Menu

కుమారి, ఐ లవ్ యూ. సుకుమార్, ఐ హేట్ యూ

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అబ్బాయిలకు కదా! కుమారీ నువ్వేంటో ఫస్ట్ సైట్ లోనే ఒకబ్బాయితో లవ్ లో పడిపోయావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. కాలనీలోకి రాగానే ఎంతమంచి నీ గురించి చెవులు కొరుక్కున్నారో తెలుసా? నువ్వు ముంబైలో ఏదో కేస్ లో ఇరుక్కుని హైదరాబాద్ కి తిరిగొచ్చావంట కదా! అయినా ఒక్క దానివి బాంబే లో ఎలా ఉన్నావు కుమారీ. అమ్మా, నాన్న లేకపోయినా, పక్షవాతం వచ్చిన తాతని చూసుకుంటూ ఎలాగో చిన్న చిన్న మోడలింగ్ ఎసైన్‍మెంట్ లు చేసుకుంటూ చిన్నగా జీవితం నెట్టుకొస్తున్నావు చూడు. నీ ధైర్యం నాకు నచ్చింది.

నిన్ను చూసి పాపమనుకునే వాళ్లు ఈ కాలనీలో చాలా మంది ఉన్నారు. మేమున్నాము కుమారీ నీకు. మా “దగ్గరకి” రా. నిన్ను”బాగా చూసుకుంటాం.” అని నీకు చెప్పి నిన్ను దగ్గరగా తీసుకుని నీకు “ఓదార్పు” ఇవ్వాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా కూడా వాళ్లని “దగ్గరకి రానివ్వకుండా”, వారి “ఓదార్పు” ని కోరుకోకుండా – వాళ్లడగక ముందే  “హే వస్తావా?” అని అడిగేసరికి పాపం వాళ్లకి నీ మీద కోపం. ఎంత ధైర్యం నీకు కుమారీ? వాళ్ల  “ఓదార్పు” ని కాదంటావా?

ఆడవాళ్లు మందు తాగకూడదు. సిగెరెట్ తాగకూడదు. నీలా షార్ట్ డ్రస్ లు వేసుకుని తిరక్కూడదు. ఇది మా కాలనీలో రూల్. మా కాలనీలోనే కాదు. ఇండియా మొత్తం ఇదే రూల్. అలా నువ్వున్నావంటే నువ్వు వాళ్లకి వెల్‍కం బోర్డ్ పెట్టి పిలిచినట్టే. ఈ మాత్రం నీకు తెలియదా? ఇదంతా నువ్వు కావాలనే చేశావు కదూ? నిన్ను సొల్లు కార్చుకుంటూ చూసే వెధవలందరి మధ్యలో సిద్ధు నీకు నచ్చడంలో ఆశ్చర్యం లేదు లే. అది మోడల్ రా…అందరితో తిరుగుతుందని, అది సినిమాల్లో చిన్న చిన్న వేషాలేస్తుంది. ఇలాంటి కేసులు డబ్బులికి వచ్చేస్తారనీ …ఇలాంటి జనరలైజ్డ్ ఒపీనియన్స్ లేని సిద్ధు నీకు నచ్చాడు కాబట్టే ఐ లవ్ యూ కుమారీ.

అమ్మాయిలు మందు, సిగెరెట్ తాగడమంటే – చూడు నేను చాలా బోల్డు అని చెప్పుకునే బోలెడు అమ్మాయిలుంటారు. కానీ నువ్వు వాళ్లలా కాదు. నీకేది ఇష్టమైతే అది చేస్తావు. కానీ కుమారీ నిన్ను చాలామంది సరిగ్గా అర్థం చేసుకోలేదు. పాపం వాళ్లని క్షమించు. మేమంతా ఇంతే కుమారీ. నువ్వు ఎందుకు ఇలా తిక్క తిక్కగా బిహేవ్ చేస్తున్నావని మాకు అర్థం కాదు. మాకు తిక్కలుండొచ్చు. దానికి లెక్కలుండొచ్చు. మా మగవాళ్లం ఎంత దగుల్బాజీ వెధవలమైనా అయ్యుండొచ్చు. మేమెంత వెధవలో మాకే తెలియకపోయుండొచ్చు. మేము లోఫర్స్, రోగ్స్, పోకిరీస్, జులాయిస్ …ఏమైనా అయ్యుండొచ్చు. అమ్మాయిలు మాత్రం నీలా ఉండకూడదు.

పాపం సిద్ధు కూడా మా లాంటి వాడే! నువ్వు చెప్పినవన్నీ అబధ్ధమైతే బావుండుననే భ్రమలో బతుకుతుంటాడు. ఊరికే సరదాగా నేను వర్జిన్ కాదని చెప్పింది కానీ కుమారి కుమారే అని ఎక్కడో గుడ్డి నమ్మకం. కానీ నువ్వు ప్రతి సారీ వాడికి అటూ ఇటూ తేల్చకుండా – నన్ను నన్నుగా ప్రేమించమన్నందుకే వాడికి నీ మీద కోపం. వాడికే కాదు. చాలా మందికి నీ మీద అందుకే కోపం. అంటే గతం తో అసలేమీ సంబంధం లేకుండా ఒకమ్మయిని ప్రేమించడం ఎలా సాధ్యమవుతుంది? అని వాళ్ల అనుమానం.

కానీ అనుమానం అన్నది మొదలయ్యాక గతం గురించి ఎంత చెప్పినా, ఏం చెప్పినా ఇంకా కొత్త అనుమానాలు రేకెత్తుత్తాయి తప్పితే అవి ఆగిపోవు. నిన్ను నిన్నుగా మొదట అంగీకరిస్తే కదా సిద్ధు గాడికి నువ్వు కూర్చోబెట్టి నీ గతాన్నంతా వాడికి చెప్పేది. ఫ్రెండ్స్ ఏదో అన్నారని అనుమానాలు పెంచుకున్నవాడికి నువ్వేం చెప్పినా అర్థం కాదనే మెచ్యూరిటీ నీకుంది కాబట్టే ఐ లవ్ యూ కుమారీ. కానీ ఐ ఆల్సో హేట్ యూ కుమారీ. బాధపడొద్దు. ఇందులో నీ తప్పేం లేదు. అంతా ఆ సుకుమార్ చేశాడు. యాక్చువల్లీ ఐ లవ్ యూ. బట్ ఐ హేట్ సుకుమార్.

సుకుమార్ గారూ, కుమారి లాంటి క్యారెక్టర్ కి ప్రాణం పోసినందుకే మీరు చాలా గొప్పవారైపోయరు. సినిమా చూస్తున్నంత సేపూ సుకుమార్ ఐ లవ్ యూ అనుకున్నా. ఎవరూ, ఏంటి, ఎందుకు, ఎలా అనే ఏమీ చెప్పకుండ కుమారి అనే ఒక అందమైన పొడుపు కథని సృష్టించారు. కుమారి ఒక మిస్టరీ. కాని ఆమె మిస్టరీ ని మీరు మీ సిద్ధు చేధించలేకపోయుండొచ్చు. కానీ మాలో ఎవరో కొంతమందికైనా మిస్టీరియస్ గర్ల్ గా మిగిలిపోయుండేది గా! అవన్నీ వదిలేద్దాం. ఎందుకండీ, ఆ అమ్మాయి చేత చివర్లో ఒక ఉత్తరం రాపించారు? ఏం చెప్పారా ఉత్తరంలో? తనో పతివ్రతనని చెప్పిందా? లేదా పూజకి పనికి రాని పువ్వునని చెప్పిందా? కుమారి చీర మీద మీరు చూపించిన ఆ రక్తం మరకలేంటి? అవి కన్నెపొర చిరగగా స్రవించిన రక్తమా? ముగ్గురు మృగాల అఘాయిత్యానికి చిందిన రక్తపు మరకలా? లేక ఈ కథను అటూ ఇటూ తేల్చలేక మీరు కార్చిన రక్తకన్నీరా? ఏదైతేనేం చెప్పీ చెప్పకుండా మీనా ఇంకా కుమారి అని తేల్చేశారా?

సరే ఒక వేళ కుమారి వర్జిన్ అనుకుందాం. అది డైరెక్ట్ గానే చెప్పాయల్సింది. అమెరికన్ బ్యూటీ లో మీనా సువారి గుర్తుందా? ఆ మీనా సువారి గుర్తుందా? ఆ అమ్మాయి ఈ మీనా కుమారి లానే కదా! ““మీ నాన్నే కొద్దిగా కండలు పెంచితే I would totally fuck him” అంటుంది. కాలేజ్ లో ప్రతి వాడితో పడుకున్నానని గొప్పలు పోతుంది. చివరికి ఏమవుతుంది? లెస్టర్ తో పడుకోబోయే చివరి నిమిషంలో నేనింకా కుమారినని చెప్తుంది. అప్పుడు లెస్టర్ కే కాదు, మనందరికి కూడా ఆ అమ్మాయి మీద సానుభూతి కలిగింది.  ఒక వేళ మీ ఉద్దేశం కుమారి వరిజిన్ అని చెప్పడం అయ్యుంటే అలా ఏదో చేసుండాల్సింది. అది మీ ఉద్దేశం కాకపోయుంటే, కుమారి చేత లెటర్ రాపించకుండా ఉండాల్సింది. అంటే కుమారి మందు తాగడం ఓకే కానీ, షాప్ కెళ్లి మందు బాటిల్ కొనడం తప్పయిపోతుందా? ఈ లాజిక్ ఏంటో అర్థం కాలేదు. ఒక పెద్ద తప్పు జరిగిపోయిన తర్వాతే కుమారి ని కుమారిలానే ప్రేమించాలని సిద్ధు రియలైజ్ అయ్యాడనుకుంటే, ఆ acceptance ని మాటల్లో చెప్పించకుండా ఉండాల్సింది.

ఇదే పాయింట్ ని మాటలే లేకుండా ఎలా చెప్పొచ్చో చూపించిన పై సినిమాలోలా చేసుండాల్సింది. ఎందుకో మీ సేఫ్టీ మీరు చూసేసుకున్నట్టుంది. వై సార్ వై? అందుకే …ఏం తెలుగు సినిమా కదా! కుమారి కుమారే అని చెప్పకపోతే ఆడియన్స్ క్షమించరనుకున్నారా సార్? 

చాలా సేపటి వరకూ కుమారి ఒక ఎనిగ్మా. కానీ హటాత్తుగా ఏమైందో ఏమో. ఆమె పొడుపు కథను విప్పే బాధ్యత తీసుకున్నారు మీరు. బహుశా కుమారి పొడుపు కథను మేము పడుపు కథగా అనుకుంటామనే భయమా?

ఐ స్టిల్ లవ్ కుమారి. బట్ ఐ హేట్ సుకుమార్.

5 Comments
  1. ashok krishna November 23, 2015 /
  2. chaks November 23, 2015 /
  3. Rajendraprasada Reddy August 2, 2017 /