Menu

మసాన్ – జననం, మరణం; మధ్యలో ఎంత కథనం!

ఈ జీవితముందే – ఉదయం లేచిన దగ్గర్నుంచీ ఒకటే పరుగు పెట్టిస్తుంది. ఆగలేము. కాసేపు ఆగాలన్నా బతుకు బండి ఆగదు. ఈ పరుగుపందెంలో ఎంతో మంది మనతో పాటే పరిగెడ్తుంటారు. ఆగలేము కానీ, ఆగి చూస్తే – మనల్ని దాటుకుంటూ వెళ్లేవాళ్ళు, వెనకపడి మెల్లగా కదిలే వాళ్ళు, ఎదురుగా పరిగెట్టేవాళ్ళు, వద్దనుకుని వెనక్కి మళ్లేవాళ్లు – ఎంతోమంది కనిపిస్తారు.

జీవితమనే ఈ పరుగుపందెంలో మనకి తారసపడే ప్రతి ఒక్కరిదీ మనలాంటి జీవితమే; పైకి ఏ మాత్రం తెలియని సాధారణ జీవితంలా అనిపించవచ్చు. లోపలకి తొంగి చూస్తే – ఎన్ని వేర్వేరు దారులు. ఎన్ని వేర్వేరు ద్వారాలు. కన్నీటి జలపాతాలు, కోపాల అగ్నిగుండాలు. భయాలు ఆందోళనలు. ఎన్నో లక్ష్యాలు. గెలుపులు, ఓటమిలు. రొటీన్ గా సాగే నిత్యకృత్యాలు, ఏవో బాధలు, సంతోషాలు, బంధువులు, స్నేహితులు… అందులో మనమూ ఉంటాము. చిన్నదో పెద్దదో, తెలిసో తెలియకో – మనమూ వారి జీవితాల్లో పాత్రలవుతాం.

ఈ చిన్ని జీవితంలో మనకు ఎదురుపడే వారందరూ, ఎదురు పడని ఇంకెందరో… మనందరిదీ ఒకే ప్రయాణం. అందరం చివరికి ఒకే చోటుకి చేరుకోవాల్సిన తోటి ప్రయాణికులం. మనలాంటి కొందరి సహ ప్రయాణికుల కథే, కాశీలో జరిగే మసాన్ సినిమా కథ.

*****

కాశీ.

ఆత్మకు విముక్తి కలిగే చోటు. అనుక్షణం శవాలు కాలుతుండే చోటు.

అదో మహాస్మశానం. ఈ స్మశానంలో మనుషులూ ఉంటారు. కొందరికి అక్కడ చస్తూ బతకడం తప్ప వేరే మార్గం లేదు. ఇంకొంతమందికి అక్కడనుంచి ఎగిరిపోవాలనే ఆశ తప్ప మరొకటి లేదు.

అలా రెక్కలు కట్టుకుని ఎగిరిపోవాలాని ఆశపడ్డవాళ్ళల్లో ఒకడు దీపక్.

masaan-670-may13ఒక వైపు తన కులవృత్తి అయిన శవదహనం చేయడంలో తన కుటుంబానికి సహాయం చేస్తూనే, మరో వైపు ఇంజనీరింగ్ చదువుతూ ఉద్యోగప్రయత్నాలు చేస్తున్నాడు. తన స్నేహితుని ద్వారా పరిచయమైన షాలూ తో ప్రేమలో పడ్డాడు. కొద్దిపాటి పరిచయంలోనే షాలూ కి కూడా దీపక్ నచ్చాడు.

షాలూ కి, దీపక్ కి ఎక్కడా పోలిక లేదు. షాలూ బాగా డబ్బున్న వాళ్ల అమ్మాయి. దీపక్ ది నిరుపేద కుటుంబం. ఇద్దరిదీ ఒక కులం కాదు. ఆమెది అగ్రకులం. దీపక్ దళితుడు. ఆమెకు కవిత్వమంటే ఇష్టం. దీపక్ కి కవిత్వం అసలు అర్థమే కాదు. ఇన్ని తేడాల మధ్య ప్రేమ సాధ్యమేనా? ప్రేమకు వీటన్నింటితో సంబంధమేముంది? స్వచ్ఛమైన హృదయం కావాలంతే!

*****

కాశీ – ప్రపంచ పసిద్ధి గాంచిన చోటు. చరిత్రకంటే పురాతనమైనదిగా పేరు గాంచిన చోటు.

ఎవరేమన్నా, అక్కడ నివసించే వాళ్లకి మాత్రం అదో స్మాల్ టౌన్ అంతే. టౌన్ ఎంత చిన్నదైతే అక్కడి మనుషుల ఆలోచలూ అంతే చిన్నవిగా ఉంటాయని నమ్ముతోంది కొత్త జనరేషన్. ఈ స్మాల్ టౌన్స్ లోని పాతకాలపు ఆలోచనలు, పురాతన సంకోచాల మధ్య ఇమడలేక, ఇరుక్కోలేక సతమతమవుతున్న యువతరపు ప్రతినిధి దేవీ పాఠక్.

masaan-richaతను ప్రేమించిన పీయుష్ అనే అబ్బాయితో లాడ్జిలో ఉండగా పోలీసులకి పట్టుబడింది. ఆమెను పట్టుకున్న పోలీస్ ఇన్స్పెక్టర్ ఆమె వీడియోను తన మొబైల్ ఫోన్ లో వీడియోగా చిత్రీకరిస్తాడు. పోలీసులకు దొరికిపోతానన్న భయంతో బాత్‍రూంలో దాక్కుని ఆత్మహత్య చేసుకున్నాడు దేవి బాయ్ ఫ్రెండ్ పీయుష్. ఇది అదనుగా చూసుకుని దేవి తండ్రిని డబ్బుల కోసం బ్లాక్‍మెయిల్ చేశాడు ఇన్స్పెక్టర్ మిశ్రా. తను చేసింది క్షమించరాని నేరమేమీ కాదని దేవి నమ్మకం. కానీ పీయుష్ మరణం మాత్రం ఆమెను చాలా బాధకు గురి చేసింది.

*****

తన కులం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు షాలూ తో గొడవపడతాడు దీపక్. ప్రేమలో గొడవలు సహజం. తమ పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోరని చెప్తుంది షాలూ. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అన్నీ వదిలేసి అతనితో వచ్చెయ్యడానికి తను సిద్ధమని చెప్తుంది. కానీ ఇంతలోనే వారి కథ మలుపు తిరుగుతుంది.

ఘోరమైన ప్రమాదంలో షాలూ తో పాటు ఆమె కుటుంబ సభ్యులంతా మరణిస్తారు. ఆమె శవాన్ని తన చేతుల్తో దహనం చెయ్యాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు దీపక్.

జీవితం హటాత్తుగా ఆగిపోయింది.

కొన్నాళ్ళకు మళ్లీ తేరుకున్నాడు. రైల్వేస్ లో ఉద్యోగం సంపాదించాడు. అలహాబాద్ లో కొత్త జీవితం మొదలుపెట్టాడు.

*****

తల్లి లేకున్నా ప్రేమగా చూసుకునే తండ్రి, తన వల్ల ఇబ్బందులకు గురయ్యాడనే బాధ దేవి కి. చిన్న ఉద్యోగం వెతుక్కుంది. అక్కడే వేధింపులే. అక్కడ్నుంచి మరొక ఉద్యోగం. ఇన్స్పెక్టర్ మిశ్రా కి ఇవ్వవలసిన మూడు లక్షల లంచం డబ్బులు సమకూర్చడంలో తండ్రికి సహకరిస్తూ జీవితం గడుపుతోంది.

ఇవ్వాల్సిన డబ్బులు సమకూరగానే ఊరు విడిచి, చదువుకోడానికి అలహాబాద్ కి బయల్దేరింది. నగరంలో ఉంటున్న పీయుష్ తల్లి దండ్రులను కలిసింది. తనలోని అపరాధభావాన్ని తొలగించుకుంది. కొత్త జీవితం మొదలు పెట్టింది.

*****

రెండు వేర్వేరు కథలు.

ఒకటి దీపక్ కథ. మరొకటి దేవి కథ.

కానీ తవ్వి చూస్తే ఎన్ని కథలో!

ఇది దీపక్ కథ మాత్రమే కాదు. తరతరాలుగా కులవృత్తిలో ఇరుక్కుపోయిన అతని కుటుంబం కథ. పగలూ, రాత్రి శవాలు తగలబట్టే కుటుంబాల పరిస్థుతులను కళ్ళముందుంచే కథ.

సెక్స్ స్కాండల్ లో ఇరుక్కున్న దేవీ కథ మాత్రమే కాదిది. ఆ కుంభకోణం నుంచి తన కూతురుని బయటపడెయ్యడానికి బలైన ఆమె తండ్రి విద్యాధర్ కథ కూడా.
అధికారాన్ని దుర్వినియోగపరిచే ఇన్స్పెక్టర్ మిశ్రా, డబ్బుల కోసం ప్రాణాలకు తెగించి నీళ్లల్లో దూకి చిల్లర ఏరుకొచ్చే పిల్లాడు… ఇలా తెరమీద కనిపించే పాత్రక కథలే కాదు. తెరపై కనిపించని పాత్రలకీ (పీయుష్ తల్లిదండ్రులు, షాలు తల్లి దండ్రులు) ఈ సినిమాలో కథలున్నాయి.

చిన్న పట్టణాలకు సైతం విపరీతంగా పాకిన టెక్నాలజీ జీవితాలను ఎలా మార్చేస్తుందని చెప్పే కథ. స్మార్ట్ ఫోన్ లూ, 4G నెట్‍వర్క్ లూ – అన్నింటా ముందుకెళ్తున్నాం; జాతి, మత, కుల, లింగ వివక్ష లో మాత్రం ఇంకా వెనక్కే నడుస్తున్నాం అని మళ్లీ నొక్కి వక్కాణించి చెప్పే కథ. యువతరం సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఎలా తిరగబడబోతున్నారో చెప్పే కథ. మనిషికి మనిషే శత్రువని చెప్పే కథ. మనిషిగా మనమెంత పోరాడినా విధి మనల్ని ఒక్కోసారి ఎలా వెక్కిరిస్తుందో చెప్పే కథ. అన్నింటికీ మించి విరుద్ధ స్వబావాలు కలిగిన రెండు తరాల మధ్య సంఘర్షణ ఈ కథ. మనిషి జీవితం ఒక ఉద్వేగ భరితమైన కవిత అని తెలియచెప్పే కథ. అన్నింటికీ మించి, భవిష్యత్తులో జరగబోయే ఓ హృద్యమైన ప్రేమకథ కు భూమికగా కూడా ఈ సినిమా కథను చూడవచ్చు.

*****

మసాన్ సినిమా దర్శకుడు నీరజ్ పక్కా హైదరాబాదీ. పుట్టింది, పెరిగిందీ ఇక్కడే. చదివింది కూడా సిబిఐటి కాలేజి లో. మనలో ఒకడే. కానీ మసాన్ లాంటి సినిమా తీశాడు. కాన్స్ చలనచిత్రోత్సవంలో తన సినిమాకి రెండు అవార్డ్స్ ని సొంతం చేసుకున్నాడు. బాహుబలి, భజరంగీ భాయ్‍జాన్ లాంటి భారీ సినిమాల నడుమ ఎదురీదుతూ, హైదరాబాద్ లో మూడు నాలుగు వారాలు, వీక్ డేస్ లోనూ హౌస్‍ఫుల్స్ తో నడిచిందీ సినిమా.

ఇదో కొత్త పరిణామం. తెలుగులోనూ మనలాంటి మామూలు మనుషుల కథల్తో కొన్ని సినిమాలైనా వస్తే బావుండు.

ఇలాంటి కథలు మనకి లేవని కాదు. చెప్పుకుంటే ప్రతి ఒక్కరిదీ ఒక్కో కథ. కానీ ఇక్కడ ఈ కథలన్నీ పుట్టకముందే అబార్షన్ అయిపోతున్నాయి. ఎందుకని అడిగితే, తెలుగు వాళ్లకి ఇలాంటి సినిమాలు నచ్చవట. మనవాళ్లకి వినోదమే ప్రధానమట. ఇచ్చట సినిమాని సినిమాగానే చూడాలట. నిజమేనా? మసాన్ లాంటి సినిమాలు తీస్తే మీరు చూడరా?

చూస్తారు. చూడాలి. ఎందుకంటే, సినిమా – తడి ఆరిన హృదయాల్లో తొలకరి చినుకవుతుంది. చీకటి బారిన జీవితాల్లో వెన్నెల వెలుగవుతుంది.

చూడాలి. ఎందుకంటే, చివరికి మనందరిదీ ఒకటే కథ. మన కథలు మనమే చెప్పుకోవాలి. ఆ కథల్లోనే కదా మళ్లీ మనందరం ఒకటయ్యేది!

masaan-cannes-film-festival

*****

చివరికి అందరిదీ ఒకటే కథ.

మట్టిలో కలిసిపోయే కథ.
గాలిలో తేలిపోయే కథ.
నీటిలో చేరిపోయే కథ

ముగింపు అదే!
మొదలూ అదే!
మధ్యలోనే గొడవంతా!

ఎంత సంతోషం
ఇంతలోనే విషాదం

రెక్కలొస్తాయి, విరిగిపోతాయి
వద్దనిపిస్తుంది, చాలనిపిస్తుంది

అయినా…

ఎగురుతూనో, పాకుతూనో
కష్టపడో, ఇష్టపడో

జీవించాలి.

జీవిస్తేనే కదా,
కథ నీదవుతుంది.

*****

7 Comments
  1. tkcphd November 21, 2015 /
  2. Vijaya Karra November 23, 2015 /
  3. Krishnakanth November 24, 2015 /
  4. Kavitha Katta June 17, 2016 /
  5. బి. పవన్ కుమార్ November 28, 2016 /