Menu

Ratcatcher – అంతర్మధనం

 

 సినిమా అనేది భావవ్యక్తీకరణ మాధ్యమం అయితే దాన్ని స్పష్టంగా సూటిగా వ్యక్తీకరించగలిగిన దర్శకులు కొందరే.  

జేమ్స్ నీళ్ళకొలను దగ్గర ఆడుతూ ఉంటాడు. కిటీకీ లోంచి రయాన్ చూస్తాడు.తనకీ స్నేహితుడితో ఆడుకోవాలని అనిపిస్తుంది. కానీ తల్లి మాత్రం  జైల్లో ఉన్న తండ్రిని చూడటానికి బయలుదేరమంటుంది. వెంట నడిచినట్టే నడిచి తల్లిని ఏమార్చి స్నేహితుడిని చేరుకుంటాడు రయాన్.  జేమ్స్  రయాన్ని నీళ్లలోకి తోస్తాడు. రయాన్ జేమ్స్ మొహాన బురద కొడతాడు.  అలా సరదాగ మొదలై  కొంచం తీవ్రమవుతుంది. రయాన్ని ఆ కాలువ లోతుల్లోకి బలంగా  ఒక్క తోపుతోసి  పరుగు తీస్తాడు జేమ్స్, కొద్ది దూరం పరిగెత్తి వెనక్కి తిరిగి చూస్తే….

మనం చేసే పనుల ఫలితాలు భయంకరమైనవో..భాధాకరమైనవో తెలిస్తే  మనం ఆ పనులే చేయము. కానీ ఆ ఫలితాలు మనకి ముందే తెలియవుగా !!

ఆ సంఘటన మొదలు జేమ్స్ మనసులో అదే ఆలోచన…తప్పు చేసిన ఫీలింగ్.

1970 కథా కాలంలో  గ్లాస్గో లోని ఒక మురికి వాడల నేపథ్యంలో తీయబడిందీ సినిమా . అక్కడన్నీ పాతబడిన అపార్ట్మెంట్లు..  వాటి చుట్టూ  ఎత్తేసే నాథుడే లేక పేరుకుపోయిన చెత్త సంచులు. వాటిల్లో తిరుగాడే ఎలకలు. చదువు సంధ్యాలేక అల్లరి చిల్లర గా తిరిగే పిల్లలు. జేమ్స్ కి తల్లీ, దండ్రీ.. ఓ అక్కా ఓ చెల్లీ.  వీళ్లంతా పాతబడిన ఆ పాత అపార్ట్ మెంట్లలో ఉంటారు. ఈ సంసారం..భార్యాభర్తలు, పిల్లల మధ్య సంబంధ బాంధవ్యాలు  ఒకవైపు చూపిస్తూ.. మరోవైపు చుట్టూ ఉండే వివిధ వయసుల  పిల్లల మనస్తత్వాలు, .  ప్రీ టీన్ ఏజ్ లో ఉండే సహజ ప్రవర్తనలూ..సహజాత ప్రోద్బల ప్రవర్తనలూ  చూపిస్తారు.  వీళ్లందరి మధ్యా  జేమ్స్ ఇంట్రావర్ట్ మనస్థత్వం చక్కగా సహజంగా ఆవిష్కరించబడింది.

ప్రభుత్వం ఈ అపార్ట్ మెంట్లకి దూరంగా  కొత్త  అపార్ట్మెంట్లు కట్టిస్తుంటుంది. ఖాలీగా ఉండి కొత్తగా ఉన్న  కొత్త ఇళ్ళు  జేమ్స్ కి బాగా నచ్చుతాయి. వంటగది కిటికీలోంచి  కనుచూపు మేరా పరచుకున్న  గోదుమ చేలలోకి దూకి రివ్వున కొట్టే గాలిని..అకాశాన్నీ అనుభవిస్తాడు. అక్కడ తన అన్నీ  మరిచిపోయి హాయిగా గంతులేస్తాడు. జేమ్స్ కి ‘ అన్నే’ అనే  అనే టీనేజ్ అమ్మాయితో దోస్తీ  కుదురుతుంది. ఆపిల్ల  లోకల్ టీన్ గ్యాంగ్ తో అబ్యూజ్ కి గురవుతూ ఉంటుంది. జేమ్స్  వాళ్లలా కాక సున్నితుడుగా  ఉండటం వల్ల  స్నేహం కుదురుతుంది. అయితే  అతను ఎంత వద్దనుకున్నా కొన్ని సంఘటనలు  ‘ ఆ సంఘటన’ వయిపు లాగుతుంటాయి. పశ్చాత్తాపం ప్రకటించే వీలు లేదు. ఎవ్వరికీ చెప్పుకునేందుకులేదు. లోలో ఆలోచిస్తూ ఉంటాడు.  ఈ లోపు జేమ్స్ కుటుంబానికి ఒక కొత్త అపార్ట్మెంట్ కేటాయిస్తారు. వాళ్ళంతా తలా ఓ  సామాను తీసుకొని గోధుమ చేల మీదుగా కొత్త ఇల్లు వైపు నడుస్తుంటారు. చివరగా జేమ్స్ కుర్చీ పట్టుకొని కొత్తింటివైపు వస్తూంటాడు.

 

పిల్లల లోకం వేరు. వాళ్ళ ఊహలూ, భావనలూ, బాధలూ, భయాలూ,  ఆలోచనలూ చేసే చేష్టలూ వేరు. వాళ్ళ మనస్తత్వం ఒకలా ఉంటుంది. ఇంట్లో వాతావరణం మరోలా ఉంటుంది. పెద్దలంతా తమ తమ పనుల్లో బిజీగా ఉంటారు. పట్టించుకునే నాథుడుండడు. వాళ్ళేదో చేస్తారు, అది తప్పో ఒప్పో మంచో చెడో వాళ్లకే తెలియదు. చెప్పుకునే దిక్కుండదు. లోలోపల మధన పడుతూ..వాళ్ళేంచేస్తారో వాళ్లకే తెలీదు. !!

కొన్ని సినిమాలకి కథలుండవు.. ఓ సంఘటన తద్వారా మనసులో జరిగే ఘర్షణా ఆలోచనలూ  మానసిక స్థితిగతులే ఉంటాయ్. అవి ఒక అబ్స్ట్రా క్ట్ కవితల మల్లే అర్థం అయ్యీ కానట్టు ఉంటాయి. కానీ మనసుకు హత్తుకుపోతాయి.  పిల్లలుగా నటించినవాళ్ళూ ..పెద్దలుగా నటించినవాళ్ళూ అతి సహజనటన కనపరిచారు. ముఖ్యంగా జేమ్స్ పాత్ర. … టైం అండ్ స్పేస్ చక్కగా కుదిరాయి. రాచల్ పోర్ట్మన్ సంగీతం ఎప్పటిలాగే ఆకట్టుకుంటుంది. దర్శకత్వ ప్రతిభ గురించి చెప్పనే అక్కరలేదు.
నాకైతే బాగా నచ్చింది. మీకూనచ్చుతుందనే అనుకుంటున్నాను.

One Response
  1. Mattie May 15, 2017 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *