Menu

షిప్ ఆఫ్ థిసియస్ – తాత్విక వినోదం !!

ప్రశ్నలు..ప్రశ్నలు..ప్రశ్నలు..

చిన్నప్పటి నించీ ప్రశ్నలు..  ఆకాశం లో నక్షత్రాలేమిటి?? అక్కడ ఎవరుంటారు?? పువ్వులింత అందంగా ఎలాఉన్నాయ్ ??  పక్షుల్లా మనం ఎగిరితే ఎంత బావుంటుందీ??
ఈ స్కూలికెందుకు  వెళ్లాలి?? ఈపుస్తకాలేంటీ??పాపం ఎలా తగులుతుందీ??దయ్యాలున్నాయా??  దేవుడేంటీ ?? దేవుడెలా ఉంటాడూ??… అసలు నేనెవరు ? మొదలైనవి ఎన్నో ప్రశ్నలు !!

ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పేవాళ్ళేవరూ ఉండరు.  అందరూ రెడీమేడ్ గా ఉన్న విషయాలు అంగీకరించినవాళ్ళే కనక అవే సమాధానాలు చెపుతారు.  నీవూ  అక్సెప్ట్ చేయాలి,చేసి ప్రశ్నలొదిలేసి  నీవూ అదే జీవితంలో పడాలి. అదే బాగా చదువుకోటం..మంచి ఉద్యోగం.. అంతకు తగ్గ బొంత భార్య.. ఇద్దరుపిల్లలు…………………………………………………………….

కానీ ఈ ప్రశ్నలనే అలా మనసులో ఉంచుకొని ..జ్ఞానం పెరుగుతున్న కొద్దీ సమాధానాలు  వెతుక్కొని ..మళ్ళీ కొత్తగా ఉద్భవించిన ప్రశ్నలూ..వాటికి సమాధానాలు.. ఈ పరంపరలో పడిపోయినవాళ్లంతా తత్వవేత్తలవుతారు.

ప్రతి మనిషికీ నిత్య జీవిత గమనంలో కొన్ని ప్రశ్నలు  ఉదయిస్తాయి. కానీ పొట్టపోసుకోవటంలో వాటినీ  సరిగ్గ పట్టించుకోకుండా ఏదో సమాధాన పడతాం. ఈ ప్రశ్నలూ సమాధానాల కంటే.. ఎంతో కొంత సంపాదించుకొని సుఖపడాలనే ఆశ ఉంటుంది.  అన్వేషణ సాగదు కానీ సాగితే   ప్రతిమనిషిలోనూ ఒక తాత్వికుడున్నాడు.

మనకి, మన కళ్ళముందు ప్రతి సంఘటనతోనూ ఒక ప్రశ్న ఉదయిస్తుంది..దానికి మనకి మనం పడే సమాధానం ఒకటుంటుంది. దాంతో తృప్తిపడితే అక్కడే.. కానీ దాన్ని వెతుకుతూ పోతే కొత్త సమాధానాలు..కొత్త ప్రశ్నలూనూ.
ఉన్నట్టుండి ఒకాయనకి ఒక ప్రశ్న కలిగింది..  ఒక పడవలోని చెడిపోయిన ప్రతి భాగాన్నీకొత్త భాగంతో బాగుచేస్తే.. అది పాత పడవంటారా..కొత్తపడవా? పాతదానిలాగే పనిచేస్తుందా, కొత్తగా ఏమన్నా మారుతుందా ?
ఆ తాత్విక  ఆలోచనల సంపుటాన్ని   ‘ థిసియస్ పారడాక్స్ ‘ అన్నారు. ఆ తాత్విక ప్రశ్నమీద ఎంతో మంది తమ విశ్లేషణలు చేసారు.  ఆ తాత్విక ప్రశ్న ని తానూ వేసుకొని,   తనకొచ్చిన సమాధానాలూ.. ప్రశ్నలూ అనుమానాలూ సినిమా రూపంలో మనముందుంచాడో యువకుడు. అతని పేరు ఆనంద్ గాందీ,  ఆ సినిమా పేరు  షిప్ ఆఫ్ థిసియస్.

సినిమాల్లో చూపించిన మూడు కథల గురించీ చాలామంది  వివరించారు..అయితే  ఆనంద్ గాందీ కొన్నింటికి సమాధానాలు సరిగ్గా చెప్పలేదనీ..స్పష్టంగా లేవనీ కొందరన్నారు.  ఆయనకుండే స్పష్టత ప్రశ్నలే. తనకి తోచినమేర దాన్ని అర్థంచేసుకోవటానికి..తానర్థం చేసుకున్నదాన్ని మనకి చూపించటానికీ ప్రయత్నించాడు. తప్ప ఇవీ నా సమాధానాలు అని మనని సమాధాన పరచలేదు. ఈ ప్రశ్నలకి ఎవరికి వాళ్ళే సమాధానం చెప్పుకోవసినవి. దొరక్కపోతే అన్వేషించుకోవలసినవి తప్ప… ఎవరో సమాధానం చెప్పరు. చెప్పలేరు.

టూకీగా నేనూ కథలు చెప్పక తప్పదు.

మొదటికథలో.. ఒక అందమైన అంధురాలు ఫోటోగ్రఫీ చేస్తుంటుంది. ధ్వనిని బట్టి అక్కడ ఉన్న సబ్జెక్టుని తెలుసుకొని.. క్లిక్ మనిపిస్తుంది. చూపులేకపోయినా మంచి చిత్రాలు తీయగలగే   సునిశిత్వత్వం ..కళా ఆమెకి స్వతహాగా అబ్బింది.  అమె చిత్రాలు  జనాదరణ పొందుతాయి. అలాంటి సమయంలో..ఎవరో కళ్ళు దానం చేయగా అమెకి చూపొస్తుంది. చూపొచ్చాక ఫోటోలు తీసే ప్రయత్నం చేస్తుంది. కానీ అవి తనకే నచ్చవు.

ఎందుకు నచ్చలేదు అనటానికి రెండు కారణాలు చెప్పుకోవచ్చు. 1) చూపులేనపుడు తాను ఊహించుకున్న ప్రపంచం,సౌందర్యం  ..చూపొచ్చాక తనకి కనపడకపోవటమే,  ఊహకీ వాస్తవానికీ ఉన్న తేడా అన్నమాట, అమె గొప్పగా ఊహించుకున్నది..కానీ అంత గొప్పేమీ లేదు ప్రపంచంలో / తన విద్యలో   2) తన కంటిమార్పిడి ద్వారా తనకున్న  జ్ఞాననేత్రం మూసుకొని పోవటమే.

మన థియరీ ప్రకారం..  వస్తువులో చెడిపోయిన బాగాన్ని రిపేరు చేసి కొత్త భాగం అతికిస్తే అది ఒరిజినల్ లా పని చేస్తుందా ??   ఏనాటికీ చేయదు…అలా అమెకి లేని కళ్ళు తెప్పించబడ్డాయి. అంటే ఆమెలో మార్పు ఖచ్చితంగా ఉంటుంది. అమెకి కళ్ళొచ్చాయి కానీ కళ కోల్పోయింది.  !!

రెండవకథలో ఒక జైన యోగి మనుషులకి ఉపయోగపడే మందులు కనుక్కొనే ప్రయోగాల్లో భాగంగా చాల జంతువులు హింసకి గురవుతున్నాయి అంటాడు. ఆవ్యాజ్యాన్ని కోర్టుకెక్కిస్తాడు.  కనీసం వాటికి మంచి వసతి ఏర్పాటు చేయాలీ చచ్చేవరకూ అని అతని వాదన. కానీ అతని కాలేయానికి వ్యాది సోకుతుంది.  ఆపరేషన్ చేసి కాలేయమార్పిడి చేయాలంటారు. ససేమిరా అంటాడు. ఆ వ్యాధి వలన తాను బాధ అనుభవిస్తుంటాడు. కానీ మందులు తీసుకోడు.చివరాఖరికి బాధలో జ్ఞ్నాననేత్రం వెలిగి ఆపరేషన్ కి సిద్దమవుతాడు.

మార్పు కి రెండు కారణాలు. 1) చార్వాకుడు అనే జూనియర్ లాయర్.. పదే పదే ఆ యోగి పాటించే ఆధ్యాత్మిక నియమాల పట్టు సడలించే తెలివైన ప్రశ్నలు సంధించటం,

                               ఎంతటి ధృడ విశ్వాసాలైనా.. మూలాలని కదిలించే ప్రశ్నలెదురైనపుడు  సమాధానలు లేకుంటే.. కుప్పకూలవలసిందే కదా .
                                2) ఎవ్వరికైనా పారడియం షిఫ్ట్ అనేది వస్తుంది జీవితంలో… అది పలు రకాలుగా రావచ్చు..ముఖ్యంగా  ఎప్పుడైతే చావుకి దగ్గరగా వస్తామో అప్పుడు.
ఇవి రెండూ జరిగాయి కనకే  అతడు ఆపరేషన్ కి ఒప్పుకుంటాడు. అతని దేహం ఓ కొత్తభాగంతో రిపేరు చేయబడింది. మన థియరీ ప్రకారం మార్పు రావాలి. సో జీవనశైలి మారిపోతుంది. అందుకే అతడు యోగిలా కాకుండ మామూలు జీవితాన్ని గడుపుతూ రెగులర్ వస్త్రధారణతో కనపడతాడు.

ఇహ మూడవకథ > డబ్బే ప్రపంచంగా బిజినెస్ లో తల మునకలయ్యే ఒక యువకుడికి  ఆపరేషన్ జరిగి కిడ్నీ అమరుస్తారు ఎవరో దాతది. డిచ్చార్జీ అయ్యి ఇంటికొస్తాడు.  వాళ్ల నానమ్మ మాత్రం ప్రజాసేవ..జీవిత పరమార్థం అని ఏదో చెపుతుంటుంది. అవేశం ఎక్కవాకుర్రాడికి. కానీ అమె జారిపడి కాలు విరగటంలో ఆసుపత్రి లో జాయిన్ చేస్తాడు. అక్కడ అమెకీ అతనికీ ఒక అర్థవంతమైన చర్చ జరుగుతుంది. అతనిలోకి మరోభాగం అమరింది కనక అతనిలో మార్పు కలగాలిగా ..కలుగుతుంది.   హాస్పిటల్లో ఎవరివో ఏడుపుపు  వినపడటం. ఎవరిదో మరో ఆసుపత్రిలో అపెండిసైటిస్ ఆపరేషన్తో పాటూ కిడ్నీ కాజేశారని వినటం తో.. కొంపదీసి ఆ కాజేసి పెట్టింది తనకేనా అని అనుమానమొచ్చి… కూపీ లాగితే  చివరాఖరికి అది తనకి అమర్చలేదని తెలుసుకుంటాడు. కిడ్నీ కోల్పోయిన కుటుంబానికి భారీగా నష్టపరిహారం కూడా ముడుతుంది. ఆ కూపీ లాగటంలో భాగంగా అతను మనుషులగురించి తెలుసుకుంటాడు.

ఓ వ్యక్తికి సంభందించిన  ఎనమిది శరీరభాగాలు.. అవసరమైన ఎనమిది మందికి అమర్చబడ్డాయి. వాళ్ళకి కొత్త జీవితం ఇవ్వబడింది. అది పాతజీవితం లాగ ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండదు. మార్పు తప్పకుండా ఉంటుంది.
షిప్ ఆఫ్ థిసియస్ ప్రకారం ఓ  కొత్త భాగం అమర్చటం వల్ల  మార్పు ఉంటుందో లేదో తెలియదు కానీ  ….  వ్యక్తి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడినపుడు ‘ జీవితపు విలువ’  తెలుసుకోవటం ద్వారా వస్తుంది.

శరీరభాగలు దానం చేసిన వ్యక్తి తీసిన వీడియో ఫూటేజ్ చూస్తూంటారు గ్రహీతలంతా .. గనుల్లో  ఆ వ్యక్తి తీసిన వీడియో ఫూటేజ్ అది. అందరూ నిస్శబ్ధంగా గమనిస్తుంటారు..చీకటిగనుల లోతుల్లోకి వెళ్ళే కొద్దీ తళుక్కున మెరుస్తున్న తెల్లని రాళ్ళు దర్శనమిస్తుంటాయి. అవన్నీఅత్యంత విలువైన వజ్రపు రాళ్ళే !!

అవును చీకటి కుహరంలా కనిపించే మన మనసులోకి వెళితే తప్ప  … విలువైన మానవతా వజ్రపుగనులు కనపడవు . !!
షిప్ ఆఫ్ థిసియస్..  తప్పకుండా చూడవలసిన  వినోదాత్మక తాత్వికమైన సినిమా  !!!