Menu

మౌనరాగం – మనసు తీరు

స్త్రీ పురుషులిద్దరూ కొన్నాళ్ళపాటూ కలిసుంటే..స్నేహం వికసించి,  ఒకరినొకరు అర్థంచేసుకొని..సర్ధుబాటు కూడా చేసుకొని ఒకరిమీద ఒకరికి ఆధారపడే తత్వం ఏర్పడి,  ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉంటారు తద్వారా వాళ్లమధ్య అనుబంధం ఏర్పడి ప్రేమ చిగురిస్తుంది. ఈ లోపు ఇద్దరి ప్రేమకి ప్రతిరూపంగా పిల్లలు పుట్టుకొస్తారు. అలా కుటుంబం ఏర్పడుతుంది.  ప్రేమ కొంచం అటూ ఇటూ అయినప్పటికీ అలవాటు అయిన అనుభంధం వివాహాన్ని పటిష్టంగా ఉంచుతుంది. ( పటిష్టం అంటే…ఇద్దరూ కొట్టుకుంటున్నా వివాహన్ని విడిచిపోకూడదు అనుకుంటారు ) . కుటుంబ అనుభంధంలోనుంచి బయటపడి చేసేదేమీ లేదన్న భావన కలుగుతుంది. అదీ కాక మళ్ళీ అంతదూరం ప్రయాణించాలంటే బద్దకం అనిపిస్తుంది. అంతాకలిసి జీవితంలోని అరవై ఏళ్లనీ లాగేస్తుంది. ఇహ తామిద్దరం అన్యోన్యంగా ఉన్నారాలేదా..ప్రేమించుకున్నారా లేదా..ఆకర్షణ ఉన్నదాలేదా ఈ ప్రశ్నలకంటె ఏలాగోలా జీవితాన్ని లాగామా లేదా అన్న విషయం చక్కగా జరుగుతుంది. కనక వివాహం సఫలమైనట్టే !!  ఇదీ భారతీయ వివాహ పథకం. కానీ ఈ మధ్య ఈ పథకం చక్కగా పారటం లేదు. వ్యక్తి స్వేచ్చ..స్త్రీ ఆర్థిక స్వతంత్రం మూలాన ఎన్నోవివాహాలు పెటాకులవుతున్నాయి. రెమిడీ కనుక్కునేవాళ్ళే లేరు. 😛 జస్ట్ ఊరికే చెప్పా.. ఆ విషయం వదిలేయండి..!! 😉
 
ఈ సినిమా చూద్దామని చాలాసార్లు అనుకున్నాను. యూట్యూబులో లింకు దొరక్క చూడలేకపోయా..నిన్న వేరే ఏదో సినిమాగురించి చూస్తుంటే దొరికింది. వెంటనే చూసేసాను. చాలా సరళమైన కథ. అయినప్పటికీ సహజ నాటకీయత/ రియలిస్టిక్ డ్రామా బాగా పండటం మూలాన  సినిమా మనసుకు హత్తుకుంటుంది.

 కథ

దివ్య ఆ ఇంట్లో అల్లరిపిల్ల. ఇద్దరు చెళ్ళెల్లూ, ఒక అన్నయ్యా, వదినా, అమ్మా నాన్నా. హాయిగా ఉన్నదివ్యకి పెళ్ళి చూపులు ఏర్పాటు చేస్తారు. దివ్యకి అప్పుడే పెళ్ళి చేసుకోవటం ఇష్టంలేదు.  అందుకే పెళ్ళి చూపులు ఎగ్గొట్టటానికి కాలేజీకి వెళ్ళి..అటునుంచి మిత్రురాళ్ళతో తిరిగి చీకటిపడ్డాక గానీ ఇంటికి రాదు. కానీ పెళ్ళివాళ్ళు ఆమె కోసం ఓపికగా ఎదురుచూస్తూంటారు. పెళ్ళికొడుకు చంద్రకుమార్ ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడాలి అని వేచిచూస్తుంటాడు. అతను నోరుతెరవకముందే తను మొండిపిల్లనీ..చెప్పినమాట వినననీ..మంచిభార్యని అవలేననీ, సో తనని చేసుకోవద్దని చెపుతుంది, అతను తన్ని నిరాకరించాలని. కానీ అతను  అమె తనకి బాగా నచ్చావని చెపుతాడు.ఇంట్ళోవాళ్లకి కూడా పెళ్ళికొడుకు బాగా నచ్చటంతో దివ్యమీద ఒత్తిడి తెస్తారు. దివ్యమాత్రం అతను తనకి నచ్చలేదనీ ఈ పెళ్ళీ ఇష్టంలెదనీ..చవువుకుంటాననీ తెగేసి చెపుతుంది.  అందరి ఉత్సాహం నీరు కారుతుంది. ఇంతలో తండ్రికి గుండెపోటు రావటంతో దివ్య పెళ్ళి ఒత్తిడివల్లే అలా అయ్యిందని భావిస్తారు. తనకి మాంగల్య భిక్షపెట్టమనీ తల్లికూడా దీనంగా బ్రతిమిలాడటంతో చేసేది లేక పెళ్ళికి అంగీకరిస్తుంది.

పెళ్లవుతుంది. మొదటిరాత్రి చంద్రకుమార్ ని దూరంగా ఉంచుతుంది. ఇద్దరూ ఢిల్లీకి బయలుదేరుతారు కొత్తకాపురానికి.  అక్కడ చంద్రకుమార్ దివ్యకి దగ్గరవటానికి ప్రయత్నిస్తాడు. దివ్య ముభావంగాఉంటుంది. చేసేది లేక సెలవులు కాన్సిల్ చేసుకొని ఆఫీసుకు బయలుదేరుతాడు. అక్కడ తన బాస్ మున్నాళ్లకే అఫీసుకెందుకు తగలడ్డావ్ అని తిట్టీ.. కొత్త పెళ్లానికి మొదటి బహుమతి ఇవ్వు..అప్పుడేవాళ్ళు  కొంచం పట్టుసడలిస్తారని సలహా పారేస్తాడు. ఆయన సలహా మేరకి  దివ్యని డిన్నర్కి తీసుకెళతాడూ. బహుమతిగా ఏంకావాలీ అని  అడుగుతాడు..విడాకులు ఇయ్యగలవా అని అంటుంది చీకాకుగా, కోపంగా.. అర్థం కాదు చంద్రకుమార్  కి.  మరునాడు  దివ్యా నీకోటి చెప్పాలి అని  అమె చెయ్యి పట్టుకోగానే గొంగలి పురుగు పాకినట్టుంది వదలండీ అని విసురుగా వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. అక్కడ ఒక బహుమతి పాక్ ఉంటుంది. చంద్రకుమార్  అది విప్పిచూడమని చెపుతాడు. వద్దని చెప్పినా బహుమతి ఎందుకుతెచ్చావ్.. నాక్కకరలేదు అంటుంది. భర్తగా బలవంతం చేస్తే అంటాడు.. మీబలవంతాలకి లొంగాల్సిన అవసరం నాకు లేదు. నాకు సంభందించినంతవరకూ ..మీరుకట్టింది తాళి కాదు. కేవలం పసుపు పూసిన తాడు. జనం దృష్టిలో నేను మీ భార్యని కావచ్చు..కానీ మీరు నా భర్త కాదు.

ఎందుకంటే.. నేను మిమ్మల్ని భర్తగా స్వీకరించలేకపోతున్నాను… ఎందుకంటే.. నా హృదయం  నాదగ్గరలేదు.  !!

 

ఇదివరకు మనోహర్ ని ప్రేమించిన విషయం.. అతన్ని పెళ్ళి చేసుకోవాలనుకున్నరోజే రిజిస్టర్ ఆఫీసుమెట్ల మీద తన కళ్లముందే మనోహర్ చనిపోయినవిషయం తెలుసుకుంటాడు. చంద్రకుమార్  దివ్య మనసుని అర్థం చేసుకుంటాడు. అయినాసరే బహుమతి విప్పి చూడంమంటాడు. ఇంతచెప్పినా మీ పట్టువీడరా అని బహుమతి విప్పుతుంది కోపంగా..

” నీవడిగిన విడాకుల పత్రం.. నేను ఆశపడితెచ్చిన కాలిగజ్జెలు..

నిన్నవిడాకులడినపుడూ..నిజంగా అడీగావో..వేళాకోళానికి అడిగావో నాకర్థం కాలేదు. కానీ ఇప్పుడూ నీవు చెప్పిందివిన్నతరవాత  నీవడిగింది న్యాయమే. అయితే నీ గతజీవితంతో నాకు సంభందంలేదు. భావిజీవితాన్ని బాగుచేద్దామని ఆశపడ్డాను. ఇంకా ఆశపడుతున్నాను. వివాహంమీద నమ్మకముంటే.. నేతెచ్చిన బహుమతి తీసుకో.. లేదూ ఏకాకిగా ఉండాలనుకుంటే మాత్రం విడాకుల పత్రం మీద సంతకంపెట్టు ”  అంటాడు. దివ్య విడాకుల పత్రంమీదే సంతకం పెడుతుంది.

మరునాడు ఇద్దరూ లాయర్ని కలుస్తారు. కేవలం ఏడురోజుల పెళ్ళికి కోర్టువిడాకులు ఇవ్వదనీ.. కనీసం సంవత్సరం పాటూ ఆగాలని చెపుతుంది.  ఆ సంవత్సరం పాటు తన ఇష్టం వచ్చినట్టు తాను తన ఇంట్లో ఉండవచ్చనీ చెపుతాడు. దివ్య మనసు కుదుట పడి సంతోషపడుతుంది. స్నేహంగా ఉండాలనే ఆమె ప్రయత్నాలన్ని చంద్రకుమార్  తన ముభావంతో విరిచేస్తాడు. చంద్రకుమార్  అలా ఎందుకు చేస్తున్నాడో దివ్యకి తెలియదు.
” ఒకసారి పురుషహృదయంలో ప్రేమ మొలకెత్తిన తరవాత ఏమీ లేక ఎండనన్నా ఎండాలీ..కాలికింద నలిగి చావనన్నా చావాలి..గానీ నీరుపోసి మరోదోవన తిప్పుదామంటే  ఎవరితరమూ కాదు ” – చలం.
ఆమెంటే అతడిని బాగా ఇష్టం. కానీ ఆమెని తన పెళ్ళాంలా అనుకోలేడు. బాగా ఇష్టమైన ఆమెని కేవలం స్నేహితురాలిగా చూడలేడు. స్నేహం ముదిరి  మనసు దగ్గరైతే ఆమెలేకుండా బ్రతకలేడు.ఎలాగూ సంవత్సరం తరవాత అమె వెళ్ళిపోతుంది..అప్పుడు అతడి మనసు బద్దలవుతుంది. అందుకే ముందునించే దూరంగా ఉండటమ్ మంచిది అని అతడి ఉద్దేశం.

‘ప్రస్తుతం  ఆనందంగా ఉన్న మనసు, గతం తాలూకు చేదు అనుభవాలనీ..విషాదాన్ని మరిచిపోతుంది’ . దివ్య తన గతాన్ని మరుస్తుంది, ఆ ఇంట్లో అమెకి సంతోషంగా ఉంటుంది.అతడి విశాల హృదయం అర్థమవుతుంది. అతన్ని ఇష్టపడటం..ప్రేమించటం మొదలుపెడుతుంది.  చివరాఖరికి అమె తన ఇష్టాన్ని తెలియజేస్తుంది.ఇద్దరూ ఒకటవుతారు.

కథ సరళమే అయినప్పటికీ..పాత్రలు బలంగా సృష్టించబడ్డాయి. కథనం వడివడిగా ఉంటుంది.  అల్లరిపిల్లగా పరిచయమైన దివ్య..అంతలోనే లోతైన భావాల్లోకి ఇంకిపోవటం.. .సూటితనం, మొండితనం కలగలిసి ఒక స్టబర్న్ నేచర్ గలిగి ఆకట్టుకుంటుంది. అందుకే ఆ పాత్రకి ఎవరూ చెప్పి ఒప్పించలేరు. అమెకి ఆమే నిర్ణయం తీసుకోవాలిగానీ.  దివ్యగా రేవతి చక్కగా ఇమిడిపోయింది. చంద్రకుమార్ గా మోహన్, మనోహర్ గా  కార్తీక్ లు ఆకట్టుకుంటారు.  అలాగే కథనం లో ఎక్కడా బోర్ ఫీలుండదు. సన్నివేషాలు ఒకదానికొకటి అల్లుకుపోయు ఉంటాయి.అనవసర సన్నివేశాలుండవు. ఉన్నా అవి ఏ ఒకటో రెండో..( కామీడీ సీన్లు). ఇహ సన్నివేషాలు చక్కగా హత్తుకునేట్లు రావటానికి రెండు బలమైన మాధ్యమాలుండనే ఉన్నాయి. ఒకటి ఇళయరాజా నేపథ్య సంగీతం..మరోటి పిసీశ్రీరాం  చాయాగ్రహణం.  ఓవరాల్ గా సినిమా చూస్తుంటే.. కాలానికతీతమైన ఒక నాణ్యమైన సినిమా కనపడుతుంది.  ఈ సినిమా ద్వారానే  మణిరత్నానికి సినిమాతీయటం మీద గట్టి పట్టు వచ్చింది.  కమర్షియల్ గానూ హిట్టయింది. నేషనల్అవార్డూ..ఫిల్మ్ ఫేర్ అవార్డూ తెచ్చిపెట్టింది.

ఇంత టెక్నాలజీ ఉండి  ఇప్పుడు  ఇప్పటికి కూడా ఇలాంటి సినిమా చేయటం..అబ్బే సాధ్యపడదేమో !