Menu

The lovely bones – వేదనా కావ్యం !

 చావు తరవాత జీవితం ఉంటుందా ?? అనేది ప్రతి మతగ్రంధాల్లోనూ చర్చించారు. ఒక్కోరు ఒక్కోవిధంగా తమ మత విశ్వాసలకనుగుణంగా రాసుకున్నారు. అయితే విచిత్రంగా అన్నిట్లోనూ  స్వర్గమూ..జెన్నత్..హెవెన్ అని ఒకానొక ఆనందకరమైన ప్రదేశం ఉంటుందనీ.. అలాగే నరకం.. హెల్..   అనే బాధకరమైన ప్రదేశం ఉంటూందనీ రాసుకున్నారు. ఎవ్వరినీ నొప్పింపక ఇతరులకి చేతనైన సహాయంచేస్తూ పుణ్యం దక్కించుకున్నవాళ్ళు చచ్చాక స్వర్గం చేరి ఆనందపడతారనీ..  ఇతరులని దోచుకుంటూ.. పీడిస్తూ ..హాని తలపెడుతూ బతికినవాళ్ళు చచ్చాకా  నరకానికి వెళ్ళి  ఆ పాపాలకి శిక్షఅనుభవిస్తారనీ  నమ్మారు.

అయితే మనం దేవుడు నిర్ణయించినట్టు ..మన ఆయుష్షు తీరాక చస్తున్నామా.. లేక కొన్ని సార్లు ముందే చస్తున్నామా తెలియదు. ఒక వ్యక్తి ఎనభై ఏళ్ళు బతికి ..మెల్లిగా ఆరోగ్యం క్షీణించి చనిపోతే అతడు సంపూర్తిగా జీవించినట్టుగానూ,  బాల్యంలోనో.. యవ్వనంలోనో..మధ్యస్థంలోనో ఏదో ప్రమాదం బారినపడి చనిపోతే అయుష్హు తీరక మధ్యలోనే చనిపోయినట్టు పరిగణించకతప్పదు. ఒకవేళ ఈ చావుకూడా దేవుడు నిర్ణయించిందేనా  లేదా అనేది మనకి తెలియదు. ఒకవేళ దేవుడే అలా నిర్ణయిస్తే అలా అర్థాంతరంగా చావెందుకిస్తాడూ   అనేది   ఏ మతగ్రంధాలు చెప్పలేదు, చెప్పినా నమ్మలేము. ఎందుకంటే అర్థాంతరంగా చనిపోయే చావును ఎవ్వరూ ఆక్సెప్ట్ చేయలేరు. ఒకవేళ అది దైవ నిర్ణయమే ఐతే ఆ దేవుడిని కూడా దిక్కరించక ,నిగ్గదీయక తప్పదు. మనల్ని ఒకరు చంపినా..ప్రమాదంలో చనిపోయినా  మనకిమనం చేసుకున్న తప్పిదాల ప్రకారం చనిపోయినా …. అలాంటి చావుతరవాత మనం ఎక్కడికిపోతాం ? అటు పాపమో పుణ్యమో సంపూర్తిగా చేయనేలేదు. మనలెక్క మధ్యలోనే వదిలేయబడింది కదా ?? అ లెక్కతేల్చేదెలా..ఆ ప్రకారం మనకి న్యాయం జరిపేదెవరు ??
….ఏమో,.. చావుతరవాత జీవితం ఎలా ఉంటుందో..ఏం ఉంటుందో.. ఎవ్వరికీ తెలియదు. మతగ్రంధాల్లో చెప్పినవి ఊహాగానాలు అని మాత్రం చెప్పవచ్చు.

ఒక పద్నాలుగేళ్ళ అమ్మాయి. అప్పుడప్పుడే యవ్వనము లోగిలి లోకి అడుగుపెడుతున్న చిన్నారి. జీవితపు కొత్తమలుపులో కొత్త చివుళ్ళు ..నూతన  యవ్వన కోరికలు .. జీవిత కలలు ఒక్కొక్కటిగా మదిలో రూపుదిద్దుకుంటున్న అందాల బొమ్మ.  తల్లిదండ్రుల ప్రేమచాటున పెరుగుతున్న  లేత మొగ్గ. లోకం మంచో చెడో తెలియని అమాయకురాలు. మనుషుల మనసుల్లో ఉన్న కుళ్ళుని పసిగట్టలేని పసిపాప.గలగలా నవ్వు, సెలయేటి వేగం ఆమె సొంతం. పుట్టినరోజుకి గిఫ్ట్ గా వచ్చిన కెమెరా అంటే బాగా ఇష్టం.దాంతో చక చకా పోటోలు తీస్తూ…ఏనుగులూ, ఖడ్గమృగాల్లాంటి అడవిజంతువులని ఫోటోలు తీసే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కావాలని నిర్ణయించుకుంది. అదో యవ్వనపు కల.

నాపేరు సుసీ సాల్మన్..  ప్రమాదవశాత్తూ ఏదో కట్టెపుల్లని మింగేసిన తమ్ముడిని కాపాడినప్పుడు అమ్మమ్మ అంది  ‘ఎవరిప్రాణాలైనా కాపాడినవాళ్ళు ఎక్కువ కాలం ఆనందంగా గడుపుతారూ’ అని.కానీ మా అమ్మమ్మ చెప్పినవి ఏవీ జరగనట్టు. ఇది కూడా జరగలేదు.. ఎందుకంటే  నేను నా పద్నాలుగవ ఏట  1973 వ సంవత్సరం  డిసెంబరు 6  హత్య చేయబడ్డాను.. అని తన కథని మొదలుపెడుతుంది సుసీ. సుసీ ఎందుకు చంపబడిందీ.. ఎవరు చంపారూ..ఎలా చంపారూ..చనిపోయింతరవాత సుసీ ఎక్కడికి వెళ్ళింది..ఏం చేసిందీ..ఎంత బాధపడిందీ..దేనికోసం ఆరాటపడిందీ అనేది సినిమా.

ఇది అర్ధాంతరంగా చంపబడిన అమాయకపు అమ్మాయి ఆత్మ ఘోష.. భరించలేని భాద. మూగవేదన. అరణ్యరోదన. ఒక పెద్దమనిషిలా కనపడే రాక్షసుడి చేతిలో  చంపబడ్డ  చిరుమనసు పడే వేదనా కావ్యమే ఈ సినిమా.!!

ఇది ఊరికే టైంపాస్ కో.. ఎంటర్టినింగ్ కో చూసేసినిమా కాదు.. అలా చూస్తే మీకేం దక్కదు. దీన్ని చూడటానికి మీరు సుసీ మనసు తెలియాలి. ఆమె దృక్కోణం అర్థం కావాలి. మీరు సుసీగా మారాలి. .. మీరే సుసీ గా అయి చూస్తే…మాత్రం మీ మనసుకి కన్నీటీ అభిషేకం చేయబడి ఆత్మజ్ఞానంభోదపడుతుంది. సహానుభూతి అర్థం తెలియవస్తుంది.

ఇహ ఈ సినిమాని గురించి రివ్యూలు చదివితే.. గొప్ప సినిమాఅని ఎక్కడా చెప్పరు. లార్డ్ ఆఫ్ ద్ రింగ్స్ అందించిన పీటర్ జాక్సన్  ఫైల్యూర్ అటెంప్ట్ అనే ఉంటుంది చక్కని నటీనటులని వాడుకోలేదు. గ్రాఫిక్స్ ఉండటం వల్ల బావుందనిపిస్తుందిగానీ  కథే లేదు. అనే ఉంటాయి జనాల అభిప్రాయాలు.

 

కానీ చావుతరవాత జీవితం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు గనక కథ సరిగ్గా ఉంటుంది ? అది ఇలాగే ఉంటుంది అనేదానికి ఎవరు చూసొచ్చారు గకన అది రియాలిటీకి దగ్గరగా ఉంటుంది ?
సో ఇది ప్యూర్లీ కాల్పనిక కథ. ఆ కాల్పనిక వాతావరణంలోకి చేరిన ఒక అమ్మాయి ఆత్మ గా పడే తపన. సినిమాటిక్ గా ఇందులోని విలన్ ని చంపి ఎవ్వరూ పగ తీర్చుకోలేరు..కనక సినిమాటిక్ రసప్రాప్తి ఉండదు.మామూలు సినిమాలు ఎప్పుడూ వస్తుంటాయి. ఇలాంటి కథలూ..ఇలాంటి సినిమాలూ అరుదు. విజువల్లీ స్ఠన్నింగ్.  సుసీగా చేసిన Saoirse Ronan తన అందమైన మొహంతో అద్భుత నటనతో సినిమాకి జీవంపోసింది.అదే పేరుతో రాసిన నవలని పీటర్ జాక్సన్ సినిమాగా తీయటం,  అతని దృశ్యీకరణ.. కాల్పనిక జగత్తు ఆకట్టుకుంటుంది. సినిమా విజయం సాధించిందా లేదా అన్నది పాయింట్ కాదు,ఇలాంటి కథలని పట్టుకొని సినిమాతీయటమే గొప్ప సాహసం..ఆ సాహసమే విజయం.  !!!!

One Response
  1. Ramireddy August 23, 2014 /