Menu

The Man from the Earth

ఏది సత్యం…ఏదసత్యం…ఓ మహాత్మా…ఓ మహర్షీ!!!

జాన్ ఓల్డ్‌మ్యాన్ ఒక విశ్వవిద్యాలయంలో పదేళ్ల పాటు ప్రొఫెసర్ గా పని చేసి ఒక రోజు అకస్మాత్తుగా రాజీనామా చేసేశాడు. అతనితో పాటు పని చేస్తున్న మిగిలిన ప్రొఫెసర్లందరికీ అది చాలా విచిత్రంగా అనిపించింది. ఇంకో కొన్ని రోజుల్లో హిస్టరీ డిపార్ట్‌మెంట్ కి డీన్ గా పదోన్నతి పొందుతాడన్న విషయం దాదాపుగా ఖాయం అనుకుంటున్న సమయంలో జాన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వారెవరికీ అర్థం కాలేదు.

జాన్ ఇల్లు ఖాళీ చేసి తన సామానంతా ఒక ట్రక్ లో సర్దుకున్నాడు. ఇంకాసేపట్లో బయల్దేరడానికి సిద్ధంగా ఉండగా యూనివర్శిటిలోని తన మిత్రులంతా అతన్ని సాగనంపడానికి వచ్చారు. తనకు వీడ్కోలు చెప్పడానికి వచ్చిన తన స్నేహితులతో కబుర్లు చెప్తూ కూర్చున్నాడు జాన్. వచ్చిన వారిలో డ్యాన్ అనే ఆంథ్రపాలజిస్ట్, హ్యారీ అనే జీవ శాస్త్రవేత్త, ఆర్ట్ అనే పురావస్తు శాస్త్రవేత్త, క్రిస్టియానిటీ గురించి బోధించే ఎడిత్ ఉన్నారు. వారితో పాటే హిస్టరీ డీపార్ట్‌మెంట్ లో జాన్ తో పాటు పనిచేసే శ్యాండీ మరియు లిండా అనే ఒక విద్యార్థిని కూడా అక్కడకు చేరుకున్నారు. వారందరికీ ఒకటే అనుమానం: జాన్ అకస్మాత్తుగా ఎందుకు వెళ్లిపోతున్నాడు?

తమ అనుమానాన్ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా అడిగి చూశారు. కానీ జాన్ సమాధానం చెప్పకుండా దాటవేశాడు. వారందరూ అనుకుంటున్నట్టుగా తనకేవీ సమస్యలు లేవన్నాడు. ఇంతలో టాపిక్ మారింది. జాన్ సర్దుకున్న సామాన్లలో ఉన్న Van Gogh పెయింటింగ్ చూసి ఎడిత్ ఆశ్చర్యపోయింది. చూడ్డానికి నిజంగానే Van Gogh పెయింటింగ్ లానే ఉందది. అది ఒరిజినల్ పెయింటింగ్ కాదని, తనకో మిత్రుడు దాన్ని బహుమతిగా ఇచ్చాడన్నాడు జాన్.
ఇంతలో జాన్ ఇంటిలో ఒక మూల ఉన్న ఒక రాయిలాంటి దాన్ని చూసాడు డ్యాన్. పాతరాతి యుగంలో మనుషులు జంతువుల్ని వేటాడడం కోసం వాడిన ఆయుధం లా ఉందది. అది జాన్ దగ్గరకు ఎలా వచ్చిందని అడిగాడు డ్యాన్. పాత వస్తువులు అమ్మే ఒక షాప్ లో కొన్నానని చెప్పాడు జాన్.

మరో వైపు హ్యారీ అందరికీ తలో గ్లాస్ లో స్కాచ్ విస్కీ పోసి అందచేశాడు. అందరూ తీరిగ్గా సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. జాన్ ఇలా అకస్మాత్తుగా వెళ్లిపోవడం దిగులుగా ఉందని అన్నారు. పదేళ్ల క్రితం జాన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా చేరినప్పటినుంచీ ఇప్పటివరకూ ఏ మాత్రం మారలేదనీ, ఇప్పుడు తమని వదిలేసి వెళ్లిపోతుంటే బాధగా ఉందంది ఎడిత్.

తన స్నేహితుల మాటలన్నింటికీ దాదాపు మౌనమే సమాధానంగా తలూపాడు జాన్. అతని మౌనం వారిలో మరిన్ని అనుమానాలను రేకెత్తించింది. జాన్ తమకు చెప్పకుండా ఏదో దాస్తున్నాడని వారందరి అభిప్రాయం. వివిధ విధాలుగా అతన్ని అడిగి చూశారు. చివరికి జాన్ నోరు విప్పాడు. వారందరికీ తనొక విషయం చెప్పాలనుకుంటున్నానని అన్నాడు. అందరూ ఆసక్తిగా వినడం మొదలుపెట్టారు.

mfe1

జాన్ మాట్లాడడం మొదలు పెట్టాడు. “పాతరాతియుగం లో పుట్టిన ఒక మనిషి నేటివరకూ బతికే ఉండుంటే ఎలా ఉండేవాడని మీరనుకుంటున్నారు?” అని జాన్ వాళ్లందరికీ ఒక ప్రశ్న వేశాడు. మొదట అతని ప్రశ్న ఎవరికీ అర్థం కాలేదు. అన్ని రోజులు బతికుంటే గడ్డాలు, మీసాలు జడజడలుగా పెరిగి విచిత్రంగా ఉండిఉంటారని ఒకరు, అన్ని వందల సంవత్సరాల పాటు ఏ మనిషీ బతికుండే అవాకాశం లేదని ఒకరు, ఇదేం పిచ్చి ప్రశ్న అని మరొకరు, బహుశా అలా బతికుండే అవాకాశం ఉండుంటే ఇప్పటి మనుషులకంటే అతను కాస్తా పొట్టివాడై ఉండుంటాడని….ఇలా తమకు తోచిన సమాధానాలు చెప్పుకోచ్చారు వాళ్లంతా.

అసలైనా ఈ ప్రశ్నకు, జాన్ రాజీనామా చేసి వెళ్లడానికి సంబంధమేమిటా అని ఆలోచిస్తుండగానే జాన్ చెప్పడం మొదలు పెట్టాడు. తను పధ్నాలుగు వందల ఏళ్ల నుండీ భూమి మీద బతుకుతూ వస్తున్నాడని చెప్పాడు. అందరూ ఒక్క సారిగా ఉలిక్కి పడ్డారు. తను పూర్వం ఒక సారి కొలంబస్ తో కలిసి ప్రయాణించాడని, అప్పట్లో తనకి భూమి బల్లపరుపుగానే ఉందన్న నమ్మకం ఉండేదనీ, ఏదో ఒక రోజున తాము ప్రయాణిస్తున్న ఓడ భూమి చివరికి చేరుకుని అక్కడ్నుంచి పడిపోతుందనే భయం ఉండేదనీ జాన్ చెప్పాడు.

అంతా విన్న జాన్ మిత్రులు కాసేపు నోటమాట రాక ఉండిపోయారు. ఇంతలోనే జాన్ తాను చెప్పిందంతా ఒక కట్టు కథ అని తేల్చెయ్యడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వింటుంటే అంతా ఒక సైన్స్ ఫిక్షన్ కథలా ఉందన్నారొకరు.జాన్ చెప్తున్న కథ వినడానికి చాలా ఆసక్తికరంగా ఉందని కొనసాగించమని అన్నాడు హ్యారీ. జాన్ చెప్పడం మొదలుపెట్టాడు.

కొన్ని వందల ఏళ్ల క్రితం ఒక తెగలో జన్మించాడు జాన్. ముప్ఫై ఏదేళ్ల వయసులో ఉండగా అతనిలో ఎదుగుదల ఆగిపోయింది. అప్పట్నుంచీ అతను అదే రూపంతో, అదే వయసులో ఉండిపోయాడు. కొన్నాళ్ళకు అతని తెగలోని వారు జాన్ ని ఒక ప్రత్యేకమైన వాడిగా గుర్తించారు. కొన్నాళ్ళు దేవుడిలా ఆరాధించారు. కానీ ఆ తర్వాత జాన్ ని చూసి భయపడ్డారు. తమ లోని జీవశక్తిని కాజేయడం ద్వారానే జాన్ యువకుడిగా ఉండగలుగుతున్నాడని అతని మీద అపవాదు వేసి అక్కడ్నుంచి తరిమేశారు.

జాన్ చెప్తున్నదంతా ఆసక్తిగా విన్నారు వాళ్లు. అతను చెప్పేదంతా నిజమని నమ్మడం వారికి సాధ్యం కావటం లేదు. ఎలాగూ జాన్ స్వయంగా ఇదంతా కట్టుకథ అని చెప్పేశాడు కాబట్టి, వారే కథను కొనసాగించమన్నారు. నిజంగానే జాన్ 1400 ఏండ్ల నుంచి ఈ భూమ్మీద బ్రతుకుతూ వస్తుంటే అప్పటి విషయాల గురించి ప్రశ్నలు అడిగారు. జాన్ ఓపిగ్గా ప్రతి ఒక్క దానికీ సమాధానం చెప్తూ వచ్చాడు. కథ పాకాన పడింది. బుద్ధుడి తో కలిసి గడిపిన రోజులను నెమరు వేసుకున్నాడు జాన్.
జాన్ చెప్తున్న కొద్దీ వారిలో అనుమానం మొదలయింది. ఎంత పుస్తకాల్లో చదివి చరిత్ర గురించి తెలుసుకున్నప్పటికీ, జాన్ చెప్తున్న విషయాలు నిజమనే అనిపించసాగాయి. కానీ అప్పటివరకూ వారికి తెలిసిన జ్ఞానానికి అందని విధంగా ఉంది జాన్ చెప్పేది. అంతే కాదు! తను పదేళ్లకు మించి ఎక్కడా ఉండనని, లేదంటే తను ముప్ఫై ఏదేళ్లకు మించి వయసు పైబడటం లేదన్న విషయం తన చుట్టుపక్కల వాళ్ళకు తెలిసిపోతుందనీ చెప్పుకొచ్చాడు. ఆ కారణం చేతే తను రాజీనామా చేసి మరో కొత్త ప్రదేశానికి వెళ్లిపోతున్నానని చెప్పడంతో వారిలో చాలామందికి చిర్రెత్తుకొచ్చింది.

బహుశా జాన్ పిచ్చి వాడై ఉంటాడని కూడా వారికి అనుమానం వచ్చింది. జాన్ లేని సమయం చూసి, ఎందుకైనా మంచిదని తమ విశ్వవిద్యాలయంలో పనిచేసే మానసిక వైద్యుడు విల్ కి ఫోన్ చేసి పిలిపించారు.

కీలక సన్నివేశం

జాన్ చెప్పిందంతా వింటాడు విల్. అతనికి కూడా జాన్ చెప్పిందాంట్లో నిజమున్నట్టుగానే అనిపించింది. కానీ ఎలా నమ్మడం? ఒక మనిషి 1400 ఏళ్లు బ్రతకడం అసాధ్యం. విల్ ఒక్కడే కాదు. అక్కడున్న అందరికీ జాన్ మీద చిరాకొస్తుంది. అతను తమ నమ్మకాలతో ఆటలాడుతున్నాడని కోప్పడతారు. కానీ జాన్ మాత్రం తన కథ యధాతధంగా కొనసాగిస్తాడు. తన మేధస్సుకి అందని విధంగా మాట్లాడుతున్న జాన్ మీద విపరీతంగా కోపం వస్తుంది విల్ కి. అన్ని ఏళ్ల పాటు మరణం లేకుండా జీవిస్తున్న జాన్ ని తుపాకీ తో కాలిస్తే ఏమవుతుంది? మరణం సంభవిస్తుందా, లేదా? అని అడుగుతూ జాన్ వైపు తుపాకీ గురి పెడతాడు.

mfe5

అందరూ కలిసి విల్ ని ఆపుతారు. జాన్ మాటలన్నీ వట్టి మోసమని చెప్పి అక్కడ్నుంచి కోపంగా వెళ్లిపోతాడు విల్. వెళ్తూ వెళ్తూ, “ఒక వేళ నువ్వు చెప్పేదంతా నిజమే అయితే, మా ప్రాణాలను హరించి సజీవంగా ఉంటున్న నువ్వు మనిషివి కాదు; హంతుకుడివి” అని జాన్ తో కోపంగా అంటాడు విల్.

కానీ కోపంగా వెళ్లిపోయిన విల్ కాసేపటికి తిరిగివస్తాడు. అంతకుముందు రోజే తన భార్య చనిపోయిందనీ, ఆ బాధలోనే జాన్ మీద కోప్పడ్డాననీ చెప్తాడు. జాన్ చెప్తున్న కథ ఆసక్తికరంగా ఉండడంతో తిరిగొచ్చానని అంటాడు. తన కథను కొనసాగిస్తాడు జాన్. కథ ఎక్కడెక్కడో తిరిగి జీసస్ దగ్గరకు వస్తుంది. తనే ఒకప్పుడు జీసస్ అని చెప్తాడు. బుద్ధుడి దగ్గర నేర్చుకున్న సిద్ధాంతాలను ప్రజలతో పంచుకోవాలనుకున్నానే తప్ప తనకు వేరే ఏ ఉద్దేశమూ లేదని చెప్తాడు జాన్. క్రైస్తవ మతాన్ని పరమ పవిత్రంగా అవలంబించే ఎడిత్ అతని మాటలకు కోప్పడుతుంది. జాన్ లాంటి ఒక సామాన్యుడు క్రీస్తు అయ్యుండడానికి అవకాశం లేదంటుంది. అవి కాలక్రమంలో ఎలా రూపాంతరం చెందాయో చెప్తాడు. ఈజిప్ట్ గురించి, అక్కడ్నుంచి తను ఎక్కడెక్కడికి ప్రయాణించాడు, ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఎలా జీవించాడో చెప్తాడు.

అంతా విన్న వారిలో తెలియని ఒక అసహనం ఏర్పడుతుంది. ఇన్నాళ్లూ తాము చూసిన, విన్న, నేర్చుకున్న, అనుభవించిన వాటికి పూర్తిగా విరుద్ధంగా ఉంది జాన్ చెప్తున్నది. జాన్ మాత్రం “Anything is possible” అంటాడు. భవిష్యత్తులో జరిగేవి మనం ముందుగా ఊహించలేము. కానీ ఆ సంఘటన జరిగాక, అది పరిణామక్రమంలో తపనిసరిగా ఏర్పడే ఒక దశ అని సిద్ధాంతం చేయగలుగుతాం. తను కూడా అలాంటి ఒక పరిణామమేమో అని అంటాడు జాన్.

చివరికి అందరూ ఏక కంఠంతో జాన్ మీద కోపగించుకోగా జాన్ అసలు విషయం బయట పెడ్తాడు. తను అంతవరకూ చెప్పించి కేవలం కట్టుకథ అని మరోసారి తేల్చేస్తాడు. Van Gogh పెయింటింగ్, పాతరాతియుగం నాటి రాతి ఆయుధం, తను హిస్టరీ ప్రొఫెసర్ కావడం-ఇవన్నీ కథ చెప్పడంలో కలిసొచ్చాయంటాడు.

mfe3
ముగింపు: ఏక్షణంలోనైనా తమ జీవితాలకు పునాదులైన నమ్మకాలు పటాపంచలైపోయి పిచ్చివాళ్ళైపోతామేమో అనుకున్న క్షణంలో జాన్ చెప్పిందంతా కట్టుకథ అని తెలియడంతో ఊపిరి పీల్చుకుంటారు అందరూ. అతనికి వీడ్కోలు చెప్పి అందరూ బయల్దేరుతారు.

కానీ జాన్ ని చూసిన మొదటి రోజునుంచీ అతన్ని ప్రేమించిన శ్యాండీ మాత్రం జాన్ ని పూర్తిగా నమ్ముతుంది. జాన్ చెప్పిందంతా కట్టుకథ కాదని ఆమె నమ్మకం. అందుకే అతని గురించి మరిన్ని విషయాలు ఆరాతీస్తుంది. అంతకు పదేళ్ల క్రితం ఎక్కడున్నాడో, ముప్ఫై ఏళ్ల క్రితం ఎక్కడున్నాడో చెప్తాడు జాన్. అరవై ఏళ్ల క్రితం తను జాన్ టీపార్టీ పేరుతో ఉండగా ఒకావిడని పెళ్ళి చేసుకుని కొన్నేళ్లకు తన నిజం బయడపడ్తుందేమోనని తన కుటుంబాన్ని వదిలి పారిపోయాడని చెప్తాడు. అదంతా వెనకనుంచి విన్న విల్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. విల్ తన తండ్రి పేరు జాన్ టీపార్టీ అనీ, తన చిన్నప్పుడే తండ్రి ఇల్లు వదిలేసి వెళ్లాడని చెప్తాడు. విల్ అనుమానం నిజమే అని, తనే అతని తండ్రినని చెప్తాడు జాన్. విల్ నమ్మడు. కానీ తన చిన్ననాటి సంగతులు ఒక్కొక్కటి చెప్పగానే విల్ తీవ్రమైన ఉద్వేగానికి లోనవుతాడు; గుండెపోటుతో మరణిస్తాడు.

నిజం ఒప్పుకోని అందరూ ఎవరి దారిన వారు వెళ్లిపోగా, కళ్లముందు సాక్షాత్కరించిన నిజం తట్టుకోలేని విల్ గుండె ఆగి మరణించగా, నిజమో అబద్ధమో అతని సాన్నిధ్యం కోసం తపించే శాండీ తోడు రాగా జాన్ ఆ ఊరినుంచి బయల్దేరడం సినిమా ముగుస్తుంది

4 Comments
  1. sravan December 18, 2013 /
  2. Raj December 19, 2013 /
  3. Siva January 16, 2016 /