Menu

Nostalghia ~ ఓ అసంబద్ధ దృశ్య కావ్యం

ఒక్క జాడ కూడా మిగల్చకుండా

వేసవి అయిపోయింది
సూర్యుడు ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నాడు
అది కూడా ఓదార్పుకాదు

రాలి పడిపోవాల్సినవన్నీ
సరిగ్గా అరచేతి మీద వాలేయి
ఐదు వేళ్ళ చిగురాకు లా
అది కుడా ఓదార్పు కాదు

మంచి కాని, చెడు కాని
ఏదీ ఫలించదు.
అన్నీ భగ్గుమనాల్సిందే
అది కుడా ఓదార్పు కాదు

దాచిపెట్టుకున్న రెక్కను
జీవితం విప్పింది.
అందుకు నేను దీవింపబడ్డాను
అది సైతం ఓదార్పుకాదు

ఆకులనెవరూ అంటించలేరు
కొమ్మలనెవరూ  విరగ్గొట్టలేరు
ఆ రోజు ఓ గాజు ముక్క లా  స్పష్టంగా ఉంది
చివరికి అది సైతం ఓదార్పుకాదు

~ ఆర్సెనీ టర్కోవిస్కి.

పొగమంచు తో కప్పబడ్డ విశాలమైన మైదానం. ఓ కారు మాత్రం కదులుతూ ఉంటుంది. ఆ కారు  ఒక దగ్గర ఆగుతుంది.  యుజీనియా బయటకి దిగుతూ పారవర్శ్యంతో అంటుంది – “మార్వలస్ పెయింటింగ్ లా ఉంది. మొదటి సారి ఇక్కడకి వచ్చినప్పుడు ఏడ్చినట్టు గుర్తు. ఇక్కడి వెలుగు శరదృతువు లోని మాస్కో ని గుర్తుచేస్తుంది. ఇంతకూ నువ్వు రావట్లేదా?” అని అడుగుతుంది యుజీనియా. “నువ్వు వెళ్ళు” అంటాడు ఏండ్రీ గోర్చకోవ్. యుజీనియా ఆ దృశ్యకావ్యం లోకి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఏండ్రీ మనసులో అనుకుంటాడు-
“ఈ జబ్బుపట్టిన అందాలను నిరంతరం చూసి చూసి అలసిపోయాను. ఇక నాకు అవసరంలేదు. చాలు”

ఆ ఒక్క వాక్యం సినిమా పరిణామ క్రమాన్ని అంతా నిర్వచిస్తుంది.  సినిమా లో ఏండ్రీ స్వభావాన్ని ఒక రహస్య పరాయితనం వెంటాడుతూ ఉంటుంది.  కాఫ్కా నవలల్లోని కథానాయకుడిలా ఏదో ప్రపంచం లో ఉంటాడు.  ఒక తలుపుకున్న రంధ్రం లోంచి ఓ ఆఫీస్ లోపలకి చూసినప్పుడు – అక్కడ జరిగే  గందరగోళం, ఒక టేబుల్ మీద నుండి మరొక టేబుల్ మీదకు ఫైళ్ళు ఎగురుతూ పోవటం- యాంత్రికంగా పని చేసే కాళ్ళూ చేతులు- అందరూ ఓ సహజమైన ప్రపంచం లో తమవంతు పనిని నిర్వర్తించటం- ఈ సన్నివేశాలన్నిటినీ చాటుగా గమనిస్తూ, ఓ నిష్పాక్షికతతో జీవితంలోని సందిగ్ధతల గురించి ఆలోచించే పాత్ర ఏండ్రీ ది.  మనతో సైతం ఆలోచింపచేసే గుణం ఉంటుంది ఆ పాత్ర కి.

క్లుప్తంగా సినిమా కథ చెప్పాలంటే~ 18 వ శతాబ్ధంలో రష్యాలో ఆత్మహత్య చేసుకున్న ఇటాలియన్ స్వరకర్త పావెల్ సొస్నోవిస్కి గురించీ పరిశొధన చేయటానికి ఇటలీ కి వస్తారు ఏండ్రీ గోర్చకోవ్ ఇంకా అతని వ్యాఖ్యాత యుజీనియా.  తన స్వదేశాన్ని వదలి వచ్చినప్పటినుండి ఏండ్రీ కి ఏదో బెంగ మొదలవుతుంది.  అక్కడ పరాయితనంతో ఆవహింపబడిన ఏండ్రీ కి, అందరూ స్నానం చేసే ఓ వేడి సరస్సు దగ్గర డొమినికో అనే ఒకతను పరిచయం అవుతాడు. అందరూ అతనికి పిచ్చి అంటారు. డొమినికో పదే పదే  కొవ్వొత్తిని తీసుకొని ఆ వేడినీటి సరస్సులోకి నడుచుకుంటూ వెళ్ళేవాడు.  చుట్టూ ఉన్న జనం అతనికి ఏమైనా అవుతుందేమో నని భయపడి ఆయనను వెనక్కి లాగేసే వారు.  ఆ కొవ్వొత్తిని అవతలికి చేర్చటం ద్వారా ప్రపంచాన్ని కాపాడచ్చు అనుకుంటుంటాడు డొమినికో.  కొన్ని రోజులతరువాత ఏదో ముఖ్యమైన కార్యమని డొమినికో రొముకి వెళ్తూ, కొవ్వొత్తిని సరస్సు అవతలి వైపుకు చేర్చే బాధ్యత  ఏండ్రీ కి ఇచ్చి వెళ్ళిపోతాడు. యుజీనియా కు ఏండ్రీ-డొమినికో స్నేహం నచ్చక, ఏండ్రీ నిర్లిప్తత అర్థం కాక, – “నువ్వొక పిరికిపంద వి! ఎవ్వరికీ అర్థం కావు. నీకు స్వాతంత్ర్యం లేదు. స్చేచ్చ కావాలనుకుంటావ్- అది దొరికినప్పుడు మాత్రం నీకు ఏం చేయాలో తెలియదు, అసలు అదే స్వేచ్చ అని కుడా తెలియదు. ఇక చాలు” అని రోములోని తన  బాయ్-ఫ్రెండ్ దగ్గరకి వెళ్ళిపోతుంది.     రోములో అనుకోకుండా యుజీనియా డొమినికో ని కలిసినప్పుడు,  తన స్నేహితుడు ఆ కొవ్వొత్తిని సరస్సుకు అవతలివైపుకు చేర్చాడేమో కనుక్కోమని అడుగుతాడు, డొమినికో. యుజీనియా రోమునుండి ఇటలీలోని ఏండ్రీ కీ ఫోన్ చేసి  తన  బాగోగుల గురించీ చెప్తూ డొమినికో ని కలిసిన విషయం చెప్తుంది.  అతను కొవ్వొత్తి ని సరస్సు దాటించాడేమో తెలుసుకోమని అడిగినట్టు చెప్తుంది. దాటించాడని అబద్దం చెప్తాడు ఏండ్రీ.

రోమునగరం మధ్యలో, చివరిగా ఒక కవిత చదివి, అందరూ చూస్తుండగా తనను తాను అంటించుకొని దగ్ధం చేసుకుంటాడు డొమినికో.  ఆ దీపాన్ని ఏండ్రీ సరస్సు దగ్గరికి తీసుకెళ్ళే సరికి అక్కడ నీళ్ళు ఎండిపోయి ఉంటాయి. ఏండ్రీ ఆ సరస్సులోనే ఒక వైపునుండి మరొక వైపుకు తిరుగుతూ ఆ దీపం మొత్తం కరిగిపోయే దాక చేతిలోనే పట్టుకుంటాడు. చివరకు ఆ ఏండిన సరస్సులోనే తను కుడా ప్రాణాలు వదులుతాడు ఏండ్రీ.

ఈ సినిమా  ఒకొక్క సారిచూసినపుడు ఒక లాగ అర్థమవుతుంది. ఒక కవితలోలా, ఓ వుల్లిపాయలోలా అనేక పొరలు ఉన్న సినిమ.  ఏండ్రీ తన చుట్టూ ఉన్న ప్రదేశాలతో అసంబద్ధం గా  తిరుగుతూ ఉంటాడు- అలాంటి పరాయితనంలో తనను తానూ పోగొట్టుకుంటాడు.  ఒక సమయంలో డొమినికో లేని ఒంటరితనంలో తానే డొమినికో అన్నంత కోల్పోతాడు.  అలాంటి ఒక సందర్భంలో ఏదో మాట్లాడుకుంటూ అండర్-గ్రౌండ్ లో ప్రవహించే కాలువలోకి నడుచుకుంటూ పోతాడు.  అక్కడ ఒక పాప కనిపిస్తుంది.  “భయపడకు!” అంటాడు ఏండ్రీ. “ఇంకా నిన్ను చూసి నేనే భయపడాలి” అంటాడు సరదాగా. అలా ఆ పాపతో మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో ఒక కథ చెప్తాడు.

“ఓ మనిషి సరస్సులో మునిగిపోతుంటాడు. ఇంకొక అతను తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అతనిని కాపాడుతాడు. అలసి పోయిన ఇద్దరూ ఒడ్డు మీద గట్టిగా వూపిరి పీలుస్తూ. పడుకొని ఉంటారు. అప్పుడు బయటపడ్డ వ్యక్తి అంటాడూ~ ‘నీకేమైనా పిచ్చా! అలా ఎందుకు చేసావూ! నేను కాపురముండేది ఆ నీటి లోపలే” అని.  ఈ కథ సినిమా మొత్తానికీ కవితాత్మక ప్రతీకగా అనిపిస్తుంది.  అసంబద్దత అనే అస్థిత్వ పరిస్తితికి అద్దం పట్టే క్యారక్టర్ ఏండ్రీ ది.  “మనిషి అవసరానికీ, ప్రపంచపు  నిషబ్ధానికి మధ్య ఘర్షన లోంచీ పుట్టేదే అసంబద్ధత(అబ్సర్డ్)” అంటాడు అల్బర్ట్ కామూ.  మరొక దగ్గర అంటాడు కామూ “తన సొంత చర్మం/మాంసం తన అస్థిత్వం  పై చేసే తిరుగుబాటే అసంబద్ధత” అని.  అలాంటి అసంబద్ధత ఒక దీర్ఘమైన ఏకాకితనం నుండి వస్తుంది. బహుషా అలాంటి తనంలోనే ఉన్నాడేమో ఏండ్రీ.

ఆ పాపతో అంటాడు ఏండ్రీ – “ఇంతకూ నీ పేరేంటి?”
“ఏంజిలా”
“నువ్వు సంతోషంగా ఉన్నావా?”
“ఏ విషయం లో?” అడుగుతుంది.
“నీ జీవితంలో”
“ఉన్నాను”
“మంచి పాప” అంటాడు చిరు మందహాసంతో.

సినిమా ఆధ్యంతం మనిషి జీవితపు అసంబద్దత కు సంబంధిన్చిన సన్నివేశాలు – ఓ స్వప్న తీగకు అల్లబడినట్టు అనిపిస్తుంది.   అలాంటి అసంబద్ధతలో నే పోస్ట్-ఫేసిస్టు అసైలం నుండి విడుదలయిన డొమినికోతో సాన్నిహిత్యపు భావన  ఏర్పడుతుంది ఏండ్రీ కి. ఏండ్రీ కి డొమినికో ఓ అనంతమైన జ్ఞానం ఉన్న సన్యాసిలా కనిపిస్తాడు ఈ తరుణంలో.  అందుకే అంటాడు ఏండ్రీ, యుజీనియాతో – “అందరూ అతనికి పిచ్చి అని ఎందుకు అంటారు? అతను పిచ్చోడు కాదు, అతనికి ఇంకా విశ్వాసం ఉంది”. ఇంకా “పిచ్చి అంటే ఏంటి? వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడ్తారు. వాళ్ళు మనకు భారంగా తయారవుతారు. మనం ఎప్పుడూ వాళ్ళను అర్థం చేసుకోము. వాళ్ళు నిరంతరం ఒంటరిగానే ఉంటారు.  కానీ ఖచ్చితంగా వాల్లు వాస్తవానికి దగ్గరగా ఉంటారు.” అని అంటాడు.

కొన్ని మాటలు మధ్యలో ఆగిపోతాయి. మరి కొన్ని మాటలు అర్థాంతరంగా మొదలవుతాయి. ఈ రెంటికి మధ్య గడ్డకట్టిన , తీవ్రమైన నిషబ్ధం. దృష్యాన్ని అస్పష్టం చేస్తూ పొగ మంచు. అలాంటి కవితాత్మక అవస్తలోకి, అసంబద్ధతలోకి, శూన్యంలోకి నెట్టేస్తుంది ఈ సినిమా. ఇంద్రియాలన్నీ కవిత్వంతో ముద్దయినప్పుడు చిన్న అలికిడి కుడా అనుభవమే. “నోస్టాల్జియా” పొరలు పొరలుగా బోధపడే సినిమా.  ఏండ్రీ ఒక దగ్గర అన్నట్టు “వ్యక్తం చేయలేని  విషయాలను ఎప్పటికీ  మరచిపోలేము” .  అలాంటి మరచిపోలేని సినిమా, “నోస్టాల్జియా”.

ఏండ్రీ టర్కోవిస్కి తన సినిమాల ద్వారా తన తండ్రి అయిన ఆర్సినీ టర్కోవిస్కి కవిత్వానికి రెండో జీవితం ఇచ్చాడంటారు.  ఆర్సెనీ  టర్కొవిస్కి కవితలోని చిన్న భాగం, ముగించే ముందు-

“నేను ఓ ఉత్సవంలో అంటించిన కొవ్వొత్తిని.
వుదయాన్నే నా మైనాన్ని అంతా సేకరించు.
ఈ కాగితం నిన్ను ప్రేరేపించగలదు
ఎలా ఏడవాలో, ఎలా గర్వపడాలో
జాగరూకతలేని ఈ ఇంట్లో
చివరి సంతోషాలను ఎలా వదులుకోవాలో
సులభంగా ఎలా మరణించాలో
మరణానంతరం ఒక పదంలా ఎలా వెలగాలో.”

One Response
  1. jajimalli November 3, 2015 /