Menu

మైత్రి (2015) – ఓ గౌరవనీయమైన చిత్రం

Mythri-Kannada-Film

వాణిజ్యపరంగా మిగతా దక్షిణ చిత్ర పరిశ్రమలకంటే వెనుకబడిన పరిశ్రమని, మూస చిత్రాలు ఎక్కువగా వస్తాయని కన్నడ చిత్ర పరిశ్రమ మీద విమర్శలున్నాయి. నేను ఎక్కువ కన్నడ చిత్రాలు చూడలేదు. నేను చుసిన మొదటి చిత్రం “చార్మినార్” (తెలుగులో కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ). కొన్ని రోజులుగా “మైత్రి” అనే చిత్రం గురించి వింటూనే ఉన్నాను. విమ్మర్శకుల ప్రశంసలతో పాటు వాణిజ్యపరంగానూ విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఎట్టకేలకు చూడటం జరిగింది.

మైత్రి ఓ ద్విభాషా చిత్రం. కన్నడ మరియు మలయాళంలో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రంలో కన్నడ పవర్ స్టార్ “పునీత్ రాజ్ కుమార్” మరియు మళయాళ దిగ్గజ నటులు “మోహన్ లాల్” ముఖ్య పాత్రలు పోషించగా, “మాస్టర్ ఆదిత్య” ప్రధాన పాత్రను పోషించాడు. అతుల్ కులకర్ణి మరో ముఖ్య పాత్రలో కనిపించాడు. గిరిరాజ్ దర్శకత్వం వహించారు.

కథ :

ఇది ఓ పన్నెండేళ్ళ సిద్దరమ (ఆదిత్య) కథ. పునీత్ రాజ్ కుమార్ అభిమాని అయిన ఈ బాల నేరస్తుడు పునీత్ ని కలవడానికి అతడు వ్యాఖ్యాతగా వ్యవహరించే “కరునాడ కోట్యాధిపతి” (కన్నడ “కౌన్ బనేగా కరోడ్పతి”) కార్యక్రమానికి ఎంపిక అవుతాడు. సిద్దరమ అందులో గెలుపొందాడా? శాస్త్రవేత్త మహాదేవ్ (మోహన్ లాల్)కి, సిద్దరమకి సంబంధం ఏంటి అనే అంశాల మీద మిగతా కథ నడుస్తుంది. ఈ చిత్రం ముఖ్యంగా బాల నేరస్తుల మనస్తత్వాలు, వారి జీవితాలు మరియు “హ్యూమన్ మాఫియా” అనే అంశాల చుట్టూ తిరుగుతుంది.

కథనం :

ఈ చిత్రం ఆకతాయి పనులు చేసి పోలీస్ లాకప్ లో ఉన్న సిద్దరమతో మొదలవుతుంది. సిద్దరమ తల్లి ఆ ప్రాంతపు గూండా మరియు రాజకీయ నాయకుడు గూళి ప్రతాప్ (రవి కాలే) సహాయంతో అతడిని విడిపించగా, తన కోసం పని చేయమని సిద్దరమ తల్లిపై కన్నేస్తాడు ప్రతాప్. ఆ తరువాత ఓ షూటింగ్ లో పునీత్ రాజ్ కుమార్ ని కలుస్తాడు సిద్దరమ. ఈ కథనం అంతా పూర్తి కన్నడ శైలిలో సాగుతుంది. పరభాషా ప్రేక్షకుడు ఇక్కడ కొంచెం సహనంగా ఉండాలి.

సిద్ధరమని జైలులో చూపించిన క్షణం నుండి కథనం ఊపందుకుంటుంది. బాల నేరస్తుల చెరసాలలోని వేర్వేరు మనస్తత్వాలను, వారిని జైలర్ రవి ప్రకాష్ (అతుల్ కులకర్ణి) అదుపు చేసే తీరును ఇంకొంచెం ఒప్పించేలా తీసుంటే బాగుండేది. ఈ మధ్యలో వచ్చే పునీత్ – రవిల మధ్య చర్చను దర్శకుడు రచించిన తీరు బాగా ఆకట్టుకుంటుంది. అసలు బాల నేరస్తుల జీవితాలు ఎలా ఉంటాయి? ఎలాంటి శిక్ష వారిలో మార్పు తెస్తుంది అనే అంశాలను చర్చించిన తీరు బాగుంది.

ఇక కార్యక్రమానికి హాజరు కావడానికి సిద్దరమకు తోటి ఖైది సాయం చేసే సన్నివేశాలను బాగా తెరకెక్కించాడు దర్శకుడు. ఇక్కడే ఈ చిత్రంపై ఇష్టం మొదలైంది. సిద్దరమ పోటిలో ఎంపిక అయిన తరువాత కథనం ఎక్కువగా ఆ కార్యక్రమం నేపథ్యంలోనే సాగుతుంది. మధ్యమధ్యలో ఇళయరాజా గీతాలు గుండెను హత్తుకుంటాయి. ఈ క్రమంలో నాకు నచ్చినవి “గెలువు ఒందే లెక్క” మరియు “ఆకాశ మేలుంటూ” అనే గీతాలు. అటు సాహిత్యపరంగానూ, ఇటు చిత్రీకరణపరంగానూ ఆకట్టుకున్న గీతాలు ఇవి.

మహదేవ్ పాత్ర పరిచయం, మొదట్లో స్పృశించి వదిలేసిన గూళి ప్రతాప్ చేసే “హ్యూమన్ మాఫియా” అంశాన్ని మళ్ళీ పరిచయం చేస్తుంది. ఈ క్రమంలో కైలాష్ ఖేర్ ఆలపించిన “చంద్రనేను చందా” అనే గీతం మహదేవ్ పాత్రని, అతడి కుటుంబాన్ని పూర్తిగా పరిచయం చేస్తుంది.

ఇక్కడ కథనంలోని ఓ చిన్న మెలిక తరువాత ప్రేక్షకుడి ఊహకు అందుతూనే చిత్రం ముగుస్తుంది. ఇక్కడ పునీత్ పాత్రకు కాస్త ప్రాధాన్యత లభించి ఉంటే బాగుండేదేమో అనిపించింది. సిద్దరమకు సాయం చేయడానికి పునీత్ మహదేవ్ కి ఫోన్ చేసే సన్నివేశాన్ని, దాని తరువాతి కథనాన్ని మరింత భావోద్వేగంగా, కాస్త బరువైన మాటలతో ఈ చిత్రం ద్వారా ఇవ్వాలనుకున్న సందేశాన్ని ఇచ్చి ఉంటే ఇంకాస్త మంచి ముగింపు దొరికి ఉండేది. ఏదేమైనా, చివరలో ఇళయరాజా గొంతుకలో వచ్చే “ఇదు యావ లోకవో” అనే గీతం ఆ లోటుని భర్తీ చేసిందనే చెప్పాలి.

మొత్తానికి, “మైత్రి” ఓ గౌరవనీయమైన కన్నడ చిత్రం. భాషా భేదం లేకుండా అన్ని చిత్రాలను ఆదరించే సినీప్రియులకు ఈ చిత్రాన్ని చూడమని గట్టిగా సిఫార్సు చేస్తున్నాను.

నటనల విషయానికి వస్తే, పునీత్ రాజ్ కుమార్ కు దక్కింది తన నిజజీవిత పాత్రే. అంత పెద్ద స్టార్ కథానాయకుడికి ఇలాంటి పాత్ర దొరకడం చాలా అరుదు. కానీ ఎంతో ఒదిగి నటించి పూర్తి మార్కులు కొట్టేశారు పునీత్. మోహన్ లాల్ పాత్ర కథనపు దారి మార్చేది. ఎప్పటిలాగే అందులో ఒదిగిపోయారాయన. అతుల్ కులకర్ణి తనకు దక్కిన గౌరవనీయమైన పాత్రను అంతే గౌరవంగా పోషించాడు. రవి కాలే మామూలే. అర్చన, భావనలకు చిన్న పాత్రలు దక్కాయి.

ప్రత్యేకతలు :

  1. ఇళయరాజా సంగీతం. ఈ చిత్రం హృదయానికి దగ్గర చేయడంలో రాజా గారి పాత్ర ఎంతైనా ఉంది. తన శైలిలోనే అద్భుతమైన, కథకు సరిపోయే గీతాలను అందించారు.
  2. కృష్ణకుమార్ ఛాయాగ్రహణం. అన్ని సన్నివేశాలను కెమెరాలో బాగా బంధించారు కృష్ణ.
  3. గిరిరాజ్ దర్శకత్వం. ఇది చాలా ప్రత్యేకమైనది. ఈ చిత్రంలో పునీత్ లాంటి పెద్ద స్టార్ ఉన్నప్పటికీ, అనవసరపు వాణిజ్య హంగులకు వెళ్ళకుండా, కథానుసారంగా చిత్రాన్ని తెరకెక్కించినందుకు గిరిరాజ్ ను తప్పనిసరిగా అభినందించాలి.
  4. పునీత్, మోహన్ లాల్ మరియు ఆదిత్యల నటనలు.

బలహీనతలు :

  1. భావోద్వేగపు మోతాదు తగ్గిన పతాక సన్నివేశం.
  2. బాల నేరస్తుల జీవితాలు, మనస్తత్వాల గురించి మరింత చర్చించి ఉంటే బాగుండేది.

– యశ్వంత్ ఆలూరు

4 Comments
  1. Venkat Siddareddy September 13, 2015 /
  2. Dathathreya Reddy September 14, 2015 /
    • Yashwanth Aluru September 15, 2015 /