Menu

పూజాఫలము

పగటి పూట వెన్నెల – ఒక అందమైన అబద్ధం.

“కళను వ్యాపార దృష్టితో చూడకూడదు. కళాకారునికి సమాజం పట్ల గురుతరమైన బాధ్యత ఉంది. అవాంచనీయ సన్నివేశాల ద్వారా ప్రేక్షకులలోని నీచాభిరుచులని రెచ్చకొట్టకూడదు. ఉత్తమ వులువలని ప్రతిబింబించే కళాత్మక చిత్రాలనే నిర్మించాలి” అనే సత్సంకల్పంతో సినీరంగ ప్రవేశం చేసిన బి.ఎన్.రెడ్డి తెలుగు సినీరంగంలో ఓ చరిత్ర. ఆయన తీసింది పదకొండు సినిమాలే అయినా అందులో ఒక్కొక్కటి ఒక్కో కళాఖండం. ఆయన తీసిన చిత్రాల్లో అందరికీ నచ్చిన చిత్రాలు కొన్నయితే, అందరికీ నచ్చినా బి.ఎన్. కి మాత్రం అంతగా నచ్చనవీ కొన్ని ఉన్నాయి. అయితే చాలామందికి పెద్దగా నచ్చక, బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందినా, బి.ఎన్.రెడ్డి కి మాత్రం అమితంగా నచ్చిన చిత్రం ’పూజా ఫలము ’. మునిపల్లె రాజు వ్రాసిన ’పూజారి ’ ఈ సినిమాకు ఆధారం.

ఈ సినిమాలో హీరో మధు. ధనవంతుల బిడ్డ. చాలా మంచివాడు. చిన్ననాడే తల్లీ దండ్రులను కోల్పోయి తాతగారి దగ్గర ఒంటరిగా పెరిగాడు. చాలా సున్నిత మనస్కుడు. మనసు నిండా అందరిలానే కోరికలుంటాయి. కానీ, ధైర్యం చేసి వాటిని బయటపెట్టలేడు. మధుకి సంగీతం మీద ప్రేమ. నిత్యం వాయులీనం మీద సాధన చేస్తూ, సంగీత జగతిలో విహరిస్తూ ఉంటాడు. ఇలాంటి మధు జీవితంలోకి ముగ్గురు అమ్మాయిలు చేరతారు. ఒకరేమో తను ప్రేమించిన అమ్మాయి. మరొకరు తను ప్రేమిమ్చిన అమ్మాయి. మూడో ఆమె తన డబ్బును ప్రేమించిన అమ్మాయి. ముగ్గురూ అతన్ని మూడు విధాలుగా మారుస్తారు. అతని మనసుతో ఎడాపెడా ఆడుకుంటారు. మధు జీవితాన్ని అల్లకల్లోలం చేస్తారు. అలా మధు జీవితంలోకి ప్రవేశించిన మొదటి యువతి వాసంతి.

pooja1

మధు ఇంట్లోకి అద్దెకొచ్చిన బ్యాంక్ ఏజెంట్ గారి అమ్మాయి వాసంతి. ఎంతో చలాకీగా కలుపుగోలుగా ఉండే వాసంతి కొద్ది పాటి పరిచయంలోనే మధు జీవితంలోని వెలితిని పోగొడుతుంది. మసక చీకట్లలో మరుగునపడిపోయిన అతని జీవితంలో కోటి చంద్రుల వెన్నెలలు కురిపిస్తుంది. అతనితో కలిసి ఆడుతుంది, పాడుతుంది. కానీ తన ఒంటరి జీవితంలోకి ’పగలే వెన్నెల’ అని ఆడుతూ పాడుతూ అడుగుపెట్టిన వాసంతి చేరిక ప్రేమ కానక్కర్లేదనీ, ఒక వేళ ప్రేమ అయినా- అది ’ప్రేయసి’ కనబరిచే ప్రేమ కాదని, ఒక సోదరి కనబరిచే ప్రేమ అయ్యుండొచ్చనీ గ్రహించలేకపోతాడు మధు. కానీ వచ్చినంత వేగంగానే చెప్పాపెట్టకుండా అతని జీవితంలోనుంచే కాదు, ఆ ఊరి నుంచి కూడా మాయమవుతుంది వాసంతి.

వాసంతి వెళ్లిపోయాక కథ వివిధ మలుపులు తిరుగుతుంది. మధు దివాణంలోనే పనిచేసే గుమాస్తా కూతురు సీత, అతని చీకటి జీవితంలో దీపం వెలిగిస్తుంది. ఇద్దరి మధ్యా పరిచయం ఏర్పడినా, వారిద్దరి మధ్యా ఎటువంటి ప్రత్యక్షమైన సయోధ్య ఉండదు. ఇద్దరూ తమ మనసులోని భావాలను లోపలే దాచుకుంటాదు. ఇటువంటి సమయంలో మధు జీవితంలోకి ప్రవేశిస్తుంది విలాసిని నీల నాగిని. మగవారిని మెప్పించి, రెచ్చగొట్టి అవసరాన్ని తీర్చి డబ్బు చేసుకోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. మధు నీలనాగినే తన ఆరాధ్య సుందరిగా భ్రమిస్తాడు. కానీ కొద్ది రోజుల్లోనే, ఆమె ఉనికికి కారణం -అతని బలహీనత కానీ, ఆమె బలం కాదనీ, నీల తననుకుంటున్న ఆడది కాదని, ఆమెకు నీడ మాత్రమేనని తెలుసుకుంటాడు. నీలవేని ని తన జీవితంలోనుంచి పంపించేశాక మళ్లీ నిర్వేదానికి లోనవుతాడు. మరో సారి సీత అతన్ని అక్కున చేర్చుకుంటుంది. ఇదే సమయంలో వాసంతి కనిపిస్తుంది. ఆమె తనలో మరణించిన తన సోదరున్ని చూసుకుంటోందని తెలిసి నిరుత్తురవుతాడు. అపార్థాలు తొలిగి సీత, మధు ఒక్కటవడంతో కథ సుఖాంతమవుతుంది.

*****

ఈ సినిమాలోని కీలక సన్నివేశాలన్నింటిలోనూ ’పగలే వెన్నెల’ పాట చాలా ప్రాముఖ్యం వహిస్తుంది. వాసంతి వదిలివెళ్లిపోయినా ఆమె జ్ఞాపకాలు మాత్రం మధుని వదిలి వెళ్లవు. ముఖ్యంగా ఆమె పాడిన పాట అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. దర్శకుడు బి.ఎన్.రెడ్డి ఈ పాటను సినిమా లో చాలా కీలకమైన సన్నివేశాలకు నేపధ్యంగా ఈ పాటను ఉపయోగిస్తారు.

వాసంతి తో పరిచయం అయ్యాక కాలేజిలో చదువుల కోసం పట్టణానికి వస్తాడు మధు. అక్కడ హాస్టల్ లో తన ఆప్త మిత్రుడితో వాసంతి గురించి చెప్తాడు మధు. త్వరలో తన ఊరికి వెళ్లి వాసంతికి తన ప్రేమ గురించి చెప్పాలనుకుంటున్నానని చెప్పే సన్నివేశంలో మధు వయోలిన్ పై ’పగలే వెన్నెల’ పాటన మోగిస్తాడు.

’పగటి పూట వెన్నెల’ ఎంత అబద్ధమో, తను వెతుక్కుంటున్న కలల ప్రేయసి గా వాసంతి ని ఊహించుకోవడం కూడా అంతే అబద్ధమని అప్పుడు గ్రహించలేకపోతాడు మధు.

ఇటాలో కాల్వినో అనే ప్రముఖ రచయిత ఒక దగ్గర రాస్తారు.

Nobody looks at the moon in the afternoon,
and this is the moment
when it would most require our attention,
since its existence is still in doubt.

ఆ విధంగానే వాసంతి ఒక అందమైన అబద్ధంగా మిగిలిపోతుంది. తన తాతగారు చనిపోయారని తెలుసుకుని కాలేజి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన మధుకు వాసంతి ఇల్లు వదిలి వెళ్లిపోయిందని తెలుసుకుని చాలా బాధపడతాడు. తన గదిలోకి వెళ్లి ఆమెను తలుచుకుంటూ తన వయోలిన్ పై ’పగలే వెన్నెల’ పాట పాలికిస్తూ వాసంతి ని తలుచుకునే సమయంలో మరో సారి సినిమాలో ఈ పాటను ఉపయోగిస్తాడు దర్శకుడు.

వాసంతి వెళ్లిపోయిన బాధలో మధు ఆరోగ్యం పాడవుతుంది. ఆ సమయంలో అతన్ని సీత కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఒక రోజు రాత్రి మధుకి నిద్ర పట్టని సమయంలో అతని మనశ్శాంతి కోసం సీత వీణ మోగిస్తూ పాట పాడనారంభిస్తుంది. ఆశ్చర్యమేమిటంటే సీత కూడా ’పగలే వెన్నెల’ పాటే పాడుతుంది. ఆ పాట వినగానే మధు కోపంతో ఊగిపోతాడు. తన మనసులో మంటలు రగిలించిన ఆ పాటను పాడొద్దంటాడు.

pooja2

ఆ తర్వాత మధు ఒక యాక్సిడెంట్ కి గురవుతాడు; స్థిమితం కోల్పోతాడు. అతన్ని మామూలు వాడిని చేసే ప్రయత్నంలో మధు కి ఇష్టమైన వయొలిన్ వాయించమంటుంది. ఆ సమయంలో మధు మరో సారి పగలే వెన్నెల వాయించబోతాడు. కానీ స్థిమితంగా వాయించలేకపోతాడు. పాత జ్ఞాపకాలు వాసంతి రూపంలో ఒక్కటొక్కటీ గుర్తుకొస్తుండగా, అప్పటివరకూ అస్తవ్యస్తంగా సాగిన వయోలిన్, క్రమంగా మాధుర్యాన్ని సంతరించుకుంటుంది; ఒక బాణీలో, రాగయుక్తంగా, భావయుక్తంగా మూగుతూ అద్భుతమైన సంగీతాన్ని పలికిస్తుంది. ఆ సన్నివేశాల్లో వయోలిన్ అద్భుతంగా పలికించింది ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు పోరూర్ గోపాల కృష్ణన్. ఈ సన్నివేశాన్ని అద్భుతమైన మోంటాజ్ గా తీర్చిదిద్దారు దర్శకుడు బి.ఎన్.రెడ్డి.

pooja5

సినిమా చివర్లో మధు పరిస్థితి గురించి తెలుసుకున్న వాసంతి, అతన్ని కలుసుకోవడానికి తిరిగి వస్తుంది. ఆ సమయంలో ఆమె ‘పగలే వెన్నెల’ అని పాడుతుండగా, మధు వయోలిన్ పై ఆదే పాటను మోగిస్తాడు. వాసంతి రాకతో తిరిగి మామూలు మనిషవుతాడు మధు.

ఎస్.రాజేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా మొత్తానికీ ఆయువు పట్టులా నిలుస్తుంది ’పగలే వెన్నెల’ పాట. హిందోళ రాగంలో వైభవంగా పాటగా, నేపథ్య సంగీతంగా ఈ పాట సినిమా లో చాలా చోట్ల వస్తూనే ఉంటుంది.

ఈ సినిమా లో హీరో ఆదర్శవాది. ఆదర్శ ప్రేమ కోసం అన్వేశిస్తుంటాడు. తన సంగీతంలో తాదాత్మ్యాన్ని అనుభవిస్తాడు. చక్కగా అమర్చుకొన్న తన జీవితాన్ని మరొకరి ప్రమేయం లేకుండా జీవించే మనిషి. ఒక విధంగా ఇవన్నీ బి.ఎన్.రెడ్డి గారి లక్షణాలు. ఆయన ఎంతో సరళంగా, రమ్యంగా, హృద్యంగా తీర్చిదిన్న మధు పాత్రకు అక్కినేని నాగేశ్వరరావు గారు జీవం పోశారు. ఒకే సినిమాలో కలిసిరాని ప్రేమ, కనుమరుగయిన ప్రేమ, ప్రేమే లేని లంపటం – మూడు వివిధ పరిస్థుతుల్లో ఇరుక్కుని సతమతమయ్యే పాత్ర ఇది. సంగీతం మీద ప్రేమతో, ఎప్పుడూ వయోలిన్ పై సాధన చేస్తూ, సంగీత ప్రపంచంలో మునిగిపోయిన మధు పాత్రలో జీవించారాయన.

pooja4

బి.ఎన్.రెడ్డి కి ఎంతో ఆప్తుడైన అక్కినేని నాగేశ్వర రావు కలిసి చేసిన ఒకే ఒక్క చిత్రం పూజాఫలము. మధు పాత్రకు బి.ఎన్.రెడ్డి మొదటినుంచి అక్కినేని నాగేశ్వరరావు గారినే అనుకున్నారు. తన జీవితంలో ఎదురైన ఎన్నో ఒడిదుడుకుల కారణంగా మానసిక ఆందోళనకు గురైన మధు పాత్రలో అక్కినేను నాగేశ్వరరావు నటన అపూర్వం. ఈ మధ్యనే స్వర్గస్తులైన ఆయన లాంటి నటుడు మన తెలుగువాడు కావడం నిజంగా మన ’పూజాఫలము’.

*****