Menu

Morvern Callar – అంతరంగపు అన్వేషణ

ఈ సినిమా ఆది మధ్య  అంతం అనే కథా సూత్రాలమీద నడవదు. అసలు ఇక్కడ కథే లేదు.ఇది ఒక అమ్మాయి, ఆమె భావోద్వేగాలు మాత్రమే.

జీవితం అనేది జీవించటానికి ..  అంటే సంతోషాల్ని సొంతం చేసుకోవటానికి, ఆనందాన్ని అందిపుచ్చుకోవటానికి ఇవ్వబడింది. లైఫ్ ఈజ్ ప్యూర్ బ్లిస్. కానీ  ఆ ప్రయత్నంలో మనకి విషాదాలు.. బాధలూ ..ఎదురవుతూంటాయి. కొంతమంది బాధలని నొక్కిపట్టి ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కొందరు సంతోషాన్ని దూరం చేసుకొని బాధలోనే జీవిస్తారు.

అమె తన ప్రియుడి పక్కనే పడుకుని ఉంది. వెనకవైపు మెడమీద తన ముఖాన్ని ఆనించింది.వేడి శ్వాసలు అతనికి తగులుతూ ఉన్నాయి. క్రిస్మస్ చెట్టుకు చుట్టిన లైట్లు మినుక్కు మని వెలిగి ఆరుతున్నాయి. ఆమె ఏదో తదేకమైన ఆలోచనల్లో ఉన్నది. అతని తలని ముద్దాడింది. మొహాన్ని జుట్టుకి అదిమింది.మెడమీదుగా అతని జుట్టు పరిమళాన్ని ఆస్వాదించింది.అమె శ్వాస  స్పష్టంగా వినపడుతోంది. లయబద్దంగా ఉన్నది.  రంగురంగుల చిన్ని  విద్ద్యుద్దీపాలు నిర్విరామంగా ఆరి వెలుగుతున్నాయి. ..నగ్నంగా ఉన్న అతని వీపుమీదుగా తడుముతూ  ఆతని చేతుల్లో తన చేయి ఉంచింది.  ఆమె ఏదో ఆలోచనల్లో ఉంది. అమె పక్కనే అతడున్నాడు. అమె సజీవంగా ఉన్నది. అతడు మాత్రం నిర్జీవుడు.

‘ఆత్మహత్య చేసుకోవటం సమంజసమే అనిపించింది..అందుకే,  అంత్యక్రియలకి అయ్యే ఖర్చు బాంక్ లో ఉన్నది. డెస్క్ లో కార్డ్ ఉన్నది దానిద్వారా డబ్బుతీసుకోవచ్చు. నేను రాసిన నవల ఇది. ప్రకాశకుల లిస్ట్ ఇస్తున్నాను. మొదటి వాళ్లకి పంపు..వాళ్ళు ప్రచురించకుంటే రెండోవాళ్లకి..”  కంప్యూటర్ లో అతడు రాసిన  చావులేఖ చదివింది. ఏం చేయాలో తోచలేదు. దగ్గర్లోని  ఒక రైల్వే స్టేషన్ చేరుకుంది. విషయం ఎవరికో చెప్పాలని  ఫోన్ తీసింది, చేద్దామనుకున్నది ..కానీ చేయబుద్దేయక అక్కడే చాలా సేపు కూర్చుంది. అక్కడున్న ప్రజా టెలీపోన్ మోగింది. అటువైపు ఉన్నవ్యక్తి చెప్పినమాటలు విన్నది . ఇంటికి చేరుకుని..  క్రిస్మస్ బహుమతులని చూసుకున్నది. వింటర్ జాకెట్ తనకి బాగా నచ్చింది.  స్నానానికి తొట్టిలో కూర్చుంది. అప్పుడామె మనసులోని మూగ వేదన కళ్ళలో స్పష్టంగా మనకి కనపడుతుంది. అయితే అది ప్రియుడు చనిపోయినందుకా.. లేక తన పరిస్థితికా ??

ఆ రాత్రి చక్కగా తయ్యారయ్యి..తన ఆప్తమిత్రురాలు లానా ని కలిసి పబ్బుల్లో తాగి అపరిచితులతో చిందులేసింది. వాళ్లతో గడిపింది.

ఇల్లు చేరాక  కాసేపు సంగీతం విన్నది..తరవాత అతడు రాసిన చావులేఖ మళ్ళీ చదివింది. అతడి నవలని..తాను రాసినట్టుగ మార్పు చేసి ప్రింట్ తీసింది. డెస్క్ లోని కార్డ్ తీసుకొని డబ్బులు డ్రా చేసింది. స్పెయిన్ వెళ్లటానికి రెండు టిక్కెట్లు బుక్ చేసి స్నేహితురాలికి చెప్పింది మనం హాలీడే కి వెళ్తున్నామని.   ప్రియుడి శవం మాత్రం  నట్టింట్లో అలాగే పడిఉన్నది. కానీ ఎంతకాలం దాన్నలా ఉంచుతుంది. అందుకే ముక్కలు చేసి ఎక్కడో కొండల్లో పాతేసింది. కొంచం హాయిగా ఫీలయ్యింది. తరవాత స్నేహితురాలితో స్పెయిన్ బయలుదేరింది.

అసలు ఆ అమ్మాయి ఎందుకలా ప్రవర్తిస్తోంది. శవాన్ని ఇంట్లో పెట్టుకొని పార్టీల్లో ఎందుకు తిరిగింది ? ప్రియుడు ఆత్మహత్మ చేసుకుంటే తనకి బాధ లేదా ? అతడి పుస్తకాన్ని తను రాసిన పుస్తకంగా ఎందుకు మార్చింది?  అసలా ప్రియుడు ఎందుకు చచ్చాడు ? సినిమా చూస్తుంటే  ఇలా ఎన్నో ప్రశ్నలు మనకి కలుగుతాయి. వాటికి సమాధానలు ఇవ్వాలని కూడా సినిమా ప్రయత్నించదు. కేవలం ప్రియుడి చావు తరవాత ఆ అమ్మయి ఎలా ప్రవర్తించిందీ అన్నదే చూపిస్తారు.

మార్వెన్ గా నటించిన సమంతా మార్టన్ తన మనసులో భావాలని  మొహంలో  సునిశితంగా పలికించింది. చాలా కొద్దిపాటి మార్పులు మాత్రమే ఆమె మొహంలొ కనపడతాయి. అవి మనని ఆమె మనసులో ఏముందో చదివే ప్రయత్నం చేపిస్తాయి. అమె మొహంలో  నిగూడత్వం ఉంటుంది. ఆమె ఆలోచిస్తూ ఉంటుంది..అమె బాధ అంతా అంతర్గతంగానే ఉంటుంది. బయటికిఎక్కడా కనపడదు.

‘రాట్ కాచర్’ తరవాత లేన్ రాంసే (Lynne Ramsay) దర్శకత్వం వహించిన రెండవ సినిమా ఇది.  ‘వ్యక్తి  మానసిక విశ్వంలోని భావోద్వేగాల అన్వేషణ’ ని   సినిమాలుగా  తెరకెక్కించాలనుకోవటం సాహసం. ప్రతిభావంతంగా తెరకెక్కించటం అసాధారణం. ఆ ప్రయత్నంలో ప్రశంశలు,  అవార్ఢులూ పొందటం విశేషం.