Menu

Masaan – స్వేచ్చ పొందు చోటు

ఇద్దరు వ్యక్తులు ఏకాంతంలో ఉంటే ఎంత కామమో అనుకుంటారు గానీ.. ఎంత ప్రేమో అని అనుకోరు. – చలం

కొందరు ప్రేమించి పెళ్ళి చేసుకుందామనుకుంటారు.  కొందరు ప్రేమిస్తారు జతకట్టాలని అనుకుంటారు. పెళ్ళయినా, జతకట్టటం అయినా ఒక వయసు నిండాక  వ్యక్తిగతం. కానీ అంత స్వేచ్చ ఇచ్చే సమాజాన్ని మనం నిర్మించుకోలేదు. దానికితోడు కాలానుగుణ ప్రమాదాలు ఉండనే ఉన్నాయి. అన్నీ కలిసి జీవితాన్ని సంక్లిష్టం చేస్తాయి. ఎదురుకొని నిలవమని సవాలు విసురుతాయి.   ఈ విషయాలని రెండు సమాంతర కథలుగా ఈ సినిమా తీసారు.!

మొదటికథ :

కోరికతో జతకట్టాలనుకోవటం అతిసహజం. పశ్చిమ దేశాల్లో అయితే దానికే సమస్యాలేదు. కానీ  ఖర్మ భూమి..ఆధ్యాత్మిక సనాతన సాంప్రదాయ దేశంలో,  ఒక అస్తవ్యస్త, గందరగోళ దేశంలో,  సహజాన్నీ సహజాతాలనీ కూడా మిధ్యాప్రపంచంతో..మంత్ర తంత్రాల తంతులతో ముడిపెట్టే దేశంలో, తుప్పుపట్టిన చట్టాలతో ..ఊడిపోయిన చక్రాలతో ధర్మం నాలుగు పాదాల నడపాలనుకునే దేశంలో.. ప్రతిమూలా, ప్రతి మనిషి మనసులో  అవినీతీ..లంచగొండితనంతో
ఒకడిని ఒకడు సకలవిధాలా మోసం చేసుకునే దేశంలో..ప్రతోడూ చచ్చునీతులు మాట్లాడి మనసు లోపల మచ్చుకయినా నీతిలేని మనుషులున్న దేశంలో, కనిపెంచిన పిల్లలకంటే..సమాజం, పరువు ప్రతిష్టలే ముఖ్యమైన దేశంలో, అసలెందుకు పుట్టామో..పెరిగమో పిల్లల్ని కన్నామో తెలియని నిరక్షరాస్యులు  మట్టి రేణువుల్లా  నిండిన దేశంలో  కామాన్ని  పెళ్ళికి ముందు తీర్చుకోవటం చులకన. నేరం. ఘోరం. అందుకే అది దొంగచాటు వ్యవహారం. పట్టుబడకుంటే హాపీ. పడీతే మాత్రం చావుబతుకుల సమస్య !!

ధనికులూ…గొప్పవాళ్లూ స్టార్ హోటళ్లలో చేసే రంకుకి ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తుంది. విషయాలు బయటికి పొక్కనీయకుండా కాపాడుతుంది. అర్బన్ లైఫ్ స్టయిల్లోఅది భాగమవుతుంది.   కానీ గతిలేనివాడు కామం తీర్చుకుంటూంటే  దాన్ని ఆపుతుంది. నేరంగా పరిగణించి కటకటాల వెనక్కి తొయ్యాలనీ చూస్తుంది. గుట్టు రట్టుచేసి  సమాజంలో పరువుని తీసి చావుకు  కారణం అవుతుంది.  వ్యక్తి స్వేచ్చ, నైతిక విలువలూ స్వేచ్చ చచ్చిన ఈ దేశం స్మశానంకాక మరేమి ?

ఓ అమ్మాయి.తల్లిలేనిది..వయసులో ఉన్నది. ఒకబ్బాయిని ప్రేమించింది. జతకట్టాలని అనుకుంది. తెలిసీ తెలియక లాజ్డ్ కొచ్చింది. పోలీసులకి పట్టుబడింది.  ఇద్దరువ్యక్తులు ఇష్టపడి దగ్గరైతే దాన్ని వ్యభిచారం అనే అంటుంది లోకం.  ఇలాంటి పరిస్థితిని,  పరువుమర్యాదలేమైపోతాయో అన్న పిరికితనాన్నీ ఆసరా తీసుకొని   అజమాయిషీ చేస్తారు అధికారులు. ఆ ఇద్దర్నీ అపరాధభావనలోకి తోసి పోలీసు ఆడుకుంటాడు.  పరువుపోతుందని ఆ ప్రియుడు బాత్రూంలో ఆత్మహత్య చేసుకుంటాడు.  గంగా ఒడ్డున కర్మకాండలు చేసుకుంటూ బతికే  ఆ ఒంటరి తండ్రికి విషయం తెలిసి నిస్సయంగా కుమిలిపోతాడు.  అమ్మాయి పరువు కావాలంటే మూడులక్షలిమ్మంటాడు పోలీసు. తనేమీ తప్పు చేయలేదన్న నమ్మకం ఉన్నది కనక అమ్మాయి కాస్త గట్టిగానే ఉంటుంది.  ఆ తండ్రి పోలీసుకు ముడుపు చెల్లించుకోవటం, ఆ అమ్మాయి తను అనుకున్నట్టు పైచదువులకి వెళ్లటం ఓ  కథ !!

రెండవ కథ
ప్రేమ చిత్రమైంది. వయసు రాగానే అవతలి  వ్యక్తిని ప్రేమించాలని అనిపిస్తుంది. చుట్టూ ఉన్న మనుషుల్లో ఎవరో ఒకరు నచ్చుతారు. నచ్చావు అని చెప్పే ప్రయత్నాలు మొదలవుతాయి. అవతలి వ్యక్తులు ఒప్పుకుంటే ఆనందం వర్ణనాతీతం.  తరవాతి తంతుకి ప్రణాలికలు సిద్దం చేసుకుంటారు ప్రేమికులు. కానీ  ఎక్కడ ఇద్దరు వ్యక్తులు ఒకటవుతారో, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ విడదీసే విషయాలు పొంచి ఉంటాయి. అది మనుశులు కావచ్చూ, వ్యవస్థ కావచ్చు, కులం,గోత్రం, డబ్బు  చివరికి చావు కావచ్చు.  దాన్ని ఎదుర్కొని నిలిస్తే ప్రేమ సఫలం..ఓడిపోతే విఫలం.

గంగా ఒడ్డున శవాలని తగలబెట్టే కులంలో పుట్టిన యువకుడు, వృత్తితో పాటూ చదువుకుంటూ ఉంటాడు. చదివి మంచి ఉద్యోగం సంపాదించాలని ఆశ. ఒకమ్మాయి తారసపడి ఇష్టపడి ప్రేమిస్తాడు. అమ్మాయికి తెలియజేస్తాడు. అమ్మాయి కూడ ఇతన్ని ఇష్టపడి ఒప్పుకుంటుంది. తమని కులం వేరుచేయొచ్చేమో అని భయపడి, అవసరమైతే లేచిపోయి పెళ్ళిచేసుకోవాలనుకుంటారు ఆ ప్రేమికులు. కానీ వాళ్లని విడదీసేది వేరే పొంచి ఉంది….మనసు వికలమై నిత్య రోదనమై ఒంటరి అయిన ప్రేమికుడు…తిరిగి స్వాంతన తెచ్చుకొని  నిలబడటమే  రెండవ కథ !!

సమాంతరంగా అల్లిన ఈ రెండు కథల్లోని ఆ పాత్రలు  గంగానది ఒడ్డున ఒకరికొకరు తారసపడటం తో ముగుస్తుంది సినిమా.

కాశీ పవిత్రక్షేత్రం. గంగానది ఒడ్డున శవదహనం జరిపితే ఆత్మలు పుణ్యలోకాలకి తరలుతాయని విశ్వాసం.  మసాన్ అంటే స్మశానం, అందుకే కాశీ ఒక  స్మశానం. చావుపుట్టుకల నిలయం. చచ్చిన మనుషులు/మనసులు స్వేచ్చని అందుకునే చోటు.

నీరజ్ గైవాన్ మొదటిసారి దర్శకత్వం వహించిన ఈ   సినిమా సినిమా కథ ఇచ్చే విషయం కంటే కాశీ బాక్ డ్రాప్ లో మనం ప్రస్తుత భారతీయ వ్యవస్థని,  మారుమూల ప్రాంతాల్లోకి పాకుతున్న టెక్నాలని జన  జీవితాలని ప్రభావితం చేస్తున్నతీరుని, దేశంలోని ప్రాంతీయ పరిస్థితులని, జనజీవిత దృక్పథాన్ని, ప్రభుత్వ యంత్రాంగ పనితీరునూ, మానవసంభంధాలనూ చక్కగా చూపించింది.

చిత్రీకరణ మొత్తం చాలా రియలిస్టిక్ గా సాగుతుంది. అవినాష్ అరుణ్ సినిమాటోగ్రఫీ  సహజశైలి ( naturalism/realism) లో చేసిన  చక్కగా కుదిరింది. ఇండియన్ ఓషియన్ అనే మ్యూజిక్ బాండ్  చేసిన  నేపథ్యసంగీతం సన్నివేశాల్ని ఎలివేట్ చేస్తే, పాటలు మానసిక భావోద్వేగాలని ప్రతిబింబించాయి. ఇహ నటీనటులు అతి సహజంగా నటించి, అంతా కళ్లముందే చాలా  జరుగుత్న భావనని కలిగించారు. వాళ్ల  భావోద్వేగాలతో మనం కూడా మమేకమవుతాం. గాఢతకలిగి.. మెల్లిగా ..గుంభనంగా సాగిన సినిమా అయిపోయిన తరవాత కూడా మనని వెంటాడుతుంది.  అందుకే  వివిధ సినిమా పండుగలలో  ప్రశంసలు అందుకున్నది.

మెయిన్ స్ట్రీమ్ సినిమా మన సమాజంలోని గ్లిట్టర్ నెస్ని, సూడో ఎమోషన్లనీ చూపిస్తే ఇలాంటి సినిమా నిజ జీవితాన్నికళ్లముందు ఉంచుతుంది.  జీవితానికి దూరంగా ఉన్న ఎన్ని సినిమాలు చూసినా కలగని భావనాత్మక ఆనందం ఇలాంటి ఒక్క సినిమా ద్వారా కలుగుతుంది నాలాంటి వాళ్లకి.   సినిమా ప్రేమికులు తప్పక చూడవలసిన సినిమా. !!

3 Comments
  1. Krishna Veni Chari January 8, 2016 /
  2. chakradhar January 8, 2016 /
  3. telugu nris January 8, 2016 /