Menu

పెళ్ళిచూపులు (2016)

ఒక సినిమా ఓ ప్రేక్షకుడికి విపరీతంగా నచ్చిందంటే, ఖచ్చితంగా ఆ సినిమా అతడి నిజజీవితానికి దగ్గరగా వచ్చిందని అర్థం. అలాంటి సినిమానే “పెళ్ళిచూపులు”. షార్ట్ ఫిలిమ్స్ రూపొందించిన “తరుణ్ భాస్కర్” దర్శకత్వంలో “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్”, “ఎవడే సుబ్రమణ్యం” సినిమాలతో సుపరిచయమైన “విజయ్ దేవరకొండ”, “ప్రేమ ఇష్క్ కాదల్”, “ఎవడే సుబ్రమణ్యం” సినిమాలతో సుపరిచయమైన “రీతు వర్మ” జంటగా నటించిన ఈ సినిమాను “రాజ్ కందుకూరి”, “యష్ రంగినేని” నిర్మించారు. “సురేష్ ప్రొడక్షన్స్” సంస్థ మరియు “మధుర శ్రీధర్” ఈ సినిమాను ప్రేక్షకులకు అందించారు.

కథ :

నిరుద్యోగి అయిన ప్రశాంత్ (విజయ్), సొంతంగా బిజినెస్ చేసి ఎదగాలనే ఆశ ఉన్న చిత్ర (రీతు) పెళ్ళిచూపులలో పరిచయమవుతారు. కానీ అనుకోకుండా వారున్న గది తలుపు లాక్ అయిపోతుంది. ఆ తరువాత ఏమి జరిగింది అన్నది కథాంశం.

రచన – దర్శకత్వం :

ఇది అనవసరపు కమర్షియల్ హంగులు, విదేశాల్లో పాటలు, నమ్మశక్యం కాని పోరాటాలు ఇవేవి లేని సినిమా. కేవలం కథ, కథనాలనే నమ్ముకొని కోటి పైచిలుకు ఖర్చుతో నిర్మించబడ్డ పరిపూర్ణమైన సినిమా. మంచి కథ, కథనాలు, వాటిపై దర్శకుడికి పూర్తి అవగాహన ఉంటే సినిమా ఎలా ఉంటుందో చెప్పే సినిమా.

ఇందులో భారీ కథేమి లేదు. మనం మన జీవితాల్లో చూసిన మనుషులు, పరిస్థితులే ఉన్నాయి. ఇందులో, బాగా చదువుకొని కూడా కూతురు కాదు కొడుకే కావాలనుకునే ఓ అజ్ఞానపు తండ్రి ఉన్నాడు. కొడుకు జీవితం ఎలాగైనా బాగుపడాలని తాపత్రయపడే మరో తండ్రి కూడా ఉన్నాడు. మనతో కలిసి అల్లరి చేసే స్నేహితులు ఉన్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా మనం చేసే అల్లరి పనులు ఉన్నాయి. మనం ఇష్టపడిన వ్యక్తులున్నారు. జీవితంలో ఎదగాలని మనం కన్న కలలున్నాయి. అవి సాకారం కాక పరిస్థితులకు తలొంచినపుడు కలిగే బాధ ఉంది. “నువ్విక పనికిరావు” అని అందరూ నిందిస్తుంటే, “ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతున్నాను” అని చెప్పిన నమ్మకముంది. వదిలి వెళ్ళిపోయిన ప్రేమ, తప్పు తెలుసుకొని తిరిగొచ్చిన క్షమాపణ ఇలా ఎన్నో అంశాలున్న సినిమా ఇది. ఇవి చాలు ఈ సినిమా మనసుకు దగ్గరగా రావడానికి.

సినిమా నిడివి రెండు గంటలే. అందులో మొదటి గంట ఎలా సాగిపోతుందో ప్రేక్షకుడు గుర్తించలేడు. అంతగా నవ్వించి ఆకట్టుకున్నాడు దర్శకుడు. రెండో సగంలో అసలు కథను విప్పినప్పుడు మాత్రం కథనం నెమ్మదించింది. ఫీచర్ ఫిలింకి, షార్ట్ ఫిలింకి రచన విషయంలో ఇక్కడే తేడా కనిపిస్తుంది. సన్నివేశాలు రొటీన్ గా అనిపించినా తెలివిగా తొందరగా క్లైమాక్స్ కి వెళ్ళిపోయాడు దర్శకుడు. ఈ లోపాన్ని పూర్తిగా కప్పేసింది కౌశిక్ (ప్రియదర్శి) చెప్పిన “నా సావు నేను సస్తా, నీకెందుకు?” అనే మాట. ధియేటర్ నుండి బయటికి వచ్చిన ప్రేక్షకుడు ఈ మాటను పదే పదే గుర్తుచేసుకుని నవ్వుకునేలా ఉంది.

సింక్ సౌండ్ (Sync Sound) టెక్నాలజీ :

ఈ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. అదే “సింక్ సౌండ్” టెక్నాలజీ. మాములుగా, ఓ సినిమాకు షూటింగ్ చేసిన తరువాత డబ్బింగ్ చెప్పడం జరుగుతుంది. కానీ ఈ సినిమాకు అలా జరగలేదు. షూటింగ్ సమయంలోనే మాటలను రికార్డు చేశారు కానీ ఎక్కడా అలా చేసినట్టు అనిపించదు. అప్పట్లో, పవన్ కళ్యాణ్ “జానీ”, గౌతమ్ మేనన్ “ఎర్రగులాబీలు” సినిమాలకు ఇదే పద్దతిని అనుసరించారు కానీ వాటిలో షూటింగ్ సమయంలోనే మాటలను రికార్డు చేసినట్టు సులువుగా తెలిసిపోతుంది. ఇందులో అది తెలియకుండా దర్శకుడు తరుణ్ చాలా జాగ్రత్త వహించాడు. తెలివిగా పబ్లిక్ సన్నివేశాలన్నీ ఎవరు లేని ప్రదేశాల్లో చిత్రీకరించాడు. అందుకు అతడికి పూర్తి మార్కులు వేయాలి.

సంగీతం :

ఈ సినిమాకు సంగీతం కూడా పూర్తి సాయం అందించింది. “వివేక్ సాగర్” అందించిన పాటల్లో “చినుకు తాకే”, “రాలు రాగ పూలమాల” అనే పాటలు చాలా బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంది. ఇంతటితో ఆపేస్తే కూడా తప్పే అవుతుంది. ఈ సినిమాకు పాటలు కూడా షూటింగ్ అయిన తరువాతే రికార్డు చేశారని వినికిడి. ముందుగానే తీసేసిన సన్నివేశాలకు తగ్గ పాటలను కంపోజ్ చేయడం చాలా కష్టం. అప్పట్లో కమల్ హాసన్ “హే రామ్” సినిమా కోసం “ఇళయరాజా” ఇదే చేశారు. ఇప్పుడు ఈ సినిమా కోసం ఆ కష్టాన్ని దాటిన వివేక్ ప్రతిభను మెచ్చుకొని తీరాల్సిందే.

నటనలు :

ఖచ్చితంగా చర్చించాల్సిన విషయం. ఇందులో పేరుమోసిన నటులు ఎవరు లేరు కానీ ఉన్న ప్రతి నటుడి నుండి పాత్రకు సరిపడే పరిపూర్ణమైన నటనను రాబట్టాడు తరుణ్. ప్రశాంత్ పాత్రలో విజయ్, చిత్ర పాత్రలో రీతుల నటన చాలా సహజంగా ఉంది. మనకు రోజు కంటపడే వ్యక్తులే వీరు అనిపిస్తుంది. మరీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది “ప్రియదర్శి పులికొండ” గురించి. ఇతడు కూడా మన స్నేహితుడే. ఇతడి పాత్ర ఎంత సహజంగా ఉందో అంత సహజంగా నవ్వించేశాడు. ముఖ్యంగా, “టైం అంటే కౌశిక్, కౌశిక్ అంటే టైం” అని చెప్పే మాట మరియు పైన చెప్పిన మాట కడుపుబ్బా నవ్వించాయి. ఇతడికి బాగా సాయం చేశాడు అభయ్. ప్రశాంత్ తండ్రిగా చేసిన కేదార్, చిత్ర తండ్రిగా చేసిన గురురాజ్ పాత్రలకు న్యాయం చేశారు. ఇక అనీష్ కురువిల్ల చేసిన పాత్రకోసం కూడా దర్శకుడు బాగా శ్రద్ధ వహించాడు. అంతే శ్రద్ధగా చేశాడు అనీష్ కూడా. నందు ఆహార్యం, నటనలలో చాలా పరిపక్వత కనిపించింది.

నిర్మాణం :

ఒక షార్ట్ ఫిలిం మేకర్ కథను నమ్మి, “సింక్ సౌండ్” టెక్నాలజీని వాడి, పరిమిత ఖర్చులోనే ఎక్కడా ఆ పరిమితులు కనిపించని సినిమాను అందించిన నిర్మాతలు “రాజ్ కందుకూరి”, “యష్ రంగినేని”ల నిర్మాణ విలువలు సినిమాపై వారికున్న ప్రేమను చూపించాయి.

ముగింపు :

పెళ్ళిచూపులు అనే ఈ సినిమా బడ్జెట్ పరంగా “చిన్న” సినిమానే కావచ్చు కానీ అది పంచే ఆనందం పరంగా “పెద్ద” సినిమా. కొన్ని సినిమాలకు కథ, కథనాలతో పాటు తోటి ప్రేక్షకుడు కూడా ఎంతో ముఖ్యం. ఎలాగైతే “శంకరాభరణం” సినిమా పెద్దవారితో కలిసి చూస్తే నచ్చుతుందో, అలాగే ఈ సినిమా స్నేహితులతో కలిసి చూస్తే మరింత నచ్చుతుంది. ఒక మంచి అనుభూతితో ధియేటర్ నుండి బయటికి రావాలని, పెట్టిన టికెట్ ఖర్చుకి న్యాయం జరగాలని కోరుకునే ప్రతి ప్రేక్షకుడికి ఈ సినిమాను గట్టిగా సిఫార్సు చేస్తున్నాను.

– యశ్వంత్ ఆలూరు