Menu

Sad Movies – విఫల ప్రేమకథలు.

ఎన్నో చిత్రాలలోనూ ,కథలలోనూ ,కావ్యాలలోనూ ఎన్ని విధాలుగా ఎంత చూసినా,ఎంత చదివినా , ఎంతగా విన్నా సృష్టిలో ఎప్పుడూ కొత్తగా అనిపించేది ప్రేమ. ఎన్ని సార్లు చెప్పినా ప్రేమెప్పుడు కొత్తగానే ఉంటుంది. నిజమైన ప్రేమేప్పుడు విషాదాంతంగానే’ ఉంటుంది. విషాదాంతమైన ప్రేమే చరిత్రలో నిలుస్తుంది.మన మనస్సులో చెరగని ముద్రను వేస్తుంది. అటువంటి కోవకు చెందినదే  ఈ చిత్రం కూడాను.

సాడ్ మూవీ నాలుగు విఫల ప్రేమకథలు.ఒక్కొక్క  కథ ఒక్కొక్క కోణంలో ఉంటుంది.నాలుగింట్లో ఒకటి మాత్రం తల్లికి బిడ్డకు మధ్య గల ప్రేమ.ఒక్కొక్క కథలోనూ ఒక్కొక్క భావోద్వేగం ఉంటుంది.నాలుగు కథలు సమాంతరంగా సాగుతుంటాయి. ముందుగా ఇందులో ఏ కథతో మొదలు పెట్టాలో తెలియలేదు.నాకు తోచినవి ఒక్కొక్కటిగా చెప్పుకొస్తాను.

ముందుగా తల్లికి బిడ్డకు మధ్యగల ప్రేమతో మొదలెడదాం. వాళ్ళమ్మ అంటే ఆ పసివాడికి ఎంతో ఇష్టం.కాని ఆమెప్పుడు ఆఫీస్ వ్యవహారాలతో తలమునకలై సాగడంతో పాపం ఆ పసివాడిని పట్టించుకొనే తీరికే ఉండదు.తన తోటి పిల్లల మాదిరిగానే తను తన అమ్మతో గడపాలని పరితపిస్తాడు.

ఇక రెండోది ఒక మూగ అమ్మాయి ఎప్పుడు బొమ్మల మాస్కులు వేసుకుంటూ  జీవనాధారం సాగిస్తుంటుంది. తను పనిచేసే చోట పెయింటింగులు వేసే ఓ చిత్రకారుని ప్రేమిస్తుంది. ఆ చిత్రకారుడు కూడా ఆమెను ఇష్టపడతాడు. ఆమె అసలైన రూపాన్నిఎలాగయినా చూడాలని ఉవిళ్ళురుతాడు. కాని ఆమె అతడితో దోబూచులాడుతుంది.

ఇక మూడవది ఆ మూగ అమ్మాయి యొక్క సోదరికి,అగ్నిమాపక దళంలో పనిచేసే వ్యక్తీ ఇరువురు ఓ ప్రమాదంలో ఒకటవుతారు.ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు.ఆమె న్యూస్ రీడర్ కావడంతో ఎప్పుడు అతగాడికి ఏమవుతుందోనన్న తలంపుతో మదనపడుతుంది.

ఇక నాలుగవ కథలో ప్రియుడు ఏమో అనాకారి.అతడికి ఏ పనీపాట ఉండదు.అతడి ప్రేయసేమో సూపర్ మార్కెట్లో బిల్లులు వేసే పనిలో ఉంటుంది. ఏదైనా ఒక పని చేసాక వచ్చి తనను కలవ మంటుంది.మనోడికి ఏ పని లేదాయే, అలాగని ప్రేయసిని విడిచే మనసు లేదాయే.

ఈ నాలుగు కథలలో ఒక్కొక్క కథ ఒక్కొక్క మలుపు తీసుకుంటుంది.

ఉన్నట్లుండి ఆ పసివాడి తల్లి ఆ కుర్రవాడ్ని లాలనగా చూసుకోవడం ప్రారంభిస్తుంది. తల్లితో ప్రతి విషయం పంచుకుంటాడు ఆ పసివాడు. స్కూలు విడిస్తే అతని తల్లితోనే గడుపుతాడు.ఇక రెండో కథలో ఇక దోబూచులు ఆపి ఎలాగైనా  ఆ చిత్రకారునికి తన ముఖం చూపి అతన్ని వసం చేసుకోవాలనుకుంటుంది. మూడవ కథలో  ఇద్దరు తమ ప్రేమను వివాహ బంధంతో పరిపూర్ణం చేసుకోవాలనుకుంటారు. ఇక నాలుగవ ప్రేమ కథలో మనోడు ఏ పని దొరక్క ఆఖరికి  విడిపోయే ప్రేమికుల మధ్య ఆ ప్రేమ విడిపోవడం గూర్చిన విషయం తెలియచేసే రాయబారిగా తనే ఒక ఉద్యోగాన్ని కల్పించుకుంటాడు.

ఇలా సాగే ఈ నాలుగు కథలు సాధారణంగా మొదలయ్యి,ప్రేమతో పెనవేసుకొని, చివరాఖరికి విషాదాంతంగా ఎలా ముగిసాయి అన్నదే ఈ చిత్ర కథ. ప్రేమను ప్రేమించేవారు ఈ విషాదాంత ప్రేమలను సైతం ప్రేమగా ప్రేమిస్తారు ఇందులో 4 ప్రేమకథలు వేటికవే ప్రత్యేకం. సహజత్వంతో కూడిన ప్రేమకథలను ఇష్టడేవారు, కొరియన్ చిత్రాలను ఆరాధించేవారికి ఇది బాగా నచ్చుతుంది.

-శ్రీనివాస్ ఆగ్నెస్

One Response
  1. a navatharangam fan June 8, 2016 /