Menu

సత్యమే శివం

పరిచయం

కదిలే బొమ్మల కళా రూపం. కలలని సైతం కళ్ళ ముందుంచగలిగే అద్భుతం. బొమ్మలకు ప్రాణం పోయగల ఔషధం.

ఊహకందని ప్రపంచంలోకి ఇట్టే మనల్ని లాక్కెళ్లిపోగల సాధనం సినిమా.

సినిమా అమృతం కాదు. క్యాన్సర్ ని నయం చేయలేదు. కానీ జీవితాన్ని కాపాడే శక్తి కలదు. సినిమా తో బంగారం తయారు కాదు. కానీ మేధస్సుని మేలిమి బంగారంలా మెరిపించగలదు. సినిమా ద్వారా అంతిమ జ్ఞానం పొందలేము. కానీ జ్ఞాననేత్రాన్ని తెరిపించగలదు.

నేను రోజు వారీ కూలీనో, నువ్వో బిల్ గేట్స్ అయ్యుండొచ్చు; నేనో నిరక్షరాస్యుడిని, నువ్వొక డబుల్ పిహెచ్‍డి అయ్యుండొచ్చు. సినిమా హాలులో పక్కపక్క సీట్లో మనం అపరిచితులమై ఉండొడొచ్చు. కానీ నిన్నూ, నన్నూ, మనందరినీ ఒక్కరిగా చేసి, జీవితం మీద కొత్త ఆశ కలిగించగలదు. అందుకే సినిమా ఒక ఆల్కెమీ.

****

సత్యమే శివం

 

ఒక అంచనా ప్రకారం ఈ లోకంలో పదిహేను నుంచి ఇరవై శాతం వరకూ జనాలు దేవుణ్ని నమ్మరు. మిగిలిన ఎనభై శాతం మంది రోజుకోసారైనా దేవుణ్ని తలుచుకుంటారు. ఒక విధంగా ఆ మిగిలిన ఇరవై శాతం మంది కూడా దేవుడు లేడని చెప్తూ రోజుకోసారైనా దేవుడి ప్రస్తావన తెస్తారు. ఆ విధంగా నూటికి నూరు శాతం ఈ ప్రపంచంలో ప్రతీది దివ్యత్వం వల్లనే సాధ్యం.

దేవుడు ఈ ప్రపంచం దాటి మరెక్కడో ఉండడు; ప్రపంచంలో అంతర్లీనంగా ఉంటాడు. దేవుడు ప్రపంచంలోనూ, ప్రపంచం దేవుడిలోనూ ఉండడం జరుగుతుంది.

ఏమీ అర్థం కాలేదా?

ఓ మీకర్థమైందా?

అర్థమైనా అర్థంకాకపోయినా – ఈ దేవుడంతే ! అర్థమైతే అర్థమవుతాడు. లేదంటే లేదు.

 

*****

ఒక విషయం చెప్తాను. అర్థం చేసుకుంటారుగా?

2003. సంక్రాంతి పండగ సీజన్. అన్బే శివం (ప్రేమే దైవం) అనే తమిళ్ సినిమా తెలుగులో సత్యమే శివం గా వచ్చింది.

ఆ సినిమానా? ’ప్లేన్స్, ట్రైన్స్, ఆటోమొబైల్స్’ అనే ఇంగ్లీష్ సినిమా కాపీ! అదే కదా?

కాపీ అనకండి. ఈ సినిమాలోని ఎత్తుగడతో ప్రపంచంలో అంతకుముందు ఎన్నో కథలు వచ్చాయి. నిజమే కమల్‍హాసన్ ఆ సినిమా ఆధారంగానే ’అన్బే శివం’ కథ రాసుకున్నాడు. ఒక్క కమల్ మాత్రమే కాదు. చైనా వాళ్లు తీసిన లాస్ట్ ఆన్ జర్నీ , లాస్ట్ ఇన్ థాయ్‍లాండ్ అనే సినిమాలకు కూడా పైన చెప్పిన సినిమానే స్ఫూర్తి. కానీ కేవలం పాత్రల పరిచయం వరకే కమల్ ఆ కథను వాడుకున్నారు. మిగతా అంతా వేరు. నిజానికి ఒరిజినల్ సినిమా కంటే ఎంతో గొప్పగా ఉంటుంది ఈ సినిమా.

అవునా? అంత గొప్ప సినిమానా?

అవును. మనం ఫ్లాప్ చేశాం. మన ప్రేక్షకులు బహుశా ఆ దేవుడికీ అర్థం కారేమో! మంచి సినిమాని ఫ్లాప్ చెయ్యడం. ఉత్తుత్తి సినిమాలని నెత్తికెత్తుకోవడం.

*****

ఇక్కడో వ్యక్తి ఎవరి కోసమో వెతుకుతున్నాడు. కలుద్దాం రండి.

ఎవరండీ మీరు?

నేను సత్యాన్ని.

ఎవరికోసమో వెతుకుతున్నట్టున్నారు?

అవును దేవుడి కోసం.

దేవుడా?

మీరు నమ్మరు. కానీ నమ్మాలి. నేను దేవుణ్ణి చూశాను. అతనితో మాట్లాడాను. కొన్ని రోజులు గడిపాను.

అతను దేవుడని మీకెలా తెలుసు?

నాలో దేవుణ్ని చూశాడు కాబట్టి. నాలోనే కాదు. తనని చంపడానికొచ్చిన వాడిలోనూ, తనని చావు దాకా తీసుకెళ్ళిన ఒక కుక్కలోనూ ఆయన దేవుణ్ని చూశాడు.

ఇంతకీ మీ దేవుడికో పేరుందా?

ఉంది. శివం. కామ్రేడ్ సదాశివం.

ఎవరీ శివం? ఏమా కథ?

 

*****

“అరచేతిని అడ్డంపెట్టి ఎవరూ సూర్యకాంతిని ఆపలేరు.
బలవంతులు ధనబలం చూపించినా ఉద్యమాల్ని ఆపలేరు.
లోకం మొత్తం ఒక్కటై వచ్చిన విప్లవాన్ని ఆపలేరు.”
కామ్రేడ్ సదాశివం ఆవేశంగా పాడుతున్నాడు. రోడ్డులో ట్రాఫిక్ జామ్. పోగైన జనాలమీదుగా దూసుకు వెళ్లిందో కారు. ఆపాలని ప్రయత్నించాడు శివం. కారులో ఉన్న బాలసరస్వతిని చూశాడు. ఎంత పొగరుబోతనుకున్నాడు. అప్పటికి వదిలేశాడు.

ఆమెను మళ్లీ కలిసాడు శివం. ఆమె నాన్న పరమేశ్వర్ ఇంట్లో. తనే అంది – “ఐ మే లుక్ స్టుపిడ్. బట్ ఐ యామ్ నాట్,” అని. నిజమే బాలసరస్వతి స్టుపిడ్ కాదు. చాలా సెన్సిటివ్. కొన్నాళ్ల పరిచయంలోనే సదాతో ప్రేమలో పడింది.

బాల మంచి అమ్మాయే. కానీ ఆమె తండ్రి పరమేశ్వరే పెద్ద సమస్య. కార్మికుల శ్రమను దోపిడీ చేసి కోట్లు సంపాదించాడు. ఆ కార్మికుల సమస్యల కోసమే సదా పోరాడుతున్నాడు. అలాంటి వాడి కూతురైన బాలతో పెళ్లంటే …వద్దనుకున్నాడు. తనని మర్చిపోమని బాలకి సర్ది చెప్పబోయాడు. కానీ మిగతా కామ్రేడ్స్ ఒప్పుకోలేదు. కార్ల్ మార్క్సే ప్రేమించాడు. తప్పులేదన్నారు. ఇద్దరినీ దొంగచాటుగా ఊరినుంచి బయటకు పంపి పెళ్ళిచేసే ప్లాన్ వేశారు. కానీ సదా వెళ్తున్న బస్ కి యాక్సిడెంట్ అయింది. చచ్చి బతికాడు. కాలు అవిటి. మొహం నిండా గాట్లు. రూపం మొత్తం మారిపోయింది.

ఆరు నెల్ల తర్వాత కోలుకుని బాల ని వెతుక్కుంటూ ఆమె ఇంటికి వచ్చాడు. ఆమె పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళిపోయిందని చెప్పాడు పరమేశ్వర్. సదాకి నమ్మకం కలగలేదు. అతను చచ్చిపోయాడని బాలకి అబద్ధం చెప్పి నమ్మించి పెళ్ళికి ఒప్పించానన్నాడు. కడుపుతో ఉన్న ఆమెను ప్రేమ గీమ అని డిస్టర్బ్ చెయ్యొద్దన్నాడు. అంతే బాల వెళ్లిపోయాడు. పరమేశ్వర్ కి ఆ శివుడు కూడా ఇవ్వలేని వరం తన చావు. దాన్నే సదాశివం కి వరంగా ఇచ్చి వెళ్లిపోయాడు.

చచ్చి బతికొచ్చినందుకు ఎవరో సదాశివం ని దేవుడన్నారు. సాటి మనిషి మీద ప్రేమను చూపించేవాళ్లందరూ దేవుడితో సమానమనే వాడు శివం.

*****

నాకు భువనేశ్వర్ లో పరిచయం ఆయన. మొదట్లో అతన్ని చూసి మోటు మనిషనుకున్నాను. తప్పించుకు తిరిగాను. మధ్యలో ఒక ట్రైన్ యాక్సిడెంట్. ఒక పిల్లాడు చావు బతుకుల్లో ఉన్నాడు. రక్తం కావాలి. నా బ్లడ్ గ్రూపే. ధైర్యం చాల్లేదు. శివం నాకు ధైర్యం చెప్పాడు. అయినా కూడా ఆ పిల్లాడు చనిపోయాడు. నాకు ఏడుపాగలేదు. దేవుణ్ని తిట్టడం మొదలుపెట్టాను. శివం ఏమీ కానట్టు కూర్చున్నాడు.
అసలతనికి దేవుడి మీద నమ్మకం లేదనుకున్నాను. నేను అతనిలా కాదు. నాకు దేవుడి మీద నమ్మకముంది. ఆశ్చర్యంగా తనకీ దేవుడి మీద నమ్మకం ఉందన్నాడు.

ఎవరా దేవుడని అడిగాను. నా వైపు చూపించాడు. నాకర్థం కాలేదు.

ముక్కూ మొహం తెలియని ఒక అబ్బాయి కోసం కన్నీళ్లు కార్చే ఆ మనసుందే అదే దైవం, అన్నాడు.

*****

పాపం శివం. అతను బాలసరస్వతిని ఇంకెప్పుడూ కలవలేదా?

కలవలేదు. కానీ చూశాడు. ఆమె పెళ్లిలో.

ఆమెకు ఆల్రెడీ పెళ్ళయిపోయిందిగా?

లేదు. పరమేశ్వర్ అప్పుడు అబద్ధం చెప్పాడు. ఇప్పుడు మళ్లీ శివంతో కాళ్ల బేరానికొచ్చాడు. వెళ్ళిపొమ్మన్నాడు. శివం సరే అన్నాడు. కానీ, బదులుగా కార్మికుల జీతాలు పెంచమన్నాడు. పరమేశ్వర్ కి ఒప్పుకోక తప్పలేదు. శివం ద్వారానే వారి జీతాలు పెరిగాయని కార్మికులకూ తెలియనివ్వలేదు. తన పెళ్లి పందిట్లో శివం ఉన్నాడని బాలకి తెలియనివ్వలేదు. చెయ్యాల్సింది చేసి వెళ్లిపోయాడు. ”

మరి బాలకి ఈ విషయం ఇప్పటికైనా తెలుసా?

తెలుసు?

వాళ్ల నాన్న చెప్పాడా?

కాదు. నేనే చెప్పాను.

మీరెలా…?

బాలసరస్వతి నా భార్య. దేవుడు కూడా కథ రచయిత అనేవాడు శివం. నిజమే కదా!

 

*****

భువనేశ్వర్ నుంచి మేము హైదరాబాద్ కి చేరుకోగానే, నేను బలవంతం చేసి నా పెళ్లి కి రావాల్సిందే అని పట్టుపట్టి తీసుకొచ్చాను. కానీ పెళ్లి కాసేపట్లో ఉందనగా నాకొక లెటర్ రాసి హఠాత్తుగా మాయమయ్యాడు.

“ప్రియమైన సాటి దైవం, తమ్ముడు సత్యం కు, మనిద్దరి సిద్ధాంతాలు భిన్నంగా ఉన్నాకూడా, నన్ను అన్నగా భావించి ప్రేమతో కట్టిపడెయ్యాలనుకున్నందుకు థాంక్స్. పశువులకూ, పక్షులకూ శాశ్వతమైన శరణాలయం ఉండదు. నేనూ ఒక పక్షినే. శాశ్వతమనే చోటుని అసౌకర్యంగా అనుకునే పక్షిని.

ఇక నేనుండబోయే చోట నా ప్రియమైన తమ్ముడి ప్రేమ దొరుకుతుందో లేదో అనుమానమే! అయినా మరుక్షణంలో ఎదురుకాబోయే ఆశ్చర్యాలు ఈ లోకంలో ఎన్నెన్నో ఉన్నాయి. నిన్ను కలుసుకోవటం కూడా అటువంటి ఒక ఆశ్చర్యమే. ఆశ్చర్యాలు నిండిన ఈ లోకం మీద ఉంచుకుని పయనిస్తున్నాను.”

ఆ రోజు నుంచీ నా అన్నయ్య, నా దేవుడు, ఆ శివుడు, సదాశివుడి కోసం వెతుకుతూనే ఉన్నాను.

*****

హలో మిస్టర్ శివం. మీ కోసం ఈ మధ్యన చాలా మంది వెతుకుతున్నారు.

నా కోసమెందుకు వెతకడం? నేను మీ అందరికీ పరిచయమే.

పరిచయమే. కానీ మిమ్మల్ని గుర్తు పట్టడమే చాలా కష్టంగా ఉంది.

నన్ను గుర్తుపట్టడం అంత కష్టమేమీ కాదు. నేను మీ చుట్టుపక్కలే ఎక్కడో ఉంటాను. మీ ఇంటి పక్కనో, మీ వీధి చివర్నో లేదా రోజూ మీరు చిర్రుబుర్రులాడే మీ ఆఫీస్ క్లర్క్ గానో, చూడగానే మీరు గడగడలాడిపోయే మీ ఆఫీస్ బాస్ గానో…ఇలా ఎక్కడో దగ్గర ఉంటాను. బాగా వెతికితే మీ ఇంట్లోనో లేదా మీరు బాగా వెతుక్కోగలిగితే , మీ ఒంట్లోనో ఉంటాను.

అవునా? మరి మాకెప్పుడూ కనిపించలేదే?

ప్రయత్నం చెయ్యండి డ్యూడ్. పోయేదేముంది; మహా అయితే శివం అనే మంచి ఫ్రెండ్ దొరుకుతాడు. కొన్ని సత్యాలు తెలుసుకుంటారు.

*****

One Response
  1. moyhan August 21, 2015 /