడవాడలా పాటలు పాడటం, సాటి స్వాప్నికులతో సంబంధ బాంధవ్యాలు నెరపడం, దారిద్ర్యం, దాని వల్ల అనారోగ్యం అనుభవిస్తూ కూడా వినయ్ వోరా డబ్బులు కట్టాడంటే అభిమానపడటం అన్నీ ఒక ప్రతినిధికి సంబంధించినవే.

ఆ అభ్యుదయ వ్యవస్థని నిర్బంధించే వ్యవస్థలకు ప్రతినిధులు- సదావర్తె, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నూతన్, పోలీసు అధికారి.
సదావర్తె పాత్ర:

న్యాయమూర్తులు Gaonkar, Sarpotdar ల కంటే, సదావర్తె మరింత వేగంగా కేసులు పరిష్కరిస్తున్నారని బార్ రూములో చెప్పిస్తాడు, దర్శకుడు. న్యాయవాదుల మధ్య ఆ సంభాషణని పట్టించుకుంటే, ఆ మూడు ఇంటి పేర్లూ మరాఠీ బ్రాహ్మణులవి కావడం చేత, సదావర్తె ని ఒక బ్రాహ్మణీయ తీర్పరి వ్యవస్థకి ప్రతినిధిగా దర్శకుడు నిలిపాడనుకోవాలి.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ నూతన్ పాత్ర: శ్రీశ్రీ వ్యత్యాసంలో రాస్తారు- “మంచికీ చెడ్డకీ నడుమ/ కంచుగోడలున్నాయి మీకు/ మంచి గదిలోనే/ సంచరిస్తాయి మీ ఊహలు./ ఇదివరకే ఏర్పడిందా గది./ అందుకే వడ్డించిన విస్తరి మీ జీవితం./ నిశ్చల నిశ్చితాలు మీవి./ మంచిని గురించి,/ మర్యాద, మప్పింతం గురించి,/ నడతా, నాణ్యం, విలువల విషయం/ నిశ్చలం నిశ్చతాలు మీవి./ మీ కన్నుల చూపులు సరళ రేఖలో!/ రేఖ చెదిరితే గొల్లుమని పోతారు./ రేఖ కవతలి వారంతా నేరగాళ్ళు./ రేఖను రక్షించడానికే/ న్యాయస్థానాలు, రక్షకభట వర్గాలు, చెరసాలలు, ఉరికొయ్యలు…”
– రేఖకి ఇటు ఉన్న సగటు మధ్యతరగతి భావాలకు ప్రతినిధి- నూతన్. అందుకే, రేఖకి అవతల ఉన్న కాంబ్లే నేరస్థుడిగా కనబడటంలో వృత్తి కంటే ప్రవృత్తే కారణమని దర్శకుడు చెప్పదల్చుకున్నాడు.

ఇక మనకు కనిపించని సఫాయీ కార్మికుడు వాసుదేవ్ పవార్, కనిపించే అతని భార్య షర్మిలా పవార్ కూడా బడుగు బలహీన బహుజనుల ప్రతినిధులు.

అయితే, ప్రతినిధుల వంటి పాత్రల నిర్వహణలో దర్శకుడు ఔచిత్యం తప్పాడని నాకు అనిపించింది. వినయ్ వోరా వంటి ఆదర్శమైన, సజీవమైన వ్యక్తిని ప్రేక్షకుల ముందు నిలపడంలో చూపిన నిజాయితీ, సదావర్తె, నూతన్ విషయాల్లో చూపలేదనిపిస్తోంది. సదావర్తె, నూతన్ ల వెనక కెమెరా పట్టుకొని వెళ్లినట్టు కనిపించాడు, కానీ, తనకు కావల్సిన మాటలు…. సందర్భాలూ కుదిర్చాడు.

ఉదాహరణకి- సదావర్తె ఇప్పుడు న్యాయమూర్తి కాడు- ఒక కుటుంబ పెద్ద, బంధుమిత్ర సపరివారానికి మార్గదర్శి. ఆటగాడు… అంత్యాక్షరీ పాటగాడు. ఒక మూగ పిల్లవాడి అనారోగ్యానికి మందుగా, న్యూమరాలజీ ప్రకారం పేరు మార్పిడి, జెమ్మాలజీ ప్రకారం ఉంగరపు రాళ్ల రంగుల్నీ మార్చమని సలహాలిచ్చే పాతచింతకాయ పచ్చడివాడు. దర్శకుడి అదృష్టవశాత్తూ, సదావర్తె typical బ్రాహ్మడిలా ప్రవర్తించాడు కాబట్టి, దర్శకుడు ఉద్దేశించిన మూసలో ఒదిగిపోయాడు. అలా కాకుండా, వంద వైరుధ్యాలుండే మామూలు మనిషిగా ప్రవర్తించి ఉంటే దర్శకుడి ఉద్దేశానికి చిక్కుముడి పడి ఉండేది. నిలువెల్లా బ్రాహ్మణీయ ఆభిజాత్యం నిండి ఉండి కూడా, ఆచారాలని, సంప్రదాయాల్నీ ఛాదస్తాలుగా దునుమాడే కొందరు ఆధునిక దూర్వాసుల కోవకు సదావర్తె చెందినవాడైతే దర్శకుడి నిరూపించదల్చుకున్నది సాధ్యపడేది కాదు.
ఇక నూతన్ విషయంలో కూడా, మరాఠీయేతరుల పట్ల సగటు మరాఠీలకు ఉండే తృణీకారాన్ని establish చేయడానికి ఒక (అప)హాస్య నాటికను వాడుకున్న దర్శకుడు, మరింత ఉత్సాహంతో ఆమె వెనక లోకల్ ట్రైనులో, పిల్లాడి స్కూలులో, చివరికి ఆమె వంట్లోకి కూడా చొరబడ్డాడు. కేవలం కొన్ని భావజాలాలకు ప్రాతినిధ్యంగా ఉంచాలంటే నూతన్ స్థానంలో మగవాడ్ని కూడా ఉంచొచ్చు. కానీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్థానంలో స్త్రీని ఉంచడం ద్వారా, ఆ పాత్రని మరింత తగ్గించి మరీ తన వాదాన్ని గెలిపించుకోవాలని దర్శకుడు వెంపర్లాడాడేమో అనిపిస్తుంది. ఈ పాత్రలు, పోలీసాయనతో సహా, మూస పోసినట్టే ఉంటాయి. కాంబ్లే మీద వ్యక్తిగత కక్ష ఉండటం గానీ, ఆ కక్ష తీర్చుకోడానికి out of the rule book వెళ్లాలని గానీ అనుకోరు. పుట్టుక వల్ల వచ్చే సద్గుణాల నుంచో… దుర్గుణాల నుంచో బైటబడి వినయ్ వోరా లాగా మనిషితనం(‘మంచితనం’కి పర్యాయపదం కాదు)తో వ్యవహరించే పాత్రలే అయినట్టైతే, సదావర్తెలో కుత్సితం, లేదా విశాలత్వం, నూతన్ లో లంచగొండితనం, లేదా అభ్యుదయం – ఏదైనా.. లేదా, కొన్నిసార్లు రెండూ కలగలిసిపోయి రకరకాల shadesలో బైటపడాలి; అప్పుడే కదా వాస్తవికత- సహజత్వం!

చదరంగంలో రెండువైపులా తానే ఆడేసే ఆటగాడి చేతిలో పావులుగా పాత్రల్ని చేసుకున్నప్పటికీ, దానికి పూర్తి భిన్నంగా సహజత్వానికి చేరువగా, వాస్తవికతకు అతి దగ్గరగా, సమాజాన్ని ఒక సృజనాత్మక తాటస్థ్యంతో తరిచిచూసినట్టుగా కొనియాడబడ్డాడేమిటీ- కోర్ట్ సినిమా దర్శక- రచయిత: Chaitanya Tamhane???!!!

– నరేష్ నున్నా

One Response
  1. Anon February 10, 2017 /