Menu

సోఫీ షోల్ చివరి రోజులు

ఆ శీర్షిక చూడగానే ఆవిడెవరు? ఆవిడ చివరిరోజుల గురించి మనకెందుకు?అన్నవి చాలా సాధారణంగా కలిగే ప్రశ్నలు. ఒక ఆరేడు నెలల క్రితం రిట్టర్ స్పోర్ట్ చాక్లెట్ కంపెనీ వారి మ్యూజియంకి వెళ్ళినపుడు – అక్కడ వాళ్ళ చరిత్రతో పాటు, జర్మన్ చరిత్రలోని కొన్ని ముఖ్య ఘట్టాల గురించి కూడా గోడలపైన రాసి ఉన్నందువల్ల Geschwister Scholl (Scholl Siblings) గురించి తెలిసింది. అరే, మనూళ్ళో యూనివర్సిటీ వారి ప్రధాన కార్యాలయం ఉన్న ప్రాంతం పేరు Geschwister Scholl Platz కదా! అంటే ఆ పేరుకో చరిత్ర ఉందా! అనుకున్నాము అప్పట్లో – నేనూ, అమెరికన్ అయిన నా స్నేహితురాలూ. చాలారోజులకి, గత వారంలో Sophie Scholl-Die Letzen Tage (Sophie Scholl-The Final Days) అన్న జర్మన్ సినిమాను ఆంగ్ల ఉపశీర్షికలతో చూడ్డం సంభవించింది. సినిమా నా మీద అయితే చాలా ప్రభావం చూపింది. అందుకే, ఆ సినిమా గురించే ఈ వ్యాసం.

ముందుగా కొంత నేపథ్యం: రెండో ప్రపంచ యుద్ధకాలంలో జర్మనీ దేశంలో నాజీల విధానాలని అహింసా పద్ధతులు అవలంబిస్తూ వ్యతిరేకించిన విద్యార్థుల గుంపు ఒకటి ఉంది. మ్యూనిక్లో లుడ్విగ్ మాక్సిమిలియన్ యూనివర్సిటీలో చదువుకునే ఈ విద్యార్థులు వైట్ రోజ్ అన్న పేరుతో చెలామణీ అయేవారు. ఈ వైట్ రోజ్ వ్యవస్థాపక సభ్యులలో హన్స్ షోల్, అతని చెల్లెలు సోఫీ షోల్ కూడా ఉన్నారు. వీళ్ళు నాజీల పాలనని వ్యతిరేకిస్తూ రాసిన పాంప్లెట్లు ప్రజలకు రహస్యంగా పంచుతూ, నాజీ పోలీసుల దృష్టిలో పడకుండా కొన్నాళ్ళు తప్పించుకున్నారు. అయితే, ఐదుసార్లు ఇలా చేశాక, ఆరో పత్రం పంచడానికి హన్స్, సోఫీ ఇద్దరూ వెళ్ళారు. కానీ, అనుకోకుండా ఇద్దరూ దొరికిపోయారు. అరెస్టయ్యి, నాలుగురోజుల్లోనే మరణదండన కి గురైయారు. వీళ్ళతో పాటే ఈ దళంలోని మరో యువకుడు Christoph Probst కూడా ఉన్నాడు. క్రమంగా తరువాతి కాలంలో ఇందులోని ఇతర సభ్యులు కూడా నాజీల చేతుల్లో మరణించారు. తరువాతి కాలంలో ఆ ఆరోపత్రం దేశం దాటి, Manifesto of the students of Munich పేరిట ఆకాశమార్గాన జర్మనీని తిరిగి చేరి, ప్రజల మధ్యలోకి వెళ్ళింది. తదనంతర కాలంలో జర్మనీ దేశంలో ఈ యువతీయువకులు జాతీయహీరోలైనారు, అనేక ప్రాంతాల్లో వీథులకి వీళ్ళ పేర్లు పెట్టారు. అది చరిత్రలో జరిగిన కథ. హన్స్, సోఫీ, క్రిస్టోఫ్ ల అరెస్టు, వాళ్ళ ని కోర్టులో ప్రవేశపెట్టాక ఏం జరిగింది? అన్నది వివరంగా డాక్యుమెంట్ చేయబడింది. దాని ఆధారంగా ఈ‌సినిమా తీశారు.

ఇక సినిమా గురించి: ఈ సినిమా సోఫీ, ఆమె స్నేహితురాలు కలిసి రేడియోలో పాట వింటూ ఆనందిస్తూ ఉండే దృశ్యంతో మొదలవుతుంది. ఇంతలో సోఫీ గడియారం చూస్కుని, నేను వెళ్ళాలి అంటూ ఉన్నట్లుండి బయలుదేరుతుంది. తన అన్న హన్స్, అతని స్నేహితులని కలుసుకుంటుంది. అప్పటికే వాళ్ళు రహస్యంగా‌ కొన్ని నాజీ వ్యతిరేక పత్రాలు యూనివర్సిటీలో పంచి ఉన్నారు. ఇప్పుడూ‌మరోటి పంచడానికి సిద్ధమవుతున్నారు. సోఫీ, హన్స్ ఇద్దరూ ఈ బాధ్యత తీసుకుంటారు. యూనివర్సిటీలో పరీక్ష నడుస్తోంది. పరీక్ష అయి అందరూ బయటకి వచ్చే వేళకి అన్ని తరగతి గదుల బయటా ఈ కాగితాలు ఉంచాలనీ, బయటకొచ్చిన విద్యార్థులు ఇది చదవాలనీ వాళ్ళ ప్లాను. అంతా బానే నడుస్తుంది కానీ, చివ్వర్లో మట్టుకు ఒక పనివాడు ఇదంతా చూసి, నాజీలకి సాక్ష్యం చెబుతాడు. దానితో వీళ్ళు అరెస్టవుతారు. ఇక్కడ కథని గ్రాఫిక్ వర్ణనలతో చెప్పే ఉద్దేశ్యం నాకు లేదు. అది సినిమాలో చూసి తీరాలి. కానీ, అరెస్టయ్యాక మొత్తానికి మూడు నాలుగు రోజుల్లోనే వీళ్ళకి దేశద్రోహ నేరం కింద మరణదండన విధిస్తారు. వీళ్ళతో పాటు వీళ్ళ స్నేహితుడు క్రిస్టోఫ్ ప్రోబ్స్ట్ కూడా ఆరోజే శిక్షకు గురవుతాడు. ఇదీ చిత్రంలో చూపిన కథ.

నటీనటుల గురించి: ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం – సోఫీ పాత్ర వేసిన Julia Jentsch నటన. ఆవిడ మొహంలో సినిమా ఆద్యంతం గొప్ప పట్టుదల, నమ్మిన సిద్ధాంతాన్ని ఏం జరిగినా వదలకూడదు అన్న ధృడచిత్తం కనిపిస్తాయి. సోఫీ పాత్రకి అతికినట్లు సరిపోయిందనే చెప్పాలి. ఇక, ఆమెని చాలాసేపు ఎంక్వైరీ చేసిన నాజీ పోలీసు అధికారి, వీళ్ళకి శిక్ష వేసిన జడ్జి కూడా ఆ పాత్రల్లోకి ఒదిగిపోయి, భయపెట్టారు నన్ను. తక్కిన వాళ్ళకి పాత్ర తక్కువే కాని, క్రిస్టోఫ్ ప్రోబ్స్ట్ గా వేసినతని మొహంలో కూడా దైన్యం డీఫాల్ట్ గా కనబడ్డది చివరికొచ్చేసరికి. ఎవరి పరిధుల్లో వాళ్ళు అందరూ బాగా చేసినా, Julia Jentsch మట్టుకు నాకు గుర్తుండిపోయే నటి ఈ సినిమా తరువాత. నాజీలని ఎదిరించినా, తాను నమ్మిన దైవానికి ప్రార్థనలు చేసినా – అక్కడ సోఫీయే ఇదంతా చేస్తోంది కాబోలు అనిపించింది.

ఇక, సినిమాలో నన్ను ఆకట్టుకున్న అంశాలు కొన్ని ఉన్నాయి. Elsa Gebel అన్న యుద్ధఖైదీ పాత్ర చిత్రీకరణ – ఆ పాత్రకీ, సోఫీకి జరిగిన సంభాషణలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. చివర్లో జైలులో పని చేసే ఆవిడ ఈ ముగ్గురూ చివరిసారి కలుసుకునే ఏర్పాటు చేసిన దృశ్యం కూడా కదిలించింది. సోఫీ ని కలవడానికి ఆమె తల్లిదండ్రులు వచ్చినప్పటి సంభాషణ ఇంకొంచెం వివరంగా చూపి ఉండాల్సింది అనిపించింది – ఆమె తల్లిదండ్రుల స్పందన గురించి నాకున్న కుతూహలం వల్ల. సినిమా మొదట్లో నాజీలకి వీళ్ళు పట్టుబడే దృశ్యం, దానికి దారితీసిన సన్నివేశాలు – అద్భుతంగా చిత్రీకరించారు. ఇలా చెప్పుకుపోతే, రెండు గంటల ఆసినిమాలో నాకు నచ్చిన అంశాలు చాలానే ఉన్నాయి.

మొత్తానికి, సినిమా నాకు చాలా గొప్పగా అనిపించింది. వైట్ రోజ్ దళం మీద తీసిన ఇతర చిత్రాలను నేనింకా చూడలేదు కనుక పోల్చలేను. పోలికల్లేకుండా మట్టుకు నాకు అద్భుతంగా‌ అనిపించింది. వీళ్ళంతా పాతికేళ్ళలోపు వయసువారు. ఆ వయసులో, అంత ధైర్యంగా నాజీలని ఎదుర్కొని చివరిదాకా ఎదిరిస్తూనే నేలకొరిగిన వాళ్ళ జీవితాలు చాలా స్ఫూర్తివంతంగా అనిపించాయి. కానీ, నాకర్థంకాని విషయం ఒకటుంది – ఎందుకు ప్రత్యేకంగా సోఫీ మీదనే ఫోకస్ చేశారు? అని. ఏదేమైనా, తప్పకుండా చూడవలసిన చిత్రం. ఆంగ్ల ఉపశీర్షికలతో అంతర్జాలంలో లభ్యం.

సినిమా వివరాలు:
Sophie Scholl – The Final Days
Director: Marc Rothemund
బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డులు పొందింది, ఆస్కార్ నామినేటెడ్ చిత్రం.

One Response
  1. Vinnakota Narasimha Rao April 23, 2014 /