Menu

కుట్రం కడిదల్

కుట్రం కడిదల్ అంటే  నేరం లేక తప్పు ను తెలుసుకోవడం అని అర్ధం. తప్పు చెయ్యకుండా  వుండడమే లక్ష్యంగా సాగిపోవాలి ఎందుకంటే అది పగగా కూడా  మారొచ్చు అన్నదే ఈ చిత్రం యొక్క కథాంశం. 2015 లో జాతీయ ,అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను కైవసం చేసుకున్న తమిళ చిత్రం ఇది.. రిలీజుకు సరైన థియేటర్స్  కూడా దొరకకుండా ఉన్న పక్షంలో ఈ చిత్రం సంపాదించిన అవార్డుల మూలంగానే చేరువైందని చెప్పొచ్చు.ఎన్నో కొత్త పోకడలకు నెలవైన తమిళనాట ఈ మధ్య మరో కొత్త పోకడను అవలంభించారు.అదే సహజత్వంతో కూడిన ఆర్ట్ సినిమా కోవకు చెందిన కథలకు ఆసక్తికరమైన కథనాలను మలచి కమర్షియల్ గాను విజయవంతంగా రూపొందించే టెక్నిక్.అందుకు చక్కని ఉదాహరణ ‘కాక్కము ముట్టై’ అని చెప్పొచ్చు. ఈ సినిమా కూడా ఆ కోవలోకే వస్తుంది.

ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే ఒక కొత్తగా పెళ్లి అయిన టీచర్. పెళ్లి అయిన మరుసటి రోజే స్కూలుకి వస్తుంది.అక్కడ తన స్నేహితురాలైనటువంటి వేరొక టీచర్ తను బయటకు వెళుతూ తన క్లాస్ మెర్లిన్ కు అప్పజెప్పుతుంది. అక్కడ ఒక తుంటరి కుర్రవాడు చేసిన అల్లరి పనికి అతడి చెంప పై కొట్టడంతో అతడు స్పృహ తప్పి పడి పోతాడు.దాంతో ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ,అతని భార్య సహాయంతో మెర్లిన్ అక్కడ నుండి బయట పడుతుంది. హాస్పటల్ లో చేర్పిస్తే పల్స్ తగ్గడంతో బ్రతకడం కష్టమంటారు.

మెర్లిన్ టీచర్ ప్రిన్సిపాల్ దంపతుల సహాయంతో తన భర్తతో ఆ చోటు నుండి మరో చోటుకి ప్రయాణమవుతుంది. కుర్రాడి పరిస్థితి విషమించడంతో అతని మేనమామ కొట్టిన టీచర్ ఆచూకి  తెలుసుకొని   పగ సాధించాలనుకుంటాడు. మరో ప్రక్క మెర్లిన్ ఓ పసివాడి ప్రాణంతక స్థితికి కారణం అయ్యానన్న పశ్చాతాపంతో కుమిలిపోతుంది. మధ్యలో మరోప్రక్క మీడియా జోక్యం చేసుకుంటుంది. అటు మెర్లిన్ కు సహాయపడుతూ , మరోప్రక్క బాధితుని కుటుంబానికి ఆసరాగా ఉంటారు ప్రిన్సిపాల్ దంపతులు. అసలు చెంప దెబ్బకే  ఆ కుర్రవాడు చనిపోయేంత స్థితికి చేరడానికి గల కారణం ఏమిటి? మొత్తానికి ఆ కుర్రవాడు బ్రతికాడ లేడా?  మెర్లిన్ తన పాపానికి ప్రాయశ్చిత్తం వెదికిందా, ఆమె పై పగ తీర్చుకోవాలి అనుకున్న ఆ పిల్లాడి మావయ్య ఏం చేసాడన్నదే మిగతా కథ.

నటీనటుల నటన చాలా బాగుంది. ఒక్కొక్క చిన్న పాత్ర సైతం మదిలో నిలుస్తుంది. ముఖ్యంగా ఆ స్కూల్ ప్రిన్సిపాల్  దంపతుల నటన, ఆ చిన్న పిల్లవాడు, అతడి మావయ్య, మెర్లిన్ టిచర్ నటన చాల బాగుంది. సంభాషణలు కూడా చాలా బాగున్నాయి. నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సందర్బోచితంగా వచ్చే తమిళ కవి భారతియార్ పాట చిత్రీకరణ కట్టి పడేస్తుంది. అయితే మెర్లిన్ టీచర్ గా నటించిన అమ్మాయి క్లోజ్ షాట్స్ కొన్నిచోట్ల భయపెట్టే విధంగా ఉంటాయి. సినిమా కథ పరంగా చాలా చిన్న విషయమే అయినప్పటికీ కథనం, పాత్రల తిరు,ముగింపు సన్నివేశం  ఆకట్టుకుంటాయి. అయితే  సహజత్వంతో కూడిన కథ కనుక కొంత మేరకు నెమ్మదిగానే కథ సాగుతుంది. మొదటి చిత్రం తోనే దర్శకుడు బ్రహ్మ ఆకట్టుకున్నాడు.

-శ్రీనివాస్ ఆగ్నెస్