Menu

The hunt – వెంటాడే లోకం !!

చిన్న పిల్లలు ఎక్కువగా ఊహాలోకంలో విహరిస్తుంటారు.  పెద్దలు చెప్పిన కథలు నిజమనుకుంటారు. ఎదురుగా ఉన్న వాస్తవానికి  ఊహకీ ఒక లంకె ఏర్పరుచుకుంటారు. అందుకే వాళ్ళు చూసిందీ..ఊహించుకున్నదీ కలగలిపి మాట్లాడుతుంటారు. నిజానికి.. అబద్దానికి …ఊహలకి మధ్య కథలు అల్లుతారు.  ఇలా ఒక అమ్మాయి తెలియక చెప్పిన  విషయం  ఆమె టీచర్ జీవితానికి ఇచ్చే చిన్న కుదుపే ఈ సినిమా.

లూకాస్ అనబడే వ్యక్తి ఒక ప్లే స్కూల్లో టీచరు.  లూకాస్ కి  పిల్లలంటే ఇష్టం. వాళ్లని ఆడిస్తూ నవ్విస్తూ ఉంటాడు.  భార్యతో తెగతెంపులయ్యింది. పదేళ్ల కొడుకు ఉన్నాడు.  అతడు భార్యతో ఉంటుంటాడు. కొడుకుని చూడాలనీ వాడు తనదగ్గరే ఉండాలనే తపన పడుతుంటాడు.  ఇదిలా ఉండగా  అదే స్కూల్లో పనిచేసే ఒకావిడ అతడిని ఇష్టపడి దగ్గరవుతుంది. లూకాస్ ఆప్త మిత్రుడి థియో కూతురు క్లారా. కొంచం తనలో తాను ఉండేరకం. కానీ లూకాస్ తో మాత్రం కలివిడిగా ఉంటూ  మాట్లాడుతుంది.

నింద మోపబడనివరకే మంచి మనిషి.   అంతవరకే అందరూ ఆప్తులు.. ఒకసారి అతనిమీద నేరంమోపాక.. అతడు నిజంగా నేరం చేసాడా లేదా అనేది ఆలోచించదు సంఘం. నేరస్తుడని ముద్రవేస్తుంది. నేరగాడిగా చూస్తుంది.దూరంగా ఉంచుతుంది.
ఒకనొక రోజు ఆ చిన్న పిల్ల ఆటల్లో భాగంగా క్లారా  లూకాస్ పెదవులపై ముద్దు పెడుతుంది. ఎదో చిన్న గిఫ్ట్ కూడా ఇస్తుంది.  లూకాస్ అలా పెట్టకూడదు. కేవలం భార్యాభర్తలు మాత్రమే పెట్టుకోవాలి అని నచ్చచెపుతాడు. అది కోపమో..రిజెక్షన్ వల్లో మరి ఎందుకో తెలియదు కానీ ఆ అమ్మాయి లూకాస్ తనకి తన మర్మాంగాలు చూపించాడని ప్రిన్సిపాల్ తో చెపుతుంది.  ఒక్కసారిగా లూకాస్ ప్రపంచం తలకిందులవుతుంది.  అది చైల్డ్ అబ్యూజ్ కింద నేరం. లూకాస్ మీద అభియోగం మోపబడింది. మొదట్లో లూకాస్కి  ఏం జరిగిందో తెలియదు. ప్రిన్సిపాల్ ఉద్యోగంలోంచితీసేస్తుంది. ఆప్త మిత్రుడు అనుకున్న థియో కూడా లూకాస్ ని అనుమానిస్తాడు,  అసహ్యంగ చూస్తాడు. ప్రియురాలూ అనుమానిస్తుంది. చర్చ్ ఫాదర్ మాత్రమే లూకాస్ నిర్దోషి అయ్యుండవచ్చు అని నమ్ముతాడ. విషయం అక్కడి సమూహానికంతటికీ తెలిసిపోతుంది. అందరూ అతన్ని లైంగికవికృతత్వం గలవాడిగా చూస్తారు. కొడుకు మాత్రం తన  తండ్రి ఇలా చేసాడంటే నమ్మడు. తండ్రీ కొడుకులిద్దరూ తమ సమూహం నించి వెలేయబడతారు. సరకులు ఇవ్వకుండా..అసలు లోనికే  రానివ్వకుండా చేయిచేసుకుంటారు దుకాణదారులు. నడిరాతిరి ఇంటిమీద రాళ్ళు పడతాయి. ప్రియంగా పెంచుకున్న కుక్క చంపబడుతుంది. వెలివేయబడి ఇంటికే పరిమితమవుతాడు.  అయినా లూకాస్ కి తాను నిర్దోశి అని తెలుసు. అందుకే ఇంతబాధలోనూ  మొండిగా అక్కడే ఉంటాడు. చెల్డ్ సైకాలజిస్ట్ వస్తాడు. క్లారా తో మాట్లాడతాడు. కానీ ఆ పాప ఏదీ సరిగ్గా సమాధానం చెప్పదు. మిగతా పిల్లలందరినీ ఆరా తీస్తారు..కోర్టులో కేసు నడూస్తుంటుంది. ఆశ్చర్యకరంగా మిగతా పిల్లలు  లూకాస్ తమతో  కూడా అలాగే ప్రవర్తించాడనీ చెపుతారు. లూకాస్ అలాంటి వాడు కాదని అనిపిస్తుంది. కానీ అంతలోనే  ఏమో..అనే అనుమానం మనకి కలుగుతుంది. ఇలా మనని  కొంచం సందిగ్దంలో పడవేస్తుంది సినిమా.  ఇలాంటి పరిస్థితుల్లో  లూకాస్ నిర్దోషా కాడా అనేది తెలియాలంటే   సినిమాచూడాల్సిందే !!

మంచికీ చెడుకీ మధ్య చిన్న గీత..లోకమెప్పుడూ ముందు మంచి కంటే చెడునే వెతుకుతుంది. ప్రతి ఒక్కరినీ దోషిగా నిలబెడుతుంది. చాలావరకు మనందరి నిజజీవితంలో ఇలా దోషిగా నిలబడాల్సిన సందర్బాలు ఉండనే ఉంటాయి. చిన్న సందర్బాలైతే మరిచిపోతాం.పెద్ద సందర్బాలైతే అవి జీవితాంతం మననివెంటాడుతూనే ఉంటాయి.

ఇలాంటి కథని ఎంచుకొన్ సినిమాగా తీయటమే గొప్ప …   ‘మాడ్స్ మికెల్సన్’  లూకాస్ పాత్రకి చక్కగా సరిపోయాడు. అద్భుతంగా నటించాడు. అందుకే ఈ సినిమాకి అన్నిచోట్లా ప్రశంశలూ, అవార్డులూ వరించాయి.