Menu

ఎన్న నిండె మోయిదీన్ (Ennu Ninte Moideen) – ఓ జ్ఞాపకంలాంటి సినిమా

“హిట్టైనా, ఫ్లాపైనా, సినిమా అనేది ఒక అనుభవంగా మిగిలిపోవాలి” అన్నది దర్శకుడు “రాంగోపాల్ వర్మ” ఎప్పుడో చెప్పిన ఒక మాట. అనుభవానికి తదుపరి దశ “జ్ఞాపకం”. “అనుభవం” ఓ క్షణాన పుట్టి మరికొన్ని క్షణాలకు నశిస్తుంది. గొంగళిపురుగులాంటి ఆ క్షణాల అనుభవం సీతాకోకచిలుకలాంటి జ్ఞాపకంగా మారి మనసు మూలల్లో తన రంగుల రెక్కలు విప్పి చాలాకాలం విహరిస్తూనే ఉంటుంది. ఈ దశలను చవిచూపించిన సినిమాలలో “ఎన్న నిండె మోయిదీన్” ఒకటి.

ఓ సీతాకోకచిలుక గుడ్డు మూడు దశలు దాటి మరో సీతాకోకచిలుకగా మారినట్టు, “ఆర్.ఎస్.విమల్” తీసిన ఈ సినిమా కూడా నాకు మూడు దశల్లో జ్ఞాపకంగా మారింది. అవి పరిచయం, అనుభవం, జ్ఞాపకం.

పరిచయం :

2015లో వచ్చిన మంచి మళయాళ సినిమాల్లో ఒకటి ఈ “ఎన్న నిండె మోయిదీన్” అని పలు వెబ్సైట్లు వ్రాయడం జరిగింది. హైదరాబాదులో ఈ సినిమా విడుదల కాలేదు. కేరళకు వెళ్ళి చూసే అవకాశంలేదు. క్రమేణా, సినిమా పట్ల ఆసక్తి తగ్గిపోయింది. ఇంతలో “చార్లీ” అనే మరో మలయాళ సినిమా విడుదలయింది. అందులో హీరొయిన్ “పార్వతి మేనన్” బాగా నచ్చింది (అప్పటికే “మరియాన్”లో మెప్పించిందనుకోండి). కొన్ని రోజులకు “ఎన్న నిండె మోయిదీన్” సినిమాకుగానూ ఆవిడకి “కేరళ రాష్ట ప్రభుత్వ పురస్కారం” లభించందని తెలిసి ఆ సినిమా మళ్ళీ గుర్తొచ్చింది. ఇంతలో ఒక స్నేహితుడు సినిమా చూసేసి తెగ పొగిడేస్తున్నాడు. ఎలాగైనా సినిమా చూడాలి అనుకుంటున్న సమయంలో డీవీడీ విడుదలయింది.

ఓ సినిమా చూడడానికి “మూడ్” చాలా అవసరం. మూడ్ ఎలా ఉన్నా, ఒకవేళ ధియేటరుకి వెళితే, పెట్టిన ఖర్చు గుర్తొచ్చి సినిమాలో బలవంతంగానైనా లీనమయ్యే ప్రయత్నం చేస్తాం. అదే, ఇంట్లో కూర్చొని ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమా చూసే వీలున్నప్పుడు మాత్రం, బిజీ జీవితంలో ఆ “మూడ్” కలగడం కాస్త కష్టమే. ఎలాగో ఒకరోజు వీలు చేసుకొని దీన్ని చూడడం మొదలుపెట్టాను…

అనుభవం :

మొదటి ఇరవై నిమిషాలు చూశాక, అటు ఇటు దిక్కులు చూసి ఆ రోజుకి సినిమాను కట్టేసి నా పని నేను చూసుకున్నాను. తదుపరి వారం మళ్ళీ మొదటినుండి మొదలుపెట్టి ముప్పై నిమిషాల వరకు చూశాను. ఈసారి నా ముందు దీన్ని పొగిడిన స్నేహితుడిని తిట్టుకొని మళ్ళీ కట్టేశాను. “అసలేంటి ఈ సినిమా ఇలా ఉంది? దీన్నా అందరూ తెగ పొగిడారు? దీని సంగతేంటో చూద్దాం!” అని అనుకుంటూ మూడోవారం మళ్ళీ మొదటినుండి మొదలుపెట్టి ఆ ముప్పై నిమిషాలను ఎలాగో కష్టపడి దాటేశాను. వర్షంలో ఓ బస్సు వెళ్తుండగా, ఆ బస్సులో ముందు సీటులో కూర్చున్న కాంచనమాల (పార్వతి) వెనక్కి తిరిగి మోయిదీన్ (పృథ్వీరాజ్)ని చూసి చిరునవ్వు నవ్వడంతో ఈ సినిమాలోకి ప్రవేశించడం జరిగింది. ఆ తరువాత ఇద్దరూ మరోసారి వర్షంలో తడుస్తూ పాడుకుంటుంటే అనిపించింది వారిది స్వచ్చమైన ప్రేమని.

ENM - 1

ఎవరూ లేని చోట, పైగా జోరుగా వర్షం పడుతుంటే, నచ్చిన అమ్మాయి పక్కనే ఉంటే, ఒక అబ్బాయి మనసులో ఏ ఆలోచనలు వస్తాయో ప్రత్యేకించి చెప్పక్కరలేదు. అలాంటిది, కనీసం ఆవిడ చిటికెన వేలుని కూడా తాకని మోయిదీన్ ని చూస్తే, ఎవరి ఆదరణకూ నోచుకోక నలిగిపోయిన “తీన్ మార్” సినిమాలో “త్రివిక్రమ్” వ్రాసిన “రుచి చూసి బాగుందోలేదో చెప్పడానికి తనేమి పాయసం కాదు, ప్రాణమున్న మనిషి” అనే మాట గుర్తొచ్చి, తన ప్రేయసికి అంత గౌరవమిచ్చిన మోయిదీన్ పై గౌరవం అమాంతం పెరిగిపోయింది. ఇదే అంశం “క్రాంతిమాధవ్” తన “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు”లో చూపిస్తే కాస్త అతిశయం అనిపించింది. అది కూడా గౌరవమని ఈ సినిమా చూశాక అర్థమైంది. ఈ కాలంవారైన మనం “ప్రాక్టికాలిటి” అని ఎంత వాదించినా, కళ్ళతోనే ప్రేమించుకునే ఆ కాలపు ప్రేమకథలు ఎప్పటికీ అజరామరంగానే ఉంటాయనిపించింది.

ఇవే కాకుండా, ఉత్తరాల రాయబారం నడుపుతున్న పనిమనిషి దొరికిపోతే, పిల్లాడి చేత రాకెట్ ఆట ఆడించే ఆట సృజనాత్మకంగా అనిపించింది. దూరం ఎంత వేరు చేసినా, అనుక్షణం కాంచనమాలకు దగ్గరవ్వాలని ప్రయత్నించే మోయిదీన్, కట్టుబాట్లు ఎంత కట్టడి చేసినా మోయిదీన్ తోనే తన జీవితమని 22 ఏళ్ళు ఎదురుచూసిన కాంచనమాలను చూస్తే జాలి కాకుండా గౌరవం కలిగింది. కథనం ఎంత నెమ్మదిగా సాగుతున్నా, అక్కడ చూపించేది సినిమా కాదు జీవితమని దర్శకుడు ఒప్పించిన తీరు ఎంతో బాగుందనిపించింది. ప్రేమంటే కేవలం మన స్వార్థాన్ని చూసుకోవడం కాదు, పరిస్థితులను కూడా అర్థంచేసుకోవాలని కాంచనమాల తండ్రి చనిపోయే సన్నివేశం ద్వారా చెప్పాడు దర్శకుడు. అక్కడే గుర్తొచ్చింది “సెర్జియో లియోన్” చెప్పిన “ఒక అంశాన్ని చెప్పే మాధ్యమాల్లో దృశ్యం మొదటి ఎంపిక, మాట చివరి ఎంపిక కావాలి” అనే మాట.

కమర్షియల్ సినిమాలకు అలవాటుపడి ముగింపు ప్రేక్షకుడు అనుకున్నట్టుగా ఉండాలని అనుకోవడం ఒక కమర్షియల్ ప్రేక్షకుడిగా నేను చేసిన తప్పు. అలా కాకుండా, జరిగిందే చూపించి ఒప్పించడం దర్శకుడి నేర్పు. విధిని ఎదిరించలేకపోయినా, కట్టుబాట్లను ఎదిరించి కాంచనమాల తీసుకున్న నిర్ణయంతో ఎన్న నిండె మోయిదీన్ (ఎప్పటికీ నీ మోయిదీన్) అని “మోయిదీన్” గుర్తుండిపోయాడు.

ENM - 2

ఈ సినిమా గురించి పరిశోధన చేస్తే తెలిసిందేమంటే, ఇది 1960లలో కేరళలోని “ముక్కమ్” అనే గ్రామంలో చోటుచేసుకున్న ప్రేమకథని.

జ్ఞాపకం :

ఈ సినిమా నేను చూసి కొన్ని నెలలు గడిచాయి. దీని మీద సమీక్ష వ్రాయాలనుకొని నిర్ణయించుకొని ఎన్నో రోజులయ్యాయి. కేవలం ఒక్కసారే చూసిన ఈ సినిమాలోని సన్నివేశాలన్నీ ఇంకా గుర్తున్నాయంటే అర్థమైంది, చూసినప్పుడు కలిగిన “అనుభవం” చూసిన ఇన్నాళ్ళకు కూడా “జ్ఞాపకం”లా వెంటాడుతోందని.

ముగింపు :

ఇంతగా ఈ సినిమా మీద నేను వ్రాసింది కేవలం నా “అభిప్రాయం” మాత్రమే. ఇదే అభిప్రాయం అందరికీ కలగాలని లేదు. అలాగని కలగదని కూడా లేదు. ఒక స్వచ్చమైన ప్రేమకథను ఆస్వాదించాలనుకుంటే తప్పకుండా ఈ సినిమాను చూడండి. మొదట్లో బోరుకొట్టినా, తరువాత మీ మనసును గెలుచుకుంటుందని నా అభిప్రాయం. అలా జరగలేదంటే, మీ సమయం వృథా అయ్యిందని దయచేసి నన్ను తిట్టుకోకండి. ఈ “నవతరంగం” వేదిక ద్వారా నా అభిప్రాయాలను మీతో పంచుకున్నానంతే. 🙂

– యశ్వంత్ ఆలూరు