Menu

North by Northwest

కొంత తక్కువ ఎత్తులో ఎగురుతూ, పొలాలకు పురుగుల మందు కొట్టే క్రాప్ డస్టర్ ఎయిర్ క్రాఫ్ట్ హఠాత్తుగా ఓ మనిషిని గుద్ది చంపడానికి కిందికి దిగి, పరుగులు పెట్టిస్తుంది. అమెరికా జాతీయ నాయకుల బొమ్మలు చెక్కిన రష్మోర్ పర్వతం మీద నుంచి ఆ నాయకుల ముఖాల మీదుగా హీరోహీరోయిన్లు విలన్లతో పోరాటం చేస్తూ దిగుతూంటారు. ఒకపక్క ఇలాంటి విచిత్రమైన ఐడియాలు, మరోపక్క, సినిమా మూడ్ ని పట్టుకున్న థీమ్ మ్యూజిక్, విషయం ఏంటి అనేది ఒకేసారి కాక కొద్దికొద్దిగా చెప్తూ, ఊహించని మలుపులతో తారాస్థాయిలో నిలబెట్టే సస్పెన్స్. వెరసి the Hitchcock picture to end all Hitchcock pictures అనే స్థాయిలోని సినిమా North by Northwest.

‘‘ఏం జరిగింది?’’ అన్న ప్రశ్న రేకెత్తించేది మిస్టరీ అయితే, ‘‘ఏం జరగబోతోంది?’’ అన్న ఉత్కంఠ సస్పెన్స్. Master of suspense అన్న పేరుతెచ్చుకున్న బ్రిటీష్-అమెరికన్ సినిమా దర్శకుడు ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్. అయితే ఆయన కెరీర్లో అత్యున్నతమైన సినిమాలన్నీ పూర్తిగా సస్పెన్స్ జానర్ కి చెందినవే అనేందుకు లేదు. మాస్టర్ పీస్ గా చాలామంది భావించే ఆయన సినిమా-సైకో నిజానికి ఓ మర్డర్ మిస్టరీ. ఆయన తీసిన ద బర్డ్స్ సినిమా హర్రర్ థ్రిల్లర్. అయితే వాటిలో అంతర్లీనంగా ఉండే సస్పెన్స్ ఆ సినిమాలకు చాలా పెద్ద బలం. కథ మొదలుకొని కెమెరా కదలికల వరకూ ప్రతిదాన్నీ ఏం జరుగుతుందోనన్న కుతూహలానికి వనరులుగా ఉపయోగించుకోవడంలో హిచ్ కాక్ పెట్టింది పేరు. అలాంటి హిచ్ కాక్ సస్పెన్స్ ని పూర్తిస్థాయిలో తీసిన సినిమా ఇది.

***

సినిమా ప్రారంభంలో అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్ గా తన జీవితంలో తాను బిజీగా ఉన్న Roger.O.Thornhill (Carry grant) ని ఇద్దరు అపరిచితులు గుండెపై గన్ గురిపెట్టి కిడ్నాప్ చేస్తారు. Luster Townsend అనే ఆయనకు చెందిన Long Island Estateకి తీసుకువెళ్ళి కింద ఫ్లోరులో ఉన్న లైబ్రరీ గదిలో పెడతారు. ఆ తర్వాత ఆ ఇంటి యజమాని Townsend అని Thornhill భావించిన ఒక అతను, తన అసిస్టెంట్, మందీ మార్బలంతో సహా వస్తాడు. Thornhillని పదేపదే Mr.Kaplan అని సంబోధిస్తూ, అతనికి తెలిసిన సమాచారమంతా చెప్పమని బెదిరిస్తాడు. Thornhillకి తననెందుకు కప్లన్ అన్న పేరుతో పిలుస్తున్నారు, వీళ్ళకి కావాల్సిన సమాచారం ఏంటో, ఏ విషయంలో తనని సహకరించమంటున్నారో ఏమీ అర్థంకాదు. అదే విషయం చెప్పి, Kaplan అనే అతనికి బదులు నన్ను తీసుకువచ్చారు మీరు అని మొత్తుకున్నా వినిపించుకోరు. ఇక విసిగిపోయిన కిడ్నాపర్ తన మనుషులకు మీరే చూసుకోండి అనేసి వెళ్ళిపోతాడు.

వాళ్ళు అతనికి బలవంతంగా మద్యం పట్టించి, కారులో తీసుకువెళ్ళి సముద్రం అంచుకు తీసుకువెళ్ళే ఓ deadly edge దగ్గర అతన్ని మరో కారులోకి మారుస్తారు. వారిలో ఒకడు అతని పక్కన కారులో కూర్చొని డ్రైవ్ చేసుకుంటూ తీసుకుపోతూండగా, హఠాత్తుగా కాస్త తెలివిలోకి వచ్చి ప్రమాదం పసిగట్టిన థార్న్ హిల్ అతన్ని బయటకి తోసేస్తాడు. రోడ్ ఎడ్జ్ లో ఇక కొంతవుంటే సముద్రంలోకి పడిపోతాడనగా హఠాత్తుగా బ్రేకు వేసి, మలుపు తిప్పుకుని ఆ సగం మత్తు, సగం మెలకువలో దారిలో ఎన్నో ప్రమాదాలు దాటుకుంటూ ప్రయాణం చేస్తాడు. వెనుక హంతకులు అతన్ని వేరే కారులో వెంటాడుతూంటారు. ఇలా దారిపోయేవాళ్ళందరినీ ప్రమాదాలవైపుకు నెట్టేలా ప్రయాణిస్తున్న ఇతన్ని పోలీసులు చూసి వెంటాడతారు. హంతకులు పోలీసులకు భయపడి వెళ్ళిపోతారు.

పోలీసులకు, కోర్టుకూ కూడా ముందురోజు రాత్రి తనపై జరిగిన హత్యాయత్నాన్ని గురించి చెప్తాడు. కానీ కొట్టేసిన కారులో, మద్యం మత్తులో నడుపుతున్నాడన్నదే వాస్తవంగా కనిపిస్తుంది వారికి, జడ్జి స్టేట్ డిటెక్టివులకు ఈ కేసు అప్పగించి ఓ రోజులో ఇతను చెప్తున్నదాంట్లో నిజమెంత ఉందో కనుక్కొమ్మంటారు. Long Island Estateకి వెళ్ళి డిటెక్టివులతో చూస్తే హంతకులు, కరడుకట్టిన కిడ్నాపర్లు ఎవరూ కనిపించరు. అంతకుముందురోజు కనిపించిన ఆమె వచ్చి ఇతను ముందురోజు పార్టీలో తాగాడని, క్యాబ్ లో వెళ్తానన్నాడని చెప్పి నమ్మిస్తుంది. ఆ ఇంటి యజమాని, తన భర్త Townsend ఐరాసలో ప్రసంగిస్తున్నారని చెప్తుంది. అతన్ని బంధించిన రూములోనూ తగ్గ ఆధారాలేవీ దొరకవు. థార్న్ హిల్ తల్లితో సహా అందరూ అదే నిజమని నమ్ముతారు.

కప్లన్ ఉంటున్నాడని మాటల మధ్యలో కిడ్నాపర్ చెప్పిన హోటల్ కి ఆధారాల కోసం తల్లితో పాటు వెళ్ళి అతని పేరిటవున్న రూం తాళాలు దొంగిలించి ప్రవేశిస్తాడు థార్న్ హిల్. అక్కడ కప్లర్ ఉన్నాడన్న దానికి ఆధారాలు కనిపిస్తాయి. కానీ అతను బట్లర్లకీ, పనివారికీ కనిపించట్లేదని కూడా తెలుస్తుంది. తనను బెదిరించిన అతని ఫోటో కూడా అక్కడే దొరుకుతుంది. ఇంతలో హంతకులు వెంబడించడంతో అక్కడినుంచి తప్పించుకుని ఐరాసలో Townsendని చూసేందుకు వెళ్తాడు. అక్కడ కలసిన Townsend తనను కిడ్నాప్ చేయించిన వ్యక్తి కాదని తెలుస్తుంది, నెలరోజులుగా అతని ఇల్లు తాళం వేసివుందనీ, తోటవాడు, పనిమనిషి మాత్రమే ఉన్నారని చెప్తాడు టౌన్ సెండ్. దాంతో వాళ్ళెవరో ఇతని ఇంట్లో తిష్టవేసి ఈ అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని థార్న్ హిల్ కు అర్థమవుతుంది. ఆ కిడ్నాపర్ ఫోటో చూపించి, మీకు ఇతనెవరో తెలుసా అంటూండగా, వెనుక నుంచి వెంటాడుతున్న హంతకులు టౌన్ సెండ్ వీపులో గుచ్చుకునేలా కత్తి విసిరి పారిపోతారు. ఆ కత్తి అనుకోకుండా Thornhill తీయడంతో అప్పుడే చూసిన చుట్టూవున్నవారు అతనే హత్యచేశాడనుకుంటారు. ఓ మీడియా పర్సన్ ఫోటో కత్తితో ఉన్న Thornhill ఫోటో కూడా తీస్తాడు. అక్కడి నుంచి హంత్యానేరంలో నిందితుడిగా పారిపోతాడు Thornhill. ఇంతకీ అతన్ని కిడ్నాప్ ఎందుకు చేశారు? Kaplan ఎవరు? అటు పోలీసులకు చెయ్యని నేరం మీద, ఇటు కరడుకట్టిన ముఠాకి వేరే వ్యక్తిగా పొరబడడంతోనూ Most wanted అయిపోయిన అమాయకుడు Thornhill ఏమయ్యాడు? అన్నది మిగతా కథ.

పాఠకులు సినిమా చూస్తే దర్శకుడు, రచయిత ఉద్దేశించిన థ్రిల్ పోకుండా ఉండేందుకే చెప్పలేదు తప్ప kaplan ఎవరు? ఆ ముఠా ఎందుకు అతను అనుకుని Thornhill వెంటపడుతున్నారు? అన్న ప్రశ్నలకు జవాబులు నేను కథనం ఆపుజేసిన తర్వాతనే సినిమాలో ప్రేక్షకులకు తెలిసిపోతుంది. అక్కడితో సినిమాలో ప్రేక్షకులకు విషయమంతా తెలిసిపోయి ఏం జరుగుతుంది, ఏమవుతుంది అన్న ఆసక్తికరమైన కథనం ప్రారంభమవుతుంది. ఐతే ఇంతకుమించి కథ చెప్పుకుంటూ పోతే సినిమా మొదటిసారి చూసేప్పుడు సస్పెన్స్ సినిమాలకు కావాల్సిన ఆసక్తి తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడితో కథ వదిలేసి మిగతా విషయాలకు వెళ్దాం.

***

రెండు సన్నివేశాలు

చిన్న పిల్లల తరహా ఓపెన్ మైండ్ తో అద్భుతమైన ఐడియాలు సృష్టించడం, వాటిని తెరకెక్కించడం హిచ్ కాక్ ప్రత్యేకతలు. ఆయన సినిమాల్లో వారసత్వ సంపదలైన స్మారక స్థలాలు, పర్యాటక ప్రదేశాల్లో విచిత్రమైన సన్నివేశాలు సృష్టిస్తూంటారు. ఓ సినిమాలో హీరో విలన్ పోరాటం ప్రపంచంలో చోటెక్కడా దొరకనట్టు న్యూయార్క్ లోని ‘‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’’ ముక్కులో ఫైటింగ్ చేస్తారు.

Mount rushmore వద్ద సినిమా క్లైమాక్స్ దృశ్యం (ఇన్ సెట్లో మౌంట్ రష్ మోర్)

Mount rushmore వద్ద సినిమా క్లైమాక్స్ దృశ్యం (ఇన్ సెట్లో మౌంట్ రష్ మోర్)

అలాంటిదే ఈ సినిమాలోని హైలైట్స్ లో ఒకటైన క్లైమాక్స్ సన్నివేశం చిత్రీకరించిన ప్రదేశం-మౌంట్ రష్ మోర్. అమెరికన్ అధ్యక్షులు, ఆ దేశ చరిత్రలో పేరొందిన మహానాయకులు-జార్జ్ వాషింగ్టన్, థామస్ జెఫర్ సన్, థియోడర్ రూజ్వెల్ట్, అబ్రహాం లింకన్ ల తల భాగం వరకూ చెక్కిన పర్వతం-మౌంట్ రష్ మోర్. ఆ తలల మీంచి హీరో హీరోయిన్లు విలన్ల బారి నుంచి తప్పించుకుంటూ జారుతూండే సన్నివేశం తీశారు హిచ్ కాక్. ఈ సన్నివేశం సినిమాకే కాక హిచ్ కాక్ శైలికే ట్రేడ్ మార్క్ ల్లో ఒకటిగా నిలిచిపోయింది. నిజానికి ఈ సన్నివేశంలో భాగంగా హీరో విలన్ల నుంచి తప్పించుకునేందుకు అబ్రహాం లింకన్ విగ్రహం ముక్కులోకి వెళ్ళి దాక్కున్నట్టు, హఠాత్తుగా అతనికి తుమ్మురావడంతో విలన్లు అతనిని కనిపెట్టినట్టు కూడా తీద్దామని హిచ్ కాక్ భావించారు. కానీ అది ఎబె లింకన్ ని అవమానించినట్టుగా భావించిన ఆ మాన్యుమెంట్ సంరక్షణాధికారులు ఆ కల్పనకు అంగీకరించకపోవడంతో తప్పనిసరై దాన్ని స్క్రిప్ట్ నుంచి తొలగించారు. ఈ ఐడియా హిచ్ కాక్ కి ఎంతగా నచ్చిందంటే- సినిమాకి పేరు మొదట ఈ ఐడియా ఆధారంగా A man in Lincoln nose అని పెడదామనుకున్నారు, సినిమా స్క్రిప్ట్ లో హిచ్ కాక్ అనుకున్న అంశాల్లో మొట్టమొదటిదీ ఇదే.

North by northwest crop duster sceneసినిమాలో అత్యంత ప్రాచుర్యం పొందిన మరో సన్నివేశం హీరోని విలన్ గ్యాంగ్ ఊరికి దూరంగా పొలాల మధ్యలో చంపే సన్నివేశం. ఈ సీన్ లో పొలాలకు మందుకొట్టే ఎయిర్ క్రాఫ్ట్ అనూహ్యంగా కిందికి దిగి హీరో మీదికి దాడిచేస్తూంటుంది. హీరో తప్పించుకున్న కొద్దీ అది మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళి మలుపుతిరిగి వెనక్కివచ్చి దాడి కొనసాగిస్తూంటుంది. ఈ సన్నివేశాన్ని కూడా మొదట విలన్ ఓ తుఫానును సృష్టించి హీరోని చంపబోగా తప్పించుకునేలా రాయమని రచయితను అడిగారు హిచ్ కాక్. తుఫాను మనిషి సృష్టించడాన్ని నమ్మదగ్గ విధంగా రాయలేక ఇలా మార్చారు రచయిత.

ఇతర అంశాలు

ఇలాంటి ఫ్యాన్సీ ఆలోచనలు ఎన్ని తీస్తున్నా కథ మీద గ్రిప్ కోల్పోకుండా నడిపించడం హిచ్ కాక్ ప్రత్యేకత. సినిమాలో ప్రతి పాత్రనూ, ప్రతి సన్నివేశాన్నీ సస్పెన్స్ ఏర్పరిచేందుకు వాడుకుంటూ దాన్ని అత్యున్నత స్థాయికి క్లైమాక్స్ వచ్చేసరికి తీసుకువెళ్ళిపోతారు. ఇక క్లైమాక్స్ లోనూ దాన్ని గ్రిప్పింగ్ గా నడిపిస్తారు. సినిమాలోని మరో ప్రత్యేకత బ్యాక్ గ్రౌండ్ స్కోర్. సినిమా టైటిల్స్ పడేప్పుడే ప్రారంభమయ్యే థీమ్ మ్యూజిక్ సినిమా నడకలో చాలా ఉపయోగపడింది. అమెరికన్ సినిమా రంగంలో ఈ సినిమా కల్ట్ స్థాయికి చేరి, ప్రభావశీలమైన సినిమాగా నిలిచింది. సినిమాలోని అనేకాంశాలు తర్వాతికాలంలో వరదలా ముంచెత్తిన జేమ్స్ బాండ్ సినిమాలు, ఆ తరహా సినిమాలను ఎన్నో విధాలుగా ప్రభావితం చేశాయి.

మొత్తంగా చెప్పుకోవాలంటే, North by Northwest సినిమా సస్పెన్స్ ని ఆస్వాదించడానికైనా, హిచ్ కాక్ బ్రిలియన్స్ చూడడానికైనా చూడాల్సిన సినిమానే.