Menu

Ordet – 1955 నాటి డేనిష్ చిత్రం

Ordet అన్న డేనిష్ పదానికి “The Word” అని అర్థమట. ఇది ౧౯౫౫లో విడుదలైన డేనిష్ చిత్రం. కార్ల్ థియొడొర్ డ్రెయర్ (Carl Th. Dreyer) ఈ చిత్రానికి దర్శకుడు. Kaj Munk అన్న డేనిష్ రచయిత రాసిన నాటకం ఆధారంగా తీశారీ చిత్రాన్ని. స్కాండినేవియన్ చలనచిత్ర పరిశ్రమలోని తొలినాటి ప్రతిభావంతమైన దర్శకుల్లో‌ డ్రెయర్ అగ్రగణ్యుడు. అతను తీసిన సినిమాలలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న చిత్రం ఈ ఓర్డెట్ (ఈ పలుకుబడులలో దోషాలుంటే వ్యాఖ్యల ద్వారా తెలియజేస్తే సరిచేయగలను). ఇటీవలే కోర్స్ ఎరా వెబ్సైటులో ఉన్న Scandinavian Film and Television అన్న ఆంలైన్ కోర్సు ద్వారా ఈ చిత్రం గురించి తెలిసి, చూడ్డం తటస్థించింది. ఈ సినిమా గురించి నాకు అనిపించిన నాలుగు ముక్కలు రాసుకుందామనుకున్నాను. అదే ఈ వ్యాసం. సమీక్ష, పరిచయం – ఇలాంటివేవీ కాదు. కేవలం నా అనుభవం (ఇక్కడ ఇంకో కేటగిరీ లేదు కనుక సమీక్ష కేటగిరీలో పెడుతున్నాను వ్యాసాన్ని, అంతే).

కథ: కథ ఒక డేనిష్ పల్లెప్రాంతంలో జరుగుతుంది. మోర్టెన్, అతని ముగ్గురు కొడుకులు, పెద్ద కొడుకు భార్య, పిల్లలు, వీళ్ళందరి జీవితాలు, మత విశ్వాసాలు, ప్రేమలూ -వీటి చుట్టూ సాగే మామూలు story-next-door కథ. మోర్టెన్ పిల్లల్లో – పెద్దవాడికి మతవిశ్వాసాలు లేవు. రెండోవాడు Kierkegaard రచనలు చదివి, మానసికంగా దెబ్బతిని, తనను తాను యేసుక్రీస్తుగా భావించుకుంటూ ఉంటాడు. ఇక మూడో వాడు స్థానిక టైలర్ కూతుర్ని ప్రేమిస్తాడు – కానీ వాళ్ళు క్రిస్టియన్ మతంలోని మరో తెగకి చెందిన వారు కనుక ఆ అమ్మాయి తల్లిదండ్రుల అంగీకారం దొరకదు. ఇవతల మోర్టెన్ ని ఒప్పించడానికి పెద్ద కోడలు తన మరిది తరపున వకాల్తా పుచ్చుకుంటుంది – ఇదీ ఈ కథలో అసలు ఘట్టానికి సెట్ చేసిన నేపథ్యం. ఇక ప్రధాన అంశం – మత విశ్వాసాల గురించి మోర్టెన్ కీ, ఆ టైలర్ కీ చర్చ, అనుకోని పరిస్థితులు – కష్టకాలం, ఆ పైన జరిగిన సంఘటనలలో మతవిశ్వాసాల గొడవలు సమసిపోవడం, “అద్భుతం” (miracle) జరగడం. క్లుప్తంగా ఇదీ చిత్రకథ.

నేను ప్రస్తావించదలుచుకున్న అంశాలు:
* సినిమా లో సంభాషణలు, పాత్రలు – ఇవన్నీ సాధారణంగా, రోజువారీ జీవితంలోలా ఉన్నాయి. ప్రత్యేకమైన హీరోయిజాన్ని ప్రదర్శించదు ఏ పాత్రా. కథకి అన్ని పాత్రలూ అవసరమే.

*‌ ఆ పెద్దకోడలి పాత్ర నాకు చాలా నచ్చింది 🙂

* మోర్టెన్ కి, అతని కొడుకు ప్రేమించిన అమ్మాయి తండ్రికి మధ్య వాదం ఎవరి విశ్వాసం గొప్పది? అన్న దగ్గర మొదలై, పక్కనోడి విశ్వాసం ఎందుకు గొప్పది కాదు? అన్న పాయింటులో మెలిక పడి, వ్యక్తిగతంగా అవతలి మనిషికి చెడుజరగాలి అని కోరుకునేదాకా వెళ్తుంది. ఈ సంభాషణ నేటికీ వందశాతం వర్తిస్తుంది అనిపించింది.

*‌ ఆ చివరి దృశ్యం – గొప్పగా ఉంది. ఆ పెద్దకోడలి శవం ముందర వీళ్ళలో పరివర్తన రావడం ఒకటైతే, అసలుకి చివ్వర్లో ముందురోజు వెళ్ళిపోయిన యోహన్నెస్ తిరిగి వచ్చి – ఆమెని “మేల్కొల్పడం” – ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యం‌ (నాకు). మతవిశ్వాసాలను పక్కన పెడితే, ఇది పతాక సన్నివేశం అన్న పదానికి అతికినట్లు సరిపోయే దృశ్యం అనమాట నా దృష్టిలో. ఈ దృశ్యాన్ని యూట్యూబులో చూడవచ్చు.

* యోహన్నెస్ – ఆ రెండో కొడుకు పాత్ర చిత్రీకరణ : ఒక ప్రముఖ తత్వవేత్తని చదివి అలా అయిపోయాడనగానే ఆయన రచనలు చదవడానికి భయమేసింది నాకు :-). ఏమైనా, ఈ పాత్ర చిత్రీకరణ -ఆ నటుడి ఆహార్యం, నటన నన్ను బాగా ఆకట్టుకున్నాయి. సత్యజిత్ రాయ్ తీసిన Shakha-Proshakha చిత్రంలో సౌమిత్ర ఛటర్జీ పాత్ర గుర్తువచ్చింది.

* ఇక, కొన్ని సంభాషణలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి – వెనక్కీ ముందుకీ జరుగుతూ ఈ సంభాషణలు పదే పదే విన్నాను గత రెండు వారాల్లో. ఉదాహరణకి ఒకటి: మోర్టెన్ తన రెండో‌కొడుకు మానసిక పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేస్తూంటే, మోర్టెన్ కి, అతని పెద్దకోడలికీ మధ్య భగవంతుడిని ప్రార్థించడం గురించి జరిగే సంభాషణ –

“I hoped and hoped he might, but he’ll never get any better.” (Morten)
“Why don’t you believe so?”
“Miracles don’t happen any more.”
“Nothing is impossible if one prays to him for it.”
“I have prayed and prayed and prayed, Inger”
“Then you must go on praying. For Jesus has promised what we pray to him for, he will give us.”
“I know Inger, I know. But what good have all my prayers done?”
“How do you know what your prayers may have set in motion?”
“Pray, and go on praying, however little you feel it helps”

– ఇదివరలో కొన్ని సందర్భాల్లో సీరియస్ గా దైవ ప్రార్థన చేసే మనుషులు (అన్ని మతాల వాళ్ళూ) కూడా ఇలా ప్రార్థన చేయడం వాళ్ళకి సాంత్వననిస్తుందని, అలాగే భవిష్యత్తు గురించిన ఆశనీ, నమ్మకాన్ని ఇస్తుందని చెప్పడం విన్నాను. “Faith can move mountains” అన్న నానుడి ఈ పెద్దకోడలు వంటి గొప్పవాళ్ళ వల్లే పుట్టిందేమో అనిపించింది. 🙂 ఇక్కడ వ్యంగ్యం ఏమీ లేదు. ఏదో ఒక విషయం మీద అంత అచంచలమైన విశ్వాసాన్ని ఉంచగల స్థితికి చేరుకోడం నా దృష్టిలో గొప్పదనమే. అంతకు మించి నాకు లేనిది వీళ్ళందరిలో కనిపిస్తోంది కనుక నిస్సందేహంగా నాకు వీళ్ళంతా గొప్పవాళ్ళూ, ఆ తరహా నమ్మకాన్ని నిలుకుంటున్నందుకూ అదృష్టవంతులూనూ!‌ (దయచేసి కింద రాసే వ్యాఖ్యలు మాత్రం సినిమాకి సంబంధించిన చర్చకి పరిమితం చేయగలరు).

ఇంతకీ నాకో విషయం మాత్రం అర్థం కాలేదు. ఉపశీర్షికల్లో ఆవిడ తన మామగారిని grand-dad అన్నట్లు రాసారెందుకనో!

మొత్తానికి సినిమా నెమ్మదిగానే సాగినా చెరగని ముద్ర వేసింది నా మీద. నన్నెవరైనా అడిగితే, నిస్సందేహంగా చూడమనే చెబుతాను. నాకు అర్థమైనంతలో కథ ఉద్దేశ్యం – “భగవంతుని లీల” ను చూపడం. అయినా కూడా, మనకు గల వ్యక్తిగత విశ్వాసాలతో సంబంధం లేకుండా సినిమాని సినిమాగా చూడగలము అని అనుకుంటున్నాను. కనీసం నేనైతే చూడగలిగాను -తెలుగు, తమిళ భక్తి సినిమాలను ఆస్వాదించగలిగినట్లే. నేను చూసిన కాసిని (క్లాసిక్స్ అని పేరుబడ్డ) సినిమాల్లో నేను మళ్ళీ కొన్నిసార్లు చూడ్డానికి సందేహించని వాటిలో దొకటి అని చెప్పుకోగలను. సినిమా యూట్యూబులో ఆంగ్ల ఉపశీర్షికలతో ఉచితంగా‌ చూడడానికి లభ్యమవుతోంది.