Menu

మేఘ సందేశ సినీ కావ్యం

రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్ద:

పర్యుత్సుకో భవతి యత్సుఖితోపి జంతు:

తచ్ఛేతసా స్మరతి నూనం అబోధపూర్వం

భావస్థిరాణి జననాంతర సౌహృదాణి

అందమైన వస్తువును చూసినప్పుడు, మధురమైన శబ్దం విన్నప్పుడు ఎంత సుఖంగా ఉన్న ప్రాణికైనా తెలియని ఆవేదన కలుగుతుంది. బహుశా ఆ సమయంలో, ఆ ప్రాణి మనసులో మరచిపోయిన గతజన్మ అనుబంధాలు కలతపెడుతుంటాయి.

 -కాళిదాసు, అభిజ్ఞాన శాకుంతలం.


నూటికి తొంభైమంది జీవితాలు తామేమిటో, తమలో ఉన్న తపనేమిటో తెలియకుండానే గడచిపోతుంటాయి. ఒకవేళ తెలిసినా పరిస్థితుల మూలంగా ఆ అసలు వ్యక్తి మరుగునపడి కష్టసుఖాల కలబోతలో ఏదో విధంగా జీవితం నడచిపోతూంటుంది. కానీ ఎవరికో ఒకరికి, ఏదో ఒక సంఘటనలో తానేమిటో, తన స్వరూపమేమిటో తెలిసివస్తుంది. ఆ ఒకరికి విశ్వనాథ సత్యనారాయణ అంటూండే జీవుని వేదనో, కాళిదాసు వర్ణించిన జననాంతర సౌహృదమో ఒకానొక సందర్భంలో లోపలి పిలుపులానే కాక వేయింతల స్పష్టమైన వాస్తవంగా నిలుస్తుంది. అప్పుడు ఆ వాస్తవాన్ని గుర్తించకతప్పదు. తనను కదిలించి, తనలోని శక్తిని వెలికితెచ్చి అపూర్వమైన కార్యాన్ని చేయించగల ఆ శక్తికి ఆ వ్యక్తి దాసోహమంటాడు. కష్టం సుఖం, స్థితిగతులు, పేరుప్రతిష్టలు తానే చేయగల, తనను సమ్మోహితుణ్ణి చేయగల ఆ కళ లేదా విద్య ముందు పూచికపుల్ల విలువ కూడా చేయనివవుతాయి. అలాంటి తపనను కనుగొన్నవారిలో శాస్త్రవేత్తలూ, సంగీతకారులు, నటులూ.. ఒకరేమిటి ఎన్నో రంగాల వారు, ఆ విద్యలోనూ, కళలోనూ తన్మయులై బ్రతుకు పండించుకున్నవారు ఉన్నారు. అలాంటి తపనకు కథారూపమిచ్చి తెరకెక్కించిన దృశ్యకావ్యం – మేఘసందేశం.

అంతేకాదు, అలాంటివాడికి బాసటై నిలిచి తన కళను అతనిలో పండించిన విద్యాసుందరి జీవితమూ ఇది. అంతేనా అంటే అతని తృష్ణ తెలుసుకుని అతనికి దారి ఇచ్చి నిర్జనవారధిగా మిగిలిపోయిన మరో స్త్రీ వ్యధ కూడాను. అంతేనా అంటే ఇంకెన్నో.. ఆ కోణాల్లో కొన్నైనా చూద్దాం.

****

వృద్ధులుగా ఉన్న రవీంద్రబాబు(నాగేశ్వరరావు), పద్మ(జయప్రద)ల మధ్య కథ ప్రారంభమవుతుంది. ఆయన రాసి చూపించిన కవితను, ఆమె స్వరం చేసి గానం చేస్తూంటుంది, ఇంతలో ఓ యువకుడు (రాజా) వారిద్దరినీ చూడడానికి వస్తాడు. అతను ఓ పుస్తకాన్ని వారికి ఇచ్చి, ఇది తాను విని, తెలుసుకుని, కొంత ఊహించి రాసిన వారిద్దరి కథకు రూపమని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ పుస్తకం తెరచి చదువుతూండగా గతం ప్రారంభమవుతుంది.

రవీంద్రబాబు గోదావరి ఒడ్డున ఉన్న ఒకానొక పల్లెటూరికి ఊరిపెద్ద. ఆ ఊళ్ళో ఏం వచ్చినా ఇది మంచి, ఇది చెడు అని చెప్పి నలుగురినీ దారిలో పెట్టే పెద్దమనిషి. ఆయన మంచి సంగీతాభిమాని, సాహిత్యాభిలాషి. లలితకళలపై అభిరుచి ఉన్న రసజ్ఞుడు. ఆయన భార్య పార్వతి (జయసుధ) అనుకూలవతి అయినా ఈ సంగీత సాహిత్యాలు తెలియని సామాన్యమైన వ్యక్తి. ఆమెకి పూజలు, వ్రతాలు, నోములు అంటే చాలా నమ్మకం. ఎప్పుడూ ఏదోక వ్రతం చేస్తూంటుంది. వారిద్దరికీ ఓ పాప. గోదావరి అవతల ఓ వేశ్య వచ్చిందని ఆమె మోజులో పడి ఊళ్ళోని కుర్రాళ్ళంతా వేరే పనులు మానుకుని అక్కడే ఉంటున్నారని రవికి చెప్తారు. దాంతో రవి అవతలి ఒడ్డుకు వెళ్ళి అక్కడ కాపలా నిలబడతాడు, ఊళ్ళోని కుర్రాళ్ళు ఆయనని చూసి భయభక్తులతో పడవ మలిపించి వెళ్ళిపోతారు.

ఇలా కాపలాకి నించున్నప్పుడు ఆ ఇంట్లోంచి జయదేవుని అష్టపదుల్లో ఒకటైన ‘‘ప్రియే చారుశీలే’’ వినిపిస్తుంది. పద్మ (జయప్రద), ఆమె చెల్లెలు ఆ గీతాన్ని పాడుతూ అభినయిస్తూంటారు. ఆ గానం, అభినయం అతనిలో నిద్రిస్తున్న కవితావేశాన్ని మేల్కొలుపుతాయి, ఆమె ఆలపిస్తూన్నంత వేగంగానూ అందుకుని తనకు తానే తెలియని స్థితిలో అష్టపదిలోని ఆ కృతిని తెనిగిస్తాడు. ఇంతలో ఎవరో అతన్ని కర్రతో గాయపరుస్తారు. పద్మ తన ఇంట్లో కట్టుకట్టగా ఆమె ఉండమన్నా వినకుండా ఇవతల ఒడ్డుకు వచ్చేస్తాడు రవి. ఆయనలో రేగిన ఆ భావావేశం కారణంగా ఓ కవిత పెల్లుబుకుతుంది. ఆమె కారణంగానే ఆ కవిత రాయగలగడంతో రవి ఆ కవితను తీసుకువెళ్ళి పద్మకు చూపిస్తాడు. ఆమెతో మాట్లాడతాడు, మొదట తాను అసహ్యించుకున్నాని తెలిసినా ‘‘వర్షించేముందు ఆకాశం ఉరుముతుంది, దాని అర్థం నేను వస్తున్నానని’’ అంటూ కవితాత్మకంగా చెప్పిన ఆమె ధోరణి అతన్ని ఆకట్టుకుంటుంది. తన అభినయం, గానం వల్ల కేవలం సాహిత్యాభిమాని అయిన రవిలో కవితావేశం ఏర్పడిందని తెలిసి ఆమె సంతోషిస్తుంది. ఆమె ప్రభావంలోనూ, ఆమె రేపిన కవితావేశపు వెల్లువలోనూ కొట్టుకుపోతున్న రవీంద్రబాబు ఇల్లు పట్టకుండా తిరుగుతూ రాసుకుంటూంటాడు. ఆమె కూడా అతని రాకకు అతని ‘‘కవితావేశపు వెల్లువలో గోదారిగంగై పొంగుతూంటుంది’’.

రవీంద్రబాబు అంతకుముందు పద్మకు ఈ కవిత గురించి ఎలా చెప్పాలో తెలియక రాసుకుంటున్న రాతల్లో ఓ కాగితం పార్వతి చేతులో పడుతుంది. అది చదివిన ఆమెకు వారిద్దరి స్థితిపై అనుమానం ఏర్పడుతుంది. అంతలోనే ఊళ్ళోవాళ్ళు రవీంద్రబాబు, పద్మల మధ్య అనుబంధాన్ని అపార్థం చేసుకుని పార్వతికి రవీంద్రబాబు ఆమె వలలో పడ్డాడని చెప్తారు. రవి కూడా ఇల్లుపట్టకుండా తిరుగుతూంటాడు. వీటన్నిటి నేపథ్యంలో పార్వతి తన పుట్టింటికి వెళ్ళి అన్నగారికి ఈ స్థితి చెప్తుంది. ఆమె అన్నయ్య జగన్నాథం (కొంగర జగ్గయ్య) ఆమెతో పాటుగా ఊరికి వస్తాడు. ఊళ్ళోవాళ్ళను కనుక్కుంటే ఆమె వలలో పడ్డాడని చెప్తారు. గోదారి అవతలకు వెళ్దామని పడవల దగ్గరకు వెళ్తే రాత్రి చిరుదీపపు వెలుగులో, పడవపై కూర్చొని ఏదో రాసుకుంటూ, చుట్టూ ఏం జరుగుందో తెలియని స్థితిలో ఉంటాడు. జగన్నాథం అతన్ని రమ్మని ఇంటికి తీసుకువెళ్తాడు. బావగారితో నర్మగర్భంగానే మాట్లాడినా తర్వాతిరోజు వెళ్ళిన పద్మ ఇంట్లో మాత్రం కటువుగా మాట్లాడతాడు. పద్మ మనసు నొప్పించి, ఆమె ఇల్లు విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు.

ఆ విషయాన్ని తెలుసుకున్న రవీంద్రబాబు తన భార్యనీ, బావమరిదినీ నిందిస్తాడు. జగన్నాథం ‘‘ఊరందరికీ మంచీ చెడూ చెప్పవలసిన మిమ్మల్నే పదిమందీ పదిరకాలుగా అనుకుంటుంటే మాకెంత బాధగా ఉంటుందో తెలుసా?’’ అంటే రవి- ఎక్కడ రసస్పందన ఉంటుందో, అక్కడ భావావేశం ఉంటుంది, ఎక్కడ భావావేశం ఉంటుందో అక్కడ కవిత వినిపిస్తుంది. ఆమె ఓ అభినయ సరస్వతి, నాలో నిద్రపోతున్న కవితావేశాన్ని ఆమె నిద్రలేపింది. మా ఇద్దరి మధ్యా ఉన్న ఈ సంబంధానికి పదిమందీ చిలవలు పలవలు కల్పించడం, దాన్ని మీరు నమ్మడం చాలా బాధపెట్టిందంటాడు. పద్మ వదలివెళ్ళిన కుటీరంలోనే పడివుంటూ ఆమె లేని విరహంలో నేలపై కచికతో రాసుకుంటూంటాడు. జగన్నాథం అవి అపురూపమైన విరహ కవితా ఖండికలని గుర్తిస్తాడు. రవీంద్రబాబును ఇంటికి తీసుకువచ్చినా పద్మనే స్మరిస్తూ దొరికిన ప్రతి కాయితంపైనా తన ఆవేదన, విరహం కవితలుగా రాసుకుంటాడు.

జగన్నాథం ఆయన రాసిన కవితలన్నీ ఏర్చికూర్చి పుస్తకంగా రాస్తాడు. రవి ఏ అప్రాప్త మనోహరి కోసం రాశాడో ఆమెకే పుస్తకం అంకితమిద్దామని జగన్నాథం పుస్తకంగా ప్రచురించేందుకు ఒప్పిస్తాడు. మేఘసందేశం పేరిట ప్రచురించిన ఆ పుస్తకావిష్కరణ సభలో జనం మధ్య పద్మ తళుక్కున రవీంద్రబాబుకీ, పార్వతికీ కనిపించి మాయమవుతుంది. రవీంద్రబాబు అది తన చిత్తభ్రాంతి అని సరిపెట్టుకోగా, పార్వతి వెళ్ళి పద్మతో మాట్లాడుతుంది. తమతో వచ్చేయమని కోరుతుంది, అయితే పద్మ అందువల్ల ఆయనకు అవమానాలే జరుగుతాయని వారించి వెళ్ళిపోతుంది. ఇంతలో వెళ్ళిపోతున్న పద్మ కనిపించడంతో రవీంద్రబాబు వెంటపడి పరుగెడతాడు. సభ రసాభాస అవుతుంది.

తర్వాత భార్యాభర్తలు ఒకే ఇంట్లో అపరిచితుల్లా ఉండడం చూసి చూసి, జగన్నాథం ఇలా అయితే తన చెల్లిని తమ ఇంటికి తీసుకువెళ్తానంటాడు. బయటకువెళ్ళిన రవీంద్రబాబుకు తమ పెళ్ళినాటి ముచ్చట్లు జ్ఞాపకం వస్తాయి. ఊళ్ళో వాళ్ళు కూడా జగన్నాథం గారు మీ భార్యని తీసుకువెళ్ళారని, ఇలా ఆమెని క్షోభ పెట్టడం తగదని చెప్పడంతో మనసు మార్చుకుని ఆమె కోసం వెళ్తాడు. ‘‘మనసు మార్చుకున్నాను’’ అంటూ వచ్చిన అతడిని పార్వతి ‘‘నేనూ మనసు మార్చుకున్నాను, వెళ్ళిపోండి’’ అని పంపేస్తుంది. తర్వాత వచ్చి తెలుసుకున్న అన్నగారు అడగగా ‘‘ఆయన మనసంతా ఆమెపైనే ఉంది, ఇన్నాళ్ళూ ఆయన జీవితంలో ఉన్న ఏదో అసంతృప్తి ఆమె వల్ల తీరుతోంది. కేవలం లోకం కోసమే నా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు నేనూ వెళ్ళిపొమ్మంటే ఆమె దగ్గరకు వెళ్ళి తన ఆ అసంతృప్తి పూరించుకుంటారన్న’’ ఉద్దేశంతోనే చేశానంటుంది.

రవీంద్రబాబుకు పద్మ ఎక్కడుందో తెలియక ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ హంపీ చేరుకుంటాడు. ఈ క్రమంలో తీవ్రమైన బాధ, ఆవేదన, ఆరాటం కవితలుగా రూపం తీసుకుంటాయి. హంపిలోనే నివసిస్తున్న పద్మకి, అతని చెల్లెల్ని పెళ్ళాడతానన్న వ్యక్తి ద్వారా రవి తన ఇంట్లో లేని విషయం, మరోవైపు జగన్నాథానికి, పార్వతికి అతను పద్మవద్ద లేని విషయం తెలుస్తుంది. రవీంద్రబాబును ఓ ఇంటివారు తమ ఇంట్లో పెట్టుకుని కొడుకుకి చదువు చెప్పే మాస్టారుగా పెట్టుకుంటారు. పద్మ వెతుకుతూండగా హంపీలోని శిథిలాలయాల్లోనూ, ప్రాసాదాల్లోనూ రవీంద్రబాబు రాసిన పాటలు, కవితలు కనిపిస్తాయి. హంపీ ప్రాంతంలోనే ఉన్నాడు కనుక పద్మ నాట్యప్రదర్శన ఏర్పాటుచేస్తే తప్పక వస్తాడని ఆమె నాట్యప్రదర్శన మంచి ప్రచారంతో పెట్టిస్తుంది. మరోవైపు జగన్నాథం పలు ప్రాంతాల్లో వెతికిస్తూంటాడు. తమ గురువుగారు ‘‘మేఘసందేశం’’ అన్న కవితా సంకలనం రాసిన కవి అని పిల్లాడి ద్వారా తెలిసిన తల్లి జగన్నాథానికి పుస్తకంలోని చిరునామా ద్వారా ఆ విషయం ఉత్తరం రాస్తుంది. వాళ్ళని చూసిన రవీంద్రబాబు తప్పించుకుని వెళ్ళిపోతాడు. రవీంద్రబాబు, జగన్నాథం కూడా పద్మ నాట్యప్రదర్శన సంగతి తెలిసి వెళ్తారు. అక్కడ పద్మ, రవీంద్రబాబు ఒకరినొకరు కలుసుకుని ఒకటవుతారు. పార్వతి అది చూసి జగన్నాథాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది.

అలా కలిసిన సంవత్సరాలకు కూతురు పెళ్ళి సందర్భంగా జగన్నాథం రవీంద్రబాబును పిలుస్తాడు. రవీంద్రబాబు పద్మ బలవంతంపై వెళ్తాడు. కూతురి పెళ్ళి ముగిశాకా వెళ్ళిపోతున్న రవిని వారంతా ఆపేందుకు ప్రయత్నిస్తారు. చివరకి కనీసం భార్యకైనా చెప్పి వెళ్ళమంటారు. అక్కడ వారిద్దరి మధ్యా ఉద్వేగభరితమైన స్థితిగతులు ఏర్పడగా చివరకు అతను ఆ ఉద్వేగంలోనే గుండెపోటుతో మరణిస్తాడు. పద్మని తీసుకురాకుండా దహనం జరగకూడదని పార్వతి చెప్పడంతో, ఆమె కోసం వెళ్ళిన జగన్నాథం, ఊరిపెద్దలు ఆమె కూడా అక్కడ మరణించివుండడం చూసి నిర్ఘాంతపోతారు. వారిద్దరికీ పక్కపక్కనే అంతిమసంస్కారాలు జరిగి పొగమేఘం రూపంలో కలసివెళ్ళిపోయినట్టు చూపడంతో సినిమా ముగుస్తుంది.

****

మేఘ సందేశం సినిమాలో చాలా థీమ్స్ కనిపిస్తాయి. భారతీయ సామాజిక వ్యవస్థలోని వైవాహిక జీవితం, ఇంటలెక్చువల్ కంపానియన్షిప్, వ్యక్తి తనలో ఉన్న ఆసక్తిని అర్థం చేసుకుని దాన్ని అన్వేషించడం ఇలా ఎన్నో విషయాలు ఇందులో కనిపిస్తాయి. అంతే కాక దేవదాసీ వ్యవస్థలో వర్థిల్లిన కళలు, వేశ్యాత్వం వల్ల ఆ వ్యవస్థకు ఏర్పడిన కళంకం వంటివీ కనిపిస్తాయి. ఇన్నిటిపై సమగ్రమైన అవగాహన, వైరుధ్యాలను వైవిధ్యాలుగా తీసుకోగలిగిన దృక్పథం ఉండడం వేరు, దాన్ని దృశ్యమాధ్యమమైన సినిమాలో చెప్పడం వేరు. కథ, కథనాల్లోకి ఈ అంశాలన్నిటిని తీసుకురావడం, దర్శకుడు చాలా విషయాలను సినిమాలో దృశ్యంలోనూ, నేపథ్య సంగీతంలోనూ, నటీనటుల అభినయంలోనూ చెప్పించడం కూడా చాలా అపురూపమైన విషయం.

****

కవితై పిలిచిన మనిషి

నేపథ్యం

దేవదాసీ వ్యవస్థ సంక్లిష్టతను చాలా సినిమాల్లో కన్నా బాగా ఇందులో చూపించారు. దేవాలయాల్లో సంగీత, నృత్యాలు చేసి దేవుణ్ణే భర్తగా భావించేందుకు దేవదాసీలుగా వివిధ కులస్తులు ఆడపిల్లల్ని సమర్పించడం వందల ఏళ్ళనాటి సంగతి. మొదటి నుంచీ ఉందో, లేక మధ్యలో ప్రారంభమైందో కానీ ఆ దేవదాసీలు దేవుణ్ణే భర్తగా భావించాలి అన్న ఆదర్శం మసకబారి వాళ్ళు వేశ్యా వృత్తికి అంకితమవుతూ వచ్చారు. ఇది ఒకపక్క ఉండగా, మరోపక్క దేవదాసీ వ్యవస్థ మన సమాజంలో సంగీత, సాహిత్య, నృత్యాలు వంటి కళల్లో పారం చూపించిందనడం నిస్సందేహం. వారి సంగీతం, వారి నృత్యం పేరొందినదని చాలామందికే తెలిసినా వాటివెనుక సాహిత్యపు దన్ను కూడా చాలా గట్టిదన్నది కొంత తక్కువ తెలిసిన వాస్తవం. ఒకవిధంగా దేవదాసీలు లలిత కళలను వారిదైన శైలిలో వారిళ్ళలో అభివృద్ధి చేశారు. వాటిలోనూ శృంగారానికి చాలా పెద్ద పాత్రే ఉన్నా కళాకారులుగా వారిని తక్కువ చేయడానికి లేనే లేదు.

మిగతా సమాజంపైన వారి ప్రభావం రెండు విధాలుగానూ ఉంది. వారి మోజులో పడి ఇళ్ళు వదిలి, భార్యాబిడ్డల్ని అలక్ష్యం చేసిన వారుండడం ఒక కోణం, సంగీత సాహిత్య నృత్యవేత్తలుగా రసవృష్టిని వర్షించి కళాకారులను తట్టిలేపడం మరో కోణం. ఈ నేపథ్యంలో 19వ శతాబ్దపు పాలకులైన బ్రిటీష్ వారికి ఈ వ్యవస్థ మురికి కూపంగా తోచింది, వారితో సన్నిహిత సంబంధాలున్న సంస్కర్తలదీ దాదాపు అదే కోణం. తెలుగునాట అటువంటివారిలో ప్రఖ్యాతులు వీరేశలింగం పంతులు. అయితే అధికారంలోని వారికి ఈ దృక్పథం ఉండడంతో దానికి రాజముద్ర పడింది, దేవాలయాల్లో సానుల ప్రదర్శనలు నిషేధించారు. దానివల్ల ఈ వ్యవస్థ అంతరిస్తుందని భావించివుంటారు.

నాణానికి మరోవైపు చూస్తే, బెంగళూరు నాగరత్నమ్మ అనే సంగీతకారిణి, దేవదాసి ఈ పరిణామాన్ని వ్యతిరేకించారు. దాదాపు ఉద్యమస్థాయిలో ప్రయత్నాలు చేశారు. ఇలా దేవాలయాలతో సంబంధం తెగగొట్టడం వల్ల తప్పనిసరి అయి మరింతమంది వేశ్యావృత్తిలోకి జారిపోతారని ఆమె భావించారు. వీరి పోరాటం ఫలించలేదు కానీ చరిత్రలో మాత్రం ఓ ఆత్మగౌరవ ఉద్యమంగా నిలిచిపోయింది. అలా దేవాలయాల్లో స్థానం కోల్పోయిన దేవదాసీలు అప్పటికే ఉన్న అలవాట్ల ప్రకారం జీవిక కోసం కళను, వేశ్యావృత్తినీ కూడా కొనసాగించివుంటారు. మద్రాసు కేంద్రంగా కర్ణాటక సంగీతం వైభవం పొందిన యుగంలో దేవదాసీ కులస్తులైనవారికీ ప్రధానమైన పాత్ర ఉంది. కళాకారులుగా వేదికలపై రాణించినవారిలో వేశ్యవృత్తిని వదిలివేసి సాంసారిక జీవనాన్ని సాగించినవారూ ఉన్నారు.

ఇక దేవదాసీల్లోని కళల గురించి నేను కొత్తగా చెప్పనవసరం లేదు. సాహిత్యంలో ఇది చర్విత చర్వణమే. విశ్వనాథ సత్యనారాయణ వేయిపడగల్లోని దేవదాసి పాత్ర అందుకొక రూపం. బెంగళూరు నాగరత్నమ్మ మొదలుకొని ఎం.ఎస్.సుబ్బలక్ష్మమ్మ వరకూ ఎందరో సంగీతాన్ని సుసంపన్నం చేసినవారున్నారు. ఇక రికార్డుల రంగారావుగా పేరొందిన ప్రముఖ సంగీతజ్ఞుడు, కళాభిమాని, నాట్యకారుడు ఎ.వి.కె.రంగారావు దేవదాసీల సంగీతం గురించి చెప్పిన విశేషాలు, నటరాజ రామకృష్ణ ముసలి వయసులో వున్న దేవదాసీల నుంచి స్వీకరించి విలాసినీ నృత్యం పేరిట పునరుజ్జీవింపజేసిన నృత్యరూపం, దేవదాసీల సాహిత్యవేతృత గురించి ‘‘కథలు గాథలు’’లో చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి రాసుకున్న విశేషాలు వంటివెన్నో సాక్ష్యాలు ఉన్నాయి.

****

సినిమాలో దేవదాసీల రసవేతృత, కళా నైపుణ్యం వంటివి విస్తృతంగా చూపించారు. ఒకరకం పెద్దమనుషుల్లో ఉన్నట్టే దేవదాసీల పట్ల చులకన భావంతో ఊరవతల దిగిన ఆమెను అసహ్యించుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్ళిన కథానాయకుడికి ‘‘ప్రియే చారుశీలే’’ అన్న అష్టపది గానం చేయడంలోనూ, ప్రదర్శించడంలోనూ ఆమె కళ మొదటి సారి పరిచయమై సమ్మోహితుణ్ణి చేస్తుంది. అతన్ని బయట ఎవరో కొట్టాక, ఆమె ఇంట్లో కట్టుతో నిద్రలేస్తాడు. లేచీ లేవగానే దర్శకుడు వరుస షాట్లలో చూపించేవి ఇలా వుంటాయి
1. భీష్మ పితామహుడు (పురాణపండ రంగనాథ్ రచన), అష్టాదశ పురాణాలు, అలంకారిక శాస్త్రానికి సంబంధించినవీ అయిన గ్రంథాలు
2. పూలమాల వేసి, కొబ్బరి చెక్కలు పాదాల వద్ద పెట్టివున్న లోహపు నటరాజ ప్రతిమ

3. వరుసగా రాముడు, లక్ష్మీదేవి, శివపార్వతులు, సరస్వతీదేవి, కృష్ణుడు వంటి దేవతల వర్ణచిత్రాలు. అవీ పాతరకమైనవి.

4. అద్వైత మతాచార్యుడైన ఆదిశంకరుడు, ఆయన నలుగురు శిష్యులతో ఉన్న పటం.

5. తెల్లటి వస్త్రంపై అమర్చిన వీణ.

సంగీత సాహిత్య మత విషయాల్లో వారిని పరిచయం చేసే విషయాలివి. అతను ఊహించుకోని కొత్త విషయం ఇది. తర్వాత అతను ఆమెకు తాను రాసిన కవిత చూపించేందుకు వచ్చినపుడు, నేను మిమ్మల్ని అసహ్యించుకున్నానని తెలసినా ఎందుకు నాపై కోపం రాలేదు అంటే ‘‘వర్షం వచ్చేముందు ఆకాశం ఉరుముతుంది, దాని అర్థం నేను వస్తున్నానని చెప్పడమే’’ అంటారు పద్మ. అంత ఆలంకారికంగా మాట్లాడడాన్ని చూసి ఆశ్చర్యపోతారు నాయకుడు.

కానీ అందరూ ఇవి చూసే రారు, వచ్చేవారందరికీ ఈ కళానురక్తితోనే రారు. అదీ స్పష్టమే. శంకరాభరణం సినిమాలో మంజుభార్గవి పాత్రలా కేవలం కళానురక్తి తప్ప విటులను దగ్గరకి చేరనివ్వని బ్లాక్ అండ్ వైట్ పాత్ర కాదు ఇది. జగన్నాథంతో మాట్లాడేప్పుడు ‘‘చెడిపోయి ఇక్కడకు వచ్చినవారే తప్ప, ఇక్కడకి వచ్చి చెడినవారెవరూ లేరు’’ అంటుంది పద్మ. ఆ వెంటనే వచ్చే డైలాగుల్లోనే ‘‘పొట్టకూటి కోసం’’ ఇదంతా చేస్తున్నామని అంటారు వాళ్ళు. తర్వాత్తర్వాత చెల్లెలు ఎవరో కుర్రాడితో చనువుగా మాట్లాడుతోండడం చూసిన పద్మ ‘‘ఇక ఈ ఇంట్లో అలాంటివారెవరూ రావడానికి లేదు’’ అని అంటుంది.  ఇన్ని ఛాయలూ చూపిస్తూన్న దేవదాసీ పాత్ర తెలుగు సినిమాల్లోనూ, సాహిత్యంలోనూ కూడా చాలా అరుదు.

****

కవిత పిలిచిన మనిషి..

ఎందరిలోనో కవిత్వం, నాట్యం, సాహిత్యం, జిజ్ఞాస వంటివి దాగివుంటాయి. వాటిని అలా దాగివుండనిస్తూ జీవితాన్నే గడిపేవాళ్ళెందరో. కానీ కొందరికి మాత్రం అవి ఓ సందర్భంలో బయటకువచ్చి ఎదుట నిలుస్తాయి. ఒక వ్యక్తికి తన జీవితాన్ని సినిమా తీయాలనిపించవచ్చు, మరొకరికి ఏదో అన్యాయం ఎదుర్కోవాలనిపించవచ్చు, మరొకరికి ఎవరూ చేయని కవితల్లో కవిత్వం చనిపోకుండా అనువదించాలని అనిపించవచ్చు. అవి అలా ఎదుట నిలిచిన క్షణం, ఇదే మన జీవిత పరమార్థం అనిపించిన క్షణం ఆ వ్యక్తి ఆ లక్ష్యానికి, ఆ కళకీ, విద్యకీ అంకితమైపోతాడు. ఆ పని చేయడంలో మంచీ చెడూ, ఆకలీ దప్పులూ, నిద్రా సుఖం వంటివేవీ పట్టవు. ఒకరి దృష్టిలో అదొక తపస్సు, మరొకరి దృష్టిలో అదొక పిచ్చితనం. ఎవరే పేరు పెట్టినా వారికి సమస్య ఉండదు. ‘‘ఈ కరణి వెర్రినై ఏ కతమ తిరుగాడ’’ అంటూ ఆ జీవితాశయం వారిని నిలబెట్టేస్తుంది.

ఈ కరణి వెర్రినై ఏ కతమ తిరుగాడ?

ఈ కరణి వెర్రినై ఏ కతమ తిరుగాడ?

అలాంటి జీవితాశయం స్థానాన్ని వేరేదో పెడితే పండదు కనుకనో ఏమో అప్రాప్త మనోహరి పద్మగా పెట్టారు సినిమాలో. అలాంటి ఓ జీవితాశయాన్ని సాధించే క్రమంలో దాసోహమనే రంగంగా కవిత్వాన్ని నిలిపారు. ఆ క్రమంలోని రవీంద్రబాబు తాపత్రయం, కృషి, పట్టుదల, నిరాశ అన్నీ ఓ గొప్ప అంశాన్ని సాధించే సాధకుడితో పోల్చేందుకు సరిపోయేలా వుంటాయి. ఆమె కళతో పరిచయమే అతనిలో కవితావేశానికి మేల్కొలుపు అవుతుంది, ఆమె విరహంలో తనకు తానే తెలియని స్థితిలో ఓ ఖండకావ్యాన్నే రాశాడు, ఆమె కోసం వెంటాడుతూ వెళ్తూ కచిలతో గోడల మీద, నేలమీద అపురూపమైన కవిత్వాన్ని రాశాడు. మెరుపును ఉరుము అనుసరించినట్టు ఆమెను అతను, అతన్ని కవిత అనుసరించింది. అలా పాత్రను ఏకకాలంలో ఓ సాంకేతిక చిహ్నంగానూ, రక్తమాంసాలున్న వ్యక్తిగానూ రూపొందించడం గొప్ప ప్రయత్నం.

కవిత్వం రాసేప్పుడు వ్యక్తిలోని మథనం ఎలావుంటుందన్నది స్క్రీన్ పై చూపడం కొంచెం కష్టం. అలాగే ‘‘నాట్యంలో ఆ వ్యక్తి తాదాత్మ్యత చెందారు’’, ‘‘సంగీతం అతనిలో రసస్పందన కలగజేసింది’’ అన్నలాంటి వాక్యాలను తెరపైకి దృశ్యంగా అనువదించడం సులభం కాదు. సినిమాలో పలు సందర్భాల్లో ఇలాంటి వాక్యాలకు తెరరూపం కల్పించడానికి దర్శకుడు చేసిన వివిధ ప్రయత్నాలు అభినందనీయం. బాలమురళీ కృష్ణ కచేరీలో ‘‘పాడనా వాణి కళ్యాణిగా’’ పాట విన్నప్పుడు అందరూ లేచి వెళ్ళిపోతుంటే రవీంద్రబాబు అలాగే కూర్చొని ఉండిపోతాడు, వేరెవరో వచ్చి కదిపి లేపితే కానీ అతను ఆ తన్మయత్వం నుంచి బయటకు రాలేకపోతాడు. రాత్రి భార్య పక్కన పడుకున్నప్పుడు ఆమె కళ్ళలో కోర్కెల దీపాలు వెలుగుతూండగా, అతను పరధ్యానంగా ఉంటాడు. అతని మనసులో బాలమురళీ ఆలపించిన పాటే మారుమోగుతూంటుంది. అంతలో మధురమైన గీతం విన్నప్పుడు ఎంత సుఖమైన ప్రాణికైనా ఆవేదన కలుగుతుంది, అది ఏదో జన్మల సంబంధం గుర్తురావడం వల్ల ఏర్పడ్డ మధురమైన బాధ అన్న అర్థం వచ్చే ప్రఖ్యాతమైన కాళిదాసు శ్లోకం వేసి, అర్థం చెప్తారు. పక్కనే భార్య ఉండగా, ఆమె కూడా అతని వంక ఆశగా చూస్తుండగా అతను మాత్రం భార్య ‘‘ఆకులో ఆకునై’’ పాట పాడుతున్నట్టు ఊహించుకోవడాన్ని చూపించడం అతనికి కళపై ఉన్న ఆసక్తినే కాకుండా ఏదో ఆలంబన పట్టుకుని తన భావుకతను సంతృప్తి పరుచుకోవడాన్ని సూచిస్తుంది. పద్మ పరిచయమయ్యేవరకూ అలాంటి పరధ్యానమంతా సంగీతంపైనో, భార్య

తన్మయత్వానికి తెరరూపం

తన్మయత్వానికి తెరరూపం

పాడి అభినయించని గీతాన్నో ఊహిస్తూ దానిపై కేంద్రీకృతమైవుండగా – పద్మ, ఆమె కళ పరిచయమ్యాకా అతని మనస్సులో దృశ్యాన్ని ఆమె వాస్తవంగా చేసిన నాట్యం కదలాడడం మొదలవుతుంది. అతను కవిత రాసేప్పుడు కూడా పద్మ, తన చెల్లెలితో అష్టపదులకు అభినయం చేస్తున్నట్టు అతనికి కనిపించడాన్ని చాలా చక్కగా చూపిస్తారు. అతని భావుకతకు ఆమె ఆలంబన ఎలాగయ్యిందో మాటల్లో చెప్పకుండా ఇలా తెరరూపం కల్పించారు. తొలిసారి అష్టపది విని గోదావరి దాటి వస్తున్న అతని మనసులో పడవ సాగుతూండగా ‘‘ప్రియే చారుశీలే’’ పాట వినిపిస్తూండడం, గోదావరి ఒడ్డును తాకి పడవ ఆగిపోయి భౌతికంగా ఏర్పడ్డ గట్టి మార్పు వల్లనే మనసులో సాగుతున్న పాట ఆగిపోవడం చూపిస్తారు. అలానే ‘‘నిన్నటిదాకా శిలనైనా’’ పాట ఇద్దరి మనసుల్లో మోగుతూండగా ఒకరికొకరు చేరువైన పద్మ, రవిల్లో పద్మని ఆమె చెల్లెలు పట్టుకోవడంతో హఠాత్తుగా పాట ఆగిపోవడం వంటివి చూస్తే దర్శకుడు భావావేశం, రసజ్ఞత, కవితావేశం వంటి ఎన్నో నైరూప్యమైన అంశాలకు రూపం ఇవ్వడంలోని చూపిన ప్రతిభ తెలుస్తుంది. మౌనాన్ని, ధ్యానాన్ని ఇష్టపడే కథానాయకుడి తత్వాన్ని తెలియపరిచేలా ఎన్నో సన్నివేశాల ముగింపులో రీరికార్డింగ్ కేవలం గోదావరి చిరు గలగలలు, వీచే గాలుల శబ్దాలు మాత్రమే ఉపయోగించి చేశారు.

***

సినిమాలో మరో పార్శ్యం ఈ మేధో సహజీవనం వల్ల పార్వతి తన సంసార జీవితాన్ని కోల్పోవడం. ఏ కోణం నుంచి చూసినా పార్వతి పాత్రకు సినిమాలో జరిగినది చాలా అన్యాయం. కథాగమనంలో హాయిగా ఆ విషయాన్నే వదిలేసివుండొచ్చు రచయిత తలుచుకుంటే, కానీ ఆమెకు జరిగింది ఓపలేని అన్యాయమన్న కోణాన్ని కూడా ప్రవేశపెట్టి చాలా కథని చాలా సంక్లిష్టం చేశారు. ‘‘భర్తని అన్ని విధాలుగా సంతృప్తిపరచలేని వ్యక్తిని భార్య అనడానికి తగదు, అలా సంతృప్తిపరిచిన మనిషే భార్య’’ అన్న పతివ్రతా ధర్మాలు మూర్తీభవించిన మనిషి కావడంతో, అవే ఆమె దాంపత్యానికి లోటు తెచ్చిపెడతాయి. అన్నీ ఉన్నా భర్త పొందుతున్న తెలియని వేదన, అసంతృప్తి ఆమె అర్థం చేసుకుంటుంది. అతన్ని అర్థం చేసుకుంటుంది. ఆ అసంతృప్తిని పద్మ తొలగిస్తోందన్న విషయమూ క్రమంగా అర్థమవుతుంది. దాంతో తనను తానే నిందించుకుని, అతన్ని వెళ్ళగొట్టి చివరకు ఆమెతో కలవడానికి మార్గం వేస్తుంది. ఆఖరి సన్నివేశంలోనూ ఆమె తనను తాను నిందించుకుంటుందే తప్ప అతనిపై ఆమెకెలాంటి ఫిర్యాదు ఉండదు. ఇలాంటి పాతివ్రత్యాన్ని దర్శక, రచయితలు సమర్థిస్తున్నట్టు కనపడదు, కానీ ఇదీ విషయం అని మాత్రం చెప్తారు. రవి, పార్వతిల కూతురు మాట్లాడే మాటలు, అతను పశ్చాత్తాపంతో పక్కన నిలవనే లేకపోవడం వంటివాటితో ఆమెకెంతటి అన్యాయం జరిగిందో తెలుస్తూనేవుంటుంది. సినిమా చివరి సన్నివేశాల్లో అతన్ని చూసి ఆమె పొందే దు:ఖం, అతను ఆమె పక్కన కూర్చోవడానికే అర్హత లేనివాడిగా భావించడం వంటివి చూసినప్పుడు కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ఆత్మకథ ‘‘నిర్జనవారధి’’లో ఎన్నో ఏళ్ళు విడిపోయాకా భర్తను చూస్తే భర్తలా కాక మావగారిలా కనిపించారని (భర్త క్రమంగా ముసలివాడవడాన్ని ఆమె చూసివుండకపోవడమో మరే కారణమో) రాసిన విషయం గుర్తొచ్చి కలుక్కుమంది. ఆఫ్ కోర్స్ కొండపల్లి కోటేశ్వరమ్మ గారి దృక్పథానికీ, పార్వతి పాత్ర ఆలోచనలకు సంబంధమే లేదులెండి. వివాహమనే వ్యవస్థలో కుదురుకోలేకనో, క్రూరత్వం వల్లనో మరే కారణం వల్లనో భర్తకు దూరమైపోయి ఒంటరితనంలో మగ్గిపోయి కష్టపడిన ఎందరో అభాగినుల జీవితాలు గుర్తుకురాక మానవు. సినిమా చివర్లోని ఆ సన్నివేశాల్లో అతనెంతో గొప్ప కళాకారుడనీ, కవి అని మరే విషయం చెప్పుకున్నా సముద్రం కెరటాలకు నునుపైపోయిన రాళ్ళలా కన్నీటికి ఆమె కళ్ళకింది చర్మం చారలు కట్టడానికి తగ్గ కారణమనీ, జస్టిఫికేషన్ అనీ ఒప్పదు.

***

ఇక మరో కోణం నుంచి చూస్తే, సమాజం ఇందులోని ముఖ్యపాత్రే. ఆ సమాజానికి ఒకలాంటి ప్రతినిధి – జగన్నాథం. ఆ కోణం నుంచి రాయాల్సివస్తే కథానాయకుడు రవీంద్రబాబు సమాజాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడని చెప్పాలి. తనంటే ఆరాధన కలిగిన భార్య, తనకూ ఆమె అంటే పెద్ద అయిష్టత ఏమీ లేదు. చక్కని కూతురు, సంపాయించుకున్నదో, పెద్దల నుంచి వస్తున్నదో ఊళ్ళో తీర్పరి అనే గౌరవం-ఇన్నిటిని తనలోని పిలుపుకు వదిలేసుకున్నాడు. అవతలి మనిషి దేవదాసీ, ఆమెకు వేశ్యాత్వమూ ఉంది, పాండిత్యమూ ఉంది. ఏమో ఏం చేస్తున్నాడో అనే అంటుంది సమాజం. ఆమెతో సాహచర్యం కావాలంటే, ఆ రసారాధన కావాలంటే పైన చెప్పిన అన్ని బంధాలూ, స్థానాలు వదులుకోవాల్సివుంటుంది.

ఐతే రవీంద్రబాబు అనుకున్నదేమిటీ-తాను పెద్దమనిషిగా బతకడం, భార్యాపిల్లల్ని చూసుకోవడం, తన నిత్యవ్యవహారాలు నడిపించుకోవడం సమాజానికి పట్టేవిషయాలనీ, తన కవిత్వం, తన రసాస్వాదన, తన రససృష్టి తనవని. సమాజం కోసం తనవైనవి వదులుకోకూడదని. కానీ భారతీయ సమాజాన్ని దాని తాత్త్వికతతోనే చెప్పాలి కాబట్టి ఏదైనా చివర దశతోనే చూడమంటుంది. అంటే-నువ్వెన్ని గంతులు వేశావన్నది కాదు, తుదిలో ఏదీ లేకపోయినా సంతృప్తిగా జీవించగలిగావా? వెనుదిరిగి నేను ఏ దశలోనూ పొరపాటు చేయలేదు; అప్పటికి ఆ దశలో సరి అనిపించింది చేశాను. దాని ఫలితం ఏదైనా కానీ నేను చేసినదాంట్లో తప్పులేదని నిన్ను నువ్వు సంతృప్తి పరుచుకోగలిగావా? నీ జీవితం ధన్యం. అదే వానప్రస్థాశ్రమం అంటే. ఇదీ దాని లెక్క.

చివరి దశలో రవీంద్రబాబు తన అనుకున్న కవిత్వం తనకు తృఫ్తినివ్వలేకపోయింది. పైగా తనది కాదు, సమాజానిది అనుకుని వదిలేసిన బాధ్యతలు ఆయన హృదయాన్ని తగులబెట్టేశాయి. జీవితంలో తాను చేసినవాటిలో కొన్నిటి పట్ల అసంతృప్తితో, తప్పు చేశానే అన్న పశ్చాత్తాపంతో ముగిసింది ఆ జీవితం. ఐతే గమ్మత్తేమిటంటే -కవిత్వమో, కళో, సేవో నువ్వేదైతే అచ్చంగా నీదనుకుని నీ వాళ్ళని అన్యాయం చేశావో అది నిజానికి సమాజానిది. అందుకే రవీంద్రబాబుని పెళ్ళికి పిలవడానికి వచ్చినప్పుడు, ఆయన పెళ్ళికి వచ్చినప్పుడూ అంతా గౌరవిస్తారు. ఆ గౌరవం ఏనాడో మన ఊరికి పెద్దగా ఉండేవాడని కాదు కవి అనే. అలాగే కూతురు మమ్మల్ని వదిలి వెళ్ళకని అడిగితే, అల్లుడు (ఇతను సమాజంలో భాగమే తప్ప పెళ్ళయేంతవరకూ కుటుంబంలోని వాడు కాదు) ఇంతటివాడు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నాడని మురిసిపోతాడు. అదే అల్లుడు రవి-పద్మల దాంపత్యాన్ని శాశ్వతీకరిస్తూ పుస్తకం రాస్తాడు. పైగా వీళ్ళెవరికీ ఆయన గతంలో వదిలివేసిన బంధాల వల్ల ఆయనంటే అగౌరవం కలగకపోగా మాకు కవిత్వాన్ని ఇచ్చినవాడని గౌరవం కలుగుతుంది. ఇదీ సంగతి.

ఆయనకు ఆలంబనగా జీవిస్తూ, తన జీవితాన్ని సార్థకం చేసుకుని మరోవైపు ఆయన వెళ్ళవలసి వచ్చినప్పుడు ఒప్పించి పంపించిన పద్మ ఏ చింతలేక తృప్తిగా మరణించింది. తనకంటూ ఓ నీతి ఉంది, తనకంటూ ఓ మనిషి ఉన్నాడు, తనకంటూ ఓ గుప్పెడు జ్ఞాపకాలు ఉన్నాయి అన్న తృఫ్తి. మరోవైపు తాను నమ్ముకున్న పాతివ్రత్యం తనకు సుఖం కలిగించకున్నా తనకు తాను నిజాయితీగా ఉన్న పార్వతి కూడా తృప్తిగానే మరణిస్తుంది. చివరకు భర్త మరణించినప్పుడు కూడా ‘‘ఆమె రాకుండా కదలడానికి లేదు’’ అని శాసించడం ఆమె నమ్మిన విలువలకు చివరిమాట. ఇక అలాంటి మనిషికి జీవితంలో వెనుదిరిగి చూసుకుంటే తాను పొరబాటు చేశానన్న మాట రాదు. ఇలా వారిద్దరిదీ చివరిదశ తృప్తిగా సాగితే, తెలిసి తెలిసి చేసిన అతను మాత్రం చివరకు దు:ఖంలోనే మరణిస్తాడు. ఇది సమాజ పరమైన విశ్లేషణ.

***

నిజానికి మేఘసందేశం సినిమా ఏ ఒక్కరి దృక్పథాన్నో సమర్థించదు. ఏ ఒక్క కోణాన్నో ప్రదర్శించదు. జీవితం ఎలా సంక్లిష్టమైన తన అన్ని కోణాల్నీ చూపించి ఇంత మౌనానికి, ధ్యానానికి తావిస్తుందో ఈ సినిమా కూడా అలానే మనకు ఆలోచించుకోవడానికి వీలిస్తుంది. ఇది గబగబా తన పాత్రలను తీర్పులు తీర్చే అలవాటు లేని పాలగుమ్మి పద్మరాజు ముద్ర. తెలుగు సినిమా చరిత్రలో ఇంత లోతుగా నేలలో పాతుకుని అంత ఎత్తుగా ఆకాశానికి ఎదిగి తనలోంచి వేలాది ఆలోచనలను ఊడలు దింపి దేనికదే వేరే కళాసృజన అనిపించగలిగే వృక్షాలుగా చేసే వటవృక్షమంటి సినిమా అరుదు. అందుకే మేఘసందేశం మనకో కావ్యం, మన సినిమాకు ఆభరణం.

2 Comments
  1. SRINIVAS kalluri November 21, 2015 /
  2. Lalitha TS November 18, 2016 /