Menu

కంచె – క్రిష్ చేసిన సాహసం

కమర్షియాల్టీకి దూరంగా క్రిష్ తీసే సినిమాలు ఎప్పుడూ ప్రత్యేకంగానే కనిపిస్తాయి. ఇప్పుడు క్రిష్ తీసుకొచ్చిన కంచె కూడా అదే ట్రెండ్ ని కంటిన్యూ అయింది.

సినిమా కథలోకి వెళ్లే ముందు.. సినిమా ట్రైలర్స్ లో వినిపించిన డైలాగ్ గుర్తుందిగా… మన ఇద్దరిలో ఎవరి శవం ఎవరు మోసుకెళ్ళినా ఊరు బాగుపడుద్ది”.

ఈ డైలాగ్ చుట్టూనే కంచె కథ అల్లుకుని కనిపిస్తుంది. రెండవ ప్రపంచం యుద్దం కాలం నాటి కథ ఇది. హిట్లర్ వంటి నియంత జాతి వైరం పేరుతో మారణకాండ సాగిస్తుంటే.. మన పచ్చటి పల్లెటూర్లలో..జాతి గొడవలు పెట్టి.. జమిందార్లు.. పెత్తందార్లు పబ్బం గడుపుకునే సమాజంనాటి కథ ఇది. ఖండాలు వేరైనా.. నేపథ్యాలు వేరైనా…జీవించే తీరు వేరైనా…హిట్లర్ కు మన పెత్తందార్లకు పెద్దగా పెద్దగా తేడా లేదంటూ కంచె కథను చెప్పుకొచ్చాడు క్రిష్.

విభజించేవారు విభిజిస్తున్నంత కాలం.. ఊరినిండా కంచెలే కనిపిస్తాయి. కులానికి కులానికి మధ్యే కంచెలే అడ్డుగా నిలిచి రాజ్యమేలుతాయి. మమతలు , ఆప్యాయతలు కాదు మసకబారి విద్వేషాలు విరుచుకుపడతాయి… ప్రేమపలకరింపులు కాదు.. పరుష చూపులు..కత్తులు నూరుతున్నట్లు కసి ఎగిసిపడుతుంది. కంచె వేసుకోని..హద్దులు గీసుకోని ..హక్కుగా జీవించేవారికి..ధూపాటి హరిబాబు బ్రతుకు అంటే ఏంటో చెప్పాడు. సరిహద్దల్నే చెరిపే సంకల్పం చూపించి గొప్ప సాహసాన్ని ప్రదర్శించాడు.

కంచెలో క్రిష్ చెప్పిన కథను ఇంతకన్నా చెప్పలేం… అది వెండితెర మీద చూడాల్సిందే.ఎంత చెప్పినా క్రిష్ కథను మాటల్లో వర్ణించలేం…

కథను చెప్పడంలో క్రిష్ సినిమాబై సినిమా పదునెక్కుతున్న వైనం చూస్తుంటే.. భయమేస్తుంది.ఒక కథను.. అంతర్జాతీయ సినిమా పంథాకి ఏమాత్రం తగ్గకుండా..తెలుగు దనం మిస్ అవకుండా చెప్పడం అంటే చిన్న విషయం కాదు.ఎక్కడ హిట్లర్ మారణ కాంఢ, ఎక్కడి మన పల్లేటూర్లు.. ఈరెండిటి కథను జోడించి.. కంచెను వేసుకుంటూ పోతే..మగిలేది ఏమున్నది అంటూ క్రిష్ చెప్పిన విధానం..తెలుగు సినిమా స్థాయిని పెంచింది.ఫస్ట్ ఫ్రేమ్ టు..లాస్ట్ ఫ్రేమ్.. ఒక దృశ్య కావ్యంగా కంచె కథను చెప్పుకొచ్చాడు క్రిష్.

ధూపాటి హరిబాబు గా వరుణ్ తేజ్, సీత గా ప్రగ్యాజస్వాల్, నటనలో అద్భుత పరిణితిని చూపించారు. వరుణ్ తేజ్ నటన, డైలాగ్ డెలివరీ గొప్పగా ఉంది.

వీళ్లే కాదు.. శ్రీశ్రీ కవితలతో స్ఫూర్తి పొందినట్లు కనిపిస్తూ… మనల్ని నవ్విస్తూ అంతలోనే ఆలోచింపచేస్తూ.. కనిపించే అవసరాల శ్రీనివాస్, వెల్ సెడ్ వెల్ సెడ్ అంటూ సింగీతం శ్రీనివాస్ తళుక్కున మెరిసినా..ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో కనిపించే ప్రతి చిన్న పాత్ర మనల్ని వెంటాడుతుంది. ప్రతి పాత్ర సన్నివేశాన్ని మరింత గొప్పగా ఆవిష్కరించింది. నటీనటుల నుంచి క్రిష్ నటనను రాబట్టుకునే తీరు గురించి తెల్సిందే.ఈ సినిమాలో కూడా ఆ కార్యక్రమం వందకు వందశాతం కనిపించింది.

కంచె సినిమాలో కనిపించని హీరో… సంగీత దర్శకుడు చిరంతన్ భట్ . మన వాడు కాదు.. బాలీవుడ్ నుంచి వచ్చాడు.అయినా.. కంచె సినిమా సంగీతాన్ని గొప్పగా అందించాడు. సినిమాలో ప్రతిపాటా.. సినిమాను మరో ఎత్తున నిలబెట్టింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి వర్ణించడానికి మాటలు చాలవు. క్రిష్ వెండితెర రూపానికి తన సంగీతం ప్రాణం పోసాడు చిరంతన్ భట్.

కంచె పాటలు ఇంత బాగా రావాడనికి కారణం .. సిరివెన్నెల సీతారామశాస్త్రీ. ఇంత అరుదైన కథకు పాటలు రాసే అవకాశం వస్తే.. శాస్త్రీగారు ఊరుకుంటారా.. విద్వేషం పాలించే దేశం ఉంటుందా… విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా .. ఉండుంటే అది మనిషిది అయి ఉంటుందా.. అడిగావా భూగోలమా … నువ్వూ చూశావా.. ఓ కాలమా.. అంటూ ఆయన తనకలంతో రెచ్చిపోయిన తీరు చూస్తే.. అగ్నికి వాయువు తోడైన తీరు గుర్తుకువస్తుంది.

నువ్వు ఎవరూ అంటే ఏం చేస్తావని ..అంతే కానీ ఏ రక్తం కాదు…,పాప కూడా యుద్ధం చేస్తోంది. పాల కోసం ఏడవాల్సింది ప్రాణం కోసం ఏడుస్తోంది.

సాయి మాధవ్ బుర్రా మాటలు.. పదునెక్కి..కంచెను బలంగా చూపించాయి. జ్ఞాన్ శేఖర్ ఫోటోగ్రఫీ.. మనల్ని 1940 కాలానికి తీసుకువెళ్లింది. ఇలా ఒక్క విభాగం కాదు..అన్ని విభాగాల సమష్టి కృషి ఫలితంగా కంచె సినిమా గొప్పగా కనిపిస్తుంది. హీరో గొప్ప పోరాటం సాగిస్తూ.. తన ప్రేమ కథను వివరిస్తూ సాగుతుంటాడు. కథ ఎక్కడా కూడా ప్రేక్షకులు అంచనాలకు అందకుండా సాగుతుంది. ఇటువంటి నరేషన్ ఈ మధ్యకాలంలో మనం చూడలేదు.వాడిన ఆయుధాలు..చూపిన ప్రదేశాలు కూడా కొత్తే.. అయితే తెలుగు సినిమాకు మహరాజపోషకులుగా నిలిచిన మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతవరకు నప్పుతుందో వేచి చూడాలి. కథ కంటే.. హీరోయిజమ్ పైనే ఎక్కువ ప్రాణం పెట్టుకునే మాస్ జనం ఈ సినిమాపై తమ తీర్పును ఎలా ప్రకటిస్తారో ఆశక్తికరంగా మారింది. క్లాస్ ప్రేక్షకుల అండతో.. క్రిష్ అభిమానుల ఆదరణతో ఈ సినిమా ప్రస్తుతం ముందుకెళుతోంది. 19 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ సినిమాటిక్ వాల్యూస్ ను మనకు అందించిన క్రిష్ సాహసాన్ని మెచ్చుకోని తీరాల్సిందే.

తెలుగు సినిమా అంటే మూస పంథాలో కనిపించే కథలు మాత్రమే కాదు.. కంచె వంటి సినిమా కూడా ఉంటుంది. పక్కన కోలీవుడ్ వాళ్లు కాదు కదా.. నార్త్ లో బాలీవుడ్ వాళ్లు కూడా ఈ సినిమాను ఇంత బాగా తీయలేరు.

చంద్రకాంత్

One Response
  1. Rajendraprasada Reddy August 2, 2017 /