Menu

ఒక రొమాంటిక్ ప్రేమ కథ కాలేకపోయిన ‘కొత్తజంట’

ఒక అబ్బాయి-ఒక అమ్మాయి. ఇద్దరూ ప్రేమించుకుంటారు. సమస్య వాళ్ల స్వభావ వైరుధ్యం (ఖుషి)వల్లనైనా రావాలి లేదా బయటనుంచీ వచ్చే ప్రమాదం/అభ్యంతరం/పరిస్థితుల (జయం, నువ్వూ-నేనూ) ప్రభావం వల్లనైనా రావాలి. దాన్ని అధిగమించి ఇద్దరూ ఒకటవ్వాలి. ఒక హ్యాపీ ఎండింగ్ ఉన్న ప్రేమకథలకు అది అత్యంత అవసరం. ఆ ప్రేమ జంట ఒకటవ్వాలని జనాలు/ప్రేక్షకులు బలంగా కోరుకోవాలి. అలా కోరుకోవాలంటే, వాళ్ళు ముచ్చటైన జంట అయుండాలి. సమస్యతో ప్రేక్షకుడు ఐడెంటిఫై అయ్యుండాలి. వాళ్ల ప్రేమతో ఎంపతైజ్ అవగలగాలి.ఇవేవీ కాని సినిమా “కొత్తజంట”.

నిజానికి కొత్తజంట సినిమాకి ఇంత అనాలిసిస్ అవసరం లేదు. కానీ ఈ సినిమా రొమాంటిక్ కామెడీ ఎలా తియ్యకూడదో చెప్పడానికి ఈ మధ్యకాలంలో వచ్చిన పర్ఫెక్ట్ ఉదాహరణ కాబట్టి, అలాంటి సినిమా కథలు రాసుకునేవాళ్లకు ఒక మార్గదర్శకంగా ఉంటుందని ఈ విశ్లేషణ.

కేవలం పాత్రల స్వభావాల మీద నడిపే రొమాంటిక్ ప్రేమ కథల్లో, అమ్మాయి-అబ్బాయిల పాత్రల్లో వైరుధ్యం లేకపోతే పండదు. ఒకరి సాంగత్యంద్వారా మరొకరి మనస్తత్వాలలో మార్పులు రాకపోతే క్యారెక్టర్ గ్రాఫ్ (ఆర్క్) ఫార్మ్ కాదు. ప్రేమ వారి జీవితపు విలువల్ని ప్రశ్నించి, కొత్త విలువలవైపు నడిపించకపోతే ఆ పాత్రలతో ప్రేక్షకుడు మమేకం కాడు.

కొత్తజంట సినిమాలో నేపధ్యాలు వేరైనా హీరో-హీరోయిన్లు ఇద్దరూ స్వార్థపరులు. ఒకవేళ ఒకరు స్వార్థపరులుగా మరొకరు నిస్వార్థ పరులుగా ఉంటే ఇద్దరి మధ్యా ప్రేమల సాధ్యాసాధ్యాలపై ప్రేక్షకుడికి ఆసక్తి కలిగేది. నిస్వార్థపరుల ప్రేమ స్వార్థపరుని స్వభావాన్ని ఎలా ప్రభావితం చేసి మారుస్తుంది అనేది కథ అయ్యుండేది. కానీ ఇక్కడ ఇద్దరూ స్వార్థపరులు అనగానే, సాధారణ అంచనాలకన్నా మించిన మ్యాజిక్ ఏదైనా జరుగుతుందేమో అని ప్రేక్షకులు ఎదురుచూస్తారు. కానీ ఏ మ్యాజిక్కూ జరక్కపోవడంతో పాటూ, ఏ బలమైన కారణమూ లేకుండా కథానాయిక నిస్వార్థపరురాలిగా మారిపోవడం అనేది అత్యంత పేలవమైన “డ్రైవ్”గా మిగిలిపోతుంది.పైపెచ్చు నాకు వందకోట్లున్నాయని హీరో చెప్పిన ఘటనలోనే, ప్రేమ ప్రపోజ్ చెయ్యడంతో, అసలు హీరోయిన్ కి ప్రేమ వందకోట్ల వలన కలిగిందా, హీరో ప్రేమించాడన్నాడు కాబట్టి కలిగిందా అనేది ఎవరికీ అర్థం కాని విషయంగా మిగిలింది. హీరో ప్రేమని మొదటచెప్పి,దానికి స్పందనగా హీరోయిన్ ప్రేమలో పడి నిస్వార్థపరురాలిగా మారాక, ప్రేమతో పాటూ తను కోరుకున్న లైఫ్ స్టైలూ దక్కిందని సంతోషపడినా రిలీఫ్ ఉండేది. అలా చెయ్యకపోగా, హీరోయిన్ కూడా హీరోతో గేమ్ అడటానికి పోసాని పాత్రని వాడుకుంటుంది. అందుకే అమ్మాయి డిప్రెషన్లో ఉందన్నా, ఆత్మహత్యకు పాలుపడిందన్నా మనకు ఆ పాత్రమీద ప్రేమ కలగదు.

ఈ సినిమాలో అసలు సమస్య హీరోది. హీరో పాత్ర పచ్చి స్వార్థపరుడు. అవసరం కోసం ఏదైనా మానిప్యులేట్ చేస్తాడు. హీరోయిన్ తో సహా. ఈ అలవాటు అతనికి చిన్నప్పుడు మభ్యపెట్టడానికి అమ్మచెప్పిన అబధ్ధం వల్ల వచ్చింది. దాన్నే జీవితంలో మోడల్ గా అలవర్చుకుని సక్సెస్ ఫుల్గా జీవించేస్తున్నాడు. హీరోయిన్ ప్రేమించిందన్నా, ఫ్రెండ్స్ అందరూ ఏంటిలా చేశావ్ అన్నా అతనిలో మార్పు రాదు. లాజికల్గా ఆలోచించడు. హీరోయిన్ ప్రేమలోని ఇంటెన్సిటీని, మిస్సింగ్ ని అనుభవించడు. కేవలం కన్ఫ్యూజన్ లో ఉంటాడు. అంతలో వాళ్ల అమ్మ వచ్చి లాగి గూబమీద ఒకటి ఇచ్చేసరికీ మెంటల్ బ్లాక్ మటాషై హీరోయిన్ మీద ప్రేమ పుట్టుకొస్తుంది. అత్యంత అసహజమైన మారుతి మార్కు బూతుచివర వచ్చే నీతి సూత్రంలాంటి సీన్ అది.

సినిమా చూసే ప్రేక్షకులు ఇంత అనాలిసిస్ చెయ్యకపోవచ్చు. కానీ అనుభవిస్తాడు. హీరో-హీరోయిన్ పాత్రల మధ్య తేడా లేకపోవడం. ఆ లేని తేడాలవల్ల క్లాష్ వస్తే రావొచ్చుగానీ ప్రేమ కథలో కాన్ఫ్లిక్ట్ రాకపోవడం అనేది ప్రేక్షకుడు అసోసియేట్ అవలేకపోవడానికి ముఖ్య కారణం. ఒకవేళ సమస్య బయటనుంచీ వస్తుందా అనుకుంటే ఆ రౌడీ ఎమ్.ఎల్.ఏ పాత్ర క్లైమాక్స్ లో ఒక ఫైటుకితప్ప కథకు ఏ విధంగానూ పనికిరాలేదు. ప్రేమకథల్లో కూడా కామెడీ టిట్ బిట్స్ పెడితే సరిపోతుంది, కథ మీద పాత్రలమీదా వర్కౌట్ చెయ్యకుండా అనుకునే మనస్తత్వాన్ని వదిలితేగానీ, డీసెంట్ ప్రేమకథలు మనం తియ్యలేం. కొత్తజంట ఒక పెద్ద ఉదాహరణ మాత్రమే.