Menu

The straight story – వృద్దుడి ప్రయాణం

ది స్ట్రెయిట్ స్టోరీ..  పేరుకు తగ్గట్టుగానే..చాలా  సూటి, సరళం అయిన కథ.

అల్విస్  డెబ్బై ఏళ్ళ ముసలాడు. కూతురు సామానుకోసం వెళ్ళగానే  కిచేన్లో ఏదో సర్దుతూ దభీలున కింద పడతాడు. కూతురొచ్చి  చేయందించే దాకా లేవటానికి రాదు. డాక్టర్ దగ్గరికి తీసుకేల్తే మందూ, మాకూ, టెస్టులూ, ఆపరేషన్లూ ఇవేవీ వద్దంటాడు. బ్లడ్ షుగర్ వల్ల కంటిచూపు తగ్గుతోందనీ, పొగాకు పీల్చటం మంచిది కాదూ  మానేయమంటాడు డాక్టర్. అల్విన్ ఏవీ లెక్కచేయడు.

ఓ రాత్రి ఉరుములు మెరుపులతో భారీగా జల్లు కురుస్తుంటే కూతురితో కలిసి వర్షాన్ని చూస్తూ ఆనందిస్తున్న అల్విన్ కి ఓ ఫోన్ కాల్ వస్తుంది. తన తమ్ముడికి గుండెపోటు వచ్చిందని.
పదేళ్ళకింద గొడవపడి మాట్లాడుకోటం మానేసిన తమ్ముడిని చూడాలని అనిపిస్తుంది  ఆక్షణంలో. ఆ గొడవలన్నీ ఈ బాధల్లో ఆలోచించటం సబబు కాదనిపిస్తుంది. అనారోగ్యం పాలైన తన తమ్ముడెలా ఉన్నాడో అని మనసు లాగుతుంది. కుటుంబ బంధం, రక్త సంభందం గుర్తొస్తుంది.  తనకి కూడా ఆరోగ్యం బాలేదు. కళ్ళు సరిగ్గా కనపడవు. కారు నడపలేదు. చేతికర్ర సాయంతో నడవాలి. కిందకూర్చుంటే పైకి లేవలేడు.కానీ తమ్ముడిని చూడాలి, ఎలా ??   ఓ ఆలోచన తట్టి   గడ్డికత్తరించే  ‘లాన్ మోవర్’ వెనక ఓ ట్రాలి కట్టి తమ్ముడిని చూట్టానికి బయలుదేరాలని నిశ్చయించుకుంటాడు. కావలసినవి కొనుక్కొని ప్రయాణానికి సిద్దమవుతాడు. దానిమీద ప్రయాణం కుదరదని, అంతటి సాహసం కూడదని  కూతురూ, స్నేహితులు వారించినా వినడు.

గంటకి పది/పదిహేను మైళ్ళ వేగంతో సైకిల్ కంటే మెల్లిగా వెళ్ళే  లాన్ మోవర్ మీద తన రోడ్ జర్నీ మొదలెడతాడు.  ఒకట్రెండు రోజులు బానే సాగుతుంది ప్రయాణం. ఆ ప్రయాణంలో ఒకరిద్దరు వ్యక్తులని కలుస్తాడు. వాళ్ల కథని వింటాడు. తన కథనూ పంచుకుంటాడు. అంతా బానే సాగుతోంది అనుకునే సమయంలో ఆ లాన్ మోవర్  ఓ చోట మొరాయించి  వెనుదిరగాల్సి వస్తుంది. ఇంటికి రాగానే  దాన్ని కాల్చి పారేసి..కాస్త మెరుగైనది మరోటి కొంటాడు.

మళ్ళీ ప్రయాణం మొదలు. నల్లని తారు రోడ్డు.. ఎత్తుపల్లాలూ…రెండువైపులా మొక్కజొన్న చేలు.. సంధ్యా సమయాలూ.. చల్లని నక్షత్ర రాత్రులు.. మధ్య మధ్యలో అపరిచితులతో పరిచయాలు, కాసేపు మాటా మంతీ ! మధ్యలో రెండుమూడు సార్లు ఈ వాహనం కూడా సతాయించినా..దాన్ని బావుచేసుకుంటూ మెల్లిగా చివరాఖరికి గమ్యం చేరుతాడు. పదేళ్ళుగా మాటలు కూడా  లేక  బంధం తెగిపోయి, అనారోగ్యంలో ఉన్న తమ్ముడిని కలుసుకుంటాడు. తన అన్న..తనకంటే ముసలాయన, తనకోసం అదొందల మైళ్లు.. ఆ చిన్న వాహనంమీద  ప్రయాణించి రావటం గుండెకు తాకుతుంది ఆ తమ్ముడికి . ఇద్దరి కళ్ళలో ఆనంద భాష్పాలు నిండుతాయి.

ఆల్విన్ గా   రిచ్చర్డ్ ప్రాన్ వర్త్ అద్భుతంగా కుదిరాడు. ముడతల మొహం.. గాజుకళ్ళతో చక్కని నటన కనపరిచాడు. కూతురు మరియు ఇతరపాత్రలు అనుగుణంగా నటించారు. సహజంగా ఉంటూ  సినిమాటోగ్రఫీ బాగా ఆకట్టుకుంటుంది. . అన్నింటిని మించి చెప్పుకోదగింది, నాకు బాగా నచ్చిందీ Angelo Badalamenti నేపథ్య సంగీతం. అల్విన్ ప్రయాణిస్తున్నప్పుడు వచ్చే నేపథ్య సంగీతం మనసును బాగా హత్తుకుంటుంది.

నిగూఢంగానూ , హింసాత్మంగానూ ఉండే   సర్రియల్ సినిమాలకి పేరుబడిన డేవిడ్ లించ్  తన శైలికి భిన్నంగా ఈ సినిమా తీసాడు. అర్థం కాని ఎలాంటి మెలికలూ లేనందుకే   ఎ స్ట్రెయిట్ స్టోరీ అని పెట్టినట్టు ఉన్నాడు.

అక్కడక్కడా కొంచం  నత్తనడకన సాగినట్టు కొంచం  అనిపించినా  ఒకసారి సినిమాలో పడితే హాయిగానే సాగుతుంది. ఎన్నో సినిమా పండగల్లో పన్నెండు అవార్డులు కూడా గెలుచుకుందీ సినిమా !!

ఇంటర్నెట్ నిండా విచ్చలవిడి సినిమాలుండగా  ఈ సినిమాచూడాలనుకోటం అందరికీ పట్టకపోవచ్చు, కానీ ఈ “వృద్దిడి రోడ్ జర్నీ”  ప్రపంచ సినిమా ప్రేమికులందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను.

 

One Response
  1. Naresh May 21, 2017 /