Menu

The past – చిక్కుముడి

ఇదో గమ్మత్తయిన కథ..ఇందులో ఎవరు తప్పు ఎవరు కరక్టో తెలియదు.అందరి అలోచనలూ..దృక్పథాలూ సరైనవే. కానీ నాటకీయత మాత్రం నిండుగా ఉంటుంది. అదే నాటకీయంగా మన సహానుభూతి ఒకరినించి ఒకరికి మారుతూ ఉంటుంది. అలా అని ఇలాంటివన్నీ మేం టివీ సీరియళ్ళలో చూస్తూనే ఉన్నాం అనకండోయ్. ఎందుకంటే సినిమాకు ఉండే లక్షణాలన్నీ బలంగా ఉన్న సినిమా. బాగా ఆకట్టుకునే సినిమా..!!

మనం ఒక పనిచేసేముందు మనకున్న లాజిక్కు ప్రకారం ఇది ఇలా చేస్తే ఇలా అవుతుందీ అని చేస్తాం.. కానీ అది అలా జరక్కపోవచ్చు. మనం ఏదైతే జరుగుతుందని.. ఏదేతే ఎదుటివాళ్లకి తెలియాలని అనుకుంటామో అలా కాక మరోవిధంగా జరగటం..ఎదుటివాళ్ళు మరోవిధంగా అనుకోవటం సర్వసాధారణమే. అదీ కాక వివిధ సందర్బాల్లో మన మానసిక సంచలనాలని బట్టీ మనం స్పందించాల్సి వస్తుంది. కానీ స్పందనలు అవతలివాళ్ళు మనం అనుకున్నట్టు స్వీకరించలేక పోవచ్చు. అదే జీవితంలోని నాటకీయత. సరిగ్గా అదే విషయం మూలాధారంగా ఈ కథ చేసారేమో అనిపించింది. దానికితోడు సహజవాతావరణం..అతిసహజ నటనా కలగలిపి గొప్పగా అనిపిస్తుంది. సహజత్వానికి చాలా దగ్గరగా ఉండి. అసలు సినిమా గా కూడా అనిపించదు ఒక్కోసారి… !

కథ విషయానికొస్తే.. అహమ్మద్ అనే అతను తన భార్యకి విడాకులివ్వటానికి వస్తాడు,అప్పటికే వాళ్ళు ఒకరికొకరు దూరంగా ఉంటూ నాలుగేళ్ళయ్యింటుంది. అతడిని అతడి భార్య మారీ రిసీవ్ చేసుకుంటుంది. ఖచ్చితంగా వస్తావో రావో తెలియదు కనక హోటల్ రూం బుక్ చేయలేదు అంటుంది. అలా ఇంటికి వస్తాడు. ఇంట్లో ఆమెకి క్రితం వివాహాల ద్వారా కలిగిన ఇద్దరు కూతుళ్ళు లూసి..లియా ఉంటారు. వీళ్ళు కాక కాబోయే మొగుడు సమీర్ కి అంతకు ముందుభార్య ద్వారా కలిగిన కొడుకు పుహద్ ఉంటారు . మారీ పెద్ద కూతురు లుసీకి తన తల్లి మళ్ళీ పెళ్ళి చేసుకోవటం ఇష్టముండదు. లూసీతో ఒకసారి మాట్లాడివెళ్ళండీ అని చెపుతుంది మారీ, …. సో లూసీద్వారా సమీర్ మొదటి భార్య ఆత్మహత్యకి పాల్పడి కోమాలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆమె ఆత్మహత్య ఎందుకు చేసుకోబోయిందీ అనేది ఒక కారణం మీద సినిమా మొత్తం ఉంటుంది. ఇహ ఆ కుటుంబంలోని పిల్లలూ పెద్దలూ అందరూ కథలో భాగమవుతారు. పిల్లల ఇన్సెక్యూరిటీ ఒకవైపూ..పెద్దలమధ్య చోటుచేసుకున్న అపార్థాలు, కోపతాపావేశాలూగా మరోవైపు కథ వివిధ మలుపులు తిరుగుతుంది.

గమ్మత్తయిన విషయం ఏమిటంటే.. ప్రతిసినిమాలోనూ ఒక చిక్కుముడి ఉంటుంది. అది విప్పటమే సినిమా అవుతుంది. కానీ ఇక్కడ అంతా సరళంగా ఉన్నట్టు మొదలై మొదలై మెల్లిగా చిక్కుముడి పడినట్టుగా తయ్యారవుతుంది. ఆ చిక్కుముడి విడిపోయిందా లేదా కూడా తెలియదు ఎందుకంటే మానవ సంభంధాలన్నీ విడతీయలేని చిక్కుముడులే మరి.

ఒక పని/విషయానికి సంభందించి ఏదైనా ఎదుటివాళ్లకి చెప్పినపుడు/ఏదైనా విషయం జరిగినపుడు అవతలివాళ్ళు అర్థం చేసుకునే తీరు..అపార్థాలు..లేదా చిన్న డిటెయిల్స్ మీద ఎక్కువ ట్రెస్ చేయటం. ..లేదా మనమే ఇదేం పెద్దవిషయం అని చెప్పకపోయిన విషయమే చిలికి చిలికి గాలివానగా మారటం.. అనే జీవిత సత్యం మీద అల్లిన కథ ఇది. ఇలాంటి కథలు రాయలంటే చాల సునిశిత పరిశీలన అవసరం. దర్శకుడు అజ్గర్ ఫరాదీ ఇదివరకటి సినిమాలు ద సెపరేషన్.. అబౌట్ ఎల్లీ .. కూడా దాదపు ఇదేమాదిరిగా ఉంటాయి. వాటిల్లాగే ఇదికూడా పలు అంతర్జాతీయ సినిమా పండగల్లో చోటు పొందింది…బహుమతులూ గెలుచుకుంది.

సహజ వాతావరణంలో అతి సహజంగా చిత్రీకరించిన ఈ సినిమాలో  పిల్లలూ పెద్దలతో సహా ప్రతి పాత్ర..ఆ పాత్రని పోషించిన నటులూ పరెక్ట్ గా నటించారు.  మారీ గా  ప్రధాన పాత్రవేసిన  బిజు  ఉత్తమ నటిగా కేన్స్ లో అవార్డు పొందింది.

ఇలాంటి సినిమా చూసాక మనం రియలైజ్ అయ్యేదేమిటంటే… ప్రపంచంలో ఇన్ని భాషలున్నా .. కొన్ని సార్లు, మన మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పలేమని..చెప్పటం సాధ్యం కాదనీ !! ఎంజాయ్ ద మూవీ !!

One Response
  1. Pavan K August 3, 2014 /