Menu

“దృశ్యం”- నా స్పందన

సినీ సమీక్షలు రాయడం మానేసి చాలా కాలం అయ్యింది. గీత రచయితగా సినీ రంగంలో భాగం అయ్యాక మొహమాటాలు, స్నేహాలతో పాటు మనసు కూడా అడ్డుపడడం వల్ల స్వఛ్ఛందంగా సమీక్షల విషయంలో అస్త్ర సన్యాసం చేసాను. అయితే మంచి సినిమా చూసినప్పుడు ఆ అనుభూతిని నలుగురితో పంచుకోవడం మరో అనుభూతి. కేవలం ఆ అనుభూతి కోసమే నా ఈ స్పందన రాస్తున్నాను. ఇది సమీక్ష కాదని మనవి.

“దృశ్యం”. మళయాళంలో సూపర్ హిట్. తెలుగులో కూడా తీసారు. ఈ ఉదయం స్పెషల్ ప్రివ్యూ చూసాను. సినిమా మొదలైన సుమారు ఇరవై నిమిషాల వరకు చీకట్లోనే దిక్కులు చూస్తూ కూర్చున్నాను…. హిట్ సినిమా అన్నారు కాబట్టి టర్నింగ్ పాయింట్ కోసం వేచి చూస్తూ…! సడన్ గా ఒక పాత్ర ప్రవేశం, కథలో ఆసక్తి, కథనంలో ఉత్కంఠ వెంటవెంటనే మొదలయ్యాయి. ఇంటర్వల్ దాకా ఊపిరి సలపలేదు. తర్వాత ఎమౌతుందో అని ఆలోచన మొదలయ్యింది. కొన్ని వందల సినిమాలు చూసిన సగటు తెలుగు ప్రేక్షకుడిగా ఆలోచించడం మొదలెట్టా (నేను మళయాళం వర్షన్ చూడలేదు కనుక కథాగమనం తెలీదు). కానీ నా ఆలోచనలేవి ద్వితీయార్థంలో ఫలించలేదు. అంతా నేను ఊహించని స్క్రీన్ ప్లే.

తెర మీద జరిగేదంతా ధర్మానికి, చట్టానికి మధ్య యుధ్ధం. ఒక సామాన్యుడికి, అధికార బలమున్న పోలీసు అధికారికి మధ్య యుధ్ధం. ఒక కుటుంబంలోని తండ్రికి, మరో కుటుంబంలోని తల్లికి మధ్య జరిగే యుధ్ధం. ఆవేశం, ఆలోచన, ఆందోళన ఒకదానితో ఒకటి తలపడుతూ సాగే ఒకానొక ఉద్వేగం. ఆ ఉద్వేగం ప్రేక్షకుడి గుండె వేగాన్ని పెంచుతూ ధర్మం వైపు…అంటే సామాన్యుడి వైపు…అనగా తండ్రి వైపు నిలబడి అతను చట్టానికి దొరక్కూడదని కోరుకునేలా చేసే కథనబలం ఈ సినిమాకి ఆయువుపట్టు.

కథ, కథనం గురించి ఎంత చెప్పినా అసలు వెంకటేష్ లాంటి నటుడు లేకపోతే ఈ సినిమా నాకు ఇంతిలా నచ్చేదా అని ప్రశ్నించుకున్నాను. నచ్చేదే..కానీ ఇంతిలా కాదు. శంఖంలో పోస్తేనే తీర్థం అని ఊరికే అనలేదు. కొత్తనటులు ఎవరైనా చేస్తే “మంచి ప్రయత్నం” అని ఊరుకునే వాడినేమో. కానీ మన స్టార్స్ మోసే కథలనే మనమూ మోస్తూ వస్తున్నాం. మన స్టార్స్ చేసే సినిమాలే సినిమాలు అనే స్థాయిలో మనం ఉన్నప్పుడు, సరైన కథలని నెత్తిన పెట్టుకోవాల్సిన బాధ్యత స్టార్స్ పై ఉంది. అలాంటి బాధ్యతను తలకెత్తుకోవాలనే ఆలోచన మొన్న “మనం’తో నాగార్జునకి, నేడు “దృశ్యం”తో వెంకటేష్ స్థాయి హీరోకి రావడమే ఒక శుభతరుణానికి నాంది అనిపించింది. అందుకే ఇలా స్పందించడం కూడా ఒక బాధ్యతగా ఫీల్ అయ్యాను.

“యద్యదాచరతి శ్రేష్ఠః తత్త దేవేతరో జనః. స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే” అని భగవద్గీతలో చెప్పినట్టు సంఘంలో శ్రేష్ఠులు అనబడేవాళ్లు దేనినైతే ఆచరిస్తారో అదే ఇతరులూ ఆచరిస్తారు. ఈ బాధ్యత రాజకీయనాయకులకంటే ఈ రోజు సినిమా స్టార్స్ కే ఎక్కువగా ఉందని నేను గట్టిగా నమ్ముతాను. మనది స్టార్ డ్రివెన్ ఇండస్ట్రీ కనుక స్టార్స్ తలుచుకుంటేనే కథల్లో, కథనాల్లో మార్పులు వస్తాయి. వైవిద్యభరితమైన సినిమాలు సమాజాన్ని ఉధ్ధరించేస్తాయని చెప్పలేము కానీ, సినీ రంగం కీర్తిని మాత్రం ఉద్ధరిస్తాయి.

ఇక ప్రతి సారి ఇలాంటి సినిమాలతో పెట్టుకుంటే నిర్మాతలు జోలె పట్టాలి అనే వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లకి ఒకటే ప్రశ్న. ప్రతిసారి మూస ఫార్ములా మసాలాలు తీస్తే నిర్మాతల ఖజానా నిండిపోతోందా?

సరే ఇక ముగింపుకొస్తా. ఈ సినిమా చూసాననగానే, “మీరు మళయాళం వర్షన్ చూసారా? దానికన్నా ఇది గొప్పగా ఉందా?” అని కొందరు, “మళయాళం సినిమా కాపీ కొట్టి తీయడం కూడా ప్రతిభేనా?” అని కొందరు అడిగారు.

నేను తెలుగువాడిని కనుక మళయళంతో నాకు పని లేదు. ఒక ప్రేక్షకుడిగా సినిమాకి అనుభూతి కోసం వెళ్తాను తప్ప, దర్శకుడి ప్రతిభని అంచనా వేయడానికి కాదు. నా అనుభూతి నాకు లభించినప్పుడు కథ ఎక్కడనుంచి తీసుకున్నా, ఏది ఎక్కడ నుంచి ఎలా ఎత్తి ఎలా కుదేసినా నాకు అనవసరం.

-సిరాశ్రీ

3 Comments
  1. chandra August 11, 2014 /
  2. Rabhasa Movie August 26, 2014 /
  3. Rajendraprasada Reddy August 2, 2017 /