Menu

కోర్ట్ – ప్రశ్నించే సినిమా

ఈ సినిమా ఒక నిరసన. కూరుకుపోయిన కోపాన్ని వడబోసి చేసిన సినిమా. ఎంతో బాధను ఒక్క సారి బహిర్గతం చేస్తే ఈ సినిమా . ఈ సినిమా సమాజం ముందు నిలబడిన ఓ ప్రశ్న. తన గర్భంలోనే జవాబు ని కుడా దాచుకున్న ప్రశ్న. సమాజంలో రోజు జరిగే అన్యాయాలను చూసి చూసి తపించిపోయిన ఓ డైరెక్టర్ చేసిన సినిమా ఇది. కడుపు దహించుకుపోయే ఆకలి – కళ్ళు మిరుమిట్లు గొలిపే అంతస్థులు, న్యాయాన్ని నైతిక విలువలతో నిర్వహించాలని తపించే లాయర్ ఒక వైపు, – తన రోజూవారి మామూలు జీవితం మారకపోతే చాలు అనుకునే మరొక లాయర్,అన్యాయం స్వేచ్చగా చలామని అవుతున్న ఓ కోర్టు లో న్యాయం కోసం జరిగే పొరాటం – ఇలాంటి వ్యతిరేక పరిస్థితుల నడుమ సినిమా మొత్తం ఒక టెన్షన్ తో కొనసాగుతుంది.

ముంబై లోని ఓ మేన్-హోల్(man-hole) లో శవం దొరుకుతుంది. అది మురికికాలువల్లో పని చేసే ఒక కార్మికుడి శవం. అతను ఆత్మహత్య చేసుకున్నాడని  పోలీసులు కేసు రాసుకుంటారు. అంతకు ముందు రోజు అదే వీధిలో నారాయన్ కాంబ్లే అనే కార్యకర్త పాడిన పాట చేత ప్రేరేపింపబడి ఆత్మహత్య చేసుకున్నాడని ఆ కార్యకర్తను అరెస్టు చేస్తారు.  సినిమా అధ్యంతం ఈ కేసు మీద కోర్టులో వాదోపవాదాలు గా జరుగుతుంది. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ కోర్టు వాతావరణాన్ని నగ్నంగా నిలబెడుతాడు. ఆ కోర్టులో పని చేసే వాళ్ళ జీవితాలలోకి తొంగి చూయిస్తాడు. కోర్టులో చెలామని అయ్యే విశ్వాసాలనూ, పక్షపాతాలను, వివక్షలనూ బహిర్గతం చేస్తాడు.

ఈ సినిమా మనం ఉంటున్న సమయంలో చాలా అవసరమైన సినిమా.మన ప్రజాస్వామ్య విలువలనూ కాపాడుకోవటానికి ఇలాంటి సినిమా లు చాలా అవసరం. మొన్న యాకూబ్ మెమొన్ ని ఉరి తీసినప్పుడు మన దేశంలోని న్యాయవ్యవస్త పైన ఎన్నో విమర్శలు వచ్చాయ్. న్యాయవ్యవస్త లో పని చేసేది మనుషులే కదా- అలాంటప్పుడు వాళ్ళు ఎటువంటి పక్షపాతం లేకుండా తీర్పు ఇవ్వగలరా అన్నది – అప్పుడు వచ్చిన ప్రశ్నల సారాంశం. ఉదాహరనకి ఓ హిందూ కుటుంబంలో పుట్టిన న్యాయమూర్తి ఎటువంటి పక్షపాతం లేకుండా- ముస్లింకి హిందూకి ఒకే రకంగా తీర్పు నివ్వగలడ. మత-కుల-రాజకీయ-సామాజిక స్వభావాలు పుట్టి-పెరిగిన పరిస్థితుల బట్టి ఏర్పడతాయి అని మనోవిజ్ఞానశాస్త్రజ్ఞులు మొరపెట్టుకుంటున్న సమయంలో- న్యాయ వ్యవస్త ఎంత వరకు న్యాయంగా పని చేస్తోంది. ఎంత వరకు అన్యాయంగా పని చేస్తోంది. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ముందుకు వెళ్ళినప్పుడే ప్రజాస్వామ్యం తన రూపాన్ని కాపాడుకోగలుగుతుంది. అందుకే కోర్టు ప్రతి ఒక్కరూ చూడవలసిన  సినిమా. చూసి చింతించ వలసిన సినిమా.