Menu

నేను – RGV

నువ్వు చదవబోయేది మొత్తం నా self డబ్బా లాగ ఉండొచ్చు…”నీఇష్టం” మరి…నా గురించి ఆర్జీవీ గురించి ఒకే దాంట్లో ఎవరూ రాయరు కాబట్టి నేనే రాసుకుని పబ్లిష్ చేసుకుంటున్నాను… “డిజిటల్ విప్లవం వర్ధిల్లాలి”

సినిమాల్లోకి రావాలి అనుకున్నపుడు ఒక కోరిక ఉండేది రామ్ గోపాల్ వర్మ సినిమా కి కనీసం లైట్ man గా అయినా చేయాలి అని…

“Film industry” లోకి దూరటానికి ట్రై చేస్తున్న టైంలో ఆర్జీవీ దగ్గర పని చేయకూడదు…జస్ట్ ఆయన సినిమాలు చూసి excite అయి ఆనందపడిపోవాలి అని ఫిక్స్ అయిపోయా….

ఇంకొన్ని రోజుల్లో డైరెక్టర్ అయిపోతాం అనే confidence వచ్చాక ఆర్జీవీ తో మందు తాగాలి అంతే గాని పని చేయకూడదు అని ఇంకో fixation

2013 లో ఏం చేయాలో అర్ధం కాని  పరిస్థితి లో, నా ఫిక్సులు అన్నీ పక్కనపెట్టి  ఆయన దగ్గర “పట్టపగలు” కి జాయిన్ అయ్యాను… ఈ joining కి చందు హెల్ప్ చేసాడు… చందు గురించి ఒక చిన్న పుస్తకమే రాయొచ్చు… ప్రస్తుతానికి వదిలేస్తున్న….

చెన్నై నుంచి కెమెరామన్ వచ్చాడు, నేను చందు అతను కలిసి ఆర్జీవీ ఇంటికి బయలుదేరాం. నేను ఫస్ట్ టైం కలుస్తున్న, చూస్తున్న. ప్రతి కాబోయే దర్శకుడికి కనీసం ఇద్దరు ముగ్గురు “దర్శక దేవుళ్ళు” automatic గా తయారవుతారు, ఏం చేయలేం ఇదో రకం మూఢత్వం. అలా నాకున్న దేవుళ్లలో భయంకరమైన దేవుడు ఆర్జీవీ.ఎందుకంటే 13ఏళ్ళ లేత వయసులో నన్ను భయంకరం గా ఇన్ఫ్లుయెన్స్ చేసాడు కాబట్టి. హాల్లో వెయిట్ చేస్తున్నాం,కొన్ని రోజుల ముందే ఆయన కూతురు పెళ్లి జరిగింది అనుకుంటా…గడపకి తోరణాలు కట్టి ఉన్నాయి.. ఆయన వచ్చాడు ముగ్గురం లేచి నిలబడ్డాం,మధ్యతరగతి దరిద్రం,ఆయన ఫార్మాలిటీస్ వద్దు మొర్రో అంటే మనం వినం. నాకు ఆయన్ని రాము అని పిలవాలని చాలా కోరిక ఉండేది, పిలవలేం. రాగానే కెమెరా మెన్ తో డైరెక్ట్ టాపిక్ “how experimental are you with new cameras ?” నిత్య నూతనత్వం కోరుకునే మహానుభావుడు.

Cut to

కొంచెం సేపటి తరువాత ఆయన రెగ్యులర్ “dark” లొకేషన్ కి వెళ్ళాం,మాసబ్ట్యాంక్ లో apartment,పర్ఫెక్ట్ ఆర్జీవీ “దెయ్యాల కొంప” లా ఉంది ఆ అపార్ట్మెంట్. ఫ్లాట్ లోపలి వెళ్ళగానే ఏ సీన్లు ఎక్కడ తీయాలో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు ,ఒక లైట్ కూడా ఫ్లోర్ మీద ఉండకూడదు అంతా సోర్స్ లోనే ప్లాన్ చేసుకోవాలి,అవసరం అయితే లైట్ సోర్స్ ఎదో ఒక ప్రాపర్టీ నుంచి వాడాలి.

Cut  to

అరగంట తరువాత ఆఫీసులో ప్లానింగ్ మొదలైంది,ఆయన ఏవో ఇంగ్లీష్ సినిమాల రెఫరెన్సెస్ ఇస్తున్నాడు.పర్ఫెక్ట్ డాన్ setup లో ఉన్నట్టు ఉంది ఆయన ముందుPoster Designer అనిల్ వచ్చాడు,సింపుల్ గా లైన్ చెప్పేసి పోస్టర్ ఐడియా చెప్పమన్నాడు,అప్పటికపుడు అలా అడిగితే ఎవరైనా ఏం చెప్తారు?అనిల్ ఏదో చెప్తున్నాడు ఈలోపు ఫోన్ లో ఒక రిఫరెన్స్ చూపించి ఎలా షూట్ చేయాలి టైటిల్ ఎక్కడ ఉండాలి అన్నీ చెప్పేస్తున్నాడు ఆయనే. Next day ఫోటోషూట్ ప్లానింగ్ జరిగిపోయింది.నాకు కెమరామెన్ కి ఓపెనింగ్ సీన్ చెప్తే కృష్ణకాంత్ పార్క్ పర్ఫెక్ట్ అని చెప్పను,

                        ఆర్జీవీ

                     ” ఎంత దూరం?”

టెన్ మినిట్స్ పడుతుందని చెప్పా,

                                                                                                                 ఆర్జీవీ

                                                                                                            “లెట్స్ గో”

అని బయటకి నడవటం మొదలు పెట్టాడు, వెనకే అందరం.భాషాలో రజనీకాంత్ సీన్ లా అనిపించింది.స్కార్పియో లో ఫ్రంట్ సీట్ లో ఆర్జీవీ వెనక మేము,ఎలాంటి actors కావాలో చెపుతుంటే నేను కొంతమంది రిఫరెన్స్ ఇస్తున్నాను, వాళ్ళందరి ఫొటోస్ numbers సాయంత్రం కి వచ్చేయాలి.అసలు lag ఉండదు ఆయన పనిలో.మధ్యలో చందు ఎదో ఇంట్లో ఫంక్షన్ గురించి గుర్తు చేసాడు, ఆయన స్టయిల్లో “why do people celebrate” అన్న టైపు లో ఎదో కామెంట్ చేసాడు.పార్క్ రీచ్ అయ్యాము,దిగగానే ఒక ఫ్రేమ్ డిలే లేకుండా పార్క్ వెళ్ళిపోతున్నాడు ఆయన, వెనకే మేము.మళ్ళీ రజనీకాంత్.

అటు ఇటు తిరిగి పార్క్ ఎంట్రన్స్ నుంచి షాట్ ఎలా తీయాలో కెమరామెన్ కి చెపుతున్నాడు, అది fly cam shot, ఎక్కడో మొదలై చాలా దూరం ఫాలో అవుతూ వెళ్లి ఒక పొద లో రొమాన్స్ చేసుకుంటున్న కపుల్ దగ్గరి ఎండ్ అవుతుంది. ఆయన చేత్తో కెమెరా position చూపిస్తూ నడుస్తున్నాడు, పార్క్ లో ఉన్న ఒక 50ఏళ్ళ లేడీ ఆయన్ని చూసి ఎక్సైట్ అయి దగ్గరకు రావటానికి ట్రై చేసింది ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు,ఆమె నన్ను ఆపి ఆయన పేరు ఏదో శర్మ కదా అంది, కాదమ్మా ఆయన పేరు రామ్ గోపాల్ వర్మ, డైరెక్టర్ అని చెప్పాను,నాకు తెల్సు ఆయన డైరెక్టర్ అని, టీవీ లో చూసిన, మంచిగా మాట్లాడుతాడు అని పేరు చెప్పి తను కర్నూల్లో constableగా పని చేస్తున్నా అని పరిచయం చేసుకుంది.

(ఇంకా ఉందొ లేదో చెప్పలేను)