Menu

Talvar – ప్రశ్నార్థక మరణం !!

మరణం ఒక జవాబు..
మరణం ఒక ప్రశ్న..
మరణం ఒక పరిష్కారం..
మరణం ఒక సమస్య..

మరణం ఒక నిజం..

మరణం ఒక అబద్దం.

మరణం ఒక మరణం..

మరణం ఒక బ్రతుకు ..మరణం ఒక ప్రశాంతత.. మరణం ఒక అశాంతి..!!
మరణం మార్మికమైనది. ప్రతిమరణం ఎంతో కొంత  విషయాన్ని తనలోదాచుకుంటుంది. ఒక వ్యక్తి తాలూకు తనకు మాత్రమే పరిమితమైన కొన్ని విషయాలు, అంతర్గత మధనం ఆ మరణంలో ఉంటుంది. అది ఎవ్వరికీ ..ఎప్పటికీ తెలియనిది. కొన్ని సార్లు మరణాన్ని మనం కోరుతాం..కానీ అదిదొరకదు. కొన్నిసార్లు మరణాన్ని మనం నిరాకరిస్తాం, కానీ అది కబలిస్తుంది. మరణం ఒక దేవుడి వరం లాంటిది. అడిగితే దొరకదు, మనం మన ధ్యాసలో హాయిగా ఉన్నప్పుడు హటాత్తుగా వచ్చేస్తుంది.  హాయిగా మరణించటం అదృష్టం, కానీ అది అందరికీ దొరకదు.మరణం ఎప్పుడు రెడీగా వేచిఉంటుంది. ఎక్కడ మనం ఏమరుపాటుగా  ఉన్నా మీద దూకి దరిచేర్చుకోటానికి.

ఒక్కో మరణం ఒక్కో రకం.   కొన్ని మరణాలు కథల్లా ఉంటాయ్.. కొన్ని మరణాలు దీనంగా ఉంటాయి. కొన్ని దిభ్రాంతిని కలిగిస్తే, కొన్ని విరక్తిని కలిగిస్తాయి .కొన్ని నమ్మదగినవి..కొన్ని నమ్మశక్యం కానివి. కొని ప్రశ్నలు సంధిస్తే, కొన్ని పరిస్థితిని వివరిస్తాయి, కొన్ని సమాజంలో మార్పుకి దోవచూపిస్తే కొన్ని సమాజ స్థితిని ఏకరువు పెడతాయి.ఈ లోకం తాలూకు  అందాలూ, ఆనందాలు అర్థమవుతోంటే, ఊహాలూ, కలల సామ్రాజ్యాలు నిర్మించుకునే  కౌమార్యంలోకి అడుగిడుతోందా చిన్నారి.  స్కూలూ, చదువు ఎలాగూఉండేవే,  కానీ స్నేహితులూ అల్లరీ ఆటలూ పాటలూ ఇవ్వే ఎక్కువ మదిలో నిండా నిండుంటుందా వయసులో . లోకం కొత్తగా, వింతగా గమ్మత్తుగా అనుపించే వయసది. ప్రేమించే తల్లిదండ్రులూ,(?)  తను నచ్చిన, తనని మెచ్చిన స్నేహితులూ ఉన్నారు. ఇంకేమి కావాలి.  అందుకే  ఆ రాత్రి నిద్రలోకి జారుకుంది. కలల తెరలు తెరుచుకుని కమ్మటికలలు కంటోంది. కానీ మరణం తనకి గురిపెట్టిన సంగతి తెలినే తెలిదు.  కళ్ళు తెరిచేసరికి  ఒకలోకాన్ని విడిచి మరో లోకాన్ని చేరిందని మాత్రమే తెలిసింది. !!

ఆ చిన్నారి పేరు అరుషీ తల్వార్ !!

నోయిడాలో నివాసముంటున్న వైద్య దంపతులు  రాజేష్ తల్వార్.. నూపుర్ తల్వార్ ల ఒక్కగానొక్క ముద్దుల కూతురు.  తెల్లారిలేచేసరికి గొంతుకోసి రక్తం మడుగులో శవమై కనిపించింది. తలిదండ్రులు  పక్కరూంలోనే పడుకున్నారు.  కానీ ఎలాంటి అరుపులూ, గింజులాట మరేది లేకుండా నిశ్శబ్జ్దంగా ఆ పాప హత్య జరిగింది.   యధా ప్రకారం పోలీసులు రావటం విచారణా ప్రారంభమైంది.

మొదట ఆ ఇంట్లో పనిచేసే నలభైఅయుదేళ్ళ నడివయస్కుడు  హేమ్ రాజ్  కన్పించకపోయేసరికి అతడే అనుకున్నారు. కానీ రెండో రోజు మధ్యానం అతడుకూడా భవనపైభాగంలో  హతుడై కన్పించటంతో కేసు మరో మలుపు తిరిగింది. పోలీసులకు అంతుపట్టని ఆ కేసు  సిబిఐ కి అప్పగించబడింది.  రక రకాల సమాచారం ప్రకారం, లోతైన విచారణ అనంతరం   ఈ రెండు జంట హత్యల్ని   రాజేష్ తల్వార్  ఆసుపత్రి  కౌంపోండర్ అతని మిత్రులూ చేసారని సిబిఐ వివరణ.  నార్కో టెస్టులో తామే చేసామనే కథనాలు వాళ్ళు వినిపించినా కోర్టు  ఆ టెస్టులని సాక్షంగా తీసుకోదు.  అవి గాక  ఇతర  బలమైన సాక్షాలు దొరకక ముందే  నాటకీయంగా సి బి ఐ విచారణాధికారి మారిపోయారు.

కొత్త సిబిఐ విచారణ ప్రకారం,  కూతురికి తమ  తమ లైంగిక జీవిత రహస్యాలు తెలిసిపోయి,  ప్రతీకారంగా/కోపంలో  ఆ కూతురు తనుకూడా  హేమరాజ్ తో  సంభందం పెట్టుకొన్నదనీ,  ఆ రాత్రి ఆ పనివాడూ, కూతురూ  ఏకాంతంగా  కనపడేసరికి ఉద్రేకంలో  తండ్రే ఇద్దర్నీ హత్య చేసాడనీ, తల్లి సహకరించిందనీ మరో కోణంలో వివరించబడింది.

ఈ రెండు రకాల విచారణల్లో .. వివరణల్లో ఏటూ తేలక, ఎటూ సాక్షాలు బలంగా లేనందువల్ల కేసును మూసేయాలని  రెండో టీం సూచించింది. కానీ కోర్టు దాన్ని తోసి పుచ్చింది.

అయితే  కౌంపోండర్ చేసాడనటానికి బలమైన సాక్షాలు లేకపోవటం, అనుమానాలు ఎక్కువగా తల్లిదండ్రులవైపే ఉండటం వల్ల  ఆ తల్లిదండ్రులకి యానజ్జీవ శిక్ష ఖాయమైంది. వాళ్ళు శిక్షననుభవిస్తూ  పైకోర్టుకు అప్పీలు చేసుకున్నారు. ఆ ఆప్పీలు ఇంకా విచారణకి రావలసి ఉన్నది.

కూతురుని చంపిన తలిదండ్రులూ అనే దిగ్రాంతిక విషయం వల్లనో, లేక ఉన్నత కుటుంబాలకి చెందిన వాళ్లై ఇలా చేసారనో  లేక విచారణకి అందని కేసు అవటం మూలానో  ఈ జంటహత్యలు దేశవ్యాప్తంగా  ఉత్సుకతని కలిగించి కలకలం రేపింది. జనం అంతా ఆ చిన్నారికి కాండిల్స్ తో  తమ సంతాపం ప్రకటించారు. రాత్రింబవళ్ళూ మీడియా కోడై కూసింది.ఎప్పటికప్పుడు విచారణని జనాలకి తెలియజెప్పింది. ముద్దాయిల, సంబంధితవ్యక్తుల, సామాజిక నిపుణుల, పాత్రికేయిల, సాక్షుల  ఇంటవ్యూలూ,వాదనలు,వివరణలతో టివీ మీడియా హోరెత్తించింది.   ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని అనుసరించిన  వాళ్ళందరూ ఇంకా  ఒక డోలాయమాన స్థితిలోనే ఉన్నారు.  నోయిడా పోలీసుల అతి నిర్లక్షం వల్ల ఉన్న సాక్షాలు తుడిచిపెట్టుకుపోయి.. మొదటి సిబిఐ విచారణ  పటిష్టంగా అనిపించినా  గట్టి సాక్షాలు లేక,  కేసు ఎటూ బలంగా తేలక మరోవైపు నెట్టేసారేమో అని మనకూ అనిపించక మానదు.

ఈ కేసుకు సంభందించిన వివరాలూ, ఇంటి ప్లానింగూ, విచారణలూ..నార్కో టెస్టులూ, సంబంధిత వ్యక్తుల , బంధువుల, స్నేహితుల  చుట్టుపక్కల వాళ్ళ ఇంటర్వూలూ అన్నీ ఇంటర్నెట్లో ఉన్నాయి. కూర్చొని అన్నీ చూసుకొని మనకి మనం ఒక విచారణ చేసినా వీడని మిస్టరీ హత్యలివి. కొంతనేపు  మానసికంగా మనం ఒకవైపు మొగ్గినా మళ్ళీ కాసేపట్లో మరోవైపు మొగ్గుతాం. ఎన్ని రోజులు ఎన్ని సార్లు ఆలోచించినా ఎవరికి వాళ్ళు ఎన్ని రకాలుగా వివరించుకున్నా అంతుబట్టని రహస్యంగా మిగిలిందీ కేసు.

అందుకే  పుస్తకం రాసేవాళ్ళు పుస్తకం రాసారు. వెబ్ పత్రికల్, బ్లాగుల్లో తమకోణాన్ని రాసేవాళ్ళూ రాసారు. థ్రిలింగ్, ఇన్వెస్టిగేషన్ సినిమాలు చూసే ప్రేక్షకులే కాక  ఏళ్లపాటు జరిగిన విచారణ, వివరాలని ఒకేసారి చూద్దాం అనుకునే  ప్రేక్షకులుంటారనీ, తాము మిస్ అయిన కొన్నివివరాలని, తమకి అంతుబట్టని కొన్ని విషయాలనీ చూడాలకునేవాళ్ళూ ఉంటారనీ బలమైన  నమ్మకమే ఈ సినిమా తీయటానికి కారణం.

ఇంత ఉత్సుకథ కలిగిన ఈ హత్యకేసుకి   కొద్దినా నాటకీయతని, సందర్బానుసార హాస్యాన్ని  చేర్చి ఒక డాక్యుడ్రామాలాగా , భిన్న రకాల విచారణా దృక్పథాలని విడివిడిగా  చూపిస్తూ,  ఎక్కడా ఉత్కంట తగ్గకుండా  విశాల్ భరద్వాజ్ స్క్రీన్ ప్లే సమకూరిస్తే,   ఆ నిజకథని సినిమాలాగా గొప్పగా మలిచింది దర్శకురాలు మేఘన గుల్జార్ !!

తల్వార్ దంపతులుగా నీరజ్, కొంకణాసేన్ శర్మా  పాత్రోచిత  నటనని కనబరిస్తే,  సిబిఐ అధికారి గా ఇర్పాన్ ఖాన్, సబ్ ఇన్పెక్టర్ పాత్రలో గజ్ రాజ్ రావు బాగా ఆకట్టుకుంటారు.  అథితిపాత్రలో టాబు కుదిరింది. అన్ని పాత్రలు అతి సహజంగా ప్రవర్తిస్తాయి.  షిప్ ఆఫ్ థిసిస్ ని అద్బుతంగా చిత్రీకరించిన పంకజ్ కుమార్ సహజంగానూ, డాక్యుమెంటరీ శైలి కలగలిపి ఈ సినిమాకీ  చిత్రీకరణ బాగా చేయగలిగాడు.  విశాల్ భరద్వాజ్ నేపథ్యసంగీతం, గుల్జార్ పాటలూ  సన్నివేశాలకి  కావలసిన గాఢతని ఇచ్చాయి.
ఈ మధ్యకాలంలో  హిందీ సినిమా ఈ తరహా నిజజీవితకథలని, అటో బయోగ్రఫీలనీ, బయోగ్రఫీలని, గొప్పనాటకీయత, ఉత్సుకత కల్గిన సంఘటనలనీ, ప్రభుత్వయంత్రాంగపు ఫెయిల్యూర్నీ,  సమాజానికి ప్రశ్నార్థకాలనీ   కథావస్తువులుగా ఎంచుకొని గొప్పగా సినిమాలని నిర్మిస్తోంది. జనం ఉత్సుకత చూపిన విషయాలు కనక  అవి బాక్సాఫీసు వద్ద కూడా విజయాన్ని సాధిస్తున్నాయి.   నో వన్ కిల్డ్ జెసికా,  భాగ్ మిల్కా భాగ, బ్లాక్ ఫ్రై డే, షాహిద్, మేరీకోం, మొదలైనవి ఎన్నో ఉన్నాయి.

అప్పట్లో వచ్చిన  రక్తచరిత్ర, నిన్నటి కిల్లింగ్ ఆఫ్ వీరప్పన్ ఈ కోవకే చెందుతాయి. ఇవి రెండూ రాంగోపాల్ వర్మ సినిమాలే. మిగతా దర్శకులు ఇలాంటి తరహా కథలని ఎంచుకునే ప్రయత్నం చేయటంలేదు .

అయితే ఈ తరహా చిత్రాలు చేయగలగటం  సాహసం, సవాల్ కూడాను. సంఘటనమీద సరైన అవగాహన కలిగి పక్కా  రిసెర్చీ వర్కు చేయాలి. కావలసిన నాటకీయత ఉంటూనే  ఉత్సుకత కలిగించే విధంగా  స్క్రీన్ ప్లే చేయగలగాలి. పాత్రలు నిజజీవిత పాత్రలతో దగ్గరగా కుదరాలి, దాదాపు అవ్వె లొకేషన్స్ లో తీయాలి.  హాయిగా బీచీ రిసార్టుల్లో తోచిన కథ రాసుకు తీసే దర్శకులకి ఇంత పెద్ద సవాల్ ని స్వీకరించటం కష్టమే !!

సినిమా చూసి నాలుగైదు రోజులూ ఆలోచిస్తూ కూర్చున్నాను. అరుషీ తల్వార్ కథ వెంటాడింది.  అసలు  తనని ఎవరు చంపారు అన్న విషయం ఆమెకైనా తెలుసా ?????  నన్నెవరు చంపారూ అనే ప్రశ్నఆ ఆత్మ ఈ మన సమాజాన్ని అడినట్టనిపించింది.  దేశం నిండా పేరుకుపోయిన నిర్లక్షం  సుస్పష్టంగా కనపడింది. ఎక్కడ అధికారుల తొందరపాటు నిర్ణయాలు, యంత్రాంగాల్లో అంతరంగ విభేధాలూ..రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది అర్థమయింది. మనచుట్టూ ఉండే  మనుషుల్లోకి క్రూరత్వం హటాత్తుగా వచ్చి వెళ్తుందనేది తెలిసొచ్చింది. !!
మీరంతా ఇప్పటికే చూసే ఉంటారు..చూడకుంటే ఓ శనివారం చూడండి. ఆదివారం ఆలోచించటానికి ఉంటుంది. !

 

2 Comments
  1. వేలమూరి శ్రీరామ్ March 9, 2016 /
  2. Jani March 14, 2016 /