Menu

the first grader – స్పూర్తి దాయకం

 

కెన్యాలో,  1953 వ సంవత్సరంలో బ్రిటీషుపాలనకి వ్యతిరేకంగా కొన్ని తెగలు  సాయుధ పోరాటం జరిపాయి . ఆ పోరాటంలో ఎందరో మరణించారు. వేలకొద్దీ జైలుపాలయ్యారు. కొందరు  చిత్రహింసలు అనుభవించారు. ఎట్టకేలకి స్వాతంత్రం సిద్దించినా చాలా మందికి కలిగిన కష్టనష్టాలు..బాధలు..గాయాలు మాత్రం అలాగే ఉండిపోయాయి.

 

ఓ గుడిసె..  ఎనభైఏళ్ళ ముసలాడు   ఒంటరి జీవితం, గతం తాలూకు జ్ఞాపకాలతో బతుకుతుంటాడు. కొత్త ప్రభుత్వం అందరికీ  ఉచిత ప్రాధమిక విద్య అని ప్రకటిస్తుంది. ఊరూరా స్కూళ్లు వెలుస్తాయి. ఎక్కడెక్కడి పిల్లలూ వాళ్ళని బళ్ళో చేర్పించటానికి వాళ్ళ  తల్లి దంద్రులూ స్కూళ్లకి పరిగెత్తుతారు. వాళ్లతో పాటూ ఈ వృద్దుడూనూ.. ఈ  విద్య పిల్లలకి మాత్రమే అంటాడో టీచరు.. అందరికీ అని చెప్పారుగా రేడియోలో అంటాడు వృద్దుడు..  ఉన్నవే యాభై బెంచీలూ,  జాయినయ్యింది రెండువందలమంది పిల్లలూ.. కాటికి కాళ్లు చాపిన  ముసలాడివి నిన్ను  ఎలా తీస్కుకుంటాం ??  దానికి తోడూ పెన్సిలూ పుస్తకం  లేనిది స్కూల్లోకి రానివ్వం అంటాడు.  ముసలాయన వెనుదిరుగుతాడు..మరునాడు పెన్సిలూ పుస్తకంతో గేటు ముందు ప్రత్యక్షం . తాతయ్యా,  ఇంటికెళ్లవయ్యా.. నీ ఆత్మకి శాంతి కలుగుగాక.. నేనించా చావలేదు..బతికే ఉన్నా..నా పేరు ‘కిమానీ నాంగా మరుగే ‘ .. ఓహో.,సరే.. స్కూలు యీనిఫాం లేకుండా స్కూల్లోకి ఎంట్రీ లేదు మరి!!  చెప్పాడా స్కూలు టీచరు. అయినా ఈ వయసులో నీకు చదువువల్ల ఏమి ఉపయోగం చెప్పు అడిగింది జేన్ .. ప్రధానోపాద్యాయిరాలు. నేను చదవటం నేర్చుకోవాలి. కానీ ఇప్పటికే ఎక్కువమంది పిల్లలు జాయిన్ అయ్యారు. వెళ్ళు. కసీ కోపంతో వెనుదిరిగాడా వృద్దుడు.

పోరాడే తత్వం అలవాటయ్యాక, జీవితంలో  దేనిలోనైనా… ఎప్పటికైనా, గెలుపు తప్పదు !!

 

తెల్లారి చొక్కా ,లాగూ, బూట్లూ వేసుకొని స్కూలు గేటుముందు నిలబడతాడు. అతని పట్టుదలకి ముచ్చటేసిన జేన్ అతనికి ప్రవేశం కల్పిస్తుంది. అది మొదలు  జేన్ కీ.. మరుగేకీ రక రకాల అడ్డంకులు..అవాంతరాలు ఎదురవుతాయి. మరుగేని స్కూలు మానేయమని బెదిరిస్తారు. స్కూలుమీదకొచ్చి దాడీ చేస్తారు. జేన్ కి పై అధికారులనుంచి చీవాట్లూ,  భర్తతో మనస్పర్తలూ వస్తాయి. చివరికి వేరే ఊరికి బదిలీ చేయబడుతుంది.  అన్నింటినీ దాటుకొని వాళ్ళిద్దరూ తమ పోరాటంలో ఎలా గెలిచారూ అన్నదే సినిమా !

అయినా ఆ వయసులో మరుగే ఎందుకు చదువటం నేర్చుకోవాలనుకుంటున్నాడు అనేది ఆసక్తికరం ..భావోద్వేగ పూరిత అంశం. కెన్యాలో,   ప్రాథమిక పాటశాలలో చేరి చదువునేర్చుకోవటానికి ఓ వృద్దుడు చేసిన పోరాటం ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆ నేపథ్యంలో అతడు తన గ్రామస్తులతోనూ..టీచర్లతోనూ.. రాజకీయనాయకులతోనూ పోరాడి గెలిచి ప్రాథమిక విద్య నేర్చుకొని  చదువు గొప్పతనాన్ని ప్రపంచానికి  చాటాడు. అతడే  ‘కిమానీ నాంగా మరుగే’   అనే  ఎనభై నాలుగేళ్ల వృద్దుడు. అతని జీవిత కథ ఆధారంగా నిర్మించారీ  సినిమా. అయితే మరుగే  ఓ ఆది వాసీ తెగకి చెందినవాడు,  స్వతంత్రంకోసం బ్రిటీషు వాళ్లతో పోరాడటం ఒక ఎత్తయితే  స్వతంత్రం వచ్చాక  ఓ తెగకి చెందిన ఆదివాసి గా స్వంత మనుషులతో పోరాటం మరోక ఎత్తు.   విద్య నేర్చుకోవటంలో అతను గ్రామస్తులు టీచర్ల కంటే  ఓ తెగకి చెందిన వాడిగా సాంఘీక, రాజకీయంగా ఎదుర్కొన్న సమస్యలు ఎక్కువ. కానీ ఆ లోతుల్లోకి  వెళ్లలేదు దర్శకుడు.  విద్య నేర్చుకోటానికి రక రకాలుగా వచ్చిన వ్యతిరేకత ఒక వైపు చూపిస్తూ మరో వైపు వెంటాడే గతాన్ని చూపుతూ ఆసక్తిగా నడిపాడు కథని.  పట్టు సడలని  కథనం ఉండటంతో   సినిమాకి కావలసింది భావోద్వేగాలు  చక్కగా అమరి  సినిమా ఆధ్యంతం ఆకట్టుకుంటుంది. నిజ జీవిత కథని మరీ డాక్యుడ్రామా లాగా కాకుడండా   సినిమాటిక్ గా మలిచిన విధానం అభినందనీయం.

సహజ కాంతిని సమర్థవంతంగా ఉపయోగించుకొని   భూమధ్య రేఖా ప్రాంతంపు ఎండ తీవ్రత ..వేడి..  డ్రై లాండ్…పల్లెలు, పరిసరాలు..జనాలు, జీవిత విధానాన్ని ఉన్నదున్నట్టుగా కళ్లముందుంచిన సినిమాటొగ్రఫీ మనోహరం . మరుగే బాధనీ..ఆవేదననీ..అందమైన నవ్వునీ నిండుగా చిత్రీకరించ తీరు అద్బుతం.   ఆఫ్రికన్ ప్రాంతీయ సంగీతం బాగా ఆకట్టుకుంటుంది. మెరుగేగా నటించిన Musila Litondo, జేన్ గా నటించిన  Naomi Harris  చక్కగా రాణించారు. జీవిత స్పూర్తిని రగిలించే ఇలాంటి తప్పకుండా చూడాలి.