Menu

ప్రేమం – 24 కారట్ బంగారం లాంటి సినిమా

అనగనగా ఒక అబ్బాయి. ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అబ్బాయి చూడ్డానికి చాలా బావుంటాడు. తన ఊర్లోనే చదివే పదో తరగతి అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయం ఆ అమ్మాయికి ఎలాగైనా చెప్పాలి. కానీ ఎలా? ప్రేమిస్తున్నానని చెప్పడం అంత సులభమా?

రోజూ తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ అమ్మాయి కాలేజ్ బయట, ఇంటి బయట ఎదురు చూడ్డం, ఆ అమ్మాయి ఎక్కడికెళ్తే అక్కడికి ఫాలో అవడం. ఆ అమ్మాయి పుల్ల ఐస్ కొంటే వాళ్లూ అదే కొనుక్కుని తినడం – రోజూ ఇదే పని. ఎన్ని సార్లో ఆ అమ్మాయితో మాట్లాడాలని ప్రయత్నించినా ప్రతి సారీ ఏదో ఒక అడ్డంకి. చివరికి ఒక రోజు ఆ అమ్మాయే అతని దగ్గరకు వచ్చింది. తనకి మరొక అబ్బాయంటే ఇష్టమని చెప్పింది. అలా అతని మొదటి ప్రేమ కథ అలా ముగిసిపోయింది.

మూడేళ్లయింది. ఆ అబ్బాయి ఇప్పుడు కాలేజ్ లో డిగ్రీ చదువుతున్నాడు. ఈ మూడేళ్లలో అతను ఎంతో మారిపోయాడు. అమాయకంగా ఒకమ్మాయి చుట్టూ మౌనంగా తిరిగే అతను వేరు. ఇప్పుడు కాలేజ్ లో అందరితో గొడవలు పెట్టుకుని కొట్లాటకు దిగే ఇతను వేరు.

ఒక రోజు కాలేజ్ లో అమ్మాయిలను ర్యాగింగ్ చేస్తున్నాడు. ఇంతలో ఒకమ్మాయి అటు వైపుగా వెళ్తోంది. ఆమెను ఆపాడు. పేరేంటని అడిగి ర్యాగింగ్ చెయ్యబోయాడు. అప్పుడు ఆ అమ్మాయి నేనేమీ స్టూడెంట్ ని కాదు. ఈ కాలేజ్ లో లెక్చరర్ గా ఈ రోజే జాయినయ్యానని చెప్పేసరికి మనవాడు షాక్ తిన్నాడు. తీరా క్లాస్ కి వెళ్లి చూస్తే ఆమె వీళ్ల క్లాస్ కే లెక్చరర్ గా వచ్చింది.

కాటన్ చీర కట్టుకుని ఏదో చెప్పలేని కళ ఏదో ఆమె మొహంలో ఉంది. మనవాడు దెబ్బకి ఫ్లాట్ అయిపోయాడు. మరో ప్రేమ కథ మొదలైంది. ఆమె లెక్చరరే కానీ వయసులో దాదాపు మన హీరో గారి వయసే. మొదట ఇద్దరి మధ్యా స్నేహం కుదిరింది. ఒక రోజు కాలేజ్ డ్యాన్స్ పోటీల్లో మన అబ్బాయి గ్యాంగ్ కి డ్యాన్స్ నేర్పించడానికి ఒప్పుకుంది. ఈ అమ్మాయేంట్రా మనకి డ్యాన్స్ నేర్పించేది అనుకున్నారు మొదట. కొంపతీసి భరతనాట్యం చేస్తుందేమోనని కంగారు పడిపోయారు కూడా. కానీ ఆ అమ్మాయి డ్యాన్స్ చేయడం చూసి కళ్లు తిరిగిపోయాయి.

స్నేహం కాస్త ప్రేమగా మారింది. కాలేజ్ ఆఖరి రోజు. ఆ అమ్మాయి తన ఊరికి వెళ్లడానికి సిద్ధమైంది. అతనికి ఏదోలా ఉంది. ఆమె లేకుండానే మూడు నెలలు గడిచిపోయాయి. కాలేజ్ తిరిగి మొదలైంది. ఆమె వస్తుందేమోనని ఎదురుచూశాడు. ఆమె రాలేదు. ఆమె గురించి ఒక సమాచారం వచ్చింది. ఒక యాక్సిడెంట్లో గాయపడి కోలుకుంటున్న కారణంగా ఆమె ఉద్యోగం మానేసింది. అతనికి మనసాగలేదు. వెంటనే ఆమెను చూడాలనుకున్నాడు. స్నేహితులతో కలిసి బయల్దేరాడు. ఆమె ఇంటికి వెళ్లాడు. కానీ యాక్సిడెంట్ కారణంగా ఆమె తన గత స్మృతులన్నీ మర్చిపోయింది. అతన్ని గుర్తు పట్టలేదు. గాయపడిన హృదయంతో దిగులుగా అతను తిరిగి వచ్చేశాడు.

కాలంతో అన్ని గాయాల్నీ మానిపోతాయి. మూడేళ్లు గడిచిపోయింది.

ఇప్పుడు అతను ఒక కాఫీ షాప్ నడుపుతున్నాడు. తన పనేదో తనది. హాయిగా గడిచిపోతోంది జీవితం. అలాంటి ప్రశాంతమైన వాతావరణంలోకి ఒకమ్మాయి ప్రవేశించింది. ఆ అమ్మాయి అతనికి ముందే తెలుసు. గుర్తు పట్టలేదు. కానీ ఆ అమ్మాయి పట్టేసింది. ఆ అమ్మాయి ఐదో క్లాస్ లో ఉండగా తన వీధిలో ఉండే ఒక టెన్త్ క్లాస్ అమ్మాయికి సైట్ కొడ్తూ తిరిగిన అబ్బాయి ఇతనే. అతను ఆశ్చర్యపోయాడు. చిన్నపిల్ల కదా అని పుల్ల ఐస్ కొనిచ్చాడు ఆ రోజు. ఇప్పుడు ఇంత అందమైన అమ్మాయిలా తనముందు ప్రత్యక్షమవుతుందని అనుకోలేదు.

ముచ్చటగా మూడో సారి ప్రేమలో పడ్డాడు. కానీ ఆ అమ్మాయికి ఇది వరకే ఎంగేజ్‍మెంట్ అయిపోయింది. కానీ ఈ సారి మాత్రం ప్రేమలో ఓడిపోదల్చుకోలేదు అతను.

ఇదీ ప్రేమం అనే మలయాళం సినిమా కథ. వినడానికి ఏ మాత్రం గొప్పగా లేని కథ. వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితంలోనూ ఇలాంటివి బోల్డన్ని కథలు. మరి ఈ మాత్రానికే ఈ సినిమా యాభై కోట్లు వసూలు చేసి మలయాళ సినిమా చరిత్రలో అతి పెద్ద హిట్ ఎందుకయింది?

అందుకు ఒక కారణం అని చెప్పలేం. ఈ సినిమాలో ప్రతీది పాతదే. కానీ మనకి కొత్తగా కనిపిస్తుంది. అది సినిమాటోగ్రఫీ అయినా, నేపథ్య సంగీతం అయినా, నటీనటుల ఎంపిక అయినా – ఒక్క మాటలో చెప్పాలంటే ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ కి ట్వంటీ ఫోర్ కారెట్ బంగారం పూతపోసినట్టుగా ఉండే ఒక స్పెషల్ సినిమా ఇది. అంతా ఆర్డినరీ కానీ సినిమా ఎక్స్ట్రార్డనరీ!

premam-film-three-actress-sai-pallavi-anupama-madonna-620x330

ప్రేమం సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన ముగ్గురు హీరోయిన్ల గురించి చెప్పుకోవాలి. మొదటగా మేరీ పాత్రలో మెరిసిపోయిన అనుపమ పరమేశ్వరన్. అస్సలు ఏ మాత్రం టిపికల్ హీరోయిన్ లా ఉండదు. రింగుల రింగుల జుట్టు. బుట్టలా విరబోసుకుని అదోలా ఉంటుంది. మనం సాధారణంగా హీరోయిన్ అనగానే పట్టుకుంటే జారిపోయే కురులు (అవి వాళ్లక్కి స్వతహాగా లేకపోయినా, ఏ బ్యూటీ పార్లర్ లోనో అలా తయారు చేయబడుతాయి) ఉండాలని అనుకుంటాం. కానీ ఈ సినిమా దర్శకుడు అలా తన హీరోయిన్లను ఊహించుకోలేదు. మనం రోజూ చూసే అమ్మాయిల్లా ఉంటారు వీళ్లు. అందుకు సరైన ఉదాహరణ రెండో హీరోయిన్ మలర్ పాత్ర పోషించిన సాయి పల్లవి.

అసలీ అమ్మాయే సినిమాకి ముప్పావు ప్రాణం. ప్రేమం సినిమా చూసొచ్చిన సగం మంది మలర్, మలర్ అని కలవరించక మానరు. మరి ఆ అమ్మాయేమైనా అద్భుత సౌందర్య రాశా అంటే, అస్సలు కాదు. రోజూ మనం చూసే అమ్మాయిలా ఉంటుంది. అయితే మాత్రం ఏం? మనందరం ఐశ్వర్యా రాయ్ లాంటి అందగత్తెలనే ప్రేమించాలా ఏంటి? మనం ప్రేమించే అమ్మాయి సినిమా హీరోయిన్లా ఉండాలనే భ్రమ కలిగించే సినిమాలు ఒక టైపైతే, మనం ప్రేమించే లాంటి అమ్మాయిలనే తన సినిమాలో హీరోయిన్లగా చేసిన గొప్పతనం ఈ సినిమా డైరెక్టర్ ది. ఆ అమ్మాయి మొహం మొటిమలతో ఎర్రబడి ఉంటుంది. కావాలంటే టన్నులకొద్దో మేకప్ తో అవి కనిపించకుండా చేయొచ్చు. కానీ ఆ ప్రయత్నమేమీ కనబడదీ సినిమాలో. అసలీ అమ్మాయి కోసమే దర్శకుడు ఈ సినిమా తీశాడా అనిపించేంతలా ఉంటుంది ప్రేమం. ఇంతకీ ఈ సాయి పల్లవి మన తెలుగమ్మాయే! ఈ టివిలో జరిగే డ్యాన్స్ పోటీల్లో పాల్గొంది కూడా. అయినా కూడా ఈ అమ్మాయిని మనం గమనించలేదు. మనకంటే ముందే అల్ఫాన్సో పుత్రేన్ ఈ అమ్మాయి అందాన్ని కనిపట్టేశాడు. దాదాపు రెండేళ్లు ఈ అమ్మాయిని వేధించి, విసిగించి తన సినిమాలో హీరోయిన్ గా చేయడానికి ఒప్పించాడు.

ఇక మూడో అమ్మాయి. మడోనా సెబాస్టియన్. యూట్యూబ్ లోని ఒక మ్యూజిక్ ఛానెల్ లో మొదటి సారి చూశాను నేనీ అమ్మాయిని. అల్ఫాన్సో లానే నేను కూడా గత రెండేళ్లుగా ఆ అమ్మాయిని సినిమాల్లో నటిస్తారా అని విసిగిస్తూనే ఉన్నాను. హటాత్తుగా ఒక రోజు ప్రేమం సినిమాలో మూడో హీరోయిన్ గా ప్రత్యక్షమైంది. నిజంగానే ఈ అమ్మాయిని మన తెలుగు వాళ్లకి చూపిస్తే, హీరోయిన్ గా కష్టం కానీ హీరో చెల్లెలి పాత్రో, హీరోయిన్ ఫ్రెండ్ పాత్రో ఇస్తారు తప్పితే – హీరోయిన్ గా మాత్రం ఊహించుకోలేరు. కానీ ఈ అమ్మాయిని కూడా ప్రేమం సినిమాలో హీరోయిన్ ని చేసేశారు.

హిట్ సినిమా ఏదీ తెలుగు లో రీమేక్ కి అనర్హం కాదు. ఒక విధంగా పావు భాగం తెలుగు సినిమా నిర్మాతలు – ఏ భాషలో ఈ సినిమా హిట్ అవుతుందా? రీమేక్ చేద్దామా? అని ఎదురు చూస్తూ కూర్చుని ఉంటారు. కాబట్టి పెట్టిందానికి పదిహేను రెట్లు లాభాలు పొందిన ప్రేమం సినిమాని వదిలే ప్రసక్తే ఉండదు. కాబట్టే త్వరలో ఈ సినిమా తెలుగులో మజ్ను (అని అనుకుంటున్నారట!) అనే పేరుతో రాబోతోంది.

ప్రేమం సినిమా చూసిన చాలామంది అభిప్రాయం ఏంటంటే – ఈ సినిమా కాస్తా అటు ఇటుగా అప్పట్లో వచ్చిన ఆటోగ్రాఫ్ సినిమాలానే ఉందని. ఒక విధంగా అది నిజమే. కానీ సరిగ్గా పోల్చి చూస్తే – ఇప్పుడు ఆటోగ్రాఫ్ ఫక్తు సినిమాటిక్ గానూ, ప్రేమం చాలా నేచురల్ గానూ అనిపిస్తుంది. కాలం మహిమ. మనమేం చెయ్యలేం.

అయితే ఆటోగ్రాఫ్ సినిమాకీ ప్రేమం సినిమాకీ మరో పోలిక ఉంది. అప్పట్లో ఆటోగ్రాఫ్ సినిమా కథ పట్టుకుని చాలా మందికి చెప్పి, ఒప్పించలేక ఆ చిత్ర దర్శకుడు చేరన్, తనే హీరోగా చాలా సాధారణంగా కనిపించే అమ్మాయిలను హీరోయిన్లగా చేసుకుని ఆ సినిమా చేశాడు. కానీ అదే సినిమాని తెలుగులో రీమేక్ చేసినప్పుడు, అప్పట్లో మాంచి క్రేజ్ మీదున్న రవి తేజ ని హీరోగా, భూమిక ఒక హీరోయిన్ గా మరియు తమిళ్ సినిమాలో చేసిన ముగ్గురు అమ్మాయిలనే తెలుగులోనూ హీరోయిన్స్ గా పెట్టి తీశారు. కానీ సినిమా తేలిపోయింది. అందమే ప్రాతిపాదిక కాదు కాబట్టి తమిళ్ ఆటోగ్రాఫ్ లో చేసిన అమ్మాయిలనే తెలుగులో వాడుకోవాల్సిన అవసరం లేదు. ఆ మాత్రం నటించగలిగే అమ్మాయిలు మనకీ దొరుకుతారు. అంతే కాదు చిత్రానువాదంలో కూడా కొన్ని తప్పులు దొర్లాయి. తమిళ్ సినిమా కాబట్టి, అందులో హీరో తండ్రికి పక్క రాష్ట్రమైన కేరళలో ఉద్యోగమొస్తే అక్కడికి వెళ్తాడు. కథలోని ముఖ్య ఘట్టాలు కేరళ లో జరుగుతాయి. అదే సినిమాని తెలుగులో తీసేటప్పుడు – మన హీరో కూడా కేరళ కే వెళ్తాడు. ఏం? తమిళనాడు కి వెళ్లొచ్చు, కర్నాటకకి వెళ్లొచ్చు, మహారాష్ట్రకి వెళ్లొచ్చు, ఒరిస్సాకి కూడా వెళ్లొచ్చు. కానీ ఇదేం లేకుండా మక్కీకి మక్కీ తీసే ప్రయత్నంలో బోర్లా పడడం జరిగింది.

ఇప్పుడిదంతా ఎందుకంటే, ప్రేమం సినిమాకి ఇలాగే జరుగుతుందేమోనని కొంచెం బాధ, ఆందోళన, ఆవేశం. పైన కనిపిస్తున్న అమ్మాయిల లాంటి వాళ్లు మనకీ దొరుకుతారు. కానీ అవన్నీ వదిలేసి – మలర్ పాత్రకి ప్రముఖ హీరోయిన్, మరొక పాత్రకి ఇంకొక ప్రముఖ హీరోయిన్ – ఇలా సెలెక్షన్స్ జరిగిపోతున్నాయట.

ప్రేమం సినిమా ఆడిందే ఫ్రెష్‍నెస్ వల్ల. ఆ ఫ్రెష్‍నెస్ పోకుండా సినిమాని తెలుగులోకి అనువదించాలంటే ముచ్చటగా ముగ్గురు తెలుగుతనం ఉట్టిపడే అమ్మాయిలు కావాలి. అసలే కథాబలం లేని సినిమా. ఈ మాత్రం ఆలోచించరా ఏంటో? చూద్దాం తెలుగులో ఏమవుతుందో?

2 Comments
  1. బి. పవన్ కుమార్ December 19, 2016 /
  2. kumar July 11, 2017 /