Menu

సినిమా కథలు- ద్వాదశి చక్రములు

మన చుట్టూ వున్న ప్రపంచం,ఆ ప్రపంచంలో వున్న మనం…మన కుటుంబ నేపధ్యం,మన వృత్తి,ఇరుగు- పొరుగు,సంబంధ బాంధవ్యాలు వీటికి తోడుగా మన చుట్టూ అల్లుకు పోయిన సామాజిక,రాజకీయ,ఆర్ధిక పరిస్థితులు వాటి వల్ల మనం ఆకస్మికంగా ఎదుర్కోవలసి వచ్చే ఉత్పాతాలు,వాటికి మన ప్రతిస్పందన..స్థూలంగా మనం ఎదుర్కొనే సమస్యలు,వాటి ద్వారా మనం పొందే అనుభవాల సమాహారమే కథ.

ప్రతి కథానాయకుడు సమస్యల్ని ఎదుర్కొంటాడు….కొందరు ధీరులు వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు.కొందరు భీరువులు వాటికి లొంగిపోతారు(దేవదాస్)…ఇంకొందరు అవాస్తవిక దృక్పధాలతో సమస్యని తమదైన శైలిలో పరిష్కరించే ప్రయత్నం చేస్తారు.ఇంకొందరు పరిస్థితుల్ని తమ ఉనికిని కాపాడుకోవటానికి ఓ అవకాశంగా భావించి,పరిశ్రమించి తద్వారా ప్రయోజనం పొంది నాయకులవుతారు.కొందరు తమ మేధస్సుని ఉపయోగిస్తారు.

స్వాతంత్ర్య సమరంలో పరిస్థితిని వాస్తవికంగా అవగాహన చేసుకున్న మహాత్ముడు హింస పై అహింస విజయం సాధిస్తుందని భావించి నాయకుడిగా ఎదిగి, జాతిపిత అయ్యాడు.ధీరోదాత్తుడిగా భావించబడే సుభాష్ చంద్ర బోస్…హింసకి ప్రతిహింస సరైన పరిష్కారంగా భావించి జాతి ప్రయోజనాల కోసం హిట్లర్ తో జతకట్టినప్పటికీ ఆంగ్లేయులతో ఒంటరిగా అతను చేసిన సాయుధ పోరాటం,సొంత మిలటరీ ఏర్పాటు చేయాలనే తపన,వెన్ను చూపని ఆత్మవిశ్వాసం,సమస్య ఎదుర్కోవటంలో అతని నిబద్ధత ఈ అవిశ్రాంత పోరాట యోధుడ్ని వీరోచిత నాయకుడ్ని చేసాయి…ఇదే సమస్యని తన జాతి ప్రయోజనాలను కాపాడుకోవటానికి సరైన వేదికగా భావించిన జిన్నా పాకిస్తాన్ ఒక దేశంగా ఏర్పడటంలో కీలక పాత్ర పోషించి వారికి పితామహుడయ్యాడు.నాజీలు యూదు జాతిని కౄరంగా అంతం చేస్తున్నా ధీరుడై ఎదురుతిరగకుండా,స్వార్ధంతో పరిస్థితులను తనకనుకూలంగా మార్చుకోటానికి ప్రయత్నం చేసిన షిండ్లర్,హృదయాన్ని కలచివేసే ఓ సంఘటనతో పరిస్థితి తీవ్రత అర్ధమై ఆ సమస్య పరిష్కారంలో తన పాత్ర అవసరాన్ని గుర్తించి అంగ,అర్ధ,స్థాన బలం కలిగిన శతృవుని ఒంటరిగా ఎదుర్కోలేక భీరువుగా ప్రవర్తించినా…యూదు జాతిని కాపాడాడు…నేడు యూదుజాతి భూమిపై మనుగడ సాగించడానికి కారణమై వారికి ఆరాధ్య దైవమయ్యాడు.వీరందరూ అప్పటి కాలానికి,విధికి ఎదురు తిరిగి నిలిబడ్డ యోధులు.ఒకరు ధైర్యాన్నిఆయుధంగా చేసుకోవచ్చు..ఇంకొకరు తెలివిపై ఆధారపడవచ్చు…ఒకరు ఓపికని,ఇంకొకరు పిరికితనాన్నిఆశ్రయించవచ్చు….సమస్యని ఏ కోణంలోంచి చూస్తేనేం…పరిష్కారించామా? లేదా అనేదే ఇక్కడ ప్రధానం.

రాత్రి-పగలు గడిస్తే రోజు,దీన్లో చీకటి-వెలుగు పక్కపక్కనే ఉంటాయి……సమస్యలో వున్నప్పుడు అది చీకటి గానూ…పరిష్కరించబడ్డాక వెలుగుగాను గుర్తిస్తాం.

సమస్యలు లేని జీవితాన్ని మంచికాలంగాను(వెలుగు),సమస్య ఎదురైనకాలాన్ని చీకటిగాను (గడ్డు కాలం) భావిస్తాం….కష్టాల్ని అనుభవిస్తాం,సుఖల్లో తేలియాడతాం. అందుకే కష్టాల్ని చాలా లోతుగా పట్టించుకుంటాం…సుఖాల్ని తేలికగా తీసుకుంటాం…ఈ సుఖంగా వున్నప్పుడే ఆదమరిచి తప్పులు చేస్తాం,కష్టాలకు బీజాలు వేసుకుంటాం.తేలిగ్గా తీసుకునే సుఖమనే రెండో సగానికి కథల్లో అంత ప్రాముఖ్యత ఉండదు……….సమస్యలతో నిండిన జీవితమే కథకి ముడిసరుకు.. సమస్య ద్వారా ఏర్పడే సంఘర్షణే కథకి ఇంధనం..అదే కథని అభివృద్ధి చేసి,పాత్రలో పరిణామాన్ని తీసుకువచ్చేది.. సమస్యలని ఎదుర్కోవటం ద్వారా మనిషి పరిణామం చెందుతాడు…..దీన్నే మనం పరిణతిగా గుర్తిస్తాం…కాలానుగుణంగా వచ్చే మార్పులే కష్ట-సుఖాలు.సత్యాన్ని మనం సంపూర్ణంగా అర్ధం చేసుకోలేం…మన దృష్టి పరిమితంగా ఉండటమే దీనికి కారణం…అందుకే మనం 360 డిగ్రీల్లో చూడలేం…….ఒకసారి ఒకవైపు మాత్రమే చూడగలం…అంటే పగటిపూట పగలునే,రాత్రిళ్లు రాత్రినే అనుభవించగలం….అందుకే మనం కాలాన్ని(దినం/రోజు) రెండు సగాలుగా(12+12) చేసుకున్నాం.

Unity of Time & Unity of Space :
(Space = Unity of Place & Unity of Action or Theme.)

Time & Space :
1)Period (కాల పరిధి) :
1)భూత (past) 2)వర్తమాన (present) 3)భవిష్యత్ (future) ..కాలాలు(కథ జరుగుతున్న కాలం)
2) Duration (నియమిత కాలం):
1).Screen Time (మొత్తం కథ చెప్పటానికి వినియోగిస్తున్న కాలం)
2).Pace గమనం( కథలోని ఉత్థాన,పతనాలు లేదా ఎత్తు,పల్లాలు)
3).Tempo ( సన్నివేశంలో చర్య-ప్రతిచర్యలు,సంభాషణ ద్వారా జరిగే కథ)
4).Rhythm తాళం (సన్నివేశ ప్రాధాన్యతని బట్టి మనం ఒక్కో సన్నివేశంలో,ఒక ప్రత్యేక ప్రదేశంలో ఎంత సేపుంటున్నాము అనేది తెలియజేస్తుంది)

ఆకస్మికంగా జరిగే సంఘటనల్ని కాలం(Time) తనలో దాచుకుంటుంది,నువ్వు ఎదుర్కోవలసిన ఉత్పాతాల్ని విధి(Space) సిద్ధం చేస్తుంది.

కాలం & విధి : ఒక రాజు కొందరు వర్తకుల్ని తన రాజ్యంలో వ్యాపారం చేయడానికి అనుమతించాడు….వ్యాపారంలో అభివృద్ధి చెందిన వర్తకులు వ్యాపారానికే పరిమితం కాకుండా వనరులతో పరిపుష్టంగా వున్న దేశంపై కన్నేశారు…రాజ్యాధికారం కోసం అక్కడ అసంతృప్తులుగా వున్న అధికారుల్ని ప్రలోభాలకి గురిచేసి…రాజుని పదవీచ్యుతున్ని చేసారు….చేయని తప్పుకి రాజుతో సహా ప్రజలందరూ స్వాతంత్ర్యం కోల్పోయారు.చీకటి రోజులు దాపురిస్తే(కాలం) మంచికోసం తీసుకున్న నిర్ణయాలు చేటు చేస్తాయి…అలా స్వాతంత్ర్యం కోల్పోయిన ప్రజ చీకట్లో ఆసరా(నాయకుడు) కోసం ఎదురుచూసారు….కొందరు ప్రేరణ కలిగించారు..కొందరు అవగాహన కలిగించారు,ఇంకొందరు ఆవేశాన్ని తట్టిలేపారు మొత్తానికి పెద్దలందరూ ప్రజలకి సమస్య అర్ధమయ్యేలా చేసారు…ఇప్పుడు ఈ ఉత్తేజాన్ని చివరి వరకూ నిలబెట్టి,సత్య మార్గంలో సమస్యకి పరిష్కారం చూపే నాయకుడి కోసం ప్రజ వేచి చూస్తున్న సమయంలో,సాదా సీదా వేషధారణతో అహింసని ఆయుధంగా చేసుకున్న బక్కపల్చటి మనిషి ప్రజలు కోల్పోయిన దాన్ని వారు తిరిగి పొందటంలో వారినే భాగస్వాములుగా చేసాడు అంగ,అర్ధ బలంతో,ఆయుధాలతో పోరాడే నాగరికుల్ని నిలువరించాడు..దేశంలో చీకటి మేఘాలకి కాలం చెల్లింది…స్వేచ్ఛా కిరణాలు చీల్చుకొస్తున్న తరుణంలో నాయకుడు అస్తమించాడు….ఐతేనేం….స్వేచ్ఛని అనుభవిస్తున్న ప్రతి పౌరుడి హృదయంలో జాతిపితగా ఉదయిస్తూనేవున్నాడు.

స్థూలంగా ఇది కథ….ఇది జరిగిపోయాక మనం చెప్పుకుంటున్నది కాబట్టి పూర్తిగా 360 డిగ్రీల్లో అర్ధం అయింది…కానీ అనుభవిస్తున్నప్పుడు?దీనిలో మనం ఏ భాగంలో వుంటామో,ఏ కోణంలోంచి చూస్తామో అది మాత్రమే అనుభవానికి వస్తుంది…..చీకటి – వెలుగుల చక్ర భ్రమణాన్ని మనం కాలంలో కొలుస్తాం కదా…కాలంలో ఉండే రెండు సగాల గురించి మనకి అవగాహన ఏర్పడింది కాబట్టి….ఇప్పుడు దీని నిర్మాణాన్ని సినిమా స్క్రీన్-ప్లే కి అన్వయిద్దాం.

ఇతివృత్తానికి నాటకీయత అద్ది కథగా రాసుకుంటాం,కథని స్క్రీన్-ప్లే లో చెబుతాం..కాలాన్ని ప్రధానంగా చేసుకుని స్క్రీన్-ప్లే నడుపుతాం….కాదు అని ఎవరైనా అంటే మీరు వంద గంటల స్క్రీన్-ప్లే రాసుకుని దృశ్యీకరించుకున్నప్పటికీ దాన్ని ఎడిటింగ్ రూంలో రెండున్నర గంటలకి కుదించేలా ప్రయాసపడతారు… ధనమూ,శ్రమ…వృధా కదా!!…అందుకే పెద్దలు మనకి ఓ సులువైన మార్గం చూపించారు……కథని సన్నివేశక్రమాలుగా(Sequence) విడగొట్టి ఏ సన్నివేశంలో ఏమి రావాలో అనుభవపూర్వకంగా తెలుసుకుని…నిరూపణకి నిలిచిన తర్వాత దాన్ని మనలాంటి అల్పఙ్ఞుల వినియోగార్ధం వ్యాప్తి చేశారు.ఇవి అర్ధం చేసుకున్న తర్వాత ఏ సినిమా చూసినా…ఏ సన్నివేశక్రమాన్ని రచయిత/దర్శకుడు చెప్పకుండా మింగేశాడో అర్ధం చేసుకోవచ్చు….(భాష) మనం వ్యాకరణం తెలిసి మాట్లాడినా,తెలియక మాట్లాడినా భావం అర్ధం అయినట్టుగానే… ప్రతి సినిమాలోనూ రచయితలు తెలిసి రాసినా,తెలియకుండా కథలు రాసినా ఈ సన్నివేశక్రమాలుంటాయి…. కాకపోతే వ్యాకరణం తెలిసిన వాడు మాట్లాడితే భాష కాస్త ఇంపుగా ఉంటుంది.ఏమీ తెలియని వాడు కథలు రాసినప్పటికి ఈ సీక్వెన్స్ ల్లో ఒకటి అరా కనిపిస్తాయి..కారణం సదరు రచయితలు ఓ మూలం(source) పడతారు కాబట్టి, ఆ మూలల్లో(కథల్లో) ఇలాంటివి దాగి వుంటాయి కాబట్టి….ఈ ఘనుల రచనల్లోనూ అవి మెరుస్తాయి…..చెట్టు మంచిదైతే విత్తూ మంచిదే అవుతుంది (మనం దాన్ని చేజేతులా పుచ్చు పట్టించకపోతే తప్ప)….చెట్టు పేరు చెప్పకుండా కూడా కాయలమ్ముకోవచ్చు….

సందర్భం Vs అంకం:
మనం చెప్పుకోబోయే ద్వాదశి చక్రం కూడా మూడంకాల నిర్మాణాన్ని ఆధారంగా చేసుకుని నిర్మితమై వుంటుంది.
మెదటి అంకం = మూడు సన్నివేశక్రమాలు.
రెండవ అంకం = విరామానికి ముందు మూడు,విరామం తర్వాత మూడు సన్నివేశక్రమాలు.
మూడవ అంకం = మూడు సన్నివేశ క్రమాలు.

అంకాలు మూడే ఉంటాయి…సందర్భాల్లో కథ చెప్పే పద్ధతి ఉంది..ఆ పద్ధతిలో మెత్తం మూడంకాల్లోనూ మొత్తంగా కలిపి ఐదు సందర్భాలొస్తాయి,అరుదుగా కథ పెద్దది అయినప్పుడు ఐదుకన్నా ఎక్కువ సందర్భాలు వచ్చే అవకాశం ఉంది.దాన్ని పొరపాటుగా అర్ధం చేసుకున్నవారు మూడు లేదా ఆరు, పది లేదా ఎన్ని అంకాలైన ఉండొచ్చు అంటారు అది సరి కాదు….మనిషికి తల మొండెం పాదాలు ఉన్నట్టే కథకి కేవలం మూడు అంకాలు మాత్రమే ఉంటాయి..స్థూల రూప నిర్మాణంలో మార్పుండదు.ఇంటి స్థూల నిర్మాణం కూడా పిల్లర్ బీమ్ స్లాబ్ అనే మూడు అంచెల్లో పూర్తవుతుంది.

ఐదు సందర్భాలుగా కథని చెప్పటానికి ఒక్కడు మంచి ఉదాహరణ:
సంఘటన జరగటం ,సందర్భంగా ఎదగటం,ఆ సందర్భం విపత్కర స్థితిలో పడటంగా దీని నిర్మాణం ఉంటుంది.
సందర్భం 1: మహేశ్ పరిచయం నుండి ప్రకాశ్ రాజ్ ని కొట్టడం వరకూ
ప్రకాశ్ రాజ్ ని కొట్టడంతో రెండవ అంకం ప్రారంభం:

సందర్భం 2 : భూమికని కాపాడటం నుండి ప్రకాశ్ రాజ్ మనుషుల నుండి తప్పించుకోవటం వరకూ
సంఘటన: భూమిక ని కాపాడటం సంఘటన ,
సందర్భం: తప్పించుకుని పారిపోయి ప్రకాశ్ రాజ్ కి ఇంటర్వెల్ ముందు దొరకటం వరకూ సందర్భం.
విపత్కరస్థితి: దొరికగానే సందర్భం విపత్కరస్థితిలోకి వెళ్లిపోతుంది.
ఈ విపత్కరస్థితి నుండి చాకచక్యంగా బయటపడటంతో ఆ సందర్భం సుఖాంతం అవుతుంది.(విరామం)

సందర్భం 3 :భూమికని ఇంట్లో దాచడం దగ్గర నుండి తండ్రికి దొరికిపోయి తప్పించుకోవటం వరకూ
సంఘటన : భూమికని ఇంట్లో దాచడం సంఘటన.
సందర్భం : భూమిక ముఖేశ్ ఋషికి కనిపించటం వరకూ సందర్భం
విపత్కరస్థితి : భూమిక విషయం తెలిసిందని మహేశ్ కి తెలియగానే విపత్కరస్థితి లోకి వెళ్లి అక్కడ నుండి తప్పించుకోవటాంతో కథలో ఉత్కంఠ ఏర్పడుతుంది.

సందర్భం 4 : తప్పించుకుపోయిన భూమిక,మహేశ్ ఆచూకీ పోలీసులకి దొరకడం నుండి ప్రకాశ్ రాజ్ భూమికని విమానాశ్రయం దగ్గర అపహరించడం వరకూ
సంఘటన : జిప్సీని జాగిలాలు కనుగొనడం.
సందర్భం : భూమిక ని చార్మినార్ నుండి విమానాశ్రయం వరకూ తీసుకెళ్లడం సందర్భంలో భాగం
విపత్కరస్థితి : విమానాశ్రయం దగ్గర భూమికని అపహరించడంతో సందర్భాలు ముగిసి కథ మూడో అంకంలోకి ప్రవేశిస్తుంది.

సందర్భం 5 :భూమిక పెళ్లి ఆగటం నుంచి మహేశ్ చేతిలో చావటం వరకూ

ఈ ఐదు సందర్భాల్లో ఒక్కో సందర్భం నిర్మాణం కూడా సమస్య ఏర్పడటం,కొనసాగటం,ముగియటం అనే మూడు అంచెల్లో ఉంటుంది…ఈ మూడంచలే నిర్మాణానికి ఆయువు పట్టు…ఐదు సందర్భాలు కూడా కాలాన్ని భూమికగా చేసుకుని ఏర్పడినవే.అత్యుత్సాహంతో ఈ సందర్భాల్నే అంకాలుగా పొరబడిన కొందరు అనుభవఙ్ఞులు, ఔత్సాహికుల్ని తికమక పెడతారు….మూడు అంకాలు మాత్రమే ఉన్నాయని నిర్భయంగా నమ్మండి…..పరిణామక్రమం మూడుకన్నా ఎక్కువ అంచల్లో పూర్తవడం ప్రకృతి విరుద్ధం (సృష్టి స్థితి లయ – పుట్టుక పరిణామం మరణం).మీకు మీరు కొత్తగా ఏదైనా కనిపెట్టినా వాటిని నిరూపించడానికి ప్రయాసపడవలసి వస్తుంది.

సంగీతంలాగే.. సినిమా కూడా కాలంపై అధారపడి నడిచే కళ(టెంపోరల్ ఆర్ట్)…. సంగీతం వింటుండగా అది ఒక్క క్షణం ఆగిపోతే కొన్ని యుగాలు గడిచినట్టనిపిస్తుంది.అలాగే కథలో కాలాన్ని మరిచేలా చేసే సంఘర్షణ లేనప్పుడు గంటలు,రోజులు,వారాల తరబడి ఆ సినిమా చూస్తున్న అనుభవం కలుగుతుంది. (మన ప్రేక్షకులు ఈ ప్రమాదకరమైన వ్యసనానికి అలవాటుపడకుండా చూడాల్సిన బాధ్యత ఔత్సాహిక దర్శకులదే – లేనట్టయితే కొత్త ప్రవాహం పేరుతో మురికి నీరు మనల్ని ముంచే ప్రమాదం ఉంది.)

పన్నెండు సన్నివేశక్రమాలు:
ఇప్పుడు కాలం మన సినిమా కథనంలో ఎలా ఇమిడిపోతుందో చూద్దాం.
ప్రతి సన్నివేశక్రమం 10 నుండి 15 నిమిషాలుంటుంది.
రెండు గంటల సినిమాకి..10 x 12 = 120.మూడు గంటల సినిమాకి 10 x 15 = 180.
వివరణ : ఒక్కో సన్నివేశం ప్రాధాన్యతని బట్టి కొంచెం ఎక్కువగానో లేదా తక్కువగానో వుండే అవకాశం ఉంది…తక్కువగా వున్న సన్నివేశంలో మిగిలిన సమయాన్ని ఇంకో సన్నివేశం పూరిస్తుంది(cover చేస్తుంది).ఒక సన్నివేశక్రమం 8 నిమిషాల నిడివి ఉండవచ్చు ఐతే తరవాత వచ్చే ఇంకో సన్నివేశక్రమం నిడివి 15 నిమిషాలుండవచ్చు.
మినహాయింపు : MiniPlot structures కథనాల్లో నాటకీయత తగ్గించడం ఇద్దరికన్నా ఎక్కువ కథానాయకులుండటం వల్ల,కథలు ఎక్కువ అవటంతో ఆయా కథనాలు (దీని ముందు వ్యాసం చూడండి)ఈ ద్వాదశిచక్ర పరిధిలోకి రావు.
వివరణ : Archplot structures కథనాల్లో కూడా ఇద్దరుకన్న ఎక్కువ కథానాయకులుంటారు ఐతే వారికి ప్రత్యేకమైన కథలుండవు…కథానాయకులందరిది ఒకే సమస్య లేదా ప్రధాన కథానాయకుడికి అనుచరులుగా ఉంటారు.

హంస అంటే వాయువు,అశ్వం అంటే కిరణం,పరము అంటే సూక్ష్మం,చక్రం అంటే కాలం..ఇవి వ్యావహారిక భాషలో అర్ధాలు కాదు,అధ్యాత్మిక భాషలో వుపయోగించే పరమార్ధాలు(లోతైన అర్ధాలు)…మన మకుటానికి ఇది వివరణ .

ద్వాదశి చక్రములు (Screen Time) :
1.ఇందు 2.నేత్ర 3.అగ్ని 4.వేద 5.బాణ 6.ఋతు 7.ఋషి 8.వసు 9.బ్రహ్మ 10.దిశి 11.రుద్ర 12.ఆదిత్య చక్రములు.
1.ఇందు = చంద్రుడు (నిశీధి ప్రారంభం/ అఙ్ఞానం) 2. నేత్ర =దృష్టి 3.అగ్ని = తేజస్సు/శక్తి 4.వేద = విద్య లేక ఙ్ఞానము 5.బాణ = అంబు(ఆయుధం) 6.ఋతు = వెలుగు 7.ఋషి = యధార్ధాన్ని దర్శించినవాడు 8.వసు = సంపద 9.బ్రహ్మ= సర్వఙ్ఞుడు,సృష్టికర్త 10.దిశి = సర్వ దిక్కులు 11.రుద్ర = శివుడు (లయకారుడు) 12.ఆదిత్య = దినకరుడు..(ఙ్ఞానోదయం/ వెలుగు ప్రారంభం).

మనిషి అఙ్ఞానం అనే అంధకారంలో నుండి ఙ్ఞానం అనే వెలుగు బాటలోకి ప్రయాణించేటప్పుడు కాలానుగుణంగా అతను పరిణతి చెందే క్రమమే ఈ ద్వాదశి చక్రాలు. సినిమా కాలం మీద అధారపడి నడిచే కళ కాబట్టి, జీవితంలో అనేక సంవత్సరాల కాలంలో అనుభవమయ్యే ఈ దశలు ఇక్కడ కథలో కొన్ని నిమిషాల్లో క్లుప్తంగా వర్ణించబడతాయి.

విశ్లేషణ:
మనం అఙ్ఞానంలో నుండి మన జీవితాన్ని ప్రారంభిస్తాం…సమస్య ఏర్పడగానే మన దృష్టి విశాలమవుతుంది…ప్రకృతిలోబలంగా వున్న వ్యతిరేక శక్తితో పోరాడితీరాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మనలో దాగిన శక్తి బయటపడుతుంది..సంఘర్షణ మొదలు..చిన్నపాటి విజయం సాధిస్తాం.. దీని ద్వారా సమస్య చిన్నదనే భావన కలిగి..వ్యతిరేకశక్తి పై చిన్నచూపు ఏర్పడుతుంది…కాని ఆ వ్యతిరేక శక్తి ప్రస్తుతం పరిస్థితుల్ని శాసించే స్థితిలో ఉంది అని మనకి తెలీదు దాంతో ఆ శక్తి తన బలాన్నిమనపై ప్రయోగిస్తుంది……తడబడినప్పటికి మనం దానిపై కూడా విజయం సాధించి..కాస్త జాగ్రత్తగా ఉంటాం దాంతో ఆక్కడి పరిస్థితులపై మనకి పట్టు చిక్కి మనం ఓ సమాంతర శక్తిగా ఎదుగుతాం….కానీ సమస్యపై ఇంకా విజయం సాధించలేదు….ప్రస్తుత శక్తిని వ్యతిరేకిస్తే మన నాయకత్వాన్ని అంగీకరించటానికి ప్రకృతి సిద్ధంగా ఉందని అర్దం అవుతుంది….యదార్ధం బోధపడుతుంది….ప్రస్తుత శక్తిని ఎదుర్కోవటం మనకి ఇప్పుడు పెద్ద కష్టం కాదు.. క్రమంగా మనకి ప్రత్యేకమైన రాజ్యం ఏర్పడుతుంది ఇది ప్రస్తుత శక్తికి కంటకంగా మారుతుంది…తనతాను నిరూపించుకొనే అవకాశం కోసం అది కాచుక్కూర్చుంది….రాజ్యం ఏర్పడటంతో మనం కాస్త విరామంగా అలోచించే అవకాశం దొరుకుతుంది.ప్రస్తుతం మనమే రాజు,ఎక్కడ ఏం జరిగినా అది మన ఆఙ్ఞకి లోబడి జరుగుతుంది…కాని మొదటి నుండి ఉన్న ప్రస్తుత శక్తి అవకాశం రాగానే అన్ని దిక్కులనుండి మనల్ని బందీ చేస్తుంది….దీంతో మనం హఠాత్తుగా బలహీన పడతాం….సూర్యోదయం ఇంకా ఓ ఘడియకాలం
ఉందనగా నిశి భయంగొల్పుతుంది….సూర్యోదయం అవుతుందా?అనే అనుమానం కలుగుతుంది..ఇదే కీలకమైన సమయం..ఈ సమయంలో ఎదురుతిరిగి వ్యతిరేక శక్తిని నాశనం చేయగలిగే పోరాటపఠిమ కనబరిస్తే ఇక మనకి తిరుగులేదు…మనం ఇక్కడ లొంగిపోతే ప్రకృతి ఈ సమస్యని పరిష్కరించడానికి మనలాంటి మరో శక్తిని తయారుచేయడానికి సమయం తీసుకుంటుంది….ఐతే ఇలాంటి సందర్భాలు చాలా అరుదు…90% సందర్భాల్లో కాలం నూతన శక్తికే అనుకూలంగా ఉంటుంది.

ప్రస్తుతం మనమే రాజు ఐనందువల్ల….రాజ్యాంపై హక్కు ఒదులుకొనే అవకాశం లేకపోవటం + ప్రస్తుత శక్తి పాతబడి ఉండటం వల్ల మనలో నిగూఢంగా దాగి ఉన్నశక్తుల్ని ఈ సందర్భం బయటపెడుతుంది….మన శక్తికి మించి ఏదయినా సమస్య ఏర్పడితేగాని లోపల ఎంత శక్తి ఉందో తెలుకోలేము కదా….ఇప్పుడు ప్రస్తుతం సమస్యపై దాదాపు విజయం సాధించిన మనం ఈ నూతన జీవితాన్ని ఒదులుకొని పాత జీవితాన్ని కోరుకోము….కాబట్టి మహోగ్రరూపం దాల్చి పాత శక్తిని అంతం చేస్తాం…..సమస్య అంతం కాగానే…..ఙ్ఞాన సిద్ధి కలుగుతుంది…అదే సూర్యోదయం…. ఈ వెలుగు బాటలో మనం హుందాగా కొత్త ప్రపంచంలోకి అడుగుపెడతాం.

ఉదాహరణతో చక్రముల వివరణ : ఈ నిర్మాణానికి శివ సినిమా దాదాపు 80% న్యాయం చేయటంతో పాటుగా ఈ సినిమా అందరూ చూసి ఉండే అవకాశం ఉండటంతో సులువుగా అందరికి అర్ధమవుతుందనే నమ్మకంతో సన్నివేశక్రమాల ఉదాహరణలకు ఆ సినిమాని ప్రధాన వస్తువుగా తీసుకోవటం జరిగింది.ఈ సినిమా నిడివి 144 నిమిషాలు..అంటే సన్నివేశక్రమం నియమం ప్రకారం సగటున ఒక్కో సన్నివేశక్రమం 12 నిమిషాలు ఉండే అవకాశం ఉంది.
గమనిక: సన్నివేశక్రమాన్ని అక్కడక్కడా సందర్భం అని పేర్కొనటం జరిగింది…అర్ధం చేసుకోవటంలో పొరపడకూడదని మనవి.

మొదటి అంకం act – I : (ఇందు, నేత్ర, అగ్ని చక్రములు)

1.ఇందు చక్రం(నిశీధి ప్రారంభం) : కథా ప్రపంచం,దాన్నితన దృష్టికోణం నుంచి చూస్తున్న కథానాయకుడనే కిటికీ..కథనీ,కథానాయకుడ్ని దారి తప్పకుండా ఒక స్థిరమైన ప్రదేశంలో నిలిచేలా కట్టడి చేసే లంగరు వేయడంతో ఈ సన్నివేశక్రమం ముగుస్తుంది. జురాసిక్ పార్క్,టెర్మినేటర్ 2 సినిమాల్లో ఈ సన్నివేశక్రమం అద్భుతంగా ఉంటుంది. ఇది కథా ప్రపంచం,కథా నాయకుడి పరిచయం,లంగరు అని మూడు భాగాలుగా ఉంటుంది.అత్యంత ముఖ్యమైన కాలం.

కథా ప్రపంచం( premise + inciting incident – ఆవరణ) : ఈ ఆవరణలోనే కథపై ఆసక్తి కలిగించాలి(inciting incident) + ప్రధాన రసం పరిచయం చేయాలి,కథ ఏ సమస్య గురించో,కథ ఎవరి నియంత్రణలో(జాస్ లో సొరచేప,గాడ్ ఫాదర్ లో మార్లిన్ బ్రాండో,శివలో భవాని) ఉందో తెలియజేయాలి.అత్యంత కీలకమైన సమయం ఇది,దీన్ని వృధా చేస్తే తలలు పట్టుకోవల్సి వస్తుంది.రకరకాల సమస్యలతో సతమతమవుతూ చిత్ర ప్రదర్శనాశాలలో స్థిరపడిన ప్రేక్షకుడు మొదటగా కథా ప్రపంచంలోకి అడుగుపెట్టే విలువైన కాలం, ప్రేక్షకుడి మనసు రచయిత అదుపు ఆఙ్ఞలకి లోబడే కీలకమైన సమయం ఇదే….(సాధారణంగా దీని నిడివి కేవలం ఐదు నిమిషాలు.)

ఉదా: శివ సినిమాలో గణేష్ అతని మనుషులు,j.D విరోధులపై కళాశాల బయట చేయి చేసుకోవటం.ఈ సన్నివేశంలో కళాశాల బయట ఓ గొడవ జరిగినట్టుగా పైకి కనిపించినా,లోతుగా అలోచిస్తే కళాశాల వరకు ఇలాంటి రౌడీలు రాగలుగుతున్నారంటే సమస్య ఎంత లోతుల్లోకి చొచ్చుకెళ్లిందో అర్ధమవుతుంది….జురాసిక్ పార్క్ సినిమాలో రాప్టర్ గేట్ కీపర్ ని చంపటం చూస్తాం…కానీ రాకాసి బల్లిని చూడం.

కథానాయకుడు & అతని ప్రపంచం పరిచయం (Introduction to the protagonist) :కథానాయకుడి దైనందిన జీవితం,అతని కుటుంబం, అలోచనలు.అతని మనఃతత్త్వం ఇత్యాది వివరాలు ఇక్కడ మనం పరిచయం చేస్తాం…ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే,ఇక్కడ మనం అతని శక్తి సామర్ధ్యాలని పరిచయం చేస్తాం, అంతే తప్ప ఇప్పటికిప్పుడే వాటిని నిరూపించాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు.అతని పాత్రని మాత్రమే పరిచయం చేస్తున్నాం అతని పాత్ర ఔచిత్యాన్ని కాదు….. పాత్ర ఔచిత్యాన్ని పరిచయంచేసే సందర్భం దగ్గర్లోనే ఉంది కంగారుపడి గొప్ప యాక్షన్ సన్నివేశాన్ని ఇక్కడ పరిచయం చేయాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు….యాక్షన్ కోసం యాక్షన్ కథలు రాసే వారు హీరో పరిచయంలోనే అతన్ని గొప్ప సన్నివేశంతో పరిచయం చేసి క్రమంగా అతన్ని దిగజారుస్తారు…పుట్టగానే ఎవడూ హీరో అవడు,క్రమంగా తను చేసే చర్యలతో హీరోగా ఎదుగుతాడు.

ఉదా: శివలో నాగార్జున పాత్ర పరిచయం,కాలేజి వాతావరణం J.D. తరగతి గదిలో చిల్లర వేషాలు,ప్రిన్సిపాల్ చేతగాని తనం. శివ & సుధాకర్ పరిచయం,అమల పాత్ర పరిచయం. వాళ్ల బృందంలో సభ్యుడవటం.శివ ఇంట్లో పరిస్థితులు..కుటుంబ సభ్యులతో అతని సంబంధాలు.కళాశాలపై j D ప్రభావం…

లంగరు (the hook):ఇది అత్యంత కీలకమైన సమయం…వాస్తవిక భ్రమని(illusion of reality / willing suspension of disbilief) కలుగజేసే విలువైన కాలం..ఈ సన్నివేశం వచ్చే వరకూ ప్రేక్షకుడు మన కథని నమ్మడు….కథా ప్రపంచం,హీరో పరిచయం తర్వాత ఇక్కడ జరిగే ఒక సంఘటన కథని ఓ స్థిరమైన అంశం దగ్గర కట్టడి చేసి…మనం చూడబోయేది కథే అన్న నమ్మకాన్ని ప్రేక్షకుడికి కలుగజేసి అక్కడ నుండి కథని అతను కాస్త ఆసక్తిగా చూడటానికి ప్రేరణ కలుగజేస్తుంది.

ఉదా:గణేష్ చందా..కాలేజ్ వాతావరణం గురించి అన్నతో శివ చర్చ.శివ & j d మొదటిసారిగా ఎదురుపడతారు…. 12వ నిమిషంలో సుధాకర్ స్నేహితుడిపై J.D చేయి చేసుకోవటం…ఈ సంఘటనకి శివ అసహనం వ్యక్తం చేయటం..చిన్నా స్పందన…వీరి బలహీనత మనం అర్ధం చేసుకుంటాం..ఐతే హీరో వున్నాడనే నమ్మకం వల్ల మనం తర్వాత ఏమి జరుగబోతుందా అనే ఆసక్తిని కలిగివుంటాం..ప్రతిభావంతులైన రచయితలు,దర్శకులు(నిర్మాతలు,హీరోలు కాదు) తీసిన సినిమాల్లో ఈ సన్నివేశ ప్రాధాన్యతని మనం గమనించవచ్చు…జురాసిక్ పార్క్ చిత్రంలో నెడ్రీ మాఫియా నుండి డబ్బు తీసుకునే సన్నివేశం మనకి కథపై ఆసక్తిని ఒక్కసారిగా పెంచుతుంది…యజమాని పార్క్ భద్రతని పరీక్షించడానికి నిపుణుల్ని వెతికే ప్రయత్నంలో ఉంటే…పార్క్ భద్రతని పర్యవేక్షించే అధికారి ఆ భద్రతని కొంతకాలం పాటు నిలుపుచేసి,ఎంబ్రియోలు మాఫియాకి ఇవ్వటానికి డబ్బు తీసుకుంటాడు…అది ఊరపిచ్చుకల పార్క్ కాదు…రాకాసి బల్లుల నివాస స్థలం….ప్రమాదాన్నిసూచించే పరస్పర విరుద్ధమైన పాత్రల చర్యలు….ఆసక్తిని కలిగించక ఏమి చేస్తాయి??నాటకీయత అంటే ఇదే…గాల్లో తేలడాలు,రోప్ విన్యాసాలు కాదు.ఖర్చు ఎక్కడ పెట్టాలో,మెదడెక్కడ వాడాలో తెలియాలి…లేకపోతే..అర్ధంపర్ధం లేని పోరాటా దృశ్యాలకి స్టంట్ మాష్టర్స్ కాళ్లు విరగ్గొట్టుకున్నా ఫలితం ఉండదు…వ్రతమూ చెడుతుంది.. ఫలితమూ దక్కదు.ఇప్పుడు కథని,నాయకుడ్ని ఓ అంశానికి కట్టుబడేలా చేశాం…తర్వాత!!!???

2.నేత్ర చక్రం : ఇతర పాత్రల పరిచయం,పాత్రల మధ్య సంబంధం,ప్రతినాయకుడి పరిచయం…ప్రతి నాయకుడి పరిచయం అనగానే అతన్ని ఖచ్చితంగా చూపించే తీరాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు, కథ పై అతను చూపించే ప్రభావాన్ని చూపించినా అతన్ని గురించి పరిచయం చేసినట్టే.ప్రతినాయకుడు అనగానే ఖచ్చితంగా మనిషి అయి ఉండాలనే నియమం లేదు ట్విస్టర్ సినిమాలో తుఫాన్,జురాసిక్ పార్క్ సినిమాలో రాకాసి బల్లులు,అమెరికన్ బ్యూటీలో పాత్రల మధ్య ఉండే అపార్ధం,శుభలగ్నం సినిమాలో ప్రధానపాత్రకుండే మితిమీరిన ధనకాంక్ష ఇవన్నీ కథానాయకుడికి ప్రతికూలాంశాలే,అతన్ని సమస్యలోకి నెట్టి, లక్ష్యం చేరనీయకుండా చేసేది ఏదైనా విలనే …..కథానాయకుడి బలహీనత(అతని వ్యక్తిగత సమస్య) పరిచయం.కథని చుట్టుముట్టి ఉన్న పరిస్థితులు.కథానాయకుడి దృష్టికోణాన్ని అర్ధం చేసుకునే సహకార పాత్ర(చాల సినిమాల్లో ఇది హీరోయిన్ లేదా స్నేహితుడు) పరిచయం…. ఇప్పుడు భావోద్వేగాల్ని తట్టిలేపే ప్రమాదకరమైన సంఘటన అనూహ్యంగా ఎదురవుతుంది…కథానాయకుడి స్పందన కోసం ఆతృతగా ఎదురుచూస్తాం…మొదటిసారిగా ప్రేక్షకుడు సంతృప్తి పడేది ఇక్కడే…..(జురాసిక్ పార్క్ లో మనం మొదటిసారిగా రాకాసి బల్లిని పూర్తిస్థాయిలో చూసేది ఇక్కడే.)

ఉదా:శివ అమల మధ్య స్నేహం వృద్ధి చెందుతుంది,అమల అన్న పరిచయం శివ ఒదిన పై స్థానిక రౌడిల అసభ్య ప్రవర్తన.శివని ఇంట్లో ఉంచటంపై వాదన.అమలతో శివ దీని గురించి చర్చిస్తుండగా…. 24వ నిమిషంలో J.D అమలని రాసుకుంటూ వెళ్తుంటే శివ అతన్ని ఆపుతాడు.ఇప్పుడు కథ మీద ఆసక్తి కలుగకపోతే ఏం కలుగుతుంది?తర్వాత ఏం జరుగబోతుందో మనకి తెలుసు…కానీ శతృవు స్థానబలాన్ని మెదట మనం చూసి వున్నాం….మనమైతే హీరోలా స్పందించం.. శివ స్పందించాడు కాబట్టి ఇక్కడ హీరో అయిపోయాడు…ఉత్కంఠ మొదలు….రక్తం క్రమంగా వేడెక్కుత్తుంది…ఇక్కడ జరిగే పోరాటంలో శివ చైన్ లాగే సన్నివేశం…అతనిపై మన భావోద్వేగాలనే సంపద మొత్తాన్ని ఒక్కపైసా మిగలకుండా పెట్టుబడిపెట్టేలా చేస్తుంది……ఐనా ఎక్కడో ఓ మూల చిన్న సందేహం ప్రశాంతంగా ఉండనివ్వదు.ప్రిన్సిపాల్ లాంటి వాడే రాజీ పడ్దాడు….మొదట గణేశ్ గురించి ఎలా మర్చిపోతాం…….ఈ సన్నివేశంలో ప్రేక్షకుల అంచనాలు అమాంతం పెరిగిపోతాయి…తర్వాత వచ్చే పోరాట సన్నివేశం గురించి కాదు మనం అలోచించేది……తర్వాత కథేంటి????…..ఇది కదా కథలో మనం అభివృద్ధి చేయాల్సింది….అతిముఖ్యమైన,అత్యంత నమ్మకమైన,చక్కటి ఈ మార్గాన్ని ఒదిలి….దొడ్డిదారుల్లో కథలు తయారుచేయటం వల్ల ఏమిటి ప్రయోజనం?

3.అగ్ని చక్రం : అసలు కథకి దారి తీసే సంఘటనలు ఒకదాని వెంట ఒకటి జరుగుగూ,కథ వేగాన్ని పెంచుతాయి…ప్రతినాయకుడి ఆధిపత్యం..కథానాయకుడి బలహీనత…ఇక్కడ జరిగే ఒక సంఘటన ఒక్క కుదుపుతో కథని ఇక వెనక్కి తిరిగి ఆలోచించే అవకాశం ఇవ్వకుండా ముందుకు నెట్టేస్తుంది.కథానాయకుడి ముందున్నది ఒకే దారి….ముందుకే వెళ్లాలి…..కాని అతని బలహీనత అతన్ని ముందుకు నడిపిస్తుందా అనే సందేహం మనకి కలుగుతుంది….
ఉదా: ఇప్పుడు కాలేజ్ ఎన్నికలు…j.d.కి వ్యతిరేకంగా పోటి చేయాలనే నిర్ణయం……హీరో స్పందనకి…గణేశ్ రూపంలో ఓ హెచ్చరిక ప్రతినాయకుడి ప్రతిస్పందనగా వస్తుంది..హెచ్చరిక మాత్రమే.(అతి తెలివి ఎక్కువైతే ఇక్కడ ఫైట్ మాష్టర్ కి పనికలుగుతుంది)..శివ ఘాటైన సమాధానం.కథలో వాతావరణాన్ని,ప్రేక్షకుడి రక్తాన్ని వేడెక్కిస్తుంది…..శివ మిత్ర బృందంతో సినిమాకి వెళ్తాడు… ప్రతి నాయకుడు మహా శక్తిమంతుడు..ప్రస్తుతం కథపై పూర్తి అధికారాన్ని కలిగివుంది అతనే….ఇక స్పందన కాదు…ప్రతిచర్యే సమాధానం…ఇది హీరోకి భీతిగొల్పే విధంగా రచించబడి,సమయం కోసం ఎదురుచూస్తూ ఉంది …సినిమా చూచి ఒంటరిగా వస్తున్న రాంజగన్ ని గణేష్ చావగొట్టినంత పని చేస్తాడు……. అర్ధవంతంగా వుండి క్రమపద్ధతిలో వేగాన్ని పుంజుకుంటున్న కథనం…ఇక్కడ ఉపయోగించిన సౌండ్ టు సౌండ్ ట్రాన్సిషన్ కథని ఒక్క కుదుపుతో అసలు కథలోకి నెట్టేస్తాయి…..ఎగైనెస్ట్ ద గ్రైన్ టూల్ తో తయారుచేసిన అధ్బుతమైన సన్నివేశం ఇది.ఇప్పటికి 41 నిమిషాలు.

Empathy Vs Sympathy :
మొదటి సందర్భం అయిపోతూనే ప్రేక్షకుడు కథని ఆసక్తిగా చూడటం మొదలు పెడతాడు….కథలో ఈ సమయం వచ్చేసరికి కథనాయకుడి దృష్టి కోణం అర్ధమైపోతుంది,రెండవ సందర్భంలో అతని స్పందన చూస్తాం..మూడవ సందర్భం దగ్గరికి వచ్చేసరికి అతన్ని అనుసరించడం ప్రారంభిస్తాం…నాయకుడు చేయాల్సిన పని ఇదేగా..అనుసరించేలా చేసుకోవటం..అనుసరించటం మొదలాయ్యాక ఇక అతను ఎలా స్పందిస్తాడో మనమూ అలాగే స్పందిస్తాం…..ఇదే నాయకుడు,అనుచరుడి బంధం…నాయకుడితో అనుభూతి ఐక్యత (Empathy)కలిగి ఉండటం.కథలో ఇది స్థిరపడిపోయాక ఇక మనం వద్దన్నా ప్రేక్షకుడు కథానాయకుడ్ని అనుసరిస్తూనే ఉంటాడు…అలా కాక ఇంకో పద్ధతి ఉంది…అది నాయకుడ్ని ప్రారంభం నుండి ఇబ్బందులకి,కష్టాలకు గురిచేసి అతనిపై ప్రేక్షకులకి సానుభూతి కలుగజేయటం..ఈ పద్ధతిలో మొదటి పది నుండి పదిహేను నిమిషాలు అలాంటి సానుభూతి కలిగినా…అలాంటి హీరో పై సానుభూతి చూపిస్తున్నందుకు క్రమంగా ప్రేక్షకుడికి తనపై తనకి జాలి కలగటం మొదలవుతుంది….ఆర్ట్ సినిమాలని రెగ్యులర్ గా చూసే ప్రేక్షకులకి ఇది బాగా అనుభవం అవుతుంది.ఎంత సున్నితమైన,జాలి మనసు కలిగిన ప్రేక్షకుడైనా సినిమా మొదటి నుండి చివరి వరకూ ఒకే భావోద్వేగాన్ని అదికూడా బలవత్తరంగా రుద్దబడే ఈ బాధాకరమైన అనుభూతిని డబ్బు ఖర్చు పెట్టి పొందాలని కోరుకోడు,అన్ని రసాలు అస్వాదించినప్పుడు కలిగే అనుభూతి వర్ణనకు అందదు….లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటి సూత్రం ప్రకారం చూసినా కూడా పై పద్ధతి సినిమాకి ఏ మాత్రం అన్వయించదగినది కాదు.ఇదే ఆర్ట్ సినిమాకి కమర్షియల్ సినిమాకి తేడా.సినిమాలు మన తెలివిని నిరూపించుకోవటానికి చేసే పనికాదు,ప్రేక్షకుల్ని సంతృప్తి పరచడానికి చేసే పని…కథలు రాయడానికి సాథారణంగా ఎంతో అనుభవఙ్ఞానం ఉపయోగిస్తాం…అలాకాకుండా… తెలివిని మాత్రం ఉపయోగించి కథలు చెప్పాలనుకోవటం అతితెలివే అవుతుంది.

రెండవ అంకం act – II (ప్రధమార్ధం) : (వేద,బాణ,ఋతు చక్రములు)

4 .వేద చక్రం : కథానాయకుడు కథా ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.ఈ కథా ప్రపంచం ఊహాజనిత ప్రపంచం కావచ్చు,హీరో మానసిక స్థితి కావచ్చు,చారిత్రక సంఘటన కావచ్చు,సమకాలీన సమస్య కావచ్చు…హీరోకిప్పుడు తనని తాను నిరూపించుకోవల్సిన అవసరం ఏర్పడింది…ఇప్పటి వరకు ఊగిసలాడిన అనిశ్చితమైన లక్ష్యం ఇక స్థూలమూ,జడమూ అవుతుంది….సాధించటం తప్పనిసరవుతుంది…ఉపరితలాన్ని ఆశ్రయించివున్న భావోద్వేగాలు…మనసు లోతుల్లోకి చొచ్చుకెళ్లే వెసులుబాటు ఈ సందర్భం కల్పిస్తుంది.కర్తవ్య నిర్వహణలో అత్యుత్సాహంగా పాల్గొనే నాయకుడికి ఆటు – పోట్లు ఎదురవుతాయి అతనికి ..స్నేహితులు,శతృవులు తారసపడతారు….ఇక్కడ హీరో మొదటి విజయాన్ని సాధించి..ప్రతినాయకుడ్ని కలవరపెడతాడు….అతని బలహీనతని బయటపెడతాడు.

అతని అధికారంపై అతనికే సందేహాలు కలుగజేస్తాడు.తెలివిగల ప్రతినాయకుడు సమర్ధుడితో యుద్ధానికి కాలుదువ్వడు..సామ,దాన,భేదోపాయాలు ప్రయోగిస్తాడు.తప్పని సరి పరిస్థితుల్లో దండించడానికి సిద్ధపడతాడు…హీరోని తక్కువ అంచనా వేసిన ప్రతినాయకుడు.పరాభవించబడతాడు..సందేహమూ అనుమానమూ ఎవడ్నైనా భయపెడతాయని హీరోకి అర్ధమవుతుంది.దాంతో హీరో రెట్టించిన ఉత్సాహంతో ఉంటాడు.ప్రతినాయకుడు నియంత్రణ కోలోతున్నానని అర్ధంకాగానే….తనని కథలో మొదట పరిచయం చేయటానికి కారణం ఏమిటో తెలియజేయటానికి సిద్ధమవుతాడు..ఇక యుద్ధమే…

ఇక్కడ మూడురకాల స్థాయీ బేధాలుంటాయి…విలన్ కన్న ఉన్నత స్థాయిలో ఉండే హీరో(the godfather).విలన్ కన్నా తక్కువ స్థితిలో ఉండే హీరో(shiva)…ఇద్దరు హీరోలు అటూఇటూగా సమంగా వున్న స్థితి(crimson tide)…ఇద్దరు హీరోలూ సమంగా వుండి శతృవులు లేదా మితృలయ్యుండీ ఒక విలన్ నేపధ్యంలో ఉండే కథలు(the fugitive).

ఉదా : వేటాడాలి అనుకున్న పులి ముందున్నది ఏనుగా,జింకా అని చూడదు,ఎందుకంటే అది పులి అని దానికి తెలుసు.తన నిర్ణయానికి అడ్డొచ్చింది రౌడినా,రాజకీయనాయకుడా అని పట్టించుకోడు కాబట్టే వాడు హీరో…ముందు వెనుక అలోచించకుండా వెళ్లి j.d. ని కొడతాడు..పోలీస్ సపోర్ట్ అమల అన్న రూపంలో తెలివిగా పరిచయం చేయటం జరిగింది.ఒదిన వ్యతిరేకత..అమల సహకారం….భవానీ విశ్వనాధాన్ని(గొల్లపూడి) హత్యచేస్తూ కనపడతాడు…మాచిరాజు మాటల్లో పరిచయం అవుతాడు…గట్టు దాటిన నీరు,పట్టు తప్పిన ఆవేశం ఒకటే…హద్దులు దాటాక వాటిని ఆపలేం.. శివ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవటం దాని ప్రభావమే.భవానీ తరపు అని ఇతరులు అనుకునే స్థాయి నుంచి,తన బలహీనతని భవాని చెప్పుకునే స్థాయికి j.D పడిపోతాడు..కథని నియంత్రించే ప్రతినాయకుడికి అతని పరిధిని తెలియజేసే హెచ్చరిక ఇది.భవానీ రాజీ ప్రయత్నం…గణేష్ రాయభారం….ఎవరెస్ట్ ఎత్తులు తాకుతున్న శివ ఆత్మవిశ్వాసం(ఇక్కడ శుభలేక గణేష్ చేతికి కత్తి ఇస్తాడు,అప్పుడు గణేష్ కళ్లలో క్రౌర్యం చూడండి)….భవానీ భయానక పరిచయం…..అతనిలో స్పష్టంగా శివపై కనిపిస్తున్న అసహనం,కళ్లలో దాగిన అధికార దర్పం….వేచి చూసే ఓర్పు…భవాని వృత్తినిపుణుడు(ప్రొఫెషనల్) అని తెలియజేస్తాయి…రాబోయే ఉపద్రవాన్ని ముందే సూచిస్తాయి.రాబోయేది కథలో అత్యంత కీలకమైన సందర్భం….

5.బాణ చక్రం : హీరోని అభిమానించే ప్రేక్షకులు అతను బాధ పడుతుండగా చూడాలనుకుంటారు…ఎవడైనా ఎదుగుతుంటే మనలో మనకే తెలియని ఈర్ష్య,అసూయ.ద్వేషాలు కలుగుతాయి..ఎదిగేవాడి కష్టాన్ని కళ్లతో చూసే అవకాశం మనకి వాస్తవ జీవితం ఇవ్వదు…వాస్తవ జీవితం నీకందకుండా అగాధాల్లో దాచే ఎన్నో సత్యాల్ని తెలుసుకునే అవకాశం కల్పిత కథ నీకు కలుగిస్తుంది. (వాస్తవ జీవితంలో ఎవరైనా ఎదగటానికి పడే కష్టం కనీసం వారి భార్య/భర్త కూడా పూర్తిగా అర్ధం చేసుకోలేరు,(శరీరాన్ని చీల్చే గాయాలు కాదు, మనసుని చిధ్రం చేసే సమ్మెట దెబ్బలు)….వాడు అంతెత్తు నుండి పడాలి,పడితే మనం చూడాలి అని మనస్ఫూరిగా కోరుకుంటాం…నిజ జీవితంలో నిజంగా ఎవడైనా నష్టపోతే మనకి బాధ కలుగుతుంది..ఐనా సరే కింద పడ్డాక జాలి ప్రదర్శించాలి అనుకుంటాం గాని…ప్రస్తుతం ఐతే వాడు పడాలి అని కోరుకుంటాం…ఈ పైశాచిక ఆనందాన్ని తీర్చుకునే అవకాశం మనకి ఈ సందర్భం కలుగుజేస్తుంది.మనల్ని చివరి వరకు కుర్చీల్లోంచి లేవనీయకుండా చేసే సందర్భం కథ మధ్యలో ఏదైనా ఉంటుందా అంటే నిస్సందేహంగా అది ఇదే….హీరో పై నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముజేయటం వల్ల నీకిక్కడ చికాకు కలగాలి,కానీ సంతృప్తి కలుగుతుంది…..ఏంటి కారణం…కథలోతుల్లో దాగిన వ్యతిరేక శక్తి యొక్క సామర్ధ్యం మనం చూడాలి….హీరో ఇంకా బలవంతుడవ్వాలంటే ఎన్నో దెబ్బలు తినాలి తప్పదు మరి….అన్నిటికీ మించి మన పైశాచిక ఆనందం సంతృప్తి చెంది..భావశుద్ధి(Catharsis) జరగాలి…మనసు శుద్ధికాగానే ప్రశాంతత కలుగుతుంది…దీని ముందున్న సన్నివేశం వరకూ హీరో తనని తాను నిజంగా హీరోలా భావించుకుంటాడు.
అహం కలిగివుంటాడు….మనల్ని ఎదుర్కోనే శక్తి అవతలి వర్గానికి లేదులే అనుకుంటాడు…..అహం మనకి నచ్చదు కాబట్టి మనం బాలన్స్(సమతూకం) కోరతాం.

హీరో ఎంత హీరో ఐనా మాములు మనిషే అని నిరూపించే సన్నివేశం ఇది……..ఈ సన్నివేశం కనుక ఈ సమయంలో రాకుండా ఇంకెక్కడో వస్తే మన గొయ్యి మనం తవ్వుకుని మనల్ని మనం దాన్లో పూడ్చుకున్నట్టే…జురాసిక్ పార్క్ లో T-rex రాకాసి బల్లి దాడి చేసేది ఇక్కడే….
ఉదా: సాయిచంద్ హెచ్చరిక్,శివలో అదే కాన్ఫిడెన్స్….ఫ్రెండ్ చెల్లి పెల్లి…భవానికి అంది వచ్చిన అవకాశం… స్నేహితులు అక్కడ…శివ ఇక్కడ వున్నారని తెలియగానే

భవానీలో కనిపించే వేగిరపాటు(సమయాన్ని బట్టి స్పందించే గుణం ప్రొఫెషనల్స్ కి మాత్రమే ఉంటుంది)….జరగబోయే ఉపద్రవం పట్ల ఆసక్తిని రెట్టింపు చేస్తాయి.ఇక్కడ శివ పై దాడి….తప్పించుకోగానే…అక్కడ శుభలేక సుధాకర్ కి అవే చివరి క్షణాలు…అని అతనికి మనకి తెలీదు…సినిమాలో ఇప్పటి వరకూ మనం ఇష్టపడే పాత్రల్లో ఇది ఒకటి…..ఈ సన్నివేశం తెలుగు సినిమా చరిత్రలో ఉన్నతమైన వాటిలో ప్రధానమైనది….నిర్మలమ్మ శోకం…శివ పశ్చాత్తాపం….ఇంట్లో సమస్య. బయట సమస్య….ఇక మిగిలింది హీరో ప్రతిస్పందన.

6.ఋతు చక్రం : మన కథానాయకుడు దెబ్బతిని వున్నాడు….కానీ వెన్ను చూపడు….సాధారణ మనిషేగా ఇలాంటివి ఓర్చుకోవాలి అనుకోగలమా?పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఆర్ట్ సినిమా నాయకులు లొంగిపోతారేమోగానీ కమర్షియల్ కథానాయకుడు పరిస్థితిని తనకి అనుకూలంగా మార్చుకుంటాడు..పడిన ప్రతిసారి లేవాలి…ఓడిన ప్రతిసారి పాఠం నేర్చుకోవాలి….తనకి తలలు వంచమని…ప్రకృతి చెప్పదు…శాసించే వాడికోసం ఎదురుచూస్తువుంటుంది.నాయకుడు ఇప్పుడేగా దెబ్బతిన్నాడు కాసేపాగి కొడదాంలే అని ప్రతినాయకుడు అనుకోడు…కత్తి దెబ్బ తప్పితే కాటా దెబ్బ వెయ్యడానికి సిద్ధంగా ఉంటాడు..నాయకుడ్ని బలహీనుడ్ని చేయటమే ప్రతినాయకుడి పని….ఇక్కడ అవకాశం కోసం చూసే అవసరం అతనికి లేదు…అతనిప్పుడు కథని తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు.. అయినప్పటికి అనుభవఙ్ఞుడు,నిపుణుడు కావటం వల్ల అలసత్వం ప్రదర్శించడు…ఉపేక్షించడు……

అలా అని హీరో కూడా ఇప్పుడు నిర్లక్ష్యంగా లేడు….ఎదురుదెబ్బని కాచుకోడానికి సిద్ధంగా ఉంటాడు….దెబ్బతీయటమో,ఎదురు దెబ్బని ఎదుర్కోవటమో హీరో కూడా ఇక్కడ తన నైపుణ్యాన్ని,జాగ్రత్తని ప్రదర్శిస్తాడు..ప్రతినాయకుడి
అలోచనని పసిగట్టి అతనికి నక్షత్రాలు చూపించడానికి సిద్ధంగా ఉంటాడు….హీరో ఇక్కడ కొట్టే దెబ్బ విలన్ కి ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఇవ్వదు…విలన్ కి ఇంతకు ముందు దాకా కాస్తో కూస్తో తక్కువగా తూగిన హీరో ఇక్కడితో విలన్ కి సరైన సమఉజ్జీ అవుతాడు..ఇక్కడ కథ సమస్థితిలో(బాలన్స్) పడటం వల్ల అమాంతంగా అంచనాలు పెరిగిపోతాయి…తర్వాత జరగబోయే యుద్ధానికి ఇద్దరూ సన్నద్ధమవుతారు…..
ఉదా: ఇల్లొదిలి ఒచ్చేస్తాడు….ఇప్పుడు భవానితో పూర్తిస్థాయి పోరాటానికి రఢీ….మాముళ్ల వ్యవహారానికి తెర దించుతాడు…యజమానులు భవానీని ఆశ్రయిస్తారు….గణేష్ అరెస్ట్ వారెంట్….శివపై మరోసారి భవాని హత్యా ప్రయత్నం చేస్తాడు…..లైట్స్ ఆర్పుతారు…రాడ్స్ తీస్తారు….వర్షం పడుతుంది…భవానీ ఇంటికెళ్లి అతన్ని హెచ్చరించి మరీ అతని గుండెల్లో నిద్రపోతాడు….శివ. కథానాయకుడు…..మరి.

_________________________ విరామం __________________________

రెండవ అంకం act – II : (ద్వితీయార్ధం) (ఋషి,వసు,బ్రహ్మ చక్రములు)
7.ఋషి చక్రం : పెరిగిన పోటీ వాతావరణం…హీరో సవ్యమార్గం..అతన్ని భాదితులకి,పీడితులకి,శ్రామికులకి దగ్గర చేస్తుంది…అతడి బాధ్యతలు పెంచుతుంది.
సమాజానికి మరో సమాంతర శక్తి పరిచయం అవుతుంది….అతనికంటూ ఓ సామ్రాజ్యం ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి ఇలాంటి వాతావరణం నిపుణుల్ని కూడా కలవరపెడుతుంది…కాల మహిమ…ఇక హీరోని ఏమీ చేయలేని ప్రతినాయకుడు…అతన్ని బలహీనుడ్ని చేయటానికి తనలో దాగివున్న చీకటి శక్తుల్ని బయటకి ఒదులుతాడు….తనెంత అధమాధముడో నిరూపించుకొనే ప్రయత్నం చేస్తాడు….ఐతే ఇతని ప్రయత్నాలన్ని అతన్ని పూర్వస్థితిని తిరిగి పొందడంకోసం చేస్తాడు కాబట్టి సమస్యని అధిగమించడంలో అతని కోణం అర్ధం అవుతుంది….ఇక ఇద్దరూ ప్రాణాలపై ఆశ ఒదులుకోవడమే తప్ప ఇక వేరే దారి లేదు…ఇక్కడ హీరో మరీ బలహీనుడు…ఎందుకంటే అతను సత్యాన్ని నమ్మి ఉన్నాడు…ఏ పని పడితే ఆ పని చేయలేడు…అలా అని ఏమీ చేయకుండా ఉండలేడు…ధైర్యం,తెలివితేటలే అతని పెట్టుబడి…తననే నమ్ముకుని ఉన్నవాడు.కానీ అతన్ని నమ్ముకున్న వారికిన్ని శక్తి సామర్ధ్యాలుండవుగా….ఇక్కడ విలన్ దృష్టి అసంకల్పితంగా పడుతుంది…మరి హీరోకి బంధం విలువలు తెలుసు….విలన్ వాటిని గుర్తించడు…అతను పొందాలనుకున్నదాని కోసం అతను ఏదైనా చేస్తాడు.ఎంత దూరమైన వెళతాడు.
ఉదా:.శివ సామ్రాజ్యం ఏర్పాటుకి బీజం పడింది.సారా షాప్స్ మూయబడతాయి…..యూనియన్స్ అండ…యజమానులు భవానీపై నమ్మకం కోల్పోవడం….అతన్ని బలహీనుడ్ని చేస్తాయనే అసహనం….అతనికి నానాతో రాజనీతి చెప్పించుకునే స్థాయికి పడదోస్తాయి….శివని ఇప్పుడతను ఏమీ చేయలేడు….కాబట్టి అమలని అపహరించి ఒత్తిడి పెంచాలని చూస్తాడు….శివకి అబిమానులున్నారు..ఇప్పుడు సిటీ అంతటా నెట్’వర్క్ ఉంది..క్షణాల్లో సమాచారం అందుతుంది…సో….అధికారికి తన అధికారం ప్రయోగించడం పెద్ద పని కాదు…అమలతో పెళ్లి….ఇక్కడికి గంటా ముప్ఫై తొమ్మిది నిమిషాలు.

8.వసు చక్రం : ఇప్పుడు రాజ్యం ఏర్పాటయింది….ఉన్నది ఒకే రాజ్యం…దాన్లో ఇద్దరు రాజులు ఉండలేరు కదా…..ఇప్పుడు రాజెవరనేది కూడా స్పష్టమైపోయింది….రాజ్యం ఏర్పడిందంటేనే సర్వ సంపదలూ అతని పరమైపోయాయనే అర్ధం.కథానాయకుడ్ని ఇంకెవరయినా గుర్తించకుండావున్న వారు ఉంటే వారు కూడా గుర్తిస్తారు…ఇప్పుడు ఆధిపత్యమూ,రాజ్యమూ కోల్పోయిన ప్రతినాయకుడు ప్రతిస్పందించడానికి పరిస్థితులు అనుకూలం కాదు,ఎంత ప్రతినాయకుడైనా అతనూ మనిషే అని నిరూపించే సన్నివేశం ఇది …అచేతనుడైపోయిన అతడ్ని తిరిగి చైతన్యవంతం చేయాలి….సంఘర్షణలేనిదే కథ ముందుకు నడవదు….అందుకే ప్రతినాయకుడిపై ఒత్తిడి పెరగాలి…అతన్ని ఎంత ఒత్తిడికి గురిచేస్తే అతని ప్రతిస్పందన అంత వేగంగానూ,బలంగానూ ఉంటుంది….అతనిలో చలనం కలగాలంటే అతని అధికారాన్ని మరింత లోతులకెళ్లి ప్రశ్నించాలి.

ఉదా: స్టూడెంట్ యూనియన్స్ శివతో చేరిపోతారు….భవాని భయం నెమ్మదించడంతో సిటీ ప్రశాంతంగా ఉంటుంది…శివకి వెసులుబాటు చిక్కి…
కుటుంబంతో గడుపుతాడు…రాజ్యం పోయి…అధికారాన్ని కోల్పోయినవాడికి….తనని తాను నిరూపించుకోవల్సిన అవసరం ఏర్పడుతుంది…దీనికి తోడు…

నేపధ్యంలో నేర చరిత్రకూడా ఉంటే…..కంటి మీద కునుకే ఉండదు….ప్రతినాయకుడికి రాజకీయాల ఆండ ఆశించనక్కర్లేకుండా ఉంటుంది…లేని అధికారం ఉందని ఊహించుకునే రాజకీయనాయకులు దాన్ని నిరూపించడానికి అధారపడేది రౌడిల మీదనే కదా…….బలహీనులకి అండగా వున్న శివని మాచిరాజు ప్రత్యర్ధి ఆశ్రయిస్తాడు.మాచిరాజు తెరమీదికి వస్తాడు..భవానీకి హెచ్చరిక వెళ్తుంది…

9.బ్రహ్మ చక్రం : ఒత్తిడిలో వున్నది ప్రతినాయకుడు..అధికారాన్ని కోల్పోయిన వాడు, దాన్ని తిరిగిపొందడానికి చేసే ప్రయత్నాలు ఊహించలేము…అవి భయానకంగా ఉంటాయి.ఇక్కడ తనని తాను నిరూపించుకోవలసింది ప్రతినాయకుడు…..ఇక్కడ నుండీ అతను నిద్రపోడు…హీరోని నిద్రపోనివ్వడు..ఇక్కడ నుండీ అతనిదే కథ….కానీ కథానాయకుడు మహాశక్తివంతుడైపోయాడు…ఇప్పుడుతడు సర్వఙ్ఞుడు….ఇక అతన్ని దెబ్బతీయడం దాదాపు అసాధ్యం ….కానీ అతన్ని దెబ్బ తియ్యకపోతే ప్రతినాయకుడికి ఇప్పుడు రాజ్యాధికారమే కాదు….బ్రతుకు మీద ఆశ కూడా ఉండదు…తనని బలపర్చే బలమైన శక్తులు కూడా అతనికి దూరమవుతాయి.కాల మహిమ వల్ల ఎంత ఉన్నత స్థానంలో వున్న నాయకుడైనా తన స్థాన్నాన్ని కోల్పోతాడు.బలహీనుడవుతాడు.

ఉదా: భవానీ బలహీనత బ్రహ్మజీ శివని ఆశ్రయించేలా చేస్తుంది….భవానీపై ఒత్తిడి చివరి స్థితికి చేరే సంఘటన ఇది……గణేష్ ఆచూకి కోసం వెళ్లిన చిన్నా హత్య…….శివకి గట్టి దెబ్బ…ఐతే చిన్న ఇచ్చిన గణేష్ ఆచూకీతో అతన్ని పోలీస్ లకి అప్పగిస్తాడు…గణేష్ ని తనే భవానీ నుండీ రక్షిస్తాడు…మాచిరాజుకి శివ బలం అర్ధమవుతుంది….అవసరం ఎక్కడుంటే రాజకీయం అక్కడికి చేరుతుంది.శివ మాచిరాజుని మందలిస్తాడు…ఇక భవాని శివ అన్న కూతుర్ని అపహరిస్తాడు.ఇది హీరో ఊహించని పరిణామం.

*** ఈ సన్నివేశం జురాసిక్ పార్క్ లో పిల్లలు రాప్టర్ దాడి నుండి తప్పించుకొని గ్రాంట్ & సాట్లర్ లను కలుసుకోగానే ఒక్కసారిగా అవి వీరి మీద దాడి చేస్తే వారు అందరూ (కంప్యూటర్) కంట్రోల్ రూంలోకి పారిపోయి తలుపు వేసుకుంటారు, టెర్మినేటర్ 2 లో స్టీల్ ప్లాంట్ లో ప్రవేశించగానే t-1000 ని చంపినా కూడా మళ్లీ తిరిగి బ్రతుకుతాడు….దాంతో సారాని,కానర్ ని తీసుకుని ప్లాంట్ లోకి పారిపోతాడు…..

మూడవ అంకం act – III : (దిశి, రుద్ర, ఆదిత్య చక్రములు)
ఈ అంకం కథనం అత్యంత తక్కువ కాలాన్ని వినియోగించుకుంటుంది…వీలైనంత వరకూ ఈ చివరి అంకాన్ని ఎంత క్లుప్తంగా ముగిస్తే అంత మంచిది.
10:దిశి చక్రం : ఇక్కడ పోరాటం తప్పని పరిస్థితిలో హీరో అన్ని విధాలుగానూ బలహీనుడవుతాడు..భౌతికంగానూ,మానసికంగానూ హీరో దెబ్బతింటాడు.

దిక్కుతోచని స్థితిలో వున్న హీరోకి ఓ అవకాశం దొరుకుతుంది…ఇక్కడ అతనికి రెండు అవకాశాలుంటాయి, ఈ రెండిటిలో ఒకదాన్ని మాత్రమే ఎంపికచేసుకొనే అవకాశం ఉంటుంది…ఇవి రెండూ సాధారణంగా ఇలా ఉండే అవకాశం ఉంది…
1.ఖచ్చితంగా కావల్సిన రెండిటిలో ఒక దాన్నిమాత్రమే ఎంచుకునే అవకాశం ఉండటం ;
2.ప్రమాదకరమైనవైన రెండిటిలో ఒకదాన్ని ఖచ్చితంగా స్వీకరించాల్సి రావటం .

ఇది అతని నైతిక విలువలకి పరీక్ష….ఇలాంటి ఎంపిక చేసుకోవల్సి వచ్చినప్పుడు మనిషిగా అతను సర్వం కోల్పోయినట్టుగా భావిస్తాడు..ఐతే చాలా సందర్భాల్లో కథల్లో ముగింపు సానుకూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి హీరో ఆందోళన పడతాడు తప్ప పెద్దగా నష్టపోడు…ఇది నాటకీయతలో ఉచ్ఛస్థితిని పొందే సందర్భం.ఇక్కడ అతను తీసుకునే నిర్ణయమే ఈ సందర్భాన్ని ఇప్పుడు చూసిన సందర్భాలన్నిటిలోకి మేలైనదిగా భావించేలా చేస్తుంది.

ఉదా: శివలో పాపని అపహరించి గణేష్ ని అప్పగిస్తే పాపని ఇవ్వడం అనే రాజీ బేరం పెట్టాలి…ఈ సినిమాలో నాటకీయత పాళ్లు ఈ ఒక్క సందర్భంలో పూర్తిగా తగ్గించేశారు…ఈ ప్రపోజల్ వచ్చేసరికే గణేష్ కోర్ట్ లో అప్పగించబడతాడు…భవాని పాపని చంపేస్తాడు…
స్పైడర్ మాన్ సినిమా లో విలన్, హీరో ప్ర్రాణంగా ప్రేమించే హీరోయిన్ ని,సిటీలో కొంతమందిని అపహరించి చెరో వైపు వేలాడదీస్తాడు.తను ప్ర్రాణంగా ప్రేమించే అమ్మాయా? లేక ప్రాణంకన్నా ఎక్కువగా భావించే బాధ్యతా? రెండూ కావాలి…ఒక్కటే ఎంచుకోవాలి….ఇక్కడ హీరోకి ఒక్కరిని మాత్రమే రక్షించుకునే అవకాశం ఉంది…ఇప్పుడు ఎవరిని రక్షిస్తాడు లేదా రక్షించడానికి ప్రయత్నిస్తాడు అనే చర్య మీద అతని నైతికత అధారపడివుంటుంది..ఈ సన్నివేశం అతను నాయకుడా కాడా అనే విషయాన్ని తేల్చేస్తుంది…..అసలు ఈ సన్నివేశం ప్రధాన ఉద్దేశ్యమే కథానాయకుడ్ని ఉన్నతమైన మానవుడిగా నిరూపించడం…స్పైడర్ మాన్ లో హీరో తన ప్రేయసికి ధైర్యం చెప్పి, ఊరిప్రజలను రక్షిస్తాడు….తర్వాత ప్రేయసిని కాపాడుకుంటాడు.

ఇక్కడే అతని త్యాగగుణం బయటపడేది….ఇప్పటి వరకూ హీరో చేసే పనులు ఎవరికోసం? దానిలో త్యాగం ఉందా?స్వార్ధం ఉందా?? అతను హీరోనా? మనలాంటి సాధారణ మానవుడా??? ఇదే ఇక్కడ అర్ధం అవ్వాలి….ఈ ప్రశ్నకి సరైన సమాధానం దొరకాలి…..ఇప్పుడు అతను ఉన్నత మానవుడవుతాడు..ఉన్నతమైన మానవులు నిస్వార్ధ భావంతో ఉంటారు…స్వార్ధంతో ప్రయాణం మొదలుపెట్టినప్పటికీ…..సమాజం కోసం,తనని నమ్ముకున్న వారి కోసం,తన సిద్ధాంతాల కోసం,ప్రజల్లో చైతన్యం నింపటం కోసం ఇక్కడ ప్రాణాలైనా ఇచ్చేస్తాడు….బ్రేవ్’హార్ట్…ఈ సన్నివేశమే సినిమాకి ఓ అర్ధాన్ని తీసుకొచ్చేది…ఇది లేకపోతే అది ఆత్మలేని శరీరమే అవుతుంది…ఇక్కడ మొత్తానికి హీరోకి భారీ నష్టం జరుగుతుంది….మనకి అతని గొప్పతనం తెలుస్తుంది.అతని కీర్తి అన్ని దిక్కులకి వ్యాపిస్తుంది.

11.రుద్ర చక్రం : ఈ సన్నివేశంలో తన గురించి తను తెలుసుకున్న హీరో రౌద్రరూపం దాల్చి,విలన్ ని అంతం చేయటంతో సమస్య ముగుస్తుంది.బహిర్గత సంఘర్షణకి పరిష్కారం లభించింది.
ఉదా: శివలో పాప శవం పార్శిల్ రాగానే హీరో…సర్వం కోల్పోయినట్టుగా భావిస్తాడు….భవానీ మాచిరాజుని చంపుతాడు..శివ భవానీని అంతం చేయటంతో సమస్య పరిష్కారం అవుతుంది.

12.ఆదిత్య చక్రం : సమస్య ముగిసింది…..జీవితంలో తాను సాధించాలనుకున్నది సాధించాడు…ఇక మిగిలింది తన అంతరంగిక సమస్య(బలహీనత)…పైదానితోనే ఇది ముడి పడి ఉంటుంది…ఐతే…దీని ప్రత్యేకత దీనిదే…..
ఉదా : ఇక్కడి వరకూ శివ సినిమా లేదు…అమలని చేరుకోవటంతో అయిపోతుంది.

టెర్మినేటర్ 2 సినిమాలో….కథానాయకుడు ఓ యంత్రం, కానర్ చిన్నపిల్లవాడు.ఆ పిల్లవాడు కళ్లవెంట నీళ్లు పెట్టుకుంటుంటే, మీ మనుషులకి కళ్లలో నీళ్లు ఎందుకు తిరుగుతాయి అంటాడు …మంటల్లో మునిగిపోతూ అవే తనకి ఆఖరి క్షణాలని అర్ధమైన ఆ యంత్రం చివరికి ఆ కుర్రాడితో అంటుంది…మనుషులెందుకు కళ్ల నీళ్లు పెట్టుకుంటారో నాకిప్పుడు అర్ధమైంది అంటాడు…….అవును..కనీసం యంత్రాలు మనిషిని అర్ధం చేసుకునే రోజు వచ్చినప్పుడైనా మనిషి సాటి మనిషిని అర్ధం చేసుకుంటాడేమో…

చివరి సందర్భం వచ్చే సరికి వివిధ స్థాయిల్లో భావశుద్ధి(Catharsis) జరిగి ప్రేక్షకుడు ప్రశాంతతని అనుభవిస్తాడు…కథని ఒదిలి వెళ్తూ దానికి వీడుకోలు చెప్తుంటే….దానితో నువ్వు కొంతకాలం గడిపావని తెలిసొస్తుంది…మంచి మితృడికి వీడుకోలు చెప్పేటప్పుడు కళ్లలో అసంకల్పితంగా నీళ్లు తిరుగుతాయి…..ఈ మితృడ్ని డబ్బిస్తే మళ్లీ కలుసుకోవచ్చు…..కానీ….అతనిచ్చిన అనుభవాన్ని డబ్బుతో మాత్రం వెలకట్టలేం….
అందుకే..
అమూల్యమైన అభిమానంతో మళ్లీ మళ్లీ టికెట్ కొంటాం.

లోతైన దృష్టి లేని మనిషి తన బలహీనతలు,బలాలకి అనుకూలంగా ఈ ప్రపంచాన్ని చూస్తూ చివరికి ఓ అభిప్రాయాన్నో,సిద్ధాంతాన్నోఆశ్రయిస్తాడు….అర్ధం పర్ధం లేకుండా దాన్నే నిజం చేయాలని వృధా ప్రయత్నం చేస్తాడు.ఇతరులకీ,తనకీ విలువైనదైన కాలాన్ని చర్చలతో,వాదనలతో వృధా చేస్తాడు.వాస్తవిక దృక్పధంతో కాక,ద్వంద్వ(వేరు) భావంతో చేసే చర్చలకి,వాదనలకి ఫలితాలు రావు…..స్వయంగా మనకి మనం నేర్చుకుని…స్వీయ – అనుభవంతో తెలుసుకుని…ఆ పద్ధతుల్ని ఆచరించడానికి ప్రయత్నించినప్పుడు ఫలితాలు వస్తాయి…కనీసం శ్రమైనా గుర్తించబడుతుంది.విద్య సమాచారాన్ని ఇస్తుంది..ఆచరణలో పెడితే అది ఙ్ఞానంగా మారుతుంది…..సమాచార సేకరణతో ఆగిపోతే గుమస్తాగా పదవీ విరమణ చేయాల్సివస్తుంది…ఙ్ఞానాన్ని ఈ ప్రపంచం గుర్తిస్తుంది….అభిమానిస్తుంది
ఔత్సాహికులైన దర్శకులకి,రచయితలకి ఉపయోగకరమని భావిస్తూ .

మూల్పూరి.ఆదిత్య చౌదరి
(ఔత్సాహిక దర్శకుడు.)
greenlong2498@gmail.com

15 Comments
  1. Chakri September 17, 2010 /
  2. wb September 18, 2010 /
  3. Srinivas September 18, 2010 /
  4. gandhi September 19, 2010 /
  5. శshiపాle రెddy September 19, 2010 /
  6. Satyam September 19, 2010 /
  7. Balaji Sanala September 21, 2010 /
  8. vamshichandspunnam October 25, 2010 /