Menu

కోర్ట్ – తనని తాను ప్రశ్నించుకోని ఏ వ్యవస్థ అయినా ప్రమాదకరమే!

ఈయన హీరో కాదు. హీరో అవ్వాలనీ అనుకోలేదు. ఈయన విలన్ కాదు. ఎవరికీ హాని చేసే ఉద్దేశమూ లేదు. ఈయన పేరు నారాయణ కాంబ్లే. వయసు ఎనభై. పిల్లలకి పాఠాలు చెప్పడం, వీలైనప్పుడల్లా తన పాటలతో ప్రజలను ఉత్తేజపరచడం – ఇదే ఈయన దైనందిన జీవితం. పాపం ఈ పెద్దాయన్ని ఎందుకిలా కోర్ట్ బోన్ లో నిలబెట్టారు? రండి తెలుసుకుందాం.

నారాయణ కాంబ్లే ఎప్పటిలానే ఒక స్టేజి మీద పాట పాడుతున్నాడు. పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు. పాట పాడడమే అతను చేసిన నేరం. అతని పాట విని ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడనేది కాంబ్లే మీద మోపిన అభియోగం. పాట విని ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారా? అవుననే అంటున్నాడు కాంబ్లే ని అరెస్ట్ చేసిన పోలీస్ ఇన్స్పెక్టర్. ఇంతకీ చనిపోయిన వ్యక్తి ఎవరంటే, నగరంలో డ్రైనేజీలు క్లీన్ చేసే పారిశుధ్య కార్మికుడు వాసుదేవ్ పవార్. పోలీసుల కథనం ప్రకారం – నిత్యం మురికి కాలవల్లో, మరుగు నీటిలో ఉంటూ బతకడం కంటే, డ్రైనేజీ క్లీనర్లు ఆత్మహత్య చేసుకోవడమే మేలని – కాంబ్లే పాడిన పాట విన్న వాసుదే పవార్, ఎటువంటి భధ్రతా సామాగ్రి లేకుండా డ్రైనేజీ హోల్ లో దిగి ఆత్మహత్య చేసుకున్నాడు. వాసుదేవ్ పవార్ ని ఆత్మహత్య కు ప్రేరేపించిన కారణంగానే కాంబ్లేని అరెస్ట్ చేశారు.

అసలిలాంటి కేసులు కూడా ఉంటాయా అని మనకి అనిపించవచ్చు. కానీ ఇలాంటి అర్థంపర్థం లేని కేసుల్లో ఇరికించబడ్డ వాళ్లకోసం స్వచ్ఛందంగా పోరాడే లాయర్ వివేక్ కి ఇది కొత్తేం కాదు. టెర్రరిస్ట్ అనే అనుమానంతో అరెస్ట్ చేసిన ఒక ముస్లిం వ్యక్తి ని ఎటువంటి ఆధారం లేకుండా ఐదేళ్లపాటు జైళ్లో పెడితే, ఆ వ్యక్తి తరుపున వాదించి బయటకు తీసుకొచ్చాడు వివేక్. కానీ కొన్నాళ్లకే మళ్లీ మరొక కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. వివేక్ అతన్ని మళ్లీ బెయిల్ మీద బయటకు తీసుకొచ్చాడు. మళ్లీ పోలీసులు ఇంకొక కేసులో ఆ వ్యక్తి ని అరెస్ట్ చేశారు. పోలీసులు అనుకుంటే ఏమైనా చేయగలరని వివేక్ కి తెలుసు. నిజానికి వివేక్ చాలా ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిన వాడు. అతనికి ఇవన్నీ చెయ్యాల్సిన ’అవసరం’ అయితే లేదు. అయినా కూడా మానవతా ధృక్పథంతో కాంబ్లే కేసు వాదించడానికి ముందుకొచ్చాడతను.

కాంబ్లే కేసు కోర్టుకొచ్చింది.

*****

కోర్ట్ లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ నూతన్, కాంబ్లే కి ఎలాగైనా శిక్ష పడేలా చెయ్యాలని వాదిస్తుంది. నారాయణ కాంబ్లే ముప్ఫై ఏళ్ల క్రితం ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడనీ, అతను మొదట్నుంచీ నేర ప్రవృత్తి కలవాడనీ నిరూపించాలనుకుంటుంది. ఎందుకు కాంబ్లే అంటే ఆమెకు అంత కోపమో మనకి అర్థం కాదు. నిజానికి ధనవంతుడైన వివేక్ కంటే నూతన్ కే కాంబ్లే మీదఎక్కువ జాలి కలగాలి. ఎందుకంటే అమె ఒక మధ్య తరగతి స్త్రీ. ఉద్యోగం అయిన వెంటనే స్కూల్ కి వెళ్లి పిల్లాడ్ని ఇంటికి తీసుకు రావాలి. భార్యా పిల్లలకు వంట చేయాలి. ఉదయాన్నే లేచి ఇళ్లంతా చక్కబెట్టి ట్రైన్ లో కోర్ట్ కి రావాలి. అయినా కూడా ఆమె తన ఉద్యోగ ధర్మాన్నే నమ్ముతుంది. అన్నీ రూల్స్ ప్రకారమే వాదిస్తూ కాంబ్లే ని నేరస్థుడిగా రుజువు చెయ్యాలని ప్రయత్నిస్తుంది.

ఇక ఈ కేస్ ని వింటున్న న్యాయమూర్తి సదావర్తే గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఆయన చాలా స్క్ట్రిక్ట్ మనిషి. ఒక మహిళ స్లీవ్ లేస్ వేసుకుని వచ్చిన కారణంగా, ఆమె కేసుని మరొక రోజుకి వాయిదా వేసే రకం.

వీళ్లందరితో పాటు దొంగ సాక్ష్యం చెప్పే వాళ్లు, కాంబ్లే ని అరెస్ట్ చేసిన పోలీస్ ఇన్స్పెక్టర్, చనిపోయిన వాసుదేవ్ పవార్ భార్య – ఇలా ఎంతో మందిని మనం చాలా దగ్గరగా చూస్తాం. వాయిదా తర్వాత వాయిదా తర్వాత వాయిదా…ఇలా కేస్ నెలల తరబడి నడుస్తూనే ఉంటుంది. కొన్నాళ్లకి లాయర్ వివేక్ కష్టం ఫలిస్తుంది. కాంబ్లే కి బెయిల్ వస్తుంది. ఇక ఫర్వాలేదనుకునే సమయంలో – కాంబ్లే ని మరొక కేస్ లో అరెస్ట్ చేస్తారు పోలీసులు. మరొక సారి అతని బెయిల్ కోసం అప్పీల్ చేస్తాడు వివేక్. కానీ ఆ రోజు నుంచి కోర్ట్ కి నెల రోజుల శెలవు. బెయిల్ ఇవ్వడం వీలు కాదంటాడు న్యాయమూర్తి. వివేక్ కి ఏం చెయ్యాలో పాలుపోదు. కావాలంటే హై కోర్ట్ కి వెళ్లమని సలహా ఇస్తాడు న్యాయమూర్తి.

నిజానికి ఇక్కడితో మనం సినిమా అయిపోయిందనుకుంటాం. కానీ ఇక్కడే దర్శకుడు మనల్ని ఆశ్చర్యపరుస్తాడు. నెల రోజులపాటు శెలవు దొరకడంతో అతని మిత్రులు, బంధువుల కుంటుంబాలతో కలిసి ఒక హాలిడే రిసార్ట్ కి బయల్దేరుతాడు న్యాయమూర్తి సదావర్తే. ప్రయాణంలో అంత్యాక్షరి ఆడుతూ సరదాగా గడుపుతారు. రిసార్ట్ చేరుకోగానే ఆటపాటల మధ్య హాయిగా ఎంజాయ్ చేసి భోజనం చేస్తారు. కాసేపటికి ఒక బెంచీ మీద కూర్చుని నిద్రపోతుంటాడు సదావర్తే. ఇంతలో అక్కడ ఆడుకుంటున్న పిల్లలు అతన్ని ఆటపట్టించాలనే ఆలోచనతో, మెల్లగా అతని దగ్గరకు వచ్చి గట్టిగా అతని చెవిలో అరవడంతో ఉలిక్కిపడి లేస్తాడు సదావర్తే. కోపంతో ఊగిపోతాడు. పిల్లలు తుర్రుమని పారిపోతారు. కానీ ఒక పిల్లాడు దొరికిపోతాడు. సదావర్తే ఆ పిల్లాడి చెంప ఛెళ్లుమనిపిస్తాడు. ఇంతకీ అసలా పిల్లాడికి మాటలే రావు- పాపం మూగవాడు.

*****

ఇది సినిమానే కావొచ్చు. కానీ సినిమా లో చూపించింది కట్టు కథ కాదు; పచ్చి నిజం. కోర్టంటే సినిమాల్లో చూడ్డం తప్ప నిజంగా చూడని వారికి, ఈ సినిమా చాలా విచిత్రంగా అనిపించవచ్చు. మార్క్ ట్వైన్ అన్నట్టు – ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్. 2008 లో జార్కండ్ లో జరిగిన జితేన్ మరాండి కేస్ ఆధారంగా దర్శకుడు చైతన్య తమానే కోర్ట్ కథ రాసుకున్నారు.

2006 ప్రాంతంలో జార్కండ్ ఆదివాసీల బతుకు చిత్రాన్ని జితేన్ మరాండి తన పాటల్లో చిత్రించి, ఆ పాటల ద్వారా వారిలో చైతన్యం కలిగించే వారు. అదే సమయంలో జరిగిన ఒక మర్డర్ కేస్ లో జితేన్ మరాండి అనే వ్యక్తి ని నిందితుడిగా పేర్కొన్నారు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు. కానీ సాక్షులు చెప్పిన జితేన్, ఈ జితేన్ వేరు వేరు. కానీ అవతల చనిపోయింది మినిస్టర్ చుట్టాలు కావాడంతో పోలీసుల మీద ఒత్తిడి ఎక్కువైంది. ఆ కేస్ లో ఈ జితేన్ ని ఇరికించారు. కొన్నాళ్లకి కేస్ లో జితేన్ కి ఏ మాత్రం సంబంధం లేదని మొదటే పోలీసులు ఒప్పుకుని అతన్ని విడుదల చేశారు. ఆరు నెళ్ల తర్వాత ఏమైందో ఏమో మళ్లీ జితేన్ ని అరెస్ట్ చేశారు. ఐదు సంవత్సరాల విచారణ తర్వాత అతనికి 2011 లో మరణ శిక్ష విధించారు. చివరికి ఎంతో మంది జితేన్ కి మద్దతుగా పోరాడడంతో రెండేళ్ల క్రితం అతన్ని ఈ కేసులనుంచి విముక్తి చేసి, విడుదల చేశారు.
ఇది నూటికో, కోటికో జరిగే ఒక కేసు కాదు. కళ్లు తెరిచి చూడగలిగితే చుట్టూ ఇదే జరుగుతోంది. శాంతిభధ్రతలను కాపాడ్డం రాజ్యం యొక్క బాధ్యత. ఆ ప్రక్రియలో భాగంగానే, అరెస్ట్ లు, విచారణలు, శిక్షలు ఉంటాయి. అయితే ఇక్కడ కొన్ని విషయాల గురించి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎవరి శాంతి? ఎవరి భధ్రత? ఎందుకు జితేన్ మరణపు అంచులదాకా వెళ్లాల్సి వచ్చింది? ఏం నేరం చేశారని అతనికి బెయిల్ రాకుండా చేశారు? సినిమాలో నారాయణ కాంబ్లే ఏం నేరం చేశాడని అరెస్ట్ చేశారు? ఎందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాంబ్లేకి శిక్ష పడాల్సిందే అని గట్టిగా వాదిస్తుంది? ఎందుకు డిఫెన్స్ లాయర్ తన సొంత డబ్బులతో కాంబ్లేకి బెయిల్ ఇప్పించాడు?

ఈ ప్రశ్నలకు సమాధానాలు కోర్ట్ సినిమాలో లేకపోవచ్చు. ఈ సినిమాలో కేసులు, వాదనలు మాత్రమే ఉన్నాయి. చివరికి జడ్జిమెంట్ కూడా ఏమీ ఉండదు – మరొక వాయిదా అంతే! మన నర నరాల్లో చొచ్చుకుపోయిన మూఢవిశ్వాసాలు, అవినీతి, అసమర్థత, ఉదాసీనత, నిరక్షరాస్యత లకు అద్దం పట్టే సినిమా ఇది. మన దేశంలో ఇలాంటి పరిస్థుతులు నెలకొన్నాయని తెలియకుండా మనలో ఎంతోమంది జీవితం కొనసాగిపోతుంది. మన అదృష్టం బావుండి, జీవితంలో ఎలాంటి కేసులోనూ ఇరుక్కోకపోతే కోర్టుకి పోయి అక్కడే జరిగే వ్యవహారం అంతా చూడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అయితే దురదృష్టం ఏంటంటే, “మనకి కోర్ట్ కి వెళ్లే గతి ఎందుకు పడుతుందిలే?” అని మనం పట్టించుకోకే మన వ్యవస్థ ఇలా ఉందేమో!

*****

ఈ సినిమాలో విలన్లు లేరు. పోనీ సినిమాలోని ఈ ఒక్క పాత్రకూడా అవతలి వారికి హాని చేయాలనే దురుద్దేశం ఉన్నట్టుగా కూడా దర్శకుడు చూపించడు. కానీ సినిమాలోని న్యాయమూర్తి, న్యాయవాదులు, పోలీసులు – అందరూ కూడా నారాయణ కాంబ్లే అనే అమాయక వృధ్ధుని బాధకు కారణమవుతారు. బహుశా ఇదే నేటి సమాజంలోని కఠిన వాస్తవమేమో!

ఇంకా కఠిన వాస్తవమేంటంటే, ఈ రోజుకి కూడా- కోర్ట్ అంటే భారీ భవనాలు, “భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తాను,” జడ్జి కోర్ట్ లోకి రాగానే, “ఆర్డర్. ఆర్డర్,” అనడాలు, లాయర్లేమో జడ్జి ని, “మి లార్డ్,” అని సంబోధించడాలు, – మనం సినిమాల్లో చూస్తూనే ఉంటాం. ఇది మన ఫిల్మ్ మేకర్ల అజ్ఞానానికి ఒక ఉదాహరణ. అంతే కాదు మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని, అందుకు అనుగుణంగానే మన కళలను రూపొందించాలనే అవగాహన లేకపోవడం ఇంకా దారుణం. అదృష్టవశాత్తూ ఈ చిత్ర దర్శకుడు చైతన్య మన న్యాయవ్యవస్థలోని లోపాలను పరిచయం చేస్తూనే, అసలు సమస్యను ఇంకా లోతుగా పరిశీలించాడు; వాస్తవ పరిస్థుతులకి అద్దం పట్టాడు.

అందుకే ఈ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడడమే కాకుండా, దాదాపు ఇరవై కి పైగా అవార్డులను సొంతం చేసుకుంది. బాహుబళి లాంటి భారీ సినిమాలను వెనక్కి నెట్టి ఇప్పుడు ఆస్కార్ రేస్ లో ఉంది. ఈ మధ్యకాలంలో భారత దేశం నుంచి అస్కార్ కి పంపిన సినిమాలకంటే కోర్ట్ ఎన్నో రెట్లు మంచి సినిమా. మన న్యాయ వ్యవస్థే కాదు, ప్రాచీనమైన చట్టాలతో నడుస్తున్న ఏ దేశ న్యాయవవస్థకైనా ఈ సినిమా వర్తిస్తుంది కాబట్టే ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా జేజేలు పలికారు. అయితే కథా వస్తువు పరంగా మాత్రమే కాకుండా సినిమాటిక్ లాంగ్వేజ్ పరంగా కూడా కోర్ట్ అంతర్జాతీయ స్థాయిలో ఉంది కాబట్టి ఈ సారి ఆస్కార్ కోర్ట్ సినిమాని వరిస్తుందేమోనని గట్టి నమ్మకం.