Menu

సినిమాని సినిమాగా చూడడం

పాట పాడుకుంటే సినిమా పాటే అవుతోంది, మాటలో చమత్కారం దొర్లితే సినిమా నుంచి రిఫరెన్స్ ఉంటోంది, సరదాగా ఎక్కడికైనా వెళ్ళబోతే చాలాసార్లు సినిమానే అవుతోంది, సెలబ్రెటీల లిస్టు చెప్పమంటే పదిమందిలో కనీసం ఆరేడుగురు సినిమావాళ్ళే ఉంటారు. మన నిత్యజీవితంలో ఇంతగా ప్రభావం చూపిస్తున్న సినిమా, నిజానికి మనలో ఎలాంటి ఆలోచనలు విత్తుతోంది, ఎటువంటి అభిరుచులు మప్పుతోంది, ఏమేం ధోరణులు చెప్తోందని పరిశీలించబోయిన ప్రతివారికి రెడీగా ఎదురయ్యే సమాధానం – సినిమాని సినిమాగా చూడండి.

ప్రపంచవ్యాప్తంగా సినిమా అనే మాధ్యమాన్ని చాలా లైట్ గా మాత్రమే తీసుకోకుండా దాని వెనుక ఉన్న నేపథ్యం, అది చూపించే ప్రభావం వంటివి అధ్యయనం చేయడం ఎప్పటి నుంచో ఉంది. విశ్వవిద్యాలయాల్లో ఫిల్మ్ స్టడీస్ అన్నది చాలా ప్రాచుర్యం పొందిన సబ్జెక్టు. అత్యంత ప్రభావశీలమైన ఈ దృశ్యమాధ్యమం ఏం చెప్తోంది, ఎలా చెప్తోంది అన్నది తెలుసుకోవడం వల్ల ప్రజల ఆలోచనల్లో, అభిరుచుల్లో వచ్చిన మార్పులు, సాంఘికంగా జరుగుతున్న పరిణామాలు తెలుస్తాయి.

ఇలా చెప్తూంటే బహుశా చాలామందికి శంకరాభరణం, మా భూమి, మల్లీశ్వరి లాంటి కళాఖండాల గురించి మాట్లాడుతున్నానేమో అనిపించవచ్చు. ఐతే సినిమా సమాజంలోని ధోరణులు ప్రతిబింబించడం (మంచీ చెడూ రెంటినీ), మార్పులకు దారివ్వడం చాలావరకూ పక్కా కమర్షియల్ అనుకునే సినిమాల్లో కూడా చూడొచ్చు. కొన్ని పరిశీలనలు కావాలంటే – ఒకే డైరెక్టర్ తీసిన సినిమాలు కొన్నిట్లో హీరోయిన్లను హీరోలు ఏడిపించడం, ర్యాగ్ చేయడం వంటివి కనిపిస్తాయి (ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఈమధ్యే వచ్చిన లోఫర్ సహా చాలానే ఉంటాయి), ఐతే మరోపక్క అవే సినిమాల్లో మంచి స్త్రీ పాత్రలు, వాటిని చాలా చక్కగా మలచడం కూడా కనిపిస్తుంది (అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, లోఫర్ సినిమాల్లో హీరో తల్లి పాత్రలు మంచి ఉదాహరణలు) ఈ వైరుధ్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే, చక్కగా ఓ దృక్పథంతో మలిచిన పాత్రల్లో తల్లి, చెల్లి(టెంపర్ లోనే చూస్తే లక్ష్మి పాత్ర) పాత్రలే ఎక్కువ కనిపిస్తాయి. ఇది నిజానికి తల్లిని, చెల్లిని గౌరవిస్తూ, మిగిలిన వాళ్ళతో అమర్యాదగా ప్రవర్తించే సమాజంలో కొందరు వ్యక్తుల ఆలోచనలకు అద్దంగా అనిపిస్తుంది.

అలానే 2003లో శివమణి సినిమా వచ్చింది. కథానాయకుడు శివమణి ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్. స్థానిక ఛానెల్ ఇంటర్వ్యూలో తన ఫోన్ నెంబరు అందరికీ చెప్పి, ఎవరైనా ఫోన్ చేసి చెప్తే చాలు నిమిషాల్లో యాక్షన్ తీసుకుంటానని మాట ఇస్తారు. అదే పద్ధతిలో ఫోన్ చేసిన నిమిషాల మీద ఈవ్ టీజింగ్ చేస్తున్న కుర్రాళ్ళని, ఇతర అసాంఘిక కార్యకలాపాలని జరుగుతున్న స్థలానికే వచ్చి తాటతీస్తూంటారు. ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు పోలీస్ ఇన్స్పెక్టర్లు బహిరంగంగా అప్పటికి కొత్తగా వస్తున్న సెల్ ఫోన్ నెంబర్లు అందరికీ ఇవ్వడం, చాలామంది పోలీస్ ఆఫీసర్లని వాళ్ళ చురుకైన ప్రవర్తన, అవినీతి రహిత విధానాల బట్టి శివమణి అని స్థానిక యువత, పత్రికలు పిలవడం చూసేవాళ్ళం. ఇది ప్రభావం ఐతే అంతకు సరిగ్గా రెండేళ్ళముందు 2001లో ఆంధ్రప్రదేశ్‌ పోలీస్ వారు మైత్రి అన్న ఉద్యమాన్ని సంస్థాగతంగా ప్రారంభించారు. పోలీస్ స్టేషన్లంటే జనం భయపడకూడదనీ, ప్రజలతో పోలీసులు మైత్రీభావంతో వ్యవహరించాలని దాని లక్ష్యం. ఐతే వెనువెంటనే నెరవేరిపోయిందనో, ఇప్పటికైనా పూర్తి అయిందనో అనలేం కానీ దాని ప్రభావం అది చూపించివుండొచ్చు. ఇదంతా సినిమాకి నేపథ్యంగా అమరి వుంటుంది.

దీనికి పూర్తి వైరుధ్యంతో లక్ష్మీనరసింహ సినిమా 2004లో వచ్చింది. సామి అన్న తమిళ చిత్రానికి ఇది రీమేక్. ఈ సినిమాలో హీరో నిజాయితీగా ఉద్యోగం చేసేందుకు ప్రయత్నించి భంగపడి, తిరగబడతాడు. ఇందులో చాలా సన్నివేశాల్లో హీరో చట్టానికి వ్యతిరేకమైనా తన అంతరాత్మకు, తను న్యాయమని నమ్మినదానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటూంటాడు. అందుకు పరాకాష్టగా తన వద్ద ఓ లైసెన్సు లేని రివాల్వర్ ఉంటుంది. అడ్డగోలుగా వచ్చేవాణ్ణి వాడి దారిలోనే వెళ్ళి ఎదుర్కోవాలని, చట్టం చాదస్తమని ప్రబోధిస్తూంటుంది. ఈ సినిమా కూడా మంచి హిట్టే అయింది. హీరో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ కావడం చాలా తెలుగు సినిమాల్లో కనిపిస్తూ వచ్చింది కూడా. ఐతే ఒక వ్యక్తి చట్టానికి విరుద్ధంగా తన అధికారాన్ని వినియోగించుకోవడాన్ని పరోక్షంగా సమర్థిస్తే అదొక విధానం అయిపోయి చివరకు బలహీనులను దుర్మార్గులని ముద్రవేసి బాధించేందుకు ఉపకరిస్తుందన్న మానవ హక్కుల ఉద్యమాల సిద్ధాంతానికి, సమాజంలో చట్టం సక్రమంగా పనిచేయనప్పుడు ఏం చేయాలన్న తుది లేని ప్రశ్నకీ మధ్య చర్చలో ఈ సినిమాలు కీలకమన్నది ఇక్కడ ముఖ్య విషయం.

ఇలా మన సమాజంలో, నడుస్తున్న చరిత్రలో భాగమైన సినిమా అనే కళారూపం దాన్ని ప్రతిబింబించి ప్రభావితం చేయడాన్ని తప్పించుకోలేదు. కానీ దేన్ని తప్పించుకుంటోందంటే – ఆ చర్చ చేసి, విమర్శకులు, విశ్లేషకులు, పరిశోధకులు ప్రశ్నించడాన్ని మాత్రం తప్పించుకో చూస్తూంది. ఎక్కువ ఆలోచించకండా ఎంజాయ్ చేయాలని, సినిమాని ఆస్వాదించడమే ప్రధానమనీ, వినోదం కోసమే తీశామని చెప్తూంటారు. అలానే సినిమా ఎలా చెప్తున్నారన్న శైలి పరమైన ప్రశ్న వదిలిపెట్టేస్తూంటారు. మొత్తానికి తను సృష్టించిన కళ, దాని ప్రభావాలను పట్టించుకోకుండా తప్పించుకునే బాధ్యతా రహితమైన కళగా సినిమా తయారవుతోంది. పదే పదే ఒక కులాన్ని హాస్యగాళ్ళుగానూ, మరో కులాన్ని, ప్రాంతాన్ని పరమ కిరాతకులుగానూ చూపించడాన్ని, స్టీరియోటైప్ సృష్టించడాన్ని ప్రశ్నించినప్పుడు దానికి అనుకూలంగానో, ప్రతికూలంగానో, సమర్థించుకుంటూనో మాట్లాడడం వేరు. ఇలాగైతే సినిమాలు తీయడం కష్టమనీ విమర్శనే దెబ్బతీయబోవడం వేరు.

తనను విమర్శకు పెట్టని, మెరుగుపరుచుకోని ఏ కళా బతికి బట్టకట్టదు. అందుకే ఇక నుంచైనా సినిమాని సినిమాగా చూడండి అన్న వాక్యం ఒకనాటికైనా తెలుగు సినిమా ప్రేక్షకులు, సినీ రంగానికి చెందినవారి నుంచి మాయమైపోయే రోజు రావాలి.